ఆనంద స్వరూపం హోలి

0
3

[dropcap]ప్ర[/dropcap]కృతి కాంత నూతన శోభను సింగారించుకొని కన్నుల పండువైనపుడు ఆమెకు స్వాగతం పలకడం భారతీయులుగా అనాదిగా అనుసరిస్తున్న ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే హోలి. అమితోత్సాహంతో జరుపుకొనే హోలిని ‘ఫాల్గుణోత్సవం’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి ఈ ఉత్సవాన్ని మదనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు.

‘హోలి’ పండగ పుట్టుపూర్వోత్తరాలు గురించి విభిన్న గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తరభారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం. ఆ కోతల కోలాహలమే – హోహోకారమే హోలి అయిందని కొందరి అభిప్రాయం. కృతయుగంలో శివుఘాతినియైన హోలిక అనే రాక్షసిని రఘునాధుడనే పాలకుడు సంహరించిన ఉదంతాన్ని శ్రీ కృష్ణుడు యుధిష్ఠిరుడికి వివరించినట్లు భవిష్యత్ పురాణం చెబుతుంది. హోలి అనేది రంగుల పండుగ. వసంతోత్సవం లేదా కాముని పండుగ అని పిలుస్తారు. నీళ్ళలో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు.

హోలి… రంగుల కేళీ!

ఫాల్గుణమాసం… పౌర్ణమి సమయం… చల్లగాలులు వేడెక్కేవేళ లేలేత చిగుళ్ళతో విరబూసిన పూరెమ్మలతో చెట్లన్న వసంత రాగాలతో పులకిస్తుండగా… హోలీ వచ్చేసింది.. రంగుల వసంతాన ఆనందాల తుళ్ళింతల్ని వెంటేసుకుని.

చిన్నా పెద్దా అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ రంగునీళ్ళల్లో తడిసి ముద్దవుతూ కేరింతలతో తుళ్ళిపడుతూ చెమ్మకేళీలు అడుకునే ఆనందహేలే హోలి లేదా రంగపంచమి లేదా కాముని పున్నమి. దసరా, దీపావళి మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ సంబరం జరుపుకోవడం విశేషం. పౌరాణిక ప్రాశస్త్యంలో ప్రాతాల వారిగా తేడాలుండే ఉండొచ్చుగాక.. జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే.

మన దేశంతో పాటు, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్, గయానా, దక్షిణ ఆఫ్రికా, ట్రినిడాడ్, ఇంగ్లాండ్, అమెరికా, మారిషస్, ఫిజి దేశాల్లోనూ ఏటా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.

రాధాకృష్ణుల చెమ్మకేళి!

బ్రజ్ ప్రాంతంలో హోలి అంటే ప్రేమబాసలూ చిలిపి తగవులూ అయితే మధుర బృందావనం, నందగావ్, బర్సానాల్లో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజుల పాటు హోలి జరుగుతుంది. నందగావ్‍ని శ్రీకృష్ణ జన్మస్థంగానూ; బర్సానాని రాధ పుట్టిన ఊరుగానూ భావించి, అక్కడ పండుగ జరుపుకుంటారు. వీళ్ళిద్దరి ప్రేమ బాసలు చిలిపి తగవులూ అక్కడి జానపద సాహిత్యంలో ఇప్పటికే నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తుంది అక్కడి హోలి పండుగ. నందగావ్ కృష్ణులు బర్సానాలోని రాధారాణి ఆలయం దగ్గర జెండా పాతి మాదే విజయం అన్నట్లుగా గేలిచేస్తుంటే, లావుపాటి కర్రలతో వాళ్ళను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారు బల్సానా రాధలు, చివరి రోజున ఇరుపక్షాలూ రంగులు చల్లుకోవడంతో ఈ వేడుక ముగుస్తుంది. అందుకే ఈ వేడుకను ‘లాల్‌మార్ హోలి’ అంటారక్కడ. అంతేకాదు, పాలమీగడ వంటి రాధ ఒంటిఛాయతో తన శ్యామవర్ణాన్ని పోల్చుకుని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే, యశోద రాధ మోహనికి ఇంత రంగుపూసిందని అలా ఈ పండుగ మొదలైందని చెప్పే కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి.

హోలికాదహనం:

ఇక ఉత్తర భారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు. అందుకే హోలికి ముందు రోజు హోలికా దహనం చేస్తారు ప్రహ్లాదుని స్మరిస్తూ…

ప్రహ్లాదుని నోట హరినామస్మరణ వినలేని హిరణ్యకశిపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు. ఏది ఫలించక చివరకు విసిగిపోయి హోలిక (ప్రహ్లాదుడి అక్క) ఒడిలో కూర్చుని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు. హోలిక కప్పుకున్న కంబళికున్న శక్తుల వల్ల ఆ మంటలు ఆమెనేమి చేయలేవు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబళి జారి ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలిక చనిపోతుంది. అందుకే దానికి హోలికాదహనం అని పేరు.

హోలిని జాతీయ పండుగగా జరుపుకునే నేపాల్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పాల్గొంటారు. తేజోవంతమైన ఈ పండుగ దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు వాళ్ళు. ఈ పండగ జాడలు పలు ప్రపంచదేశాల్లోనూ వివిధ పేర్లతో కనిపిస్తున్నాయి. పేర్లు వేరయినా, పూజలూ ప్రసాదాలు పిండివంటలూ వేరయినా, జరుపుకునే పద్ధతులు వేరయినా రంగుల పండగలోని పరమోద్దేశం ఒక్కటే.. చలికాలం వెళ్ళి వేసవి వచ్చే వేళలో వసంతరుతువుకి ఆహ్వానం పలికే వేడుకే హోలి. వాతావరణం మారే ఈ సమయంలో జ్వరాలూ, జలుబులూ వచ్చే అవకాశం ఉంది. అవేమీ రాకుండా ఉండేందుకు వేప, బిల్వ, అగ్ని పూలు వంటి ఔషదగుణాలున్న ఆకులూ, పువ్వుల పొడుల్ని పసుపు కుంకుమలతో పాటుగా నీళ్ళలో కలిపి చట్టుకునే ఈ వేడుక పుట్టుకొచ్చిందన్నది ఆయుర్వేద పండితుల విశ్లేషణ. ఎందుకంటే ఈ నీళ్ళు శరీరాన్ని చల్లబరుస్తాయి. తరువాత చలువజేసే పానీయాలు తాగి, మిఠాయిలు తింటారు. మనదగ్గర శ్రీరామ నవమికి బుక్కాపిండి, పసుపునీళ్ళ వసంతాల్ని చల్లకోవడం కూడా ఈ కోవకు చెందినదే. అయితే ఆనాటి ఆరోగ్యకరమైన సంప్రదాయం క్రమంలో రంగుల పండుగగా మిగిలిపోయింది. వసంతంలో విరబూసే పూలచెట్లు క్రమంగా అంతరించిపోవడంతో కృత్రిమ రంగులు ఆ స్థానాన్ని భర్తీ చేశాయి. దాంతో ఈ పండుగ ప్రమాదకరంగా మారింది. కృత్రిమ రంగుల వల్ల చర్మ క్యాన్సర్లు, ఎలర్జీలు, కళ్ళు దెబ్బతినడం వంటి నష్టాలెన్నో. ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడం, రంగుల్లోని విషపదార్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో సేంద్రీయ రంగులతోనే… చెమ్మకేళీ అంటున్నారంతా… ఇదే జరిగితే హోలీ… అందరి ఆనందాన్ని పంచే అసలు సిసలైన రంగులకేళి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here