మానస సంచరరే-63: మంచి మార్పు.. మనోకాంక్ష!

12
3

[box type=’note’ fontsize=’16’] “కాలగమనంలో ఎన్నో మార్పులు జరిగిపోతుంటాయి. మనిషి కూడా మార్పును, కొత్తదనాన్ని అభిలషిస్తాడు” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]సా[/dropcap]యం సమయాన పెరట్లో అడుగు పెట్టిన నాకు ఆకులన్నీ రాల్చేసుకుని, కళ తప్పిన చెట్లు ‘చూశావా! శిశిరం మా పై ఎలా కసితీర్చుకుందో?’ అని గోడు వెళ్లబోసుకున్నట్లు అనిపించింది. ఆ గోడు గుండెగదిని తాకినా, రుతు ప్రభావం.. తప్పదు. అయితేనేం, ఈ మార్పు తాత్కాలికమే. శిశిరమూ వెళ్లిపోవలసిందే. శిశిరం ముందు తలవంచిన తరువులు, మళ్లీ ధీశాలుల్లా కొద్దికాలానికే తలలెత్తి, కొత్త ఆకుల సింగారంతో నవ వసంత శోభతో అలరారవూ అనుకుంటుంటే ఓ గీతం అలా తేలివచ్చి మదిని తాకింది..

జగమే మారినది మధురముగా ఈవేళ
కలలు, కోరికలు తీరినవి మనసారా..॥జగమే॥
మనసాడెనే మయూరమే
పావురములు పాడె.. ఎల పావురములు పాడె..
ఇదే చేరెనూ గోరువంక
రామచిలుక చెంత.. అవి అందాల జంట
నెనరు కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత॥జగమే॥

అక్కడే ఉన్న మేడమెట్ల పై బైరాయించగానే తలపులు, తలుపులు తెరుచుకున్నాయి.. కలలు పండి, కోరికలు తీరినవేళ తన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఎంతో అందంగా మారిపోయి కనిపించడం సహజం. ఆ మనోభావాలను ఆరుద్రగారు ఎంత చక్కటి మధురగీతంగా కూర్చి ‘దేశద్రోహులు’ చిత్రానికి అందించారో. ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు మనిషి మళ్లీ మళ్లీ ఎంతగానో మారుతూనే ఉన్నాడు. ఎన్ని సాధనాలనో తన మేధస్సుతో ఆవిష్కరించుకుని, తన జీవితాన్ని, ప్రపంచం మొత్తాన్ని నిత్య నూతనంగా మార్చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మార్పులలో వేష, భాషలతోపాటు మోసం కూడా జత చేరిందని ఆతడి తీరును తెలిపే చక్కని పాటొకటి పింగళి నాగేంద్రగారు ‘గుండమ్మ కథ’ సినిమా కోసం రాశారు. అది..

వేషము మార్చెనూ హొయి
భాషను మార్చెనూ హొయి
మోసము నేర్చెనూ అసలు తానే మారెనూ
అయినా మనిషి మారలేదూ..ఆతని మమత తీరలేదు
క్రూరమృగమ్ముల కోరలు తీసెను.. ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయము పై జెండా పాతెను.. ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదూ.. ఆతని కాంక్ష తీరలేదు…
పిడికిలి మించని హృదయములో..కడలినిమించిన ఆశలు దాచెను
వేదికలెక్కెను వాదము చేసెను త్యాగమె మేలని బోధలు చేసెను
అయినా మనిషి మారలేదూ.. ఆతని బాధ తీరలేదు
వేషము మార్చెను.. భాషను మార్చెను
మోసము నేర్చెను.. తలలే మార్చెను
అయినా మనిషి మారలేదూ.. ఆతని మమత తీరలేదూ..

మనుషుల్లో మార్పు అనేక రకాలు. పుట్టింది మొదలు పెరిగే క్రమంలో మనిషిలో ఎన్నో మార్పులు. పసిపాపలో కాలం గడిచే కొద్దీ వచ్చే మార్పులు, చేతల్లో, కదలికల్లో మార్పులు తల్లి మదిని పరవశింపజేస్తాయి. తండ్రికి ఎనలేని ఆనందం. ఇంట సంతోషాలు.. సందళ్లు. పసిబిడ్డ నవ్వినా, గుర్తుపట్టినా ఎదిగే క్రమంలో బోర్లాపడటం, పాకటం, కూర్చోవటం, నిలబడటం, అడుగులు వేయడం, చకచక నడవటం అన్నీ సంతోష, సంభ్రమాలకు గురి చేసే మార్పులే. తాత, అత్త తొలిపలుకులు వీనుల విందే. పుట్టగానే బిడ్డ ఫలానా వారి పోలిక అంటూ చెప్పుకుని మురిసిపోతారు, పెద్దయ్యే కొద్దీ వారి రూపురేఖల్లో వచ్చే మార్పులు చూసి, పోలిక మారిపోయిందంటూ,ఆ పైన చిన్నప్పుడు అలా ఉండేవాడు, ఇప్పుడెంతో మారిపోయాడు.. అని అనుకుంటుంటారు. ఇదంతా రూపానికి సంబంధించిన మార్పులయితే, మనస్తత్వానికి సంబంధించి, ప్రవర్తనకు సంబంధించి అనేక మార్పులు రావటం సహజం. బడిలో చేరాక పిల్లల్లో మార్పు రావడం తెలిసిందే. టీచర్ల బోధన, తోటి పిల్లలతో సహవాసం, బడిలో జరిగే అనేకానేక సందర్భాలు, సంఘటనలు పిల్లల ప్రవర్తనలో ఎంతో మార్పు తీసుకువస్తాయి. ఆ పైన కాలేజీ చదువులు, ఉద్యోగాలు.. ఎందరితోనో పరిచయాలు, చుట్టూ సమాజం, జీవితానుభవాలు మనిషిలో ఎంతో మార్పు తీసుకువస్తాయి. అబ్బాయిలయినా, అమ్మాయిలయినా పెళ్లి కాగానే ఎంతో కొంత మారటం సహజం. ఆ మార్పు అనుకూలం కావచ్చు, ప్రతికూలం కావచ్చు. పెళ్లయ్యాక కొడుకు మారిపోయి పూర్తి కోడలు సొత్తయ్యాడని తల్లి సాధించడం చాలా ఇళ్లల్లో జరిగేదే. అమ్మాయి పెళ్లయ్యాక తమను పూర్తిగా మరిచిపోయిందని, అన్నీ బావగారి ముచ్చట్లే అని చెల్లెళ్లు, తమ్ముళ్లు ఆట పట్టించడమూ మామూలే.

ఇక పెళ్లి ముందు తీయని మాటలు చెప్పిన అబ్బాయి తీరు పెళ్లయ్యాక మారితే.. దాన్నొక ప్రణయ కలహ గీతంగా ఎంతో చక్కని సరదా పాటగా ఆరుద్ర గారు ‘ఇల్లరికం’ చిత్రానికి అందించారు.

నేడు శ్రీవారికి మేమంటే పరాకా.. ఆ.. ఆ..
తగని బలే చిరాకా.. ఎందుకో తగని బలే చిరాకా.. ఆ.. ఆ..
మొదట మగవారు వేస్తారు వేషాలు.. పెళ్లి కాగానే చేస్తారు మోసం..
ఆ.. ఆ.. ఆడవాళ్లంటే శాంతస్వరూపాలే.. కోప తాపాలే రావండి
పాపం.. కోరి చేరిన మనసు.. చేత చిక్కిన అలుసు..
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు..
అని ఆమె అంటే, అతడు
నేడు శ్రీమతికి మాతోటి వివాదం.. తగువే.. బలే వినోదం..
ఎందుకో.. తగువే బలే వినోదం.. ఊ..
వారి మనసైతే వస్తారు ఆడవారు.. చేరరమ్మంటే రానేరారు
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు.. తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు.. అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే..
ప్రణయకలహాల సరసాల వినోదం..నిజమే బలే వినోదం..

నిజమే.. తాను ఆరాధించిన వ్యక్తి, ఏ నాటికైనా తన వాడవుతాడనుకుని, తన జీవనరీతినే మార్చుకుని అతడి సేవకే అంకితమవగా, ఆమె ఆశలను అడియాసలు చేసి అతడు ఆమెను వీడితే ఆమెకు మిగిలేది విషాదమేకదా. అలాంటి విషాదాన్ని పలుకు పలుకులో ప్రతిధ్వనించిన పాట పాత ‘దేవదాసు’ చిత్రంలో ఒకటుంది. అదే..

తానే మారెనా, గుణమ్మే మారెనా
దారి తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా॥తానే॥
తొలిచూపు నాటి రూపు మారే..ధోరణి మారే
నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా॥తానే మారెనా॥

సీనియర్ సముద్రాల రాసిన ఈ పాటను రావు బాల సరస్వతి పాడిన తీరు అనన్య సామాన్యం.

ఇక సమాజంలో మార్పులు కూడా ఎంతో ప్రాముఖ్యత కలవే. కొన్ని మూఢాచారాలను నిర్మూలించడానికి సంఘ సంస్కర్తలు సంఘసంస్కరణలు చేపట్టడం, తద్వారా సమాజంలో మంచి మార్పులు రావడం తెలిససిందే. బాల్య వివాహాలు, కన్యాశుల్కం, సతీసహగమనం వంటి దురాచారాల నిర్మూలనకు కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్ రాయ్ కృషే కారణం కదా. ఇంటికే పరిమితమైన ఇంతుల బతుకులకు స్త్రీ విద్యతో గొప్ప మార్పు వచ్చింది. ఆ పైన ఆమె ఆర్థికంగా స్వతంత్రత సాధించడానికి ఉద్యోగాలు చేపట్టింది. అన్ని రంగాలలో తన పాత్రను పోషించింది. రాజకీయ రంగంలోనూ రాణించింది. ఈ పరిణామం పైనే కాస్తంత సరదా పాటను పింగళి నాగేంద్రగారు ‘గుండమ్మకథ’ సినిమా కోసం రాశారు. అది..

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం…
ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా…
విస్సన్న చెప్పిన వేదం కూడా ॥లేచింది॥
పల్లెటూళ్లలో పంచాయితీలు పట్టణాలలో ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల..
మగధీరుల నెదరించారు, నిరుద్యోగులను పెంచారు॥లేచింది॥
చట్టసభలలో సీట్లకోసం భర్తలతోనే పోటీచేసి..
ఢిల్లీ సభలో పీఠంవేసి.. ఆ.. ఆ.. ఆ.. ఢిల్లీ సభలో పీఠంవేసి
లెక్చరులెన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు ॥లేచింది॥

మారే కాలంతో ప్రపంచమూ మారుతుంది. మారిపోయిన రోజుల గురించే ‘రోజులు మారాయ్’ అనే సినిమా ఏనాడో వచ్చింది. అందులోని టైటిల్ సాంగ్ మార్పును అభివర్ణిస్తుంది. కొసరాజు రాసిన ఆ పాటను జిక్కి తనదైన రీతిలో ఎంతో మధురంగా ఆలపించారు.

కల్లాకపటం తెలియనివాడ.. లోకం పోకడ తెలియని వాడ
ఏరువాక సాగారోరన్నో చిన్నన్న
నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్న…
అంటూ సాగే ఈ పాటలో చివరి చరణంలో
పదవులు స్థిరమని భ్రమిసేవాళ్లే.. ఓట్లు గుంజి
నిను మరిచేవాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్
రోజులు మారాయ్.. రోజులు మారాయ్.. మారాయ్..
మారాయ్ రోజులు మారాయ్ ॥ఏరువాక॥

అలాగే స్థితిమంతులదే చెల్లుబాటు అనేది పోయిందని, కాలం మారిపోయిందంటూ ‘మైనర్ బాబు’ చిత్రంలో ఓ పాట…

కారున్న మైనరు..కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు.. మా చేతికి వచ్చాయి తాళాలు..
మా చేతికి వచ్చాయి తాళాలు.. హుత్తెరె…
రోడ్డెంత బాగుంటే, మీకంత హుషారు.. దాన్నే సిన్నోళ్లమీదనే
ఎక్కించి పోతారు..
మేమెక్కి కూర్చుంటే మీరేమైపోతారు??..
మా పక్కనింత చోటిస్తే చాలంటారు.. హుత్తెరె.. ॥కారున్న॥

మార్పుల్లో కొన్ని మామూలు మార్పులయితే, కొన్ని అసాధారణ మార్పులు.

బోయవాడైన కరకు వాల్మీకి, తన జీవనరీతికే స్వస్తి చెప్పి మహర్షిగా మారటం అసాధారణ మార్పే కదా. దీనికి అక్షర రూపంగా వేటూరి చెక్కిన పాట ‘అడవిరాముడు’ చిత్రంలో ఇలా..

మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. మహా పురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులవుతారు…
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి..
అతిభయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలిటి..
అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించి పోయేవేళా
ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు.. ఒక పక్షిని నేలకూల్చాడు
జంటబాసిన పక్షి కంటపొంగిన గంగ తన కంటిలో పొంగ
మనసుకరగంగ ఆ శోకంలో ఒక శ్లోకం పలికే..
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే..
కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు.. కడకు మహర్షే అయినాడు
నవరస భరితం రాముని చరితం…
జగతికి అతడు పంచిన అమృతం…
ఆ వాల్మీకి మీవాడూ.. మీలోనే ఉన్నాడు..
అక్షరమై మీ మనసు వెలిగితే.. మీలోనే వుంటాడు..
అందుకే.. ॥కృషిఉంటే॥

మంచిగా మారడానికి కృషి ఉండాలంటూ కవి అందించిన చక్కని సందేశ గీతమిది. తెనాలి రామకృష్ణ కవి రచించిన ‘పాండురంగ మహాత్మ్యం’ లో నిగమశర్మ కథలో పండిత పుత్రుడైన నిగమశర్మ వ్యసనాలకు లోనై అన్ని విధాలా భ్రష్టుడై, చివరకు తన తప్పు తెలుసుకుని సన్మార్గానికి మళ్లుతాడు. ఇదే కథను కొద్ది మార్పులతో చిత్రంగా తీశారు. ఇందులో పుండరీకుడు చెడు నడతకు లోనై, చివరకు పశ్చాత్తాపపడి సత్పథగామి అవుతాడు. పశ్చాత్తాప ఆవేదనలో అతడు పాడే పాట ఎంతో పాపులర్.. అది…

అమ్మా.. నాన్నా..
అమ్మా.. అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా ‘అమ్మా’
పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ
తలచకమ్మా తనయుని తప్పులు
క్షమియించవమ్మా.. అమ్మా.. అమ్మా..
దేహము విజ్ఞానము బ్రహ్మెపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కనుగానని కామమున ఇలువెడల నడిపితీ
కనిపిస్తే కన్నీళ్లతో కాళ్లు కడుగుతా నాన్నా.. నాన్నా.. నాన్నా
మారిపోతినమ్మా నా గతి ఎరిగితినమ్మా
మీ మాట దాటనమ్మా ఒకమారు కనరమ్మా
మాతాపిత పాద సేవ మాధవ సేవేయని
మరువనమ్మ.. మాతా..
నన్ను మన్నించగ రారమ్మా.. అమ్మా.. అమ్మా.. ॥ అమ్మా అని॥

సముద్రాల జూనియర్ గీత రచన ఎంత గొప్పగా ఉంటుందో ఘంటసాల గానం అంతే గొప్పగా ఉంటుంది.

వేమన జీవితాన్నే తీసుకుంటే వేశ్యాలోలుడై భోగిగా ఉన్న వేమన ఆ తర్వాత యోగిగా మారిపోతాడు. భక్తకన్నప్ప చరితమూ అంతే. ద్వాపర యుగంలోని అర్జునుడు, కలి యుగంలో బోయవాడైన తిన్నడుగా జన్మించాడు. వేటాడి జీవించే తిన్నడికి ఓరోజు కలలో శివుడు కనిపించి, దాపులో ఉన్న శివాలయానికి వెళ్లమంటాడు. అది మొదలు తిన్నడు శివభక్తుడిగా మారుతాడు. శివుడి కంటి నుంచి కన్నీరు కారుతోందని తన కంటిని పెరికి శివుడికి అమరుస్తాడు. తిరిగి శివుడి రెండో కంటినుంచి రక్తం కారుతుండడంతో, తన రెండో కన్నును కూడా పెరకబోగా అతడి అనుపమాన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై శివసాయుజ్యాన్ని ప్రసాదిస్తాడు. శివుడికి కన్నును అమర్చిన కారణంగా తిన్నడు, భక్త కన్నప్ప అయ్యాడు. పురాణాలలో ఇలాంటి కథలెన్నో. వేషాలు మార్చే ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే ఇంద్రుడు రకరకాల వేషాలు ధరించి మోసగించడం తెలిసిందే. మారీచుడు, బంగారు లేడిగా మారి సీతను ఆకర్షించి, ఆమె అపహరణకు కారణభూతుడు కావడం విదితమే.

కొన్ని దృశ్యాలు, సంఘటనలు కూడా మనిషి పై తీవ్ర ప్రభావం చూపి మార్పుకు కారణ మవుతుంటాయి. శుద్ధోదన మహారాజు కుమారుడైన సిద్ధార్ధుడు, జ్యోతిష్కులు చెప్పినట్లుగా బుద్ధుడవుతాడని భయపడి, అతడికి బాధ, విచారం అనేవి తెలియకుండా రాజ భవనంలోనే ఉండేలా చూస్తాడు తండ్రి. సిద్ధార్థుడికి యశోధరతో వివాహమై, రాహులుడు పుడతాడు. ఆ తర్వాత ఒక రోజు రథంపై నగర దర్శనానికి వెళ్లగా దారిలో ఓ వృద్ధుడిని, ఓ వ్యాధిగ్రస్థుడిని, శవయాత్ర చూడటం జరుగుతుంది. తొలిసారిగా ప్రపంచం లోని దుఃఖం అతడికి పరిచయమై, ఆలోచనలు రేపుతుంది. కష్టాలకు కారణాలను కనుగొనేందుకు సత్యాన్వేషణ కోసం అర్థరాత్రివేళ ఇల్లు విడిచి, సన్యాసం స్వీకరిస్తాడు. బోధివృక్షం కింద ధ్యానమగ్నుడై చివరకు జ్ఞానోదయం పొందుతాడు. నగర దర్శనం సిద్ధార్థుడిలో ఎంతటి మార్పు తెచ్చిందో. అలాగే అశోకచక్రవర్తి కళింగయుద్ధంలో ఘోర రక్తపాతాన్ని చూసి, విచలితుడై హింసా మార్గం వీడి, అహింసా పథంలో పయనించినట్లు చరిత్ర చెపుతోంది. గాంధీజీ సత్య హరిశ్చంద్ర, శ్రవణకుమారుడు నాటకాలు చూసి ఎంతగానో ప్రభావితుడై సత్య, ధర్మ పథాలవైపు మళ్లారు.

ప్రపంచంలో మార్పు అనేది అనివార్యం. యుద్ధాలు, ఆర్థికమాంద్యాలు, ఇప్పుడు కరోనా ప్రపంచంపై ఎంతటి ప్రభావం చూపాయో ఊహించని మార్పులనెన్నింటిని తెచ్చాయో తెలిసిందే. కాలగమనంలో ఎన్నో మార్పులు జరిగిపోతుంటాయి. మనిషి కూడా మార్పును, కొత్తదనాన్ని అభిలషిస్తాడు. జీవనశైలి పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. పారిశ్రామికీకరణ, సాంకేతిక ప్రగతి కారణంగా మార్పులు వేగవంతంగా జరిగిపోతున్నాయి. అయితే కొందరు మార్పును వెంటనే ఆమోదించలేరు. కారణం ఆ మార్పు తమకు కొత్త కావడమే. కంప్యూటర్ రంగ ప్రవేశం చేసిన తొలిరోజుల్లో కార్యాలయాలలో చాలామంది వాటిపట్ల విముఖులయ్యారు. కారణం తాము ఎంతో కాలంగా అలవాటు పడ్డ పనితీరును వదిలి తెలియని కొత్త దాన్ని నేర్చుకోవలసి రావడమే. అయితే అతి కొద్దికాలంలో వాటికలవాటు పడిపోవడమూ జరిగింది. అయితే ప్రపంచంలో ఎన్ని మారినా నిజమైన ప్రేమ మాత్రం మారదంటూ మెర్లిన్ ఆర్కివిల్ల ఓ చక్కని పొయెమ్ రాశారు. అది..

ది కోర్స్ ఆఫ్ లైఫ్, టైమ్ అండ్ ఈవెంట్స్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ చేంజ్
టైమ్ ఆర్ ఫేట్ మే సపరేట్ ఫ్రెండ్స్, లవర్స్
బట్ ఫ్రెండ్‌షిప్ ఆర్ లవ్ దటీజ్ ట్రూ విల్ ఎవర్
దెన్స్‌ఫోర్త్ కంటిన్యూ టు లివ్ ఫరెవర్,
ట్రూ లవ్ కాంకర్స్ ది ఆఁడ్ విత్ ఇట్స్ పవర్
యాజ్ టైమ్ పాసెస్ బై, థింగ్స్ చేంజ్ విత్ ది టైమ్
ఎవిరి మూమెంట్, అవర్, డే, మంత్ అండ్ ఈయర్
ఆల్ థింగ్స్ హేవ్ దెయిర్ టర్న్ టు చేంజ్ విత్ ది టైమ్
లైఫ్ టైమ్, అండ్ ఈవెంట్స్ చేంజ్ విత్ ది ఈయర్స్
ఎవిరివన్, ఎవిరిథింగ్, హేవ్ ఎ టైమ్ అండ్ డే
ఎ టైమ్ టు చేంజ్, ఎండ్, బిగిన్ ఎ న్యూ డే
చేంజ్ ఈజ్ లైఫ్, ది కోర్స్ ఆఫ్ లైఫ్ ఎవిరిడే
ఆల్ థింగ్స్ చేంజ్, అండ్ వుయ్ చేంజ్ విత్ దెమ్ ఆల్ డేస్
ఓన్లీ ది ఎటర్నల్ వన్ ఈజ్ కాన్‌స్టంట్,
ఆల్ థింగ్స్ ఇన్ ది యూనివర్స్, ఇన్‌కాన్‌స్టంట్
బట్ డెస్పయిట్ ఇట్ ఆల్, లవ్ ఈజ్ ఇంపార్టంట్,
ది వరల్డ్ మే చేంజ్, బట్ ట్రూ లవ్ ఈజ్ కాన్‌స్టంట్

కార్మికవర్గాన్ని దోచుకునే పెట్టుబడిదారుల దుర్మార్గాలను, కార్మిక జన ఘోషను చిత్రించిన ‘మనుషులు మారాలి’ చిత్రం అప్పట్లో గొప్ప హిట్. దాన్నే హిందీలో ‘సమాజ్ కో బదల్ డాలో’ పేరిట తీశా రు. అందులో సాహిర్ లూధియాన్వి రాసిన, రఫీ సాబ్ పాడిన టైటిల్ సాంగ్..

సమాజ్ కో బదల్ డాలో, సమాజ్ కో బదల్ డాలో,
సమాజ్ కో బదల్ డాలో
జుల్మ్ ఔర్ లుట్ కె రివాజ్ కో బదల్ డాలో
సమాజ్ కో బదల్ డాలో
కిత్‌నే ఘర్ హై జినమే ఆజ్ రోష్నీ నహీ..
కిత్‌నే తన్ మదన్ హై జిన్ మే జిందగీ నహీ
ముల్క్ ఔర్ కౌమ్ కె మిజాజ్ కో బదల్ డాలో.. ॥సమాజ్ కో॥
సైకడోఁ కి మెహనతొ పర్ ఏక్ క్యూ పలె..
ఊంచ్ నీచ్ సె భరా నజామ్ క్యూ చలె
ఆజ్ హై యెహీ తొ ఐసే ఆజ్ కో బదల్ డాలో.. ॥సమాజ్ కో॥

మానవ జీవితంలో మార్పు అనివార్యం. ఏ ఒక్కరికీ కాలమంతా ఒకే తీరుగా నడవదు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అని ఓ సామెత. సోమరిపోతు, శ్రమజీవిగా మారటం; బాధ్యతా రహితుడు, బాధ్యతాయుతంగా మారటం; వ్యసనపరుడు వ్యసనాలను వీడి సజ్జనుడిగా మారటం.. ఇలా ఎన్నోరకాలు.. మార్పు మంచిదైతే అందరూ స్వాగతిస్తారు. వ్యక్తి ప్రవర్తనలో మార్పును తీసుకురాని విద్య, దయా, దానగుణాల్నీ, ధైర్య సాహసాల్నీ అలవరచలేని విద్య, విద్యగా పరిగణించ బడదంటారు స్వామి వివేకానంద. మన విద్యావిధానంలో అలాంటి మార్పు ఎప్పుడు వస్తుందో, మనుషులంతా మనసుల్లో మానవత్వపు పరిమళాలను నింపుకుని, ప్రపంచాన్ని ప్రశాంతమయంగా ఎప్పుడు మారుస్తారో అనుకుంటుంటే, ‘భక్త తుకారాం’ చిత్రంలోని వీటూరిగారి పాట మదిని పలకరించింది..

భలేభలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం.. అదే అనుబంధం..
ప్రభో మాకేల ఈయవు ॥భలే భలే॥
మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి..
మారణ హోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు?

అంతలో మధురగీత స్మృతిని ఛేదిస్తూ పక్కింటి మిక్సీ శబ్దం.. ఉలిక్కిపడ్డాను. చూస్తే చుట్టూ చీకట్లు.. చటుక్కున లేచాను. ఇంకేముంది.. ఆలోచనలు ఆవలకు, నేను ఈవలకు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here