[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథకి తగిన ‘భాష’ ఎంత అవసరమో వివరిస్తుంది. [/box]
భాష
[dropcap]మా[/dropcap]నవ నాగరికత అభివృద్ధి చెందే క్రమంలో మనిషి తన జీవిక కోసం అనేక ప్రయత్నాలు చేసాడు. ఆ ప్రయత్నపరంపర ఒక ఆనవాలుగా చరిత్రలో కనపడుతుంది. అలాంటి ఆనవాళ్ళలో సంస్కృతి ఒకటి. సంస్కృతిని తెలిపే అంశాల్లో భాషకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. భాషాప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరగడం భాష ప్రాముఖ్యతను తెలుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాష ప్రధాన భూమిక పోషించింది. భాష ఆ ప్రాంత అస్తిత్వ చిహ్నం. తెలుగు ప్రజలు మాట్లాడేది ఒకే భాష అయినా, ప్రాంతాల వారీగా భాషలో వైవిధ్యం ఉంది. ఆ తేడాని మాండలిక వైవిధ్యం అనవచ్చు. ఏ మాండలికం ఆ ప్రాంత ఆనవాలును పట్టిస్తుంది. అలాగే కుల, వర్గ, వృత్తి, మత సంబంధమైన పదజాలం ఆయా ప్రత్యేక సమాజాలను తెలియజేస్తుంది. విద్యావిధానం వల్ల అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే విభజన ఏర్పడింది. అది కూడా వారి మాటల ద్వారా (భాష) తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళ భాష లోను తేడా ఉంటుంది. కొందరు తమ హోదా తెచ్చిన స్థితివల్లనో, నేర్చుకున్న విద్యవల్లనో ఆంగ్లభాషలో మాట్లాడుతారు. కొందరు కేవలం మాతృభాషలోనే మాట్లాడుతారు. ఇదివారి ఉనికిని తెలుపుతుంది. నగర భాష, ప్రామాణిక భాషగా, భాష స్థిరపడింది. నోటి భాషకు, రాత భాషకు మధ్య ఉన్న తేడా కూడా గమనించతగినది. భాష అనేది ఇరువైపులా పదను గల కత్తిలాంటిది. దాన్ని తెలిసి వాడితే వరం, నిర్లక్ష్యంగా వాడితే శాపం.
భాష ప్రాంతాల్ని, మనుషుల స్థితిగతులను, కాలాన్ని పట్టిస్తుంది. గ్రాంథిక భాష వాడితే అది ఏ కాలమో తెలుసుకోవచ్చు. భాష భావనల్ని మోసే వాహకం. కథా విషయం కొత్తదై దాన్ని మోసే భాష పాతదైతే కథ ఆకట్టుకోదు. కథలో రకరకాల పాత్ర లుంటాయి. వాటి హోదా, స్థితిగతుల ననుసరించి అవి మాట్లాడుతాయి. అందుకు తమదైన భాషను పలుకుతాయి. కథనంలో భాగంగా కథకుడు రాసే భాష అతని స్థితిని పట్టిస్తుంది. ఎవరికి సహజమైన భాషను వారు మాట్లాడితే అది సహజంగా ఉంటుంది. అట్లుకాక ఏదో అభిమానం వల్ల మాండలికాలనో, పరాయిభాషనో కథలో చొప్పిస్తే కృతకంగా ఉంటుంది. కథా నిర్వహణలో, ఆయా సంఘటనల్లో, సంభాషణల్లో పాత్రలు మాట్లాడే భాషలోకి పరకాయ ప్రవేశం చేయక తప్పదు. అట్లా చేసి ఏ పాత్రతో ఆ మాట పలికిస్తేనే కథ సజావుగా సాగుతుంది. అనేకులు పాత్రోచిత భాష విధానాన్ని ఎన్నుకుంటున్నారు. భావ వ్యక్తీకరణలో వైచిత్రి సాధించాలంటే భాష ప్రధాన సాధనం.
“సాధారణ మానవుడు తాను పరిపరివిధాల మనసులో ఎలా అనుకుంటడో అలాంటి భాష, అలాంటి వాక్యాలు కథలో అధికంగా వాడబడాలి. అందులో వ్యాకరణ దోషాలున్నా వాక్యాలు అస్పష్టంగా ఉన్నా, ఫరవాలేదు” – దాశరథి
కథా వాతావరణాన్ని బట్టి భాషలో మార్పు వస్తుంది. చారిత్రక కథకు, సాంఘిక కథకు మధ్య తేడా కథనంలోని భాష ద్వారా కనపడుతుంది. వాక్యాలు స్పష్టంగా ఉండాలి. కథా విషయం ప్రజలదైనపుడు, ప్రజల భాషలో రాయక తప్పదు. స్థల కాలాలను బట్టి భాషలో మార్పు రాక తప్పదు. నిమ్నకులాల, జాతుల జీవితం ఎప్పుడైతే కథా వస్తువైందో వారి భాష కూడా అప్పుడే కథలోకి వచ్చింది. అలా వారి భాషకు కావ్య గౌరవం కలిగింది. నీచ పాత్రలతో గ్రామ్యభాష మాట్లాడించి ఉదాత్త పాత్రలతో
ప్రామాణిక భాష మాట్లాడించడం కూడా పద్దతి కాదు. అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తుంది. పాత్రోచిత భాష వాడడం అనేది ఒక ప్రజాస్వామిక ఆచరణ. గ్రాంథిక భాషలో రాసిన కథను వ్యావహారిక భాషలోకి తిరగరాసిన కథకులు ఉన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమం ప్రజల భాషకు పట్టం కట్టింది. ఆనాటి నుండి వచ్చిన కథల్లో ఆయా వస్తువుకు తగిన భాష వాడుతూ వచ్చారు.
గ్రాంథికం, ప్రామాణికం, వ్యవహారికం, మాండలికం, గ్రామ్యం, ఇంటి భాష ఇలా భాష వివిధ గతులలో తనను తాను ప్రజాస్వామ్యీకరించుకుంటూ వస్తుంది. కథకుడికి ఈ క్రమం గుర్తుండాలి. పూర్తి మాండలికం, పూర్తి ప్రామాణికంలో రాసేవారు ఒకవైపుంటే, పాత్రోచిత భాషలో రాసేవారు మరొకవైపు ఉన్నారు. ఏవిధంగానైన రాసే స్వేచ్ఛ కథకుడికి ఉంది. అదే సమయంలో పఠితను ఒప్పించే బాధ్యత కూడా ఉంది. ఏ కాలం వాడికి ఆ కాలపు భాష, ఏ ప్రాంతం వాడికి ఆ ప్రాంతం భాషలపై మక్కువ ఉంటుంది. ఆయా కాలపు ప్రాంతపు, జీవితాల్ని కథలుగా మలచినపుడు ఆ భాషను కథలో ఉపయోగించడం ఆధునిక లక్షణం.
(మరోసారి మరో అంశంతో)