అలనాటి అపురూపాలు-55

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

గొప్ప స్వరకర్త సాలూరి హనుమంతరావు:

తెలుగు చిత్రసీమలో గొప్ప గొప్ప స్వరకర్తలెందరో. అందులో అన్నదమ్ములుండడం కూడా విశేషం. ఈవారం సాలూరి రాజేశ్వరరావు అన్నగారైన సాలూరి హనుమంతరావు గురించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో శివరాంపురం అనే గ్రామ పంచాయితీ ఉంది. ఈ ఊరిలో సాలూరి సన్యాసిరాజు గొప్ప సంగీత విద్వాంసుడు ఉన్నారు. సంగీతమే ఆయన జీవితం. సంగీతాన్నే ఆయన శ్వాసించేవారు. ఈయనకి 17 ఏప్రిల్ 1917 నాడు పుత్రుడు జన్మించగా, హనుమంతరావు అని పేరు పెట్టుకున్నారు. సన్యాసిరాజు – ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కచేరీల్లో తరచూ మృదంగం వాయించేవారు, ఆయన పాటలు కూడా రాసేవారు (ఈయన కొన్ని పాటలకి అద్భుతమైన సంగీతం అందించగా, వారి రెండవ కుమారుడు సాలూరి రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి వాటిని పాడి – ప్రైవేటు గీతాలలో వాటికి ప్రజాదారణ కల్పించారు).

ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద విద్యార్థిగా తన తొలి జీవితాన్ని ప్రారంభించారు హనుమంతరావు. కర్నాటక, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆయన విజయనగరంలో అయిదో తరగతి వరకు చదువుకున్నారు. సాధారణ చదువుల కంటే సంగీతం వైపే ఎక్కువ మొగ్గు చూపడంతో తండ్రి సన్యాసిరాజు అర్థం చేసుకుని, కొడుకు చదువు మానేసినందుకు బాధ పడలేదు. ఆయన తన కుమారుడిని ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద మూడేళ్ళు శిష్యరికం చేయించారు. కాగా, 1922లో సన్యాసిరాజుకి మరో కుమారుడు జన్మించగా, ఆ చిన్నారి బాబుకి హనుమంతరావు – రాజేశ్వరరావు అని పేరు పెట్టారు (తదుపరి కాలంలో రాజేశ్వరరావు గొప్ప సంగీతదర్శకుడు, పలు వాయిద్యాల వాయిద్యకారుడిగా, సంగీత నిర్వాహకులుగా, గాయకుడిగా, గీత రచయితగా, నటిగా, సంగీత నిర్మాతగా రాణించి – తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో సుమారు అర్ధ దశాబ్దం పాటు శాస్త్రీయ సంగీతానికి పెద్ద పీట వేశారు). రాజేశ్వరరావు కూడా సాధారణ చదువులపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, సన్యాసిరాజు తన కొడుకులిద్దరినీ సంగీతంలోనే నిష్ణాతులని చేయాలని శిక్షణ ఇప్పించారు. పిల్లలిద్దరి చేత విజయనగరంలో కచేరీలు చేయించేవారు. అబ్బాయిలిద్దరు చక్కగా, ఎంత సేపయినా వేదిక మీద అలా పాడుతూనే ఉండేవారు. ప్రేక్షకులు కొన్ని పాటలని మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునేవారు. వీరి ఖ్యాతి అంతటా వ్యాపించడంతో – ఈ ఇద్దరినీ ‘లవకుశు’లని పిలిచేవారు.

1934లో 17 ఏళ్ళ వయసులో హనుమంతరావు మద్రాసు చేరారు. వేల్ పిక్చర్స్‌లో చేరి, స్వరకర్త గాలి పెంచలరావు గారికి సహాయకుడిగా వ్యవహరించారు. ఆయన వద్ద హనుమంతరావు జల తరంగ్, ఇంకా అరుదైన సంగీత వాయిద్యం ‘ఎస్రాజ్’ని వాయించేవారు. 1935లో ఈ వేల్ పిక్చర్స్ – తెలుగులో ‘శ్రీకృష్ణ లీలలు’ అనే సినిమా తీసింది. అందులో బాల కృష్ణుడిగా రాజేశ్వరరావుని నటింపజేశారు, కంసుడిగా వేమూరి గగ్గయ్య నటించారు.

1945లో సి. పుల్లయ్య కృష్ణవేణి, ఈల పాట రఘురామయ్యలతో ‘గొల్లభామ’ అనే సినిమా ప్రారంభించారు. ఈ సినిమాకి మరో స్వరకర్త దినకర రావుతో కలిసి పనిచేసే సువర్ణావకాశం హనుమంతరావుకి లభించింది. ఈ సినిమా 1947లో విడుదలయి పాటలన్నీ జనాదరణ పొందాయి. కాగా, 1948లో తీసిన ‘మదాలస’ చిత్రానికి కూడా ఆయన దినకర రావుతో పనిచేశారు. ఈ సినిమాలో బాలాత్రిపుర సుందరి ‘ఆహా మహరాజా’ అని ఒక పాట పాడారు. దానికి శ్రోతలంతా ‘ఆహా’ అన్నారు.

ఆరోజుల్లో గీత రచయిత సదాశివ బ్రహ్మం ‘రాధిక’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రానికి సంగీతం సమకూర్చే సువర్ణావకాశం హనుమంతరావుకి లభించింది. టైటిల్ పాత్రను రావు బాలసరస్వతి పోషించారు. ఈ సినిమాలో ఆవిడ పాడిన ‘గోపాలకృష్ణుడు నల్లన’ ఈనాటికీ వినబడుతూనే ఉంటుంది. 1950లో జెమినీ బ్యానర్ వారు ‘వీరకుమార్’ అనే చిత్రం ప్రారంభించారు. దర్శకులు సి. పుల్లయ్య – హనుమంతరావుని సంగీతం సమకూర్చమని కోరారు. దురదృష్టవశాత్తు ఈ సినిమా ఆగిపోయింది. థియేటర్లలో విడుదల కాలేదు. ఈ సినిమాకి హనుమంతరావు చేసిన సంగీతం వృథా అయిపోయింది.

అయితే 1954లో జెమినీ బ్యానర్ వారు తాము తమిళ తెలుగు భాషలలో నిర్మిస్తున్న ‘రాజీ ఎన్ కన్మణి (తమిళం) / రాజీ నా ప్రాణం (తెలుగు)’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం హనుమంతరావు కిచ్చారు. ఈ సినిమాకి చార్లీ చాప్లిన్ నటించిన సిటీ లైట్స్ మూలం. ఆ సినిమా థీమ్ మ్యూజిక్‍ని దేశీయంగా మార్చి (https://www.youtube.com/watch?v=hCPGFTp0vmo ) అద్భుతంగా అందించారు హనుమంతరావు. తమిళం లోనూ (https://youtu.be/jCMrvcFQ8-M ) తెలుగు లోనూ (https://youtu.be/XjQqYrNQ46A ) రావు బాలసరస్వతి అత్యద్భుతంగా ఆలపించారు. గొప్ప హిట్ అయ్యాయి. ఆ రోజుల్లో ఈ ఒక్క పాట గ్రామఫోన్ రికార్డు హాట్ కేక్‍లా అమ్ముడుపోయింది. మొత్తం మద్రాస్ నగరమంతా చార్లీ చాప్లిన్ సినిమాలోని ఒరిజినల్ థీమ్ ఎలా వుంటుందో అని తెగ వెతికారని రావు బాలసరస్వతి నాతో అన్నారు. అయితే ఈ పాత చిత్రీకరణలో పెద్ద లోపం ఉంది. ఈ అద్భుతమైన పాటను జూనియర్ శ్రీరంజనిపై చిత్రీకరించగా, ఆమె కేవలం పెదాలు మాత్రమే కదిపారు, ఇంకెటువంటి భావాలు ప్రదర్శించలేదు. ఇంకా విచారకరమైన అంశం ఏంటంటే – ఆమె పాడుతుంటే కాకుండా, హీరో హార్మోనికా వాయిస్తుంటే పూలన్నీ అమ్ముడవడం… ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఆరున్నర నిమిషాల బాలే పాట ‘హాలిడే జాలీ డే’ స్వరపరిచారు హనుమంతరావు. ఎక్కువ ఆర్కెస్ట్రాతో, ఎక్కువమంది కోరస్ గాయనీగాయకులతో ఈ పాట పాడించారు. అప్పట్లో అందరూ ఆ పాట గురించే మాట్లాడుకున్నారు. పైగా, ఎస్. ఎస్. వాసన్ చిన్న చిన్నవాటితో తృప్తి చెందే వ్యక్తి కాదు. తరువాత హనుమంతరావు జెమినీ వారి ‘మంగళ’కి కొన్ని పాటలు చేశారు. 1955లో జెమినీవారు ‘ఇన్సానియత్’ అనే హిందీ సినిమా (ఇది 1950 నాటి ‘పల్లెటూరి పిల్ల’కి రీమేక్) తీయగా, సంగీతంలో సి. రామచంద్రకి సహయకుడిగా ఉన్నారు హనుమంతరావు. అలాగే 1958లో తీసిన ‘దో దూల్హే’ చిత్రానికి బి.ఎస్. కల్లాకి సహాయకుడిగా వ్యవహరించారు. జెమినీ వారు అప్పట్లో ఎక్కువగా హిందీ సినిమాలపై దృష్టి సారించడంతో 1959లో హనుమంతరావు ‘Manaiviye Manithanin Manickam’ అని తమిళ సినిమాకి సంగీతం సమకూర్చారు (https://youtu.be/Ohbm7aJWbuU ). ఈ సినిమా ‘భార్యే భర్తకు మాణిక్యం’ అనే పేరుతో తెలుగులోకి డబ్ అయింది.

తరువాత చేసిన కొన్ని ప్రాజెక్టులు పరాజయం పాలవ్వడంతో, ఆయన తన తమ్ముడి వద్ద – భలే రాముడు, భలే అమ్మాయిలు, బాల సన్యాసమ్మ కథ, చరణదాసి, చెంచులక్ష్మి, అల్లావుద్దీన్ అద్భుతదీపం వంటి సినిమాలకు సహాయకుడిగా పనిచేయాల్సి వచ్చింది. ఏ పని అప్పగించినా ఆయన సమర్థవంతంగా నిర్వహించేవారు, తమ్ముడి వద్ద పని చేయాల్సి వచ్చినందుకు ఏనాడు బాధ పడలేదు. ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే సరదా మనిషి, మంచి మనిషి. అందుకని అటువంటి పనులు చేయడం ఆయన తప్పుగా అనుకోలేదు. తరువాత ‘వీర భాస్కరుడు’, ‘ఉషాపరిణయం’, ‘దక్షయజ్జం’ (తెలుగు, తమిళం) వంటి కొన్ని స్ట్రెయిట్ సినిమాలు కూడా చేశారు. ‘ధర్మమే జయం’ చిత్రంలో కొన్ని పాటలకి సంగీతం అందించారు. తన పనిని అందరూ మెచ్చేలా పూర్తి చేసేవారు. కన్నడ చిత్రసీమ ఆయనను ఎంతో గౌరవించింది. ‘శివరాత్రి మహత్యం’, ‘నవకోటి నారాయణ’, ‘గుణదాస’, ‘ప్రతిజ్ఞ’ వంటి కన్నడ సినిమాలకు సంగీతం అందించారు. ‘చంద్రహాస’ చిత్రం – తెలుగు, కన్నడ వెర్షన్‍లు రెండింటికీ సంగీతం కూర్చే అవకాశం బి.ఎస్. రంగా కల్పించారు.

ఆయన సంగీతం అందించిన చిత్రాల పాక్షిక జాబితా కొరకు ఈ లింక్ చూడండి:

https://en.wikipedia.org/wiki/S._Hanumantha_Rao

ఆయన ‘మాకు మంచి రోజులు వచ్చాయి’, ‘మంచి మర్యాద’లతో కలిపి సుమారు 75 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఈ గొప్ప విద్వాంసుడు హార్మోనియం, దిల్ రుబా, సారంగి, సెల్లో, పియానో, జల్ తరంగ్, ఎస్రాజ్ వంటి పలు వాయిద్యాలను వాయించగలిగేవారు. ఇవే కాక రేడియో కోసం లలితగీతాలకు సంగీతం అందించేవారు. హనుమంతరావు సంగీత దర్శకత్వంలో రావు బాలసరస్వతి పాడిన ‘ప్రేమా ఏల కలిగెనో నాలో’ అనే పాట ఈ లింక్‌లో వినండి (http://surasa.net/music/lalita-gitalu/balasarasvati/prema.mp3 ). అంతే కాదు కొన్ని రేడియో నాటకాలకు కూడా సంగీతం కూర్చారు.

ఆయన బాగా సరదాగా ఉండే వ్యక్తి. తన చుట్టూ వుండేవారిని బాగా నవ్వించేవారు. ఓ రోజు ఓ గీత రచయితను కలిసారు. వెంటనే “ఏమోయ్, నీ కలలోకి వచ్చే సుందరీమణులు బావున్నారా?” అంటూ పలకరించారట. రొమాంటిక్ గీతాలకు ప్రసిద్ధి చెందిన ఆ రచయిత ఉలిక్కి పడ్డారట… చుట్టూ ఉన్నవారు ఒకటే నవ్వడం! అదీ ఆయన స్వభావం. నవ్వించాలనే తప్ప, హేళన చేయాలని కాదు.

గాయని బాలసరస్వతికి Uran Khatola సినిమా తమిళ వెర్షన్‍లో పాడేందుకు అవకాశం లభించి బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. సంగీత దర్శకులు నౌషాద్. ఈ వార్త తెలిసిన హనుమంతరావు తాను బొంబాయి వస్తానని బాలసరస్వతిగారిని కోరారుట. నౌషాద్ పాటలు ఎలా స్వరపరుస్తారో చూడాలన్నది ఆయన కోరిక. అయితే ఈయన స్వభావం బాగా తెలిసిన బాలసరస్వతి – అక్కడ హుందాగా నడుచుకుంటాననే హామీ మీద తీసుకువెళ్ళారట. నౌషాద్ బాలసరస్వతి స్వరానికి ఎంత ముగ్ధులయ్యారో అనడానికి హనుమంతరావే సాక్ష్యం. బాలసరస్వతిది తక్కువ స్థాయి స్వరం (లో పిచ్ వాయిస్) కాబట్టి పాటలలో గాత్రం స్థాయిని ఆమెకు అనువుగా మార్చాల్సి వచ్చింది. అప్పుడు నౌషాద్‍ వద్ద సహాయకుడిగా ఉన్న మరో స్వరకర్త గులాం మహమ్మద్ అందుకు అభ్యంతరం చెప్పారట! ఆ అభ్యంతరాన్ని నౌషాద్ పట్టించుకోకుండా ఆమె గానం అద్భుతంగా ఉందని అన్నారట. అయితే నౌషాద్ బాలసరస్వతిని పొగగడం నచ్చని లతా మంగేష్కర్ రావు బాలసరస్వతి పాడేందుకు పెద్దగా ఇష్టపడకపోవడంతో, బాలసరస్వతిని వెనక్కి పంపేశారు. ఎంత విచారకరం! హనుమంతరావు దీనికి కూడా సాక్షి.

హనుమంతరావు ఎంత సరదా మనిషైనా, తన తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేవారు కాదు. కోపంతో మండిపడేవారు. తనని విమర్శించినా సహిస్తాను కాని, తమ్ముడిని విమర్శించిన, అతని పాటలని విమర్శిస్తే భరించలేను అనేవారు. తన తమ్ముడో మేధావి అనేవారు!

ఆయన రాజామణిని వివాహమాడారు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇంత మంచిమనిషి, అద్భుతమైన స్వరకర్త అయిన హనుమంతరావు 27 మే 1980 నాడు స్వర్గస్థులయ్యారు.

***


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here