వీగనిజం – సంక్షిప్త పరిచయం

4
4

[dropcap]వీ[/dropcap]గనిజం అంటే జంతువులపై హింసకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం. వాటిని వస్తువులాగా కాకుండా సాటి జీవుల్లా చూడటం.

మనకు ఈ భూమి మీద సుఖంగా జీవించడానికి ఎంత హక్కు ఉందో ఇతర ప్రాణులకు కూడా అంతే హక్కు ఉంది అని గుర్తించడం.

అంటే జంతువులను కాని వాటి పదార్థాలను కాని ఉపయోగించకుండా వాటికి ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత పదార్థాలను ఉపయోగించడం.

మాంసం, గ్రుడ్లు, పాలు, పాలపదార్థాలు, తేనె, ఉన్ని, జంతు చర్మం, పట్టు ఇవన్నీ జంతువులను హింసించడం వల్ల వచ్చే పదార్థాలు. అందువల్ల వీగన్లు ఈ పదార్థాలను ఉపయోగించరు. వీగనిజం అన్నది ఒక ధోరణి కాదు. ఒక ఆహార నియమం కాదు. వీగనిజం హింసకి ఇంకా అణచివేతకి వ్యతిరేకత.

మనకోసం ఇంకొక స్పర్శజ్ఞానం గల జంతువు హింసింప బడకూడదు అని వీగన్లు నమ్ముతారు. వీగనిజం శాంతి కరుణలకు ఒక చిహ్నం.

వీగనిజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు:

ప్రశ్న: మాంసం తినడం వల్ల హింసకు మద్దతు ఇస్తున్నాం అంటే సరేనండీ. కానీ పాలు, పాలపదార్థాలతో ఏమి తప్పు ఉంది?

సమాధానం: మనుషుల లాగే ఆవులు, గేదెలు కూడా పాలు ఉత్పత్తి చేయాలంటే మొదట తల్లి కావాలి. ఒక దూడకు జన్మనివ్వాలి. అందుకే ప్రతి యేటా పశువులను కృతిమగర్భధారణ పద్దతిని ఉపయోగించి గర్భిణిని చేస్తారు. అంటే ఒక ఎద్దు నుండి వీర్యకణాలు సేకరించి ఆవు యోనిలోకి ప్రవేశపరుస్తారు. అది చాలా క్రూరమైన పద్ధతి. అదే ఒక మనిషికి చేస్తే దానిని అత్యాచారం అంటాం.

అలా పుట్టిన దూడ ఒకవేళ ఆడది ఐతే అదే పద్దతిని కొనసాగిస్తారు. ఒకవేళ మగది ఐతే దానిని చర్మం కోసం కాని మాంసం కోసం కాని చంపేస్తారు. కొన్ని రాష్ట్రాలలో ఆవులని చంపడం నిషిద్ధం కాని మన దేశం ఆవు మాంసం ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇంకా దూడని ఆవు నుంచి దూరం చేస్తారు. ఎందుకంటే ఆ దూడ పాలు మొత్తం తాగేయకూడదు అని. అందువల్ల ఆవుకీ, దూడకీ తీవ్ర మనోవేదన కలుగుతుంది. తల్లికి బిడ్డకి ఉన్న బంధం జంతువులలో కూడా ఉంటుందండీ. ఒక లోటా పాలు వెనుక ఇంత హింస ఉంటుంది.

ప్రశ్న: మరి వీగన్ అయితే అన్ని పోషకాలు లభిస్తాయా?

సమాధానం: మొక్కల ఆధారిత పదార్థాలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి, ఒక్క విటమిన్ బి12 తప్ప. అది సాధారణంగా మట్టిలో ఉంటుంది. మనం పళ్ళు కూరగాయలు బాగా కడుగుకుని ఉపయోగిస్తాము కాబట్టి మనకు లభించదు. అందుకే బి12 మందులను మాత్రం తీసుకోవాలి. వేరే పోషకాలు అన్నీ కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు, ఆకుకూరలు, పప్పులు, డ్రైఫ్రూట్స్ వీటిల్లో ఉంటాయి. కొంచెం పరిశోధన చేసి ఏమి తింటే ఏ పోషకాలు వస్తాయో తెలుసుకుంటే చాలు.

ప్రశ్న: మరి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా?

సమాధానం: మొక్కలకు ప్రాణం ఉంటుంది కానీ స్పర్శ ఉండదు. నొప్పిని, బాధని అనుభవించాలి అంటే కేంద్ర నాడీ వ్యవస్థ ఉండాలి కానీ మొక్కలకు అది ఉండదు. అందువల్ల వాటికి నొప్పి తెలియదు. జంతువులను హింసించే దృశ్యాలు చూపిస్తే చాలా మంది వాటిని చూడలేరు. అదే ఒక మొక్కను కోస్తే మనం చూడవచ్చు. దీన్ని బట్టి చాలా వాటికి సమాధానాలు లభిస్తాయి.

ప్రశ్న: నాకు పాలపదార్థాలు చాలా యిష్టం. నేను వాటిని తినకుండా ఎలా ఉండాలి?

సమాధానం: ఒక జంతువు యొక్క ప్రాణం, స్వేచ్ఛల కంటే మన ఇంద్రియసుఖం ముఖ్యమైనదా అని ఆలోచించాలి. అన్ని పాల పదార్థాలకు వీగన్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పాలకు బదులుగా కొబ్బరి పాలు, సోయా పాలు, ఓట్స్ పాలు ఇలా చాలా ఉన్నాయి. వీటితో కాఫీ చేసుకోవచ్చు. స్వీట్స్ చేసుకోవచ్చు. పన్నీర్‌కు బదులుగా సోయా పన్నీర్ (తోఫు) వాడవచ్చు.

ఒక జంతువును చంపమంటే మనలో చాలా మంది ఆ పని చేయలేము. ఒక ఆవును, దూడను వేరు చేయమంటే మనకు మనసు రాదు. ఎందుకంటే మన విలువలు మనకు అడ్డొస్తాయి. అలాంటి పనులు మనం చేయలేనప్పుడు వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎందుకు చేపిస్తాము? మనం వీగన్‌గా మారితే మన గురించి మనం ఏమీ మార్చుకోము, మన చర్యలను మన విలువలతో సమర్థించుకుంటాము అంతే.

వీగనిజం గురించి మరింత సమాచారానికి అంతర్జాలం చూడగలరు.

Images Courtesy: Wikimedia

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here