[dropcap]ఈ[/dropcap] రోజు మరో మంచి లఘు చిత్రం “ఖుజలీ”. పావు గంట చిత్రం. మనం మామూలుగా బాహాటంగా మాట్లాడుకోని విషయాలు తెర మీద ఈ మధ్య ఎక్కిస్తున్నారు. కనీసం హిందీ చిత్రాల్లో.
చిత్రం మొదలవడమే ఒక పడకటింట్లో పందిరి మంచం పందిరి ని చూపిస్తుంది. మంచం పెద్ద శబ్దం చేస్తూ ఊగుతూ ఉంటుంది. ఆమె ఆయాస పడుతున్నట్టు, అతను ఇంకా ఇంకా అని అంటున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి. మంచం శబ్దం మాత్రం ఆగదు. కెమెరా కిందకు దిగినపుడు మనకు కనపడేది కూర్చున్న జాకీ ష్రాఫ్. అతని వెనక కూర్చుని నీనా గుప్తా చెక్క కవ్వం తో అతని వీపు గోకుతూ ఉంటుంది. నడి వయసు జంట. అంతలో తలుపు తెరుచుకుని లోపలికి కొడుకు వస్తాడు. నేను బైటికి వెళ్తున్నాను, రాత్రి ఆలస్యంగా వస్తానని చెప్పి వెళ్తాడు. ఇదే ముక్క మెసేజ్ చేస్తే పోయేదిగా అని సరదాగా అంటాడు జాకీ.
భోజనం వేళ అయ్యింది. నీనా గుప్తా వండింది వేడి చేస్తూ వుంటుంది. ఆ ఇంట్లో వుండే ఓ వృధ్ధ స్త్రీ (బహుశా జాకీ తల్లి) ఒక వైపున్న తన గదిలోంచి నీనా గుప్తా వెనుక నుంచి మరో వైపున్న బాత్ రూం కెళ్తుంది. ఆమె ఇనప వాకర్ సాయంతో నడుస్తూ ఉంటుంది. హాల్లో సోఫా మీద కూర్చుని జాకీ టీవీ చూస్తూ ఉంటాడు. వీపు లో దురద పెడితే సోఫాలో వెనక్కు వాలి, వీపును రుద్దుతూ ఉంటాడు. ఇలా కాదని నీనా ని క్రీం ఎక్కడుంది అని అడుగుతాడు. చూడండి అబ్బాయి గదిలో వుందేమో, వాడు అప్పుడప్పుడు తీసుకెళ్తుంటాడు అంటుంది నీనా. వాడికి నా క్రీం తో ఏం పనో అని గొణుక్కుంటూ కొడుకు గదిలోకెళ్తాడు వెతకడానికి. కేకేస్తూ బయటికి వస్తాడు జత ఫాన్సీ బేడీలతో. చూడు నీ కొడుకు నిర్వాకం, ఇలాంటివి ఇంట్లోకి తెస్తున్నాడు, నీ పెంపకం సరిగ్గా లేదు; అయినా అసలు ఇదేందుకు ఉపయోగిస్తారు నీకు తెలిస్తేగా అంటాడు. ఆమె చాలా కూల్ గా తెలుసు, BDSM కోసం, kinki సెక్స్ గురించి అంటుంది. వాళ్ళ చర్చలో తెలిసేదేమిటంటే ఆ కాలనీలో ఒక స్త్రీ 50 Shades of Grey కొంటే ఒకరి తర్వాత ఒకరుగా అక్కడి ఆడవాళ్ళందరూ చదివారు. కాబట్టి ఈ కొత్త కొత్త పధ్ధతులన్నీ తెలుసంటుంది. జాకీ కి మొదట ఆశ్చర్యం, తర్వాత కుతూహలం కలుగుతుంది. ఇద్దరూ ఆసక్తి పెంచుకుని కొత్త పధ్ధతులు ప్రయత్నించి కళ తగ్గిన తమ సెక్స్ జీవితాన్ని ఆసక్తికరంగా చేసుకోవాలనుకుంటారు. మిగతా కథంతా అదే.
ఈ మధ్య చాలా చిత్రాల్లో స్త్రీలు తమ సెక్సు జీవితాన్ని నచ్చేటట్టుగా మలచుకోవడంలో తామే బాధ్యత తీసుకుని, ప్రయోగాలకు కూడా వెనుకాడక పోవడం లాంటివి చూస్తాము. లఘు చిత్రాల్లో, వెబ్ సెరీస్ లలో. ఇందులో ఈ విషయాన్ని హాస్యపు టోన్ లో నమ్మించే విధంగా చూపారు. జాకీ ష్రాఫ్, నీనా గుప్తా ఇద్దరూ చాలా బాగా నటించారు. “మసాబా మసాబా” తీసిన సోనం నాయర్ దీనికి దర్శకురాలు. ఇదివరకు వచ్చిన రణబీర్ కపూర్, కొంకొణా సెన్ శర్మ ల చిత్రం “వేక్ అప్ సిడ్” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది. ఈ లఘు చిత్రం కూడా చాలా బాగా తీసింది.
ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. చూడమని నా రెకమండేషన్.