[dropcap]”కూ[/dropcap]రాకమ్మో… కూరాకు…” అని కూస్తా వీదిలా పోతా వుండిన అవ్వని రమ్మని పిలిసే మా అమ్మ.
అవ్వ ఇంట్లాకి వచ్చి తలపైన నింకా కూరాకు మక్కిరి కిందకి దింపె.
“కట్ట కూరాకు ఎంతవా?” అమ్మ అడిగె.
“ఐదు రూపాయలుమా!” అవ్వ చెప్పే.
“ఇద్దేం బెంగళూరు పేట అనుకొంటివా? కట్ట ఐదు రూపాయలకి అమ్మేకి. పది రూపాయలకి మూడు కట్టలు ఇస్తావా?” అమ్మ బేరం పెట్టే.
బేరం అవ్వకి అచ్చి రాలే.
అమ్మకి అంతే.
ఇద్దరూ మాటల్ని మరువ (ప్రవాహం) పారిస్తా వుండారు.
కడగా అవ్వ అమ్మ మాటకి జై కొట్టి పది రూపాయలకి మూడు కట్టల కూరాకు ఇచ్చె.
ఆ కూరాకు కట్టలు తన చేతిలాకి తీసుకుంటా అమ్మ “కూడు (బోజనం) తింటివా… వా” అంటా అడిగె.
“ఇంత పొద్దుకే కూడు తినేకి నేనేమి మిద్దె ఇంటిలా పుట్టలేదుమా…” అంటా అవ్వ అనె.
అమ్మ అట్లే మూలింట్లాకి పోయి తెలెలా (కంచం) ఉడుకు అన్నము, చారు తెచ్చి అవ్వ ముంద్ర పెట్టే.
అవ్వ అన్నము తిని “వస్తానుమా” అంటా పైకి లేచేకి సురువాయ.
“కాఫీ తాగిపోవా” అంటూ అమ్మ తిరగా మూలింట్లోకి పోయ.
నాకి అమ్మ మనసు అర్థం కాలే.
అయిదు రూపాయలకి అంత రావిడి చేసిన అమ్మ ఇబుడు అంతకు మూడింతల బోజనం ఎట్ల పెట్టే అని.
ఇదే మాటని అమ్మని అడిగితిని.
“చిన్నా… వ్యాపారంల లెక్క వుండాలా. పెట్టే దాంట్లా (ధర్మం విషయంలో) లెక్క చూస్తే తప్పైపోతుంది” అనే అమ్మ.
***
రావిడి = గోల