[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]ఆ[/dropcap] అమ్మాయిని చాలామంది డాక్టర్లకి చూపించారు. ఇంట్లో డబ్బాల కొద్దీ కుంకమ ఖర్చు అయింది. చేతబడి అనుకుని, అనుమానించి దగ్గర బంధువులతో విరోధం పెట్టుకున్నారు. పెళ్ళీడు కొచ్చిన కూతురుని, నుదుటినిండా కుంకుమ బొట్లుతో మంత్రగాళ్ళ ముందు కూర్చోబెడ్తే, వాళ్ళు వాతలు తేలేట్లు వేపమండలతో కొడ్తుంటే, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆ అమ్మాయి తమ్ముడు అప్పుడే పదో తరగతి పాసయిన వాడు, తన ఫ్రెండ్ తండ్రి సైకియాట్రిస్ట్ అయితే, ఆయనకి చెప్పాడు, ఇంట్లో పూజలు, కరుగుతున్న ఆస్తుల వివరాలు! అప్పుడు ఆయన వచ్చి మొదట హిప్నటైజ్ చేసి, ఆ అమ్మాయి చెప్పిన సినిమా పేరు విని, అదంతా రైటర్స్ కూర్చుని రాసిన కథ, డైరక్టర్లు ఎలా చెప్తే ఆర్టిస్టులు అలా చేస్తారని చెప్పి, తనతో తెలిసిన డైరక్టర్‍ని పట్టుకుని షూటింగ్‌లకి తీసుకెళ్ళి, ఆ సినిమా గురించి కూడా చెప్పించి, మామూలు మనిషిని చేసాడు. ఈలోగా క్షుద్రపూజలు చేసి, చేతబడి వదిలిస్తామని వచ్చిన మోసగాళ్ళు లక్షలు వదిల్చారు! ఆ పిల్ల మామూలు మనిషై, పెళ్ళాడి పిల్లల తల్లి కూడా అయింది.
సినిమాలే అఖ్కర్లేదు, ఆసమ్మ పోసమ్మ కబురులు, గోడల మీద నుండి మాట్లాడుకుంటూ “వదినా మా పిల్ల మంత్రించిన అన్నం తొక్కి వచ్చింది, ఏం చెయ్యాలి?” అనగానే, వదిన “తప్పకుండా చేతబడే! వెళ్ళి ఫలానా వాడిని కలవండి… నెలకి చివరి వారంలో మూడు రోజు ఫలనా రావూస్ లాడ్జిలో వుంటాడు” అంటుంది. వీళ్ళు ఉత్తి పుణ్యాన అక్కడికి వెళ్ళినందువలన చేస్తాడు చేతబడీ, తిరుగుబడీ! జేబులు ఖాళీ అవుతాయి.
కొంతమంది బోలెడు డబ్బున్న వాళ్ళు కూడా, చిరుద్యోగులనీ, మధ్య తరగతి వాళ్ళనీ కూడా వాక్చాతుర్యంతో బోల్తా కొట్టించి చందాలు వసూలు చేసి, జేబులు ఖాళీ చేయిస్తారు.. “నేను చిన్నతనంలో చదువుకున్న బడిని రీమోడలింగ్ చేయిస్తున్నాను…. నువ్వు ఆ వూరి వాడివేగా… ఓ ఐదువేలు ఇవ్వు” అనో… “అసలు ఇంతవరకు రానట్టి భారతీయుల చరిత్ర రాస్తున్నాను, పుస్తకం వేయించాలి, నీకు ఐదువేలు ఓ లెక్క లోది కాదని నాకు తెలుసు… నీ లాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప ఈ మహత్కార్యం కాదు!” అంటారు… ఐదువేలు ఎందుకు లెక్కలోది కాదూ… కష్టార్జితం… అ ఐదువేలు వుంటే పిల్లల్ని ఫైవ్ స్టార్ హోటల్‌కి తీసుకెళ్ళవచ్చు! మంచి డ్రెస్ కొనిపెట్టచ్చు… బోలెడు మిఠాయిలు కొనిపెట్టచ్చు, ఓషన్‌పార్క్‌కి తీసుకెళ్ళచ్చు! కానీ ఈ మధ్య తరగతి మొహమాటస్థులు “సరే మీ అంత పెద్దవారు అడిగితే కాదనలేము… అలాగే ఇస్తాం” అంటారు. అవతల అడిగే పెద్దమనిషికి మూడంతస్తుల భవనం, మెర్సిడెజ్ బెంజ్ వుంటే, ఇవతల అతనికీ మరీ ఆనందం… ఇంత పెద్దమనిషి నా సాయం అడిగాడే అని. అదే మనింట్లో పనిచేసే పనిమనిషి “మా ఆయన ఆస్పత్రిలో వున్నాడు… ఐదువేలు సర్దండయ్యా… జీతంలో పట్టుకుందురు గాని…” అంటే “తాగి తాగి లివర్ చెడింది వెధవకి! మళ్ళీ డిస్చార్జయి మళ్ళీ తాగుతాడు.. పోతే పోయాడు… ఇవ్వక్కర్లేదు” అని పెళ్ళాం సలహా ఇస్తుంది కూడా!
నాకు ఆప్త మిత్రుడైన ఓ డాక్టర్‍ని, ఇలాగే ఒకడు “హిందూత్వం మీద పుస్తకం వేయిస్తున్నాను, సమాజానికి మూల స్తంభాల లాంటి మీరంతా పూనుకోవాలి” అంటే ఓ మూలన ఆసుపత్రి కట్టుకుని, తన పని తను చేసుకుంటూ, రోగులతో పగలూ, రాత్రీ మర్చిపోయి, సేవ చేస్తున్న ఈ డాక్టరు “ఎంత?” అంటే, “మొదట ఓ లక్ష” అని మొదలు పెట్టించి, ఆ తర్వాత ఆరు లక్షల దాకా వదిలించి, 50 వేలతో చవకబారు పుస్తకం వేసి, ఈ డాక్టరుకి అంకితం ఇచ్చాడు! నేను పరిచయం అయ్యాకా, ఈ డాక్టరు “నువ్వు కూడా నీ పుస్తకాలు ఇలాగే చందాలు అడిగి వేయించావా?” అంటే, తెల్లబోయాను. అతను అందరూ ఇదే పద్ధతిలో వేయిస్తారు అనుకున్నట్లున్నాడు. అప్పటి నుండీ నేను అతనికి కాస్త లోకజ్ఞానం బోధించి, “ఎవరి పుస్తకాలు వాళ్ళు వేయించుకుంటారు, ఎంత లోకాన్ని వుద్ధరించేవైనా కూడా” అని వివరించి, అప్పటి నుండీ అతని డబ్బు అపాత్రదానం కాకుండా, బీద విద్యార్థులని చదివించడానికీ, బీద రోగులకి చికిత్స చేయించడానికీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌లకీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లకీ ఇప్పించసాగాను! అపాత్రదానం మహాపాపం… కానీ మొహమాటం కొద్దీ మనసులో తిట్టుకుంటూ కూడా కొంతమంది, అవతల వాళ్ళని వదిలించుకోడానికి ఇచ్చేస్తుంటారు. “మా ఊరు బాగు చేయిస్తున్నాం, విరాళాలు ఇవ్వండి” అని ఫోన్ చేస్తారు. “నువ్వు పుట్టి వూరు సరే, నీ మోరీ బయటకు వదిలేసావు… మురుగు కంపుతో చస్తున్నాం. ముందు దాన్ని డ్రైనేజ్‍లో కల్పించుకో” అని చెప్పాను ఒకాయనకి. ప్రతీ వాళ్ళూ వీరేశలింగం పంతుళ్ళే, వినోభాభావాలే…. చందా ఇచ్చాకా ఈయన స్వంతానికి ఖర్చు పెట్టుకున్నాడా, తను పుట్టిన పందులపాలెం బాగు చేయించాడా? వెళ్ళి చూడొచ్చామా? ఇదొక రకం సోఫిస్టికేటెడ్ దోపిడీ!
నేను సాయి గ్రామర్ హైస్కూల్‍లో టీచర్‍గా పని చేస్తున్నప్పుడు, ఒక టీచర్ “మా ఆడబిడ్డ కూతురికి దెయ్యం పట్టింది, మా ఇంట్లోనే వుంది. చర్చ్ నుండి పాస్టర్ వచ్చి హోలీ వాటర్ స్ప్రింకిల్ చేసి వెళ్ళారు, దెయ్యం ఇంకా రెచ్చిపోయింది. ఎవరైనా దెయ్యాలు వదలగొట్టే వాళ్ళు తెలుసా?” అంది. నేను అప్పుడప్పుడే నవలలు రాయడం మొదలుపెట్టాను. నేనూ, మా లలితా కూడా వీరేంద్రనాథ్ గారిని కలిసి సలహాలు తీసుకుంటూండేవాళ్ళం! నేనెంతో కుతూహలంతో “మేం సాయంత్రం వచ్చి చూస్తాం… అప్పుడు చెప్తాం ఏం చెయ్యాలో!” అన్నాను. మా అమ్మమ్మ “నీకు చిన్న చిన్న పిల్లలున్నారు. నీకెందుకే ఈ దెయ్యం పట్టిన పిల్లతో?” అంది. “అమ్మమ్మా, నువ్వీ దెయ్యాలూ, చేతబడులూ నమ్ముతావా?” అన్నాను. అమ్మమ్మ నవ్వి, “సరే వెళ్ళు” అంది.
సాయంత్రం నేనూ లలితా వెళ్ళాం, ఆ అమ్మాయి వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు. పిల్లకి 22, 23 ఏళ్ళు వుంటాయి. ఒళ్ళుగా వుంది. పెద్ద రూపసి కాదు. “అదిగో… వచ్చేసాడు… నన్ను రమ్మంటున్నాడు… బట్టలు తీసేయ్యమంటున్నాడు..” అని వంటి మీద బట్టలు విప్పేస్తోంది, పెద్దగా నవ్వుతూ. “అబ్బాస్… అబ్బాస్…” అని జుట్టు విరబోసుకుని వూగిపోతోంది. అందరూ ఆ పిల్లకి తురక దెయ్యం పట్టింది, అని తీర్మానించేసారు. నేను మాత్రం ఇంతకు ముందు రాంసే దెయ్యం వదిల్చిన సంఘటన గుర్తు చేసుకుని, “ఈ అమ్మాయి లాస్ట్‌గా చూసిన సినిమా ఏమిటీ? దెయ్యాల సినిమా చూసిందా?” అని అడిగాను. వాళ్ళమ్మ ‘ప్రేమాభిషేకం’ అంటే, అన్న ‘జస్టిస్ చౌదరీ’ అన్నాడు. ఇలా తేలేలా లేదని, “అమ్మా సువర్ణ సుందరీ!” అది ఆ అమ్మాయి పేరు, “ఏ సినిమా చూస్తే ఈ దెయ్యం పట్టింది తల్లీ?” అని చెవిలో అడిగాను. ‘ప్రేమ దేశం’ అంది. నాకంతా తేటతెల్లం అయింది. ఈ వీక్ హార్టెడ్ పిల్ల అబ్బాస్ అనే హీరోని చూడగానే ప్రేమించేసింది, కానీ అతను అందుబాటులో లేడు. అలాంటి వాడు తనని ప్రేమించి తన కోసం వస్తే బావుండ్ను అనుకుంది. అతనిని తన ఊహల్లోకి ఆహ్వానించింది, అతనికి వశమయింది… అతని పేరే కలవరించింది. స్కీజోఫ్రీనియాకి లోను అయింది… అతను తనతో మాట్లాడుతున్నట్టూ, రోమాన్స్ చేస్తున్నట్లూ ఊహించుకోసాగింది!
నాకు తెలిసిన ఓ మంచి హిప్నాటిస్ట్‌కి రికమెండ్ చేసాను కేస్. ఆ తర్వాత ఆమెని సైకియాట్రిస్ట్‌కి కూడా చూపించారు. కొన్నాళ్ళు ఇన్-పేషంట్‍గా ఎడ్మిట్ చేసాకా, నిమ్మళించి, మళ్ళీ తన చదువు కొనసాగించి, నర్స్ ట్రైనింగ్ చేసుకుంది! ఆ తల్లి ఇప్పటికీ నా పట్ల కృతజ్ఞతగా వుంటుంది.
(సశేషం)