[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]
కొత్త లోకం-1
Just one minor accident exploring multiple facets of life…
ఒక చిన్న ప్రమాదం జీవితపు లోతులను స్పృశించింది.
అనుబంధాల విలువలను తెలియచేసింది.
మానవతా సంబంధాల అవసరం వెల్లడించింది.
జీవిత ఫిలాసఫీ సారాన్ని మథించింది.
ఆలోచనా పరిధులను విస్తరింపచేసింది.
ముఖ పుస్తకాన్ని పరిచయం చేసింది.
నూతన మిత్రులను సమకూర్చింది.
కొత్త జీవితానికి నాందీవాక్యం పలికింది.
నిద్రాణమై వున్న సాహిత్యాభిలాషను మేల్కొలిపింది.
నన్నో కవయిత్రిగా రచయిత్రిగా తీర్చిదిద్దింది.
నాకో కొత్త లోకాన్ని సృష్టించింది.
* * *
అమ్మెప్పుడూ ‘నీ కూతుళ్లిద్దరూ నీకు రెండు కళ్ళు’ అంటుంది.
‘అయితే నువ్వు నా గుండెవు’ అంటాను నేను.
కలలు కంటూనో, కలతలు చెందుతూనో నా రెండు కళ్ళు నా చూపును మసకబార్చి చెరో దేశానికి వలసపోయాయి.
గుండె దిటవు చేసుకుని గుండెను జాగ్రత్తగా కాపాడుకుంటూ నేను ఇండియాలో వుండిపోయాను.
కళ్ళ పరిరక్షణా ముఖ్యమేనని తరచూ లబడబలాడే గుండెతో పాటే త్రిభుజపు ముక్కోణాల్లాంటి మూడు దేశాలను (ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా) చుట్టబెడుతూ విమానయాన సంస్థలను చాలాకాలం పాటు పోషిస్తూ వచ్చాను.
జనవరి 2018లో గుండెను మొదటిసారి ఇండియాలో వదిలేసి ఆస్ట్రేలియా ప్రయాణం కట్టాను. నాతో పాటే నా ఎంక్లోజర్స్ మనవలిద్దరూ వున్నారు.
అవసానదశలో వున్న అర్భకపు గుండెను ఒంటరిగా వదలటం మనసుకి కష్టంగానే వుంది.
మరో మూడు రోజుల్లో ప్రయాణం.
ఒక్కో టికెట్టుకి 23 కేజీల చప్పున రెండేసి బ్యాగులు తీసుకుని వెళ్ళవచ్చు. మొత్తం మూడు టికెట్ల మీద నూట ముప్పయి ఎనిమిది కేజీల ఆరు బ్యాగులు సర్దేసాను.
ఎంత సర్దినా ఫైనల్ కావటం లేదు. ఏదో కోతుల సామెతలా ఇందులో సామాను అందులోకి అందులో సామాను ఇందులోకి మార్చుకుంటూ అంత బరువైన బ్యాగులను ఒంటి చేతితో ఎత్తుతూ వేయింగ్ మెషీన్ మీద కుప్పి గంతులు వేస్తూ బరువులు తూస్తున్నాను. పిల్లలిద్దరూ విపరీతమైన ఎక్సైట్మెంటుతో గెంతుతున్నారు.
మొదటిసారి ఒంటరిగా వుండాల్సొచ్చినందుకు కుమిలిపోతున్న గుండె మటుకు దుఃఖంతో అలమటిస్తోంది.
అమ్మ అన్నట్టుగా నేను గుండె కన్నా కళ్ళకే ప్రాధాన్యతనిస్తానేమో…
అందుకే గుండె వేదన నా మదిని తడమలేదు.
దుఃఖంలో రోదిస్తూ ఓ పక్క అమ్మ, అమ్మ దగ్గరికి వెళ్తున్నామన్న సంబరంలో మరో పక్క పిల్లలు.
ప్రయాణపు హడావిడిలో ఎవరి భావాలు చదివే సమయం, హృదయం లేని నేను…
సరిగ్గా అప్పుడే నా ఫోను రింగయ్యింది.
“మళ్ళీ ఇండియా ఎప్పటికి వస్తావో ఏమో.. అమ్మ, పిల్లలను తీసుకుని రేపు మధ్యాహ్నం భోజనానికి రామ్మా” అవతల మా వదిన కంఠం.
“ఇంకా లగేజీ సర్డుకోవటమే పూర్తి కాలేదు. కొన్ని చిన్న చిన్న షాపింగులు మిగిలి వున్నాయి. సమయం లేదు వదినా” నచ్చచెప్పబోయాను.
వదిన ససేమిరా ఒప్పుకోలేదు.
“అరగంటలో భోజనం చేసేసి వెళ్ళిపొండి.. వచ్చేసరికి కంచాల్లో వడ్డించేసి సిద్ధంగా ఉంచుతాను. మళ్ళీ ఎన్న్నాళ్ళకు చూస్తానోనమ్మా నిన్ను..” అంటూ బ్రతిమాలింది. కాదనలేక పోయాను.
God has His own plans…
మరుసటి రోజు ఉదయం నుండీ హడావిడి పడితే తప్ప మధ్యాహ్నానికి గాని బయట పడలేక పోయాం. భోజనం కార్యక్రమం అరగంటయినా, వెళ్ళటం గంట, రావటం గంట. అదయినా ట్రాఫిక్కు లేకపోతేనే.
ఔటింగ్ అంటే సంబరపడిపోయే పిల్లలను, చుట్టాలంటే ప్రాణం పెట్టే అమ్మను తీసుకుని బయిలుదేరాను. ఇండియాలో ఎక్కడికెళ్లినా పిల్లలతో పాటు మరిచిపోకుండా తీసుకెళ్ళేవి కిన్లే వాటర్‌తో వాళ్ళ నీళ్ళ బాటిల్స్.
ఏ ట్రాఫిక్ రూల్స్ పాటించని హైదరాబాదు మహానగరంలో కారును మెళకువతో నేర్పుగా అంబులెన్సులాగా రయ్యిన దౌడు తీయించటంలో నేను ఆరి తేరి పోయాను.
ఇక్కడ ముఖ్యంగా నా స్పీడు గురించి చెప్పాలి. లిఫ్ట్ వచ్చేవరకూ ఆగలేక ఎన్ని అంతస్తులైనా పరిగెత్తుకుంటూ మెట్లేక్కేసే రకాన్ని నేను.
కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరుగులు పెడతాను.. చక్రం ముందు కూర్చున్నా వాహనాన్ని అలాగే పరుగులు పెట్టిస్తాను.
ట్రాఫిక్కులో మునకలేస్తూ సిగ్నల్స్ దగ్గర బ్రేకులేస్తూ నలభై నిముషాల్లో వదిన ఇంటి ముందు తేలాము. పిచ్చా పాటీ అయ్యాక పిల్లలిద్దరికీ కంచాల్లో అన్నం కలిపి వాళ్ళకి ఇచ్చాను. అప్పుడు గుర్తొచ్చింది పిల్లల నీళ్ళ బాటిల్స్ కారులోనే వుండిపోయాయని.
క్షణంలో మెరుపులా మాయమయి గుమ్మంలో వున్న పాత హవాయి చెప్పులు గబుక్కున కాళ్ళకు తగిలించుకుని గేటు అవతల వున్న కారు దగ్గరికి పరుగు లంకించుకున్నాను. పరిగెడుతూ గేటు ముందు మెట్ల మధ్య టూ వీలర్స్ కోసం కట్టిన నున్నటి ర్యాంప్ మీద కుడి పాదం వేశాను. కాలికున్న చెప్పు ర్యాంపు మీద సర్రున జారింది.
కాలు ఆఖరి మెట్టుకి చేరేసరికి పెద్ద బెలూనులా పొంగిన పాదాన్ని చూసిన నేను భయంతో ‘అమ్మా’ అనే పెద్ద కేకతో వెల్లకిలా పడిపోయాను. పాదం పూర్తిగా తొంభై డిగ్రీల కోణంలో పక్కకి తిరిగిపోయింది.
అరక్షణం పట్టలేదు జీవితం తలక్రిందులు కావటానికి…
Just a skid on a two feet bike ramp… కళ్ళు బైర్లు కమ్మాయి… చుట్టూ చీకట్లు అలుముకున్నాయి… నా ఊపిరి కూడా వినపడని మగతలోకి జారిపోయాను.
బక్క పల్చని నా మేనల్లుడు, మరో ఇద్దరు పొరుగింటి అబ్బాయిలు నా అరవై నాలుగు కేజీల కాయాన్ని మోసుకెళ్ళి హాలులో దీవాన్ పైన పడుకో పెట్టారు.
అమ్మ తనకిష్టమైన చేప ముక్క నోట్లో పెట్టుకోబోతూ చెట్టంత కూతురిని కుర్రాళ్ళు మోసుకు రావటం చూసి నిశ్చేష్టురాలయి కంచంలో చెయ్యి కడిగేసుకుంది.
“బాబోయ్… అమ్మ నా పిల్లోయ్… ఇంతలోనే ఏమయిపోయింది దేవుడోయ్…” అంటూ మా వదిన శోకండాలు మొదలెట్టింది.
ఎప్పుడూ నన్ను మోషన్‌లో తప్ప స్టేబుల్‌గా చూడని పిల్లలిద్దరూ కదలిక లేకుండా పడి వున్న నన్ను చూసి బిత్తరపోయారు. స్పృహలో లేని నన్ను ఎవరో కదుపుతూ, పిలుస్తూ నా మొహాన నీళ్ళు చిలకరించారు.
ఏడుస్తూనే వదిన తనకు తెలిసిన, నమ్మకమైన బోన్ సెట్టర్‌ని పిలిపించింది. అతను చాలా బలంగా నా పాదాన్ని రెండు చేతులతో పట్టుకుని తాళం చెవి తిప్పినట్టు పాదం తిప్పేసాడు. అతను పాదం తిప్పిన భయంకరమైన నొప్పికి నా అన్‌కాన్షియస్ మెదడు స్పృహలోకి వచ్చింది.
“ఫ్రాక్చర్ అయ్యింది. ఎక్స్‌రే తీయాలి. ఏదయినా డయాగ్నిస్టిక్ సెంటర్లో ఎక్స్‌రే తీయించుకు రండి. నేను చూసి పట్టీ వేస్తాను” బోన్ సెట్టర్ మాటలు లీలగా వినిపించాయి.
మెల్లగా కళ్ళు తెరిచాను. అయిన వాళ్ళంతా భయాందోళనలతో నా చుట్టూ మూగి వున్నారు. అమ్మ, వదిన ఏడుస్తున్నారు. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. అంతలో కింద చీలమండ దగ్గర నొప్పిగా అనిపించింది. కాలు కదప బోయాను. నొప్పి ఉధృతమయ్యింది.
లీలగా నేను ర్యాంపు మీద పడిపోవటం గుర్తుకొచ్చింది. అమాంతం ఇంత లావు గుమ్మడి పండులా పెరిగిపోయిన చీలమండ గుర్తొచ్చింది. మెడ పైకెత్తి కాలి వంక చూసుకున్నాను. అంత లావు లేదు. ఆ పక్కనే వున్న ఎముక సెట్టర్ వంక చూసాను. విషయమంతా వదిన చెప్పింది. భయం వేసింది. ఈ మోట వైద్యంతో జీవితమంతా కుంటిదానిగా మిగిలిపోతానేమోననిపించింది.
నా మేనల్లుడిని నా హ్యాండ్ బ్యాగులో నుండి నా మొబైల్ తీసి ఇమ్మన్నాను. వెంటనే ఒక నంబరుకి కాల్ చేసాను.
(మళ్ళీ కలుద్దాం)