[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
స్వదృగ్ దృష్ట మృతానేక విపద్విభవ సంస్కృతేః।
సూతె కస్య న వైరాగ్యస నామ జైనతరంగిణి॥
(జైన రాజతరంగిణి 1.1.78)
[dropcap]త[/dropcap]న కళ్ళ ముందు దృశ్యాల్లా వేగంగా కదిలిపోతున్న దురదృష్టాలను, దుస్సంఘటనలను చూపించే జైన రాజతరంగిణి అందరిలో వైరాగ్య భావన కలిగిస్తుంది.
కల్హణుడు రాజతరంగిణి ‘శాంత’ రసం ఉత్పన్నం చేస్తుందన్నాడు.
క్షణ భంగిణి జంతూనామ్ స్ఫురిత పరిచింతితే।
మూర్ధాభిషేకః శాంతస్య రాసస్యాత్ర విచార్యతామ్॥
(కల్హణ రాజతరంగిణి 1.23)
మానవ జీవితం క్షణభంగురం అని గ్రహింప చేసే రాజతరంగిణి శాంత రస భావన కలుగజేస్తుంది.
ఒక కవి తన రచన ఆరంభంలోనే రచన లక్ష్యం, ఉద్దేశం చెప్పటం భారతీయ సంప్రదాయం. ఒక రచనను సృజించే సమయంలోనే రచయితకు తన రచన లక్ష్యం గురించి స్పష్టమైన అవగాహన ఉండటం వాంఛనీయం. తన రచన పాఠకులను ఉద్రేకపర
ఒక కవి తన రచన ఆరంభంలోనే రచన లక్ష్యం, ఉద్దేశం చెప్పటం భారతీయ సంప్రదాయం. ఒక రచనను సృజించే సమయంలోనే రచయితకు తన రచన లక్ష్యం గురించి స్పష్టమైన అవగాహన ఉండటం వాంఛనీయం. తన రచన పాఠకులను ఉద్రేకపరచాలనో, ఆశ్చర్య చకితులను చేయాలనో, ఆలోచింప చేయాలనో… ఇలా రచయిత తన లక్ష్యం నిర్ణయించుకుంటాడు. రచనలో తన లక్ష్యం నెరవేరేలా చూసుకుంటాడు.
‘నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని,
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా…’
(కవితా… ఓ కవితా… శ్రీశ్రీ)
ఇలా కవులు, రచయితలు రచన ఆరంభంలోనే ఆ రచన లక్ష్యం ప్రకటిస్తారు. శ్రీవరుడు కూడా అదే చేశాడు. అయితే కల్హణుడికి ‘శాంతరసం’ లక్ష్యం అయితే, శ్రీవరుడికి ‘వైరాగ్యం’ ప్రాధాన్యం అయింది.
ఒక కవి/రచయిత తానున్న సమాజం ప్రభావం నుంచి తప్పించుకోలేడు. రాజతరంగిణి రచనలో కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు పాటించిన లక్ష్యాన్ని పరిశీలిస్తే భారతీయ సామాజిక మనస్తత్వ పరిణామ క్రమాన్ని ఒక కోణంలో కాస్తయినా పరిశీలించే వీలు కలుగుతుంది.
కల్హణుడు రాజతరంగిణి రచన ఆరంభించే నాటికి ఆనందవర్ధనుడి ‘ధ్వన్యాలోకం’ సాహిత్య ప్రపంచంలో స్థిరపడింది. కల్హణుడిపై ధ్వన్యాలోకం ప్రభావం ఉండటం తప్పనిసరి. ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడు రచన పరమార్థం ‘రసమే’నని, రచన చేసే సమయంలో దృష్టి ‘రసం’ పైనే ఉండాలని నిర్దేశించాడు. అంతే కాదు, ‘ఇతిహాసం’ అనేది సంఘటనలు వరుసగా చెప్తుంది కాబట్టి, ‘ఇతిహాస’ రచనలలో రసం ఉండే వీలు లేదని తీర్మానించాడు.
‘కవీనా వాక్యమ్ ఉపవిబధ్నతా సర్వాత్మనా రస పరతంత్రేన భావితవ్యమ్’
కాబట్టి కవులు రసం ఉత్పన్నం చేసే కథాంశాన్ని ఎంచుకుంటారు. తమ లక్ష్యాన్ని అనుసరించి కావ్యం సృజిస్తారు. అంటే కవి కావ్యం సృజించే ముందే తను ఎంచుకున్న కథ, తాను సృజించాలనుకున్న రసం సృజనకు అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ తాను ఎంచుకున్న కథలో అనుకున్న రసం సృజించే వీలు లేకపోతే ఆ కథను మార్చివేసి, తన లక్ష్యమైన రససృజనకు వీలు కల్పించాలి.
అత్రేతి వృత్తే యది రసానుగుణామ్ స్థితమ్ పశ్యాత్ తదేమామ్ భవిత్త్యాపి।
స్వతంత్రయా రసానుగుణమ్ కథాంతరమ్ ఉత్పాదయేత్॥
అయితే కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు రచిస్తున్నది కాల్పనిక కథ కాదు. వారు జరిగిన చరిత్రను తమ రచన ద్వారా సజీవం చేయాలని నిశ్చయించారు. కానీ వారు అనుసరించే ఆనందవర్ధనుడు నిర్మొహమాటంగా ఇతిహాస రచన రసోత్పన్నానికి అనుగుణం కాదు అని నొక్కి చెప్పాడు.
న హి కవేర్ ఇతివృత్త మాత్ర నిర్వహణేన కించిత్ ప్రయోజనమ్, ఇతిహాసద్ ఏవ తత్సిద్ధేః
కవి కేవలం సంఘటనలు చెప్తూ పోవటం వల్ల ప్రయోజనం లేదు. ఈ పని ఇతిహాసం చేస్తుంది.
అంటే కల్హణుడు, జోనరాజు, శ్రీవరుడు వంటి వారు ‘రాజతరంగిణి’ని రస ప్రధానం కల కావ్యంగా సృజించాలంటే అది ఇతిహాసం కాకుండా పోతుంది. దాన్ని ఇతిహాసంలా రచించాలంటే కావ్యం కాకుండా పోతుంది. కానీ ‘రసం’ లేని సృజన ప్రాణం లేని శరీరం లాంటిది. ప్రాణం లేని శరీరం పై ఎవరికీ ఆసక్తి ఉండదు (అందుకే విద్యార్థులు అనేకులు గణిత శాస్త్రం తరువాత అంతగా భయపడేది సాంఘిక శాస్త్రానికే. సాంఘిక శాస్త్రంలోనూ చరిత్ర అంటే మరింత విసుగు). కాబట్టి ప్రాణం లేని శరీరం లాంటి రసవిహీనమైన కావ్యాన్ని సృజించి లాభం లేదు. ప్రజలను అలరించాలన్నా, తమ ఆలోచనలు ప్రజలకు చేరువ కావాలన్నా రసాన్ని ఆశ్రయించటం తప్పనిసరి. కానీ ఇతిహాస రచన రసవిహీనం అని సిద్ధాంతం. అయితే తాము ఎంచుకున్న అంశం రసవిహీనం అని తెలిసినప్పుడు కవులు అవసరమైతే – ‘స్వతంత్రయా రసానుగుణమ్ కథాంతరం ఉత్పాదయేత్’ అన్నాడు ఆనందవర్ధనుడు. ఈ విషయంలో కల్హణుడికి ‘మహాభారతం’ రచన ఆదర్శంగా నిలిచింది. మహాభారతంలో ‘శాంతరసం’ ప్రధానం. కల్హణుడు కూడా శాంతరసం స్వీకరించాడు. మహాభారతంలో లాగే సంఘటనలను వివరిస్తూ, వాటిపై వ్యాఖ్యానిస్తూ, పాఠకుల దృష్టిని నిర్దేశిస్తూ, తాను అనుకున్న రసాన్ని సృష్టిస్తూ పోయాడు. అంటే చరిత్ర రచనను ఒక సంఘటనల సమాహారంలా కాక సంఘటనలను పాఠకుడు అనుభవించేలా చేస్తూ వర్ణలను జోడించి వ్యాఖ్యలు చేస్తూ ఆసక్తి కలిగించేలా ‘ఇతిహాసాన్ని’ ‘కావ్యంలా’ మలచి రచించాడన్న మాట కల్హణుడు. ఈ రచనా పద్ధతి పాశ్చాత్యుల ‘చరిత్ర’ ప్రామాణికాలకు విరుద్ధం. కాబట్టి వారు కల్హణుడు అభూత కల్పనలు, అద్భుతాల నడుమ చరిత్రను రాశాడు అన్నారు. భారతీయులు కావ్యరూపంలో ప్రకటించిన చరిత్ర రచనల్లో కావ్యాన్ని చూసి చరిత్రను విస్మరించారు. అయితే భవిష్యత్తులో పాశ్చాత్య భావాల ప్రభావితులు తమ రచనను విశ్లేషిస్తారన్న స్పృహ లేని ఆ కాలం కవులు తమకు నచ్చిన రీతిలో కావ్య రచన చేశారు.
రసవిహీనమైన చరిత్ర రచనను రసమయం చేశాడు కల్హణుడు. కల్హణుడు శాంతరసం ఎంచుకోవటం వెనుక ఆయన గమనించి, అర్థం చేసుకున్న చరిత్ర ఉంది. రాజతరంగిణిలో అత్యద్భుతమైన రాజులు వస్తారు. అతి గొప్పగా పాలన చేస్తారు. గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. కానీ వారు అనుకోని రీతుల్లో, జాలి కలిగే రీతిలో మరణిస్తారు. వారి సంతానం అసమర్థులవుతారు. బంగారం విచ్చలవిడిగా దొరికిన చోట చుక్క మంచినీళ్ళు దొరకని పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా సంభవిస్తూండటం, అనేక రాజవంశాలు తెరపైకి రావటం, అదృశ్యమవటం కల్హణుడు రాజతరంగిణి రచన సందర్భంలో అర్థం చేసుకున్నాడు. అధికారంలో ఉన్న వారు తమ అధికారం శాశ్వతం అని అహంకరిస్తారు. క్రూరంగా, రాక్షసంగా ప్రవర్తిస్తారు. ప్రజలను హింసిస్తారు. దాని ఫలితం తరువాత తరాల వారు అనుభవిస్తారు. ఇదంతా తన రచనలో ప్రదర్శిస్తూ శాంతరసాన్ని కలిగించాడు కల్హణుడు. అందుకే విధి వికృతాలను చూస్తున్న వారిలో శాంతరసం కలుగుతుందని రాశాడు.
కల్హణుడి కాలం స్వతంత్ర భావాల కాలం. అప్పటికి ఇంకా సమాజం బానిసత్వంలోకి దిగజారలేదు. ఉత్తమ గుణాలు, ఉత్తమ భావాలు, ఉత్తమ విలువలు సమాజంలో చలామణీలో ఉన్నాయి. కానీ ఈ సమాజంలో మార్పులు, అవీ, ఆహ్వానించదగినవి కాని మార్పులు చోటు చేసుకోవటం కల్హణుడు చూశాడు. అతి గొప్పగా రాజ్యం ప్రారంభించిన హర్షుడు, తురుష్క హర్షుడిగా పేరుపొంది, దిగజారి, చివరికి పశువుల పాకలో ప్రాణాలు కోల్పోవటం కల్హణుడు చూశాడు. అధికారం కోసం పోరాడుతూ, శ్రీనగరాన్ని తగులబెట్టి, వితస్తను శవాలతో నింపేయటం కల్హణుడు చూశాడు. ఈ హింస, అలజడి, అల్లకల్లోలం నడుమ ‘శాంతం’ వాంఛించాడు. జగతి క్షణభంగురత్వం తన రచన ద్వారా ప్రస్ఫుటం చేయటం ద్వారా పాఠకుడి హృదయంలో ఆవేశం, ఆగ్రహం తొలగి ‘శాంతం’ కలిగే రీతిలో రచనను సాగించాడు. ఎందుకంటే అతడు అనుభవిస్తున్న సమాజం అశాంతిమయం కాబట్టి. ఆ అశాంతిలో అతడు ‘శాంతం’ వాంఛించాడు.
జోనరాజు సమయం వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. జోనరాజు రాజుల చరిత్రను జైనులాబిదీన్ ఆదేశానుసారం రాశాడు. ఆయన వ్యాఖ్యాత, పండితుడు. పైగా, సుల్తాను సికందర్ బుత్‌షికన్ దుర్మార్గ పాలనను అనుభవించాడు. అంతకు ముందు మంగోలుల దాడికి ధ్వంసమైన కశ్మీరు జీవితాన్ని గ్రహించాడు. దాంతో అతడికి రాజతరంగిణి ‘కావ్యం’ కన్నా ‘చరిత్ర’ అయింది. తనకున్న కల్పిత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ రాజతరంగిణిని రచించాడు. అంతే తప్ప కల్హణుడిలా చారిత్రక కావ్యం సృజించి ప్రజలను మెప్పించాలనీ, భవిష్యత్తు తరాలకు ఏదో నేర్పాలని లేదు జోనరాజుకు. దేశమంతా విస్తరిస్తున్న ఇస్లాం, జీవన విధానాన్ని సంపూర్ణంగా రూపాంతరమొందించటం, ధర్మం అణగిపోవటం అర్థం చేసుకున్నాడు. జైనులాబిదీన్ పాలన ఈ ఎడారిలో ఒయాసిస్సులాంటిదని, ఇది ఎంత కాలం స్థిరంగా ఉంటుందో తెలియదని, ఇతని తరువాత అధికారానికి వచ్చేవారి పాలన ఎలా ఉంటుందో ఊహించలేమన్న గ్రహింపు జోనరాజుకు ఉంది. అతడు కేవలం ఉద్యోగ విధిని నిర్వహించాడు తప్ప, మనస్ఫూర్తిగా చేసిన రచన కాదిది. రాజును మెప్పించేందుకు సాగించిన రచన తప్ప మరొకటి కాదు.
శ్రీవరుడి దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మారింది. శ్రీవరుడు జోనరాజు శిష్యుడు. కవి, గాయకుడు. జైనులాబిదీన్ పాలనలో స్థిరత్వాన్ని, స్వేచ్ఛను అనుభవించినవాడు. జైనులాబిదీన్ చరిత్రను రాజతరంగిణి రూపంలో కొనసాగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవాడు. అయితే జైనులాబిదీన్ మరణం పరిస్థితిని మార్చింది. జైనులాబిదీన్ చివరిదశ అత్యంత దయనీయంగా గడిచింది. అతడి భార్య మరణం జైనులాబిదీన్‌ను క్రుంగదీసింది. అతడికి జీవితంపై విరక్తి కలిగింది. అనారోగ్యం అతడిని దెబ్బతీసింది. దాంతో అతడు శ్రీవరుడి సాంగత్యంలో ‘మోక్షోపనిషిత్తు’ వింటూ, తన సంతానం నడుమ గొడవలు తగ్గించి, వారి నడుమ సయోధ్య సాధించి, కశ్మీరానికి సుస్థిరమైన పాలనను అందించగలిగే సుల్తానుకు పట్టంగట్టి పోవాలని తపించాడు.
రాజా గర్భగృహాంతః స్థితః శృణ్వన్ పుత్రస్థితిమ్ మిథః।
కృతక ప్రేమ వైరాధ్యామ్ న బహిర్ నిరయాద్ ఛాయా॥
(జైనరాజతరంగిణి 7.131)
తన సంతానం నడుమ చెలరేగుతున్న పోరును, విద్వేష జ్వాలలను గురించి తెలుసుకుంటూ సుల్తాన్ తన గృహ అంతర్భాగంలో ఉండిపోయాడు. పైకి కపట ప్రేమను నటిస్తూ వెనుక కుట్రలు చేసేవారికి భయపడుతూ గృహాంతర్భాగం వదిలి బయటకు రావటం మానేశాడు. ఈ సమయంలో శ్రీవరుడు అతడికి అండగా నిలిచి, సంసార బాధలు ఉపశమించే రీతిలో మోక్షోపనిషిత్తు వినిపిస్తూ, వ్యాఖ్యానించాడు. తాను అత్యంత అభిమానించే రాజు, తనపై అమితమైన ప్రేమను కురిపించే రాజు ఇలా దుఃఖస్థితిలో, భయపడుతూ, బాధపడుతూ, ఒంటరిగా ఇంటిలోపల దాక్కుని మృత్యువు కోసం ఎదురు చూస్తుండటం – వ్యక్తిలో ప్రపంచం పట్ల విరక్తి కలిగించటం సహజం. వైరాగ్య భావనలు కలిగించటం ఇంకా సహజం. అందుకే శ్రీవరుడు తాను రచించే రాజతరంగిణి ద్వారా వైరాగ్య భావనలు కలిగింప చేయాలనుకోవటం స్వాభావికం. ఎందుకంటే జైనులాబిదీన్‌ను ఆ స్థితిలో చూడటం వైరాగ్యానికి దారితీయటంలో ఆశ్చర్యం లేదు. పైగా జైనులాబిదీన్ మరణం తరువాత అతని సంతానం నడుమ అధికారం కోసం ఘోరమైన పోరు సాగింది. కశ్మీరం అశాంతి పాలయింది. అయితే, ఈ పోరులో విజయం ఎవరు సాధించినా, కశ్మీరంలో ఇస్లామేతరులు జైనులాబిదీన్ కాలంలో అనుభవించిన శాంతిని, భద్రతను ఇకపై అనుభవించటం కష్టం అన్న చేదు నిజం శ్రీవరుడికే కాదు, ఆ కాలంలోని ఇస్లామేతరులందరికీ అర్థమయి ఉంటుంది. వారందరూ అభద్రతాభావాన్ని అనుభవిస్తూ ఉండి ఉంటారు. ఓ వైపు నుంచి జైనులాబిదీన్ అంత్యదశ సమీపిస్తుండటం, మరో వైపు ఈ భవిష్యత్తు గురించిన ఆందోళనా, అభద్రతాభావం వైరాగ్య భావనలు కలిగించటంలో ఆశ్చర్యం లేదు. మానవ జీవితంలోని వ్యర్థత్వం, నిష్పలత్వం మనసు గ్రహించటం వల కలిగే వైరాగ్యం ఇది. అందుకే జైనులాబిదీన్ తరువాత రాజతరంగిణి రచన హడావిడిగా, గజిబిజిగా, అయిష్టంగా సాగింది. అయితే ఎంత వైరాగ్య భావనలు కలిగినా, ప్రాణం ఉన్నంతవరకూ మనిషి బ్రతకక తప్పదు. జీవిక కోసం ప్రయత్నించక తప్పదు. శ్రీవరుడు రచించిన ‘కథా కౌతుకం’ గమనిస్తే శ్రీవరుడి ఆలోచనా విధానం మరింత స్పష్టమవుతుంది.
(ఇంకా ఉంది)