[dropcap]సై[/dropcap]న్స్ ఫిక్షన్ కధలు పుస్తకం 2010 డిసెంబర్‍లో వచ్చింది. కస్తూరి ప్రచురణలు (9849617392). ఈ కథలు ఆంధ్రభూమిలో ప్రచురితమైనాయి. ఈ సంకనలంలో పది కథలున్నాయి. ఇవి అన్నీ సైన్స్ ఫిక్షన్ నిర్వచనం ప్రకారం హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కథలు, నిజానికి దగ్గరగా వుంటూ భవిషత్తులో ఇలా జరగవచ్చు అనిపించే కథలు. ప్రపంచ సాహిత్యమంతా ఒప్పుకున్న నిర్వచనాలు చాలానే ఉన్నాయి కాని సాధారణంగా ఈ క్రింది లక్షణాలు వుంటే మనం కథలని సైన్స్ ఫిక్షన్ అని గుర్తించవచ్చు
- భవిష్యత్తులో సాగే కథనం, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీ ఆధారంగా రాసిన కధలు, నవలలు.
- కొన్ని స్పెక్యులేటివ్ సిద్ధాంతాల మీద, జరగడానికి అవకాశం వున్నట్లు రాయబడేవి. ఉదాహరణ: కాలప్రయాణం, వార్మ్‌హోల్స్, బ్లాక్ హోల్స్, డార్క్ మేటర్
- భవిష్యత్తులో జరుగబోయే టెక్నాలజీ ఏదైనా కావచ్చు, రోబోలు, గ్రహాంతర యానాలు, స్పేస్ షిప్స్, గ్రహాంతర కాలనీలు గెలాక్సీల మధ్య ప్రయాణాలు మొదలైనవి.
- వీటిలో కొన్ని ఫాంటసీ, భయానకం, అయినవి కూడా ఉండవచ్చు. ఉదాహరణకు గ్రహంతర జీవులు రావడం, ఏలియన్స్ భూమి మీద దాడి చేయడం ఇలాంటివి.
- అంతరిక్ష శాస్త్రం, గ్రహాంతర నక్షత్ర కుటుంబాల మధ్యనే కాకుండా భూమిమీద జరుగబోయే సంఘటనలు. ఇవి ఏ శాస్త్రానికి సంబంధించినవైనా కావచ్చు. వైద్యంలో జరుగబోయే మార్పులు, రోబోటిక్ సర్జరీ, నానో మెడిసిన్, క్లోనింగ్, మెమరీ ట్రాన్స్‌ప్లాంట్, మొదలైనవి. అలాగే క్వాంటమ్ ఫిజిక్స్‌లో సమాంతర విశ్వాలు, మల్టీవర్సెస్ మొదలైనవి.
- ఇతర శాస్త్రాలు అంటే చరిత్ర, సోషియాలజీ, జెనిటిక్స్, జువాలజీ, వృక్షశాస్త్రం ఇలా ఏ శాస్త్రంలోనైనా సైన్స్ ఫిక్షన్ రాయచ్చు. అయితే వాటికి ఒక ఆధారం వుండాలి. చదువరిని నమ్మించగలిగే శక్తి, కల్పన వుండాలి. సమాంతర చరిత్ర భవిష్యత్తులో సమాజంలోని మార్పులు అంటే మంచివి యూటోపియా కాని; చెడ్డవి, డిస్టాపియా కాని ఇవి కూడా, వూహించి రాసేవి సైన్స్ ఫిక్షన్ అంటున్నారు.
అయితే ఆధారం లేకుండా ఏది పడితే అది రాయలేం. ఇప్పటి శాస్త్ర సిద్ధాంతాలు, ప్రతిపాదనలు, మనకి తెలిసిన రుజువైన సిద్ధాంతాల ప్రకారమే రాయాలి.
ఉదాహరణకు సూర్యుడి మీద ఇల్లు కట్టుకుని ఉన్నట్టు రాయలేం కదా. సూర్యుడు ఎర్రటి పండని ముద్దు పెట్టుకుంటే హనుమంతుని మూతి కాలిందని పురాణాల్లో సైన్స్ తెలియనప్పుడు రాశారు. అదే ఇతిహాసం అవుతుంది కానీ సైన్స్ కాదు. భవిష్యత్తులో సూర్యుడు ఆరిపోవడం, లేక పేలిపోవడం, ఒక నక్షత్ర జీవితం, గురించిన సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి వాటి ఆధారంగా కథలు సృష్టించవచ్చు.
కాబట్టి మురళీకృష్ణ గారు రాసిన ఒక్కొక్కకథ సైన్స్ ఫిక్షన్‍కి అనుగుణంగా ఉందా అని పరిశీలించాలి. పది కథలని పరిశీలించి, వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
1. ప్రయోగం:
భవిషత్తులో ఇతర గ్రహాలకి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకోవడం సైన్స్ ఫిక్షన్‍లో ఒక ముఖ్య లక్షణం. గ్రహాంతర కాలనీల గురించి, అవి ఎలా ఏర్పాటు చేయాలి, ఏ గ్రహాలు వాటికి అనుకూలం అనే దాని మీద ఇప్పటి సైన్స్ ఎంతో విజ్ఞానం సంపాదించింది. ఎన్నో సిద్ధాంతాలున్నాయి. మన సౌర కుటుంబంలో వున్న గ్రహాలు కాబట్టి ఇక్కడ సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు భూమికి దగ్గర కాబట్టి వీటి మీద కాలనీలు ఏర్పరచుకోవడం తేలిక. అయితే ఆయా ఉష్ణోగ్రత పరిస్థితులు, వాతావరణం జీవనానికి, గృహనిర్మాణాలకి అనువుగా వుండాలి. జీవం నిలబడటానికి ఆక్సిజన్ కావాలి. ప్రయోగం అన్న కథలో ప్రోబ్ ఎక్స్ ఎక్స్-1 అనే అంతరిక్ష నౌకలో బుధగ్రహం తాకడానికి ప్రయత్నిస్తుంటాడు అవినాష్. బుధగ్రహంపై అడుగిడుతున్న మొట్టమొదటి మానవుడు తానే అనుకుంటాడు. ఇక్కడ బుధగ్రహంలో కాలనీలు ఏర్పరచడానికి ఎన్నో అవరోధాలు మనకి ఉన్నట్లు రచయిత చెబుతారు. సూర్యునికి దగ్గరగా ఉండటంలో మరీ ఎక్కువ వేడి, వుండటంలో అక్కడ జీవరాశి ఉండడం అసాధ్యం. అలాగే ఆకర్షణాశక్తి తక్కువ ఉండటంతో గ్రహం మీద దిగడం కష్టం. ఉదయం 450 డిగ్రీలు, రాత్రి మైనస్ 185 డిగ్రీలు ఉండే గ్రహం మీద దిగడం ఎలా సాధ్యం అని మనం ఆలోచిస్తుండగానే ఒళ్ళు జలదరించే వర్ణనల తర్వాత ఇది ఒక ప్రయోగం, సిమ్యూలేషన్ అని మనకి చివరలో చెప్తాడు రచయిత. ఈ విధంగా మనకి కథ ద్వారా ఉత్కంఠ ఒకవైపు, బుధగ్రహం గురించిన విజ్ఞానం వారి ఒకవైపు లభిస్తుంది. ఈ కథని రచయిత 2010లోనే రాశాడంటే ఆయన ఎంత బాగా అధ్యయనం చేసి రాశారో అని మెచ్చుకోవాల్సిందే.
2. టైటాన్లతో కరచాలనం:
ఈ కథలో శని ఉపగ్రహం అయిన టైటాన్‍లోని మిథేన్ నుంచి ఒక గ్రహగ్యాస్‍ని కనుగొని వ్యవసాయ క్షేత్రాలు ఏర్పరచడం వర్ణించబడింది. ప్రస్తుత పరిశోధనల ఆధారంగా టైటాన్ గ్రహంలో మిథేన్ సముద్రాల నుంచి ఆక్సిజన్ హైడ్రోజన్ లాంటివి సృష్టించి, ‘టెర్రాఫార్మింగ్’ చేయవచ్చని ఆలోచనలున్నాయి ఈ కథలో. కామధేను వ్యవసాయక్షేత్రం అంటే ఇలాంటిదే. అయితే టైటాన్ మీద జీవులు కూడా స్వయంగా ఆవిర్భవిస్తాయని మనకు కథ చివరలో తెలుస్తుంది. ఇది కొసమెరుపు. పంటలు పండించడం వల్ల సూక్ష్మజీవులు ఆవిర్భవించడం, గడ్డకట్టి వున్న రసాయన సముద్రాలు కరగడం, చివరికి మానవ జీవులు ఆవిర్భవించడం ఇది ఒక కల్పనాపరమైన వూహ . ఇది ఆధునిక భూగర్భ శాస్త్ర పరిశోధనల ఆధారంగా చేసిన కల్పన. భూమిపై కొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టిన మార్పులు టైటన్ లో కొన్ని గంటలు, క్షణాల్లో సంభవిస్తాయన్నది ఊహ. అయితే, వ్యవసాయం చేయడం, కంపెనీలు ఏర్పరచడం టైటాన్‍లో సాధ్యం అన్నది ప్రస్తుత శాస్త్రవేత్తల వాస్తవమైన అంచనా. ఈ విధంగా విజ్ఞానం, కొంత తార్కికమైన ఉత్కంఠ పూరితమైన ముగింపు ఈ రచయిత కథా లక్షణాలు.
3. నేనెవరిని:
భవిష్యత్తులో నానో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది అని మనకు తెలుసు. నానో అంటే అతి చిన్న పరిమాణాన్ని సూచిస్తుంది. నానోమీటర్ అంటే ఒక మీటరులో బిలియన్ వంతు. ఈ అతిచిన్న సైజు నానో పార్టికల్స్‌లో ఎలక్ట్రోడ్స్‌ని తయారుచేసి మనిషి మెదడులోకి తగిలిస్తే వారి మెదళ్ళలో ప్రతిస్పందన తెలుస్తుంది. నానో టెక్నాలజీతో మందులు తయారుచేసి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేన్సర్ కణాలని నిర్మూలనం చేయవచ్చని ఇప్పుడు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కథలో నానోటెక్నాలజీతో నానో రోబోలని శరీరంలో ప్రవేశపెట్టడం కేన్సర్‍ని రాకుండా చేసి, మనిషి ఆయుషు వంద ఏళ్ళకి మించి బతికేట్లు చేయడం వర్ణించబడింది. నానో మందులతో కేన్సర్‍ని జయించిన వ్యక్తి చంద్రమండలంలో ఉన్న కొందరు వ్యక్తుల ఆరోగ్యం పరిశీలించడానికి ఇన్‍ఛార్జిగా వెళతారు. 22వ శతాబ్దం కథ. అక్కడి వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వారి మానసిక శక్తులు, ఎదుగుదల విపరీతంగా పెరిగిపోయివుంటాయి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టం వెయ్యిరెట్లు అధికంగా అభివృద్ధి చెంది వుంటుంది. దీనికి కారణం డాక్టర్ ష్వార్జ్ చైల్డ్ అనే డాక్టర్ వారి మీద పరిశోధన చేసి వారికి నానో రోబోలను అమర్చడం, అవే రోబో వైద్యులు.
ఈ రోబో వైద్యులు శరీరాల్లో ప్రవేశించి జబ్బులన్నీ నాశనం చేసే ప్రక్రియ అందరికీ తెలిస్తే ‘డాక్టర్లంతా దిక్కులేని వాళ్లవుతారు. మందుల కంపెనీలు మూతపడతాయి’. ఈ కధలో నాయకుడికి తనకంటే వేరెవరూ ఎక్కువకాలం బతకడం, ఇష్టం లేదు. టెక్నాలజీ ఎవరికీ తెలియకూడదు. వారినందరినీ చంపించేస్తాడు. అతనిలోని నానో రోబోలు అసూయపడటం, మనిషిలాంటి మౌలిక లక్షణాలు పెట్టుకొని తనను మించిన రోబో మనుషులుండకూడదని అనుకుంటున్నాయని అతను గ్రహిస్తాడు. సైన్స్ ఫిక్షన్లో సాధారణంగా, రోబోలు మనిషిని అధిగమించడం, తిరుగుబాటు చేయడం, లేక మనిషి రోబో కలిసిపోవడం, ఈ ప్రక్రియలో అనుభూతులు పెరగడం, సంఘర్షణ, ఇవన్నీ సాధారణంగా చిత్రించబడే విషయాలు. ‘నేనెవరిని? రోబోనా, మనిషినా?’ అని ఆలోచించే ఈ వ్యక్తి కథ సైన్స్ ఫిక్షన్‍కి మంచి ఉదాహరణ. రాసిన కాలం 2010.
నేను రాసిన ‘రూబీ ఐ లవ్ యు’, సదాశివరావు రాసిన ‘ఆత్మాఫాక్టర్’ ఇలాంటి కథ.
4. షాడో యూనివర్స్ నీడ:
డార్క్ మేటర్ గురించి రాసిన కథ. 1930ల నుంచి మన పాలపుంతలో డార్క్ మేటర్ వుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
‘మాకో’ అంటే మాసివ్ ఎస్ట్రనామికల్ హాలో అబ్జెక్ట్స్.
‘వింప్స్’ అంటే వీక్లీ ఇంటరాక్టింగ్ మాసివ్ పార్టికిల్స్. వీటిలో కోల్డ్ డార్క్ మేటర్ లేక హాట్ డార్క్ మేటర్ వుంటాయని శాస్త్రవేత్తల అంచనా. వీటికి తెలుగు అనువాదం చేయడం కష్టం. 1995లో న్యూట్రినోలు కనుగొన్నారు.
ఇవన్నీ కలిస్తే షాడో యూనివర్స్ ఏర్పడుతుందని ఒక సిద్ధాంతం. మన విశ్వానికి నీడలాంటి విశ్వాలు ఇంకా అనేకం వున్నాయని మన ప్రోటాన్లకు ఎలక్ట్రాన్‌లకు వేరొక నీడ వుంటుందని సిద్ధాంతాలున్నాయి. ఈ కథలో డార్క్ మేటర్ క్రమంగా పెరిగి ప్రపంచమంతా రంగులు మారి చీకటి అయిపోవడం వర్ణించారు.
ఇప్పుడు సమాంతర విశ్వాల గురించిన కథలు చాలా వస్తున్నాయి. ఇవన్నీ స్పెక్యులేటిక్ ఫిక్షన్ కింద వస్తాయి. షాడో యూనివర్స్ నీడ అలాంటి కథే.
5. పునఃసృష్టికి పురిటినొప్పులు:
బ్లాక్‍హోల్స్ అంటే కృష్ణబిలాలు. ఐన్‍స్టీన్ సూత్రాలని విశ్లేషిస్తూ, నాధాన్ రోసెన్ అనే శాస్త్రవేత్త 1930లో బ్లాక్‌హోల్ గురించి వూహించారు. ఆ తర్వాత 1937, 67లో, 1980లో వార్మ్‌హోల్స్ వూహలోకి వచ్చాయి. పల్సార్‍లు అంటే సెకనుకు 642 సార్లు పరిభ్రమించే నక్షత్రాలని కనుగొన్నారు. 1974లో టైమ్ ట్రావెల్ గురించి ఫ్రాంక్ టిప్లర్ అనే శాస్త్రవేత్త కొన్ని ప్రయోగాలు చేసి ప్రతిపాదించారు. వంద కిలోమీటర్ల పొడవున్న, పది కిలోమీటర్లు వెడల్పువున్న సిలిండర్‍లో ఒక న్యూటన్ నక్షత్రంలో ఉండే పదార్థాన్ని కుదించి మిల్లిసెకండ్‍లో తన చుట్టూ తాను రెండుమార్లు తిరిగేటట్లు చేస్తే కాంతివేగంలో ప్రయాణించేటట్లు చేయవచ్చు అన్న సిద్దాంతాన్ని ఆయన ప్రతిపాదించారు. పల్సార్ల ప్రాతిపదికగా టైం ట్రావెల్ మీద ప్రయోగం చేస్తున్నారు. ఇటీవల CERN సిట్జర్లాండ్‍లో GOD పార్టికల్స్ కనుగొన్నారు.
వార్మ్‌హోల్స్ ద్వారా ప్రయాణం చేయవచ్చని, అతిదూరమైన విశ్వాలకి త్వరగా చేరుకోవచ్చని ఊహిస్తున్నారు.
వార్మ్‌హోల్స్ లోంచి మన కాలంలోంచి అంటే అవతల ఉన్న మరో కాలానికి మరో విశ్వానికి ప్రయాణం చేయవచ్చిన సిద్ధాంతం క్రమేపీ బలపడింది. దీనిమీద ఆధారపడి అనేకమైన సైఫీ కథలు సినిమాలు వచ్చాయి. కార్ల్ సాగాన్ ‘కాంటాక్ట్’, ఇటీవలి ‘ఇంటర్‌స్టెల్లార్’ దీనికి ఉదాహరణలు.
ఒక కాగితం తీసుకుని మడతపెట్టి దానిమీద ఒక గుండుసూదితో రంద్రాలు చేయండి. తర్వాత మడతలు విప్పితే ఆ రంధ్రాలు దూరంగా జరుగుతాయి. మడతపెట్టిన ఫోల్డెడ్ యూనివర్స్ లోని ఈ రంధ్రాలు ఒకచోటి నుంచి, మరొక సుదూర కాంతి సంవత్సరాల దూరానికి వెళ్లడం, తేలికగా జేస్తాయి. అయితే కాలప్రయాణంలో వెళ్ళడం వల్ల ఎన్నో మార్పులు సంభవిస్తాయి, వయస్సులో, తిరిగి వచ్చేసరికి స్వంత గ్రహాల్లో… కాలంలోని భవిష్యత్తులో మార్పులు చేస్తే జరిగే పరిణామాలు… ఇలా కొంత తార్కికంగా, కొంత సాపేక్ష సిద్ధాంతపరంగా అనేక కథలు రాస్తున్నారు. కాలంలో, వయస్సులో మార్పులు ముఖ్యమైన లక్షణాలు.
ఈ కథలో కాలంలోకి ప్రయాణించి మిలియన్ సంవత్సరాలకి తిరిగి చేరుకున్న గ్రహం వారి స్వంత జన్మస్థలమైన భూమి! పూర్తిగా నశించిపోయిన భూమి! అది మళ్ళీ పునఃసృష్టి కోసం ప్రయత్నిస్తోంది! ప్రకృతిని నాశనం చేసిన మనిషి నుంచి ప్రతిసృష్టి చేయడానికి భూమి ఎదురుచూస్తోంది.
కృష్ణబిలాలు (బ్లాక్‌హోల్స్) అంతరిక్ష బిలాలు గురించి వివరిస్తూ కాలప్రయాణికులు చివరికి భవిష్యత్తులో నశించిపోయిన భూమికే తిరిగి చేరుకోవడం అనేది అద్భుతమైన కల్పన. ఇది 2010లో రాయడం గమనిస్తే ఈ రచయిత అధ్యయనం చాలా లోతైనది అని అభినందించక తప్పదు. హైచ్ హైకర్స్ గైడ్ టు గెలాక్సీ (Hitch Hikers – Guide to Galaxy), ‘ఇంటర్‌స్టెల్లార్’ ఇలాంటి సినిమాలే!
ఇక క్లుప్తంగా చివరి కథల గురించి: ఎందుకంటే ప్రతికథ సైఫీ లేక స్పెక్యూలేటివ్ ఫీక్షన్‍కి మంచి ఉదహరణలే. మెల్లగా చదివితే కాని అర్థం కాని హార్డ్ కోర్ సైఫీ కథలైనా, ప్రామాణికమైన నిర్వచనానికి నిలబడుతున్న కథలు.
6. కీక్…. కీక్… కీక్…:
భవిష్యత్తులో రోబోలు మానవ మేధని, సమాజాన్ని నియంత్రించడం వర్ణించే డిస్‌టోపియన్ కథ. ఇది earth based science fiction. మనిషి మెదడులో చిప్స్ పెట్టి భావాలు అనుభూతులు అన్నీ నియంత్రించే, యంత్రాలు పాలించే వ్యవస్థ.
ఈ రకమైన సినిమాలు మనం టెర్మినేటర్ 1,2,3; ఈ మధ్య వచ్చిన టీ.వీ. సిరీస్ – బ్లాక్ మిర్రర్‌లో కూడా చూశాం. ఇప్పుడు మనం చాలావరకు యంత్రాల మీద ఆధారపడుతున్నాం. ఇంటర్‍నెట్, మొబైల్ పాఠాలు, కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ ఇంటిలీజెన్స్ రోబోలు, ఇవన్నీ మనని మించిపోతాయనే భయం మనిషిని పీడిస్తూనే వుంటుంది. ఇటీవలి Homo Deus అనే పుస్తకంలో ఇదే వర్ణిస్తాడు రచయిత Yuval Noah Harari.
7. మిధ్యాసుందరి:
వర్చువల్ గేమ్స్ అంటే నిజం అని భ్రమింపజేసే గేమ్స్. వీటికి అలవాటు పడేటట్టు చేసి పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీలు యువతని వారి మెదడుని ఎలా ప్రభావం చేస్తాయో చక్కగా వర్ణించిన కథ.
జూడీ అనే మిద్యాసుందరికి ఎంతో మంది ఫాన్స్ వుంటారు. యువకులు ఆమెతో మాట్లాడటానికి పోటీపడి ఒకరినొకరు హత్యలు చేసుకుంటారు. ఇది నిజాన్ని ఆధారం చేసుకుని వూహించిన అద్భుతమైన సైఫీ కల్పన.
ఈ మధ్య ఇలాంటి పోకోమాన్, డీప్‌బ్లూ లాంటి గేమ్స్ ఎలా మన యువతిని ఎడిక్ట్ చేశాయో చెప్పనవసరం లేదు. వర్చువల్ సాంకేతిక విజ్ఞానం పెరిగి వ్యాపారానికి ఉపయోగపడి, సమాజాన్ని నాశనం చేస్తుందో చెప్పింది ఈ కథ.
ఇది ఇప్పుడు వాస్తవం అవుతోంది కూడా!
8. వైరస్ యుద్ధం:
తీవ్రవాదులు హాకింగ్ చేసి ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థని దెబ్బతీయడం ఇతివృత్తంగా రాసిన థ్రిల్లర్ కథ. వైరస్ అంటే ఇది కంప్యూటర్ వైరస్.
9. కాలం చూపిన సత్యం:
టైం ట్రావెల్… అంటే కాలప్రయాణాన్ని వైజ్ఞానిక పరిశోధనలకి వాడుకోవచ్చు. కాలంలో ఒక మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఆదిమానవుడి కాలానికి వెళ్ళి చరిత్రని పరిశోధిస్తారు. ఈ కథలో నాయకుడు ఉజ్జ్వల్. ఆ కాలంలో వెళ్ళినా కాని అక్కడి సంఘటనలలో జోక్యం చేసుకోరాదు. అలా చేస్తే సంఘటలన్నీ మారిపోతాయి. అలాగే గ్రాండ్ ఫాదర్ పారడాక్స్, ఫూల్స్ పారడాక్స్, ట్విన్స్ పారాడాక్స్ గురించి వివరాలు ఈ కథలో ఉన్నాయి. అది మానవులలో దైవం అనే భావన ఎలా వస్తుందో ఈ కథలో వర్ణించబడింది.
10. బెంటెల్గీస్‍లో బాలుడు:
బెంటెల్గీస్ అనే ఒక గ్రహంలో సుదూర భవిష్యత్తులో ఆ గ్రహానికి ఎక్కడనుంచో వచ్చిన ఒక నౌక. దానిలో నాశనమైతూ భవిష్యత్ తరాలకి నిక్షిప్తం చేసిన మానవ డిఎన్‍ఎ మెటిరియల్ వుంటుంది.
బెంటెల్గీస్ గ్రహవాసులు ఆ అంతరిక్ష నౌక వారి గ్రహంలో దిగడానికి అనుమతిస్తారు. అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న మానవలక్షణల డిఎన్‍ఎ జాగృతమైంది. దేవ రహస్యాలు ఏమైనా ప్రమాదకరమైనవి ఉన్నాయా అని వెదికే సమాయానికి “‘వటపత్రం లాటి వ్యోమనౌకలో మానవ శిశువు’ కనిపించాడు వటపత్రశాయిలా, కాలి బొటన వేలు నోటిలో ఉంచుకొని నవ్వుతున్నాడు.”
ఇది ఒక అద్భుతమైన అందమైన కల్పన కదూ. నశించిపోయినా, మనిషి పునరుజ్జీవనానికి విశాల విశ్వంలో వెదుక్కుంటూనే వుంటాడు కదూ.
సైన్స్ ఫిక్షన్ లోని వేదాంతమే అది. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినా ఎన్ని యుగాలు దాటినా, ఈ విశాల విశ్వంలో మానవజాతి పరిణామదశ జీవితేచ్ఛ, ‘ఇన్‌స్టింక్ట్ ఫర్ సర్వైవల్’ ఎప్పటికీ పోదు.
యంత్రాలు వచ్చినా, గ్రహాంతర ప్రయాణాలు, కాలనీలు వచ్చినా, మనిషి మానవత్వం, మంచి, చెడూ విలువలు మౌలికమైనవి. శాశ్వతంగా వుంటూనే వుంటాయి.
కొంచెం క్లిష్టంగా, హర్డ్ కోర్‌గా వున్నా మురళీకృష్ణ గారి ఈ పది కథలు అందుకే చాలామంచి సైన్స్ ఫిక్షన్‌కి ఉదాహరణలు. అందరూ ఆసక్తిగా అధ్యయనం చేసి విజ్ఞానం పెంపొందించదగిన మంచి కథలు. సాహిత్యంలో నిలిచిపోతాయి.
***
సైన్స్ ఫిక్షన్ కథలు
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: కస్తూరి ప్రచురణలు
పుటలు: 80
వెల: ₹ 50/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
ఫోన్: 0866-2436642
sahithi.vja@gmail.com
ఈబుక్ కినిగెలో: