[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]ఇ[/dropcap]క ఇక్కడి మందిరము, అరుణాచలేశ్వర ఆలయము విశాలమైనది, చాలాపెద్దది. 67 అడుగుల ఎత్తైన రాజగోపురములు నాలుగూ నాలుగు దిక్కుల చూస్తూ రాజసముగా వుంటుంది. 11 వ శతాబ్దములో చోళ రాజులచే మొదలయి, 16 శతాబ్దపు విజయనగర రాజులచే పూర్తి చెయ్యబడిన గోపురములు ఈ రాజగోపురములు. గుడిలో కూడా చాలా విశాలంగా వుంటుంది. మనము మొదటి ప్రాకారములో అడుగు పెట్టిన దగ్గర్నుంచి దేవుని అంతర్మందిరము వరకూ దాదాపు మైలు దూరము నడవాలిలా వుంది. మధ్యలో మనము రమణులు తపస్సు చేసుకున్న మందిరము కూడా చూస్తాము.
ఈ గుడిలో ఎక్కడు నుంచి చూసినా మనకు అరుణగిరి కనపడుతుంది.
కరుణా పూర్ణ సుధాబ్ధే।
కబళిత ఘన విశ్వరూప కిరణావల్యా!
అరుణాచల పరమాత్మా।
న్నరుణోభవ చిత్తకంజ సువికాసాయ॥
తాత్పర్యము: దయచే నిండిన అమృత సముద్రమా! కిరణ పంక్తిచే మ్రింగబడిన గొప్ప ప్రపంచరూపము గలవాడవైన అరుణాచల పరమాత్మా! హృదయ పద్మము మిగుల వికసింపచేయుటకై సూర్యుడవగుమా!
అమ్మవారు ఆపీతకుచాంబిక. అక్కడ ఆ జనని దర్శనము చాలా సౌఖ్యముగా సాగింది. లక్షల మంది వచ్చినా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోగలిగామంటే ఆ తల్లి కరుణే కదా!
మనోహరమైన ఆ స్వామి వద్ద చాలా వేడిగా వుంటుందిట. అగ్ని లింగము కదా కపర్థి ఇక్కడ. జనాలు తాకిడి మధ్య మనకు దర్శనము ఇబ్బందినివ్వదు. అంత మంది వచ్చారా అని ఆశ్చర్యము కలుగకమానదు. ఎంత మంది భక్తులు వచ్చినా సౌకర్యముగా వుండేటంత విశాలమైన ఆ దేవాలయము, వాటి తలుపులూ, ఆ రాజవీధి చూచి మన పూర్వుల ముందుచూపుకు మనము తప్పక జోహార్లు చెప్పుకుంటాము.
ఆ పౌర్ణమికి ఏడు లక్షల మంది వచ్చి గిరి ప్రదక్షిణ చేశారని గుడిలో చెప్పారు కోవెలలో. ఆశ్చర్యము లేదు. అందుకే అంత తిరుణాలుగా వుంది. దారి అంతా నడకకు చక్కగా వున్నా, కొద్ది చోట్ల మాత్రము మనము రోడ్డు మీద బస్సులతో నడవాల్సి వస్తుంది. అది ఇబ్బంది కలిగింది. పైపెచ్చు మేము చెప్పలు లేకుండా ఆ పద్నాగు మైళ్ళు నడిచాము. దానితో కూడా ఇబ్బందిగా అనిపించింది.
మరునాడు నేను శ్రీవారు విరూపాక్ష గుహ చూడటానికి కొండ పైకి వెళ్ళాము. దారి వెతుకుతూ. నిలువుగా కొండ పైపేకి కుంటుతూ పాకుతూ వెళ్ళాను, తీరా చూస్తే గుహకు తలుపులు వేసి వుంది. ఆ ప్రాంగణము మాత్రము తీసే వుంది. లోపలికి వెళ్ళి కూర్చొని కొంత సేపు ధ్యానము చేసుకున్నాము. బయట అటుఇటుగా తిరుగుతూ వుంటే అరుణాచలేశ్వరాలయము మొత్తము కనిపించింది. అంత పెద్ద దేవాలయము ఒక్క ఫ్రేములో రావటము చాలా వింత. ఆ సూర్యోదయాన ఒక ప్రక్క విరూపాక్ష గుహ, మరో ప్రక్క దేవాలయము మనస్సుకు హత్తుకుపోయాయి. ఆ దృశ్యము ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా వుంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ విరూపాక్ష గుహ నుంచి మరోవైపుగా వెడితే మనము ఆశ్రమములోకి వెడతాము. మేము అలా నడుచుకు మళ్ళీ రమణాశ్రమము వెళ్ళాము. ఆశ్రమములో బస వుంది కాని అది పౌర్ణమి నాడు బయటివారికి ఇవ్వమన్నారు. అసలు ఎవరికైనా, ఎప్పుడన్నా ఇస్తారా అని నాకో అనుమానము వుంది. ఎందుకంటే నేను తరువాత ప్రయత్నించినా దొరకలేదు. బహుశా ఏదైనా పెద్ద బరువు మన రిక్వెస్టుకు వుండాలేమో తెలీదు.
పరమాత్మ కరుణతో, సత్యకాములైన సాధకులకు కరుణించటానికి అణువణువు పవిత్రం చేసిన పుణ్యధామము ఈ అరుణాచలము అని అర్థమైయ్యింది మాకు. ఆశ్రమములో నాకు నచ్చిన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. భగవాన్ విశ్రాంతిగా వుండే హాలు. అది ధ్యాన మందిరానికి వెనక వుంటుంది. అక్కడ భగవాన్ విశ్రాంతిగా వున్న మంచం పరుపు వుంటాయి. అక్కడే అందరూ ధ్యానములో వుంటారు. నిశ్యబ్ధము గాలిలో తేలుతూ వుండేది కూడా అక్కడే. మరోటి భగవాన్ చివర వరకూ వున్న మంచము, ఆ గది చూడటానికి ఒక అద్భుతమే. అద్దాల తలుపుల నుంచి చూడాలి. నేను ఆ గది ముంద వున్న చిన్న వరండా వంటి చూరులో కూర్చొని, భగవాన్ గురించి చదివిన కథను మనసులో దర్శిస్తూ ఆ రోజులలో జీవించాను ఆ అరగంటా. అందుకే నా హృదయము ఒక భాగము రమణాశ్రమము మట్టిలో కలిసిపొయి నాతో రాలేదు అనిపించింది. అక్కయ్య, శ్రీవారు కూడా రమణాశ్రమమును చాలా కనెక్టు అయ్యారనిపించింది. శ్రీవారు రమణులకు శిష్యులు. అరుణాచలములో వుండిపోదామని ఎన్నోసార్లు అంటూ వున్నారుకూడా. మనస్సుకు నచ్చిన చోట ఎన్ని రోజులున్నాసరిపోవు. అందుకే విదేశీయులు వచ్చి నెలలు వుండిపోతారుట. మనకు ఎక్కువగా వారే కనపడుతారు. మన స్వదేశీయులు అంత కనపడరు. విదేశీయులు వచ్చి, స్కూటీ వంటివి రెంటుకు తీసుకు ఆశ్రమము సమీపములో నెలలు వుండి తమ మూలాలు తెలుసుకునే యత్నం చేస్తూ వుంటారు. వారు భారతీయ వస్త్రధారణతో, నుదుట విభూతితో చూడటానికి మచ్చటగా వుంటారు.
ఆశ్రమములో వున్న పుస్తకవిక్రయ కేంద్రము నాకు చాలా నచ్చింది. మేము మా మిత్రులకు పంచటానికి ‘Who am I’ అన్న పుస్తకము చాలా కొన్నాము. ఎన్నో పుస్తకాలు కొన్నా నా జ్ఞాన తృప్తి తీరలేదు. మొయ్యగలిగినన్ని కొన్నాను. అవి అట్లాంటా తీసుకుపోవాలంటే నేను నా లగేజ్ కాక ఎంత ఎక్సట్రా కట్టాలో అనుకున్నాను. మొత్తానికి మేము అక్కడ అదో రకమైన భావలలో తేలిపోయాము.
మేము వున్న మూడు రోజులు మూడు నిముషాలలా కదిలి పోయాయి. ఇంకా వుండాలని వుంది. మనసును రమణుడి పై నిలిపి, దృష్టిని లోనికి నిలిపి గురువులను దర్శించాలని వుంది. మేము మూడు రోజులే అని ప్లాను చేసుకున్నాము. కదలాలి కాని కదలలేకపోతున్నాము.
ఆ మూడు రోజులు సరిపోవు అక్కడ. తప్పక నెలన్నా వుండాలి. ఆకలిగా వున్నవారికి ఒక్క రొట్టెతో సరిపెట్టుకోమన్నట్లుగా, బాగా దాహంగా వున్న వారికి చిన్న చెంచాతో నీరు ఇచ్చినట్లుగా, నిద్ర కావాలన్నవారికి నిద్రను దూరము చేసినట్లుగా, నీటి నుంచి బయటపడ్డ చేపలా గిలగిలా హృదయము కొట్టికుంది అరుణాచలము వదిలిపెట్టాలంటే. కాలు పెట్టిన క్షణము నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకూ అదో అద్భుతము జీవితములో ఆవిష్కరించినట్లుగా గడిచింది.
ఇక వెననకు లౌకిక జీవితములోకి వెళ్ళక తప్పదుగా…… కాని అరుణాచలక్షేత్ర పవిత్రత తాలుకు ఆ తీపి మమ్ములను వదలలేదు.
అరుణాచలము వెనకకు వస్తునప్పుడు, అక్కడ కలిగిన ఆనందముతో మా హృదయాలు నిండిపొయాయి. మనస్సులోని సంతోషము, దాచిన దాగక కస్తూరి దాచిన గుడ్డలా హృదయాన్నీసువాసనభరితము చేస్తింది.
“అరుణాచలమును స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలా!
అళగు సందరముల వలె చేరి నేను నీవుండమభినమై యరుణాచలా!” ( అక్షర రమణమాల)
***
మావారు వచ్చినది కేవలము రెండు వారాలకే. ఒక చిన్న ముఖ్యమైన పని మీద. అందుకే అరుణాచల దర్శనము తరువాత మా పరుగు మొదలయ్యింది. ఎక్కడికో ఎందుకో తెలియకనే మనము జీవితములో పరుగుపెడుతూ వుంటాము. ఆ తొందర ఎందుకో అర్థము కాదు. మన హడావిడి మనదిగా బ్రతికేస్తాము. మధ్యలో స్థిమితముగా కూర్చొని అసలు ఏం కావాలి? ఎందుకీ పరుగంటే మనకే సమాధానము తెలియదు. నిర్వేదము, భయం కలుగుతుంది. ఎందుకొచ్చాము? ఏం చేస్తున్నామని. అందుకే మనము మౌనము వుండక మన చుట్టూ వివిధ సందళ్ళతో, చప్పుళ్ళతో నింపుతాము. నిజానికి మనకు ఇంత సరంజామా అవసరము వుండదు.
ఇండియా వెళ్ళిన ప్రతిసారీ ఈ హడావిడి తప్పదు. అందునా శ్రీవారితో వున్నామంటే ‘చక్రాలలో కాళ్ళు’ అంటారుగా అలా వుంటుంది. చుట్టాలంటూ తిరగటము. ప్రతివారిని పలకరించాలనే ప్రయత్నము, స్నేహితులను కలవాలని, అందరికి ఒక దగ్గర కలవలేక మళ్ళీ పరుగు…. మొత్తానికి అలా మళ్ళీ హడావిడిలో పడ్డాను. మేము వచ్చామని మా బంధువులు చాలా మంది హైద్రాబాదులో కలిశారు. అందరము చాలా కాలము తరువాత కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పుకున్నాము.
ఇన్ని రోజులూ వీటికి కొద్దిగా దూరముగా జరిగి ‘లోలోపలికి చూడటమంటే ఏమిటి’ అన్న విషయముతో కొట్టుకుపోయాను. ప్రపంచములో ప్రేమతో పాటు ఇంత ద్వేషమెందుకుందని విస్తుపోయాను. మనిషి సృష్టించిన ‘కాసు’ మనిషిని ఆడించటముపై విసుగుచెందాను.
(సశేషం)