ఏరిన ముత్యాలు 13

1
3

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

సాధారణ సమస్యలకి రెండోవైపు చిత్రణ సమ్మెట ఉమాదేవి అసాధారణ కథా శిల్పాలు

[dropcap]స[/dropcap]మ్మెట ఉమాదేవిగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ఆ బోధన, అధ్యయన, అధ్యాపకవృత్తి కార్యస్థానం – ఏ మారుమూల గిరిజన గ్రామమో, తండానో అయివుంటుంది. ఇది సాధారణంగా, ఉపాధ్యాయురాల్ని ఇక్కట్ల పాలు చేసే అంశం. దాన్ని సహించటం కాక, ప్రేమించటం – ఉమాదేవిగారి సహజాతం అని తెలుసుకున్నప్పుడు, నాకు ఆమె పట్ల ప్రత్యేకమైన అభిమానం జనించింది. ఆ తర్వాత ‘రేలపూలు’ రచయిత్రిగా ఆమె ప్రవృత్తి మార్గంలో ఎంత గమనం సాగించిందో తెలిసి, ఆమె రచనా నైపుణ్యం పట్ల ఆరాధనాభావం కలిగింది. ఈ వృత్తీ ప్రవృత్తీ- రెంటికీ తోడుగా ఆమెకు గల నిజాయితీతో కూడిన సాంఘిక సేవాభావం, మానవీయ విలువల పట్ల గల నిబద్దత చూసినప్పుడు విస్మయం కన్నా గౌరవం ఎక్కువగా కలిగింది. ఆమె క్షేత్రస్థాయిలో గిరిజనులతో మమేకమైన కార్యకర్త. వారి జీవితాలతో తాదాత్మ్యమైన ఆత్మీయబంధువు.

ఉమాదేవి గారి ‘జమ్మిపూలు’ కథా సంపుటి ఇప్పుడు వచ్చింది. ఇందులోని కథలు పన్నెండు గిరిజన తండాల్లోని ప్రజల జీవితాలకు సంబంధించిన ఇతివృత్తాలతో సాగినవి.

వీటిలో ‘మైసమ్మత్తో’ ఒక కథారత్నం!

….”మొదాలు మనం వెయ్యి రూపాలు గడితే…. సర్కారోలు రెండు వేలిస్తారంట. బాత్రూంలు పైఖానాలు గట్టుకోవాల్నంట. ఊర్లె అందరూ కట్టుకుంటున్నరు.” నాగయ్య అనగానే … చెంబట్కి తీసుకెళ్ళే ఇత్తడి చెంబును చింతపండూ ఉప్పూ వేసి శుభ్రంగా తోముతున్న వరమ్మ ఉలిక్కిపడింది.

“నకరాలు గాకుంటే మూడువేలల్ల బాత్రూంలు కట్టుడు అయితదా? మనల ఇరికిచ్చుడు గాకుంటే!” మైసమ్మ అనగానే అబ్బో అత్తమ్మకు గూడా జరంత తలకాయున్నది అనుకున్నది.

“కతలు బడుతున్నవా ఎవ్వళ్ళ కోసమే? మనింట్ల బాత్రూంగడితే వానికేమన్న పండుగనా? అచ్చిందే సాలని కట్టుకోవాలె గానీ!” మామన్నది కూడ నిజమేకదా అనిపించి దిగులుపడింది……..

ఇదీ కథ మొదలు. వస్తువు తెలుస్తూనే వున్నది. గ్రామాల్లో పాయిఖానాల నిర్మాణం. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఒకటి.

వరమ్మ వంటి చాలా మంది స్త్రీలకు ‘చెంబట్కుని’ బహిర్భూమికి వెళ్ళటం యాతన కంటే పెద్ద కష్టమే. చిత్రమేమంటే ఈ యాతననీ, కష్టాన్ని ‘గుడ్డిలో మెల్లగా’ భావించే బతుకు బరువుని మోస్తున్న వారు తండాల్లో చాలామంది ఉన్నారు.

చాలామంది స్త్రీలలో ఈ వరమ్మ కూడా ఒకర్తె! కారణం ఈమే, ఈమెతోబాటు – సీతక్క, నర్సమ్మ వంటివారికి ఈ బహిర్భూమికి రావటం ఒక పెద్ద ‘రిలీఫ్’. మనసులు కలబోసుకుని కష్టనష్టాల బాధల్నీ ఊసుల్నీ ఒకరికొకరు చెప్పుకొని ఊరట పొందటం ఒక వెసులుబాటు!

చిత్రమైన సన్నివేశం. ‘కనిపించని కథ’లంటే ఇవే. ఒక సమస్య, దాని పరిష్కారం- పైకి కనిపించేటంత వాంఛనీయమైన ‘బొమ్మ’ కానఖర్లేదు. దానికి ‘రోండోవైపు’ బొరుసుగా ఇలా ఒక తీవ్రమైన అసౌకర్యమూ అంటుకొని వుండవచ్చు.

ఉమాదేవిగారి దృష్టి- ఇలాంటి సాధారణమైన అంశాన్ని అంటిపెట్టుకుని లోలోపల నిలిచిన తామరకాడలాంటి బాధల్ని కథాత్మకం చేయటం మీద కేంద్రీకృతమై వుంటుంది.

ఈ కథ ముగింపులో ఏవిధమైన వృతిరిక్త భావాజలాన్నో రాజకీయాన్నో తెచ్చి మలుపులు తిప్పి రాపాడకుండా బాత్రూం, పాయిఖానా ఆవశ్యకతనే ధృవీకరిస్తూ, తమ కథా శిల్ప నైపుణ్యాన్ని చూపారు ఉమాదేవిగారు. మైసమ్మ మనస్ఫూర్తిగా, సంతోషంగా బాత్రూంని కట్టిస్తున్నది!

‘మైసమ్మత్తో’ కథ సహజజీవిత చిత్రం! సుఖం కరువైపోతున్న గిరిజన మహిళల మూగవేదనల కథాకృతి తెలంగాణ గ్రామీణ బాసతో, యాసతో, నుడితో నానుడితో హాయిగా చదివించే మెఱుపుని సంతరించుకున్నది!

‘జమ్మిపూలు’ సంపుటిలో ‘రెడపంగి కావేరి’ అని ఒక అసాధారణమైన ఇతివృత్తం కల కథ ఉన్నది. రెడపంగి – ఇంటిపేరు. కావేరి ఆరో తరగతిలో వుంది. అర్చన టీచర్. తొలి పరిచయంలోనే ‘ఈ పిల్లలో ఏదో ప్రత్యేకత ఉన్నది’ అని తన మనసు చెబుతుంది అర్చనకు.

కావేరి గురించిన చిన్న వివరణ చూడండి. ఉమాదేవి శైలిలోని ఆర్టమైన, మృదువైన పలుకుతీరు స్పష్టమవుతుంది.

….“బాగా చదివే అమ్మాయేమీ కాదుకానీ… కాస్త అమాయకత్వం. ఒకింత గడుసుదనం. చురుకయిన కళ్ళు. ఎక్కడా ఆగకుండా తువ్వాయిలా పరుగుపెట్టే ఆ పిల్ల తుళ్ళింతలు.. అర్చనతో ఏదో అనుబంధం వున్నట్లుగా ఆ పిల్ల కనపరిచే ఆప్యాయత… వీటన్నింటిని మించి ఆ పిల్లలో ఏదో తెలియని ప్రత్యేకత…. మరేదో ఆకర్షణ వున్నది. అదేమిటో అర్థం కావడం లేదు. కావేరితో మాట్లాడడం. ఆమె తన గురించి ఆలోచించడం నిత్యకృత్యాలయి పోయాయి ఆమెకు. కావేరిలో వున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇదమిద్దంగా ఇదీ అని చెప్పలేదు గానీ ఆ ప్రత్యేకతకు అర్చన కట్టుబడిపోయింది. తనకు తెలియకుండానే కావేరి పట్ల ఆపేక్ష పెరిగిపోయింది…”

కావేరిని గురించిన వివరాలు తెలుస్తున్న కొద్దీ, అర్చనకు ఆ పిల్ల పట్ల అవ్యక్తమైన ఆప్యాయత, దగ్గరితనం పెరుగుతూ వుంటాయి. కావేరి అమ్మమ్మ దగ్గర ఒంటరిగా వుంటోంది. తండ్రి దొరదగ్గర రౌడీ. భార్యని నానాబాధలు పెడుతుంటే సహించలేక ఆమె విడాకులు తీసుకుని వేరే అతన్ని పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు మరో ఇద్దరు పిల్లలు. అమ్మ దగ్గరికీ ఈ పిల్ల దగ్గరికీ రాకపోకలు ఉన్నై. ఈ పిల్ల కూడా అక్కడికి వచ్చిపోయే అతిథే. అక్కడ తల్లికి అత్తా ఆడపడుచుల బాధ వుంది.

ఇంత చిన్న వయస్సులోనే బతుకంత చావునీ, చావంత బతుకునీ అనుభవించి అర్థం చేసుకున్నది కావేరి. ఒక రోజు తన గాథ చెబుతూ- తల్లిబాధలు చెబుతూ అంటుంది కావేరి,

…”పోనీలే, మా అమ్మ మంచిగుంటే అంతేచాలు… కదా టీచర్! మొదలే మా రమేష్ నాన్నతో మస్తు తిప్పలు పడింది. ఇప్పుడు నేను జెయ్యబట్టి మల్లా బాధలు పడకూడదు. అందుకే ఎప్పుడన్నా ఎల్లినా నాలుగు రోజులుండి వచ్చేస్తా!”

అసలు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు అర్చనకు ‘అమ్మ ప్రశాంత జీవితానికి తాను ఆటంకం కారాదని ఎంత బాధ్యత తీసుకున్నది ఈ చిన్నతల్లి. ఎవరు నేర్పారు తనకు ఇంతటి ఔదార్యము!’ అర్చన మూగబోయింది. గలగలా మాట్లాడుతూ కావేరి గుండెలోని భారం దింపుకున్నది. దుఃఖభారంతో అర్చన గుండె బరువెక్కిపోయింది. కావేరి అర్చనకు చేరువగా వచ్చి గొంతు బాగా తగ్గించి…

“టీచర్! అప్పుడప్పుడు మా అమ్మకు బాగా జరం రావాల్ననీ….. మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి పదిరోజులు ఇక్కడే ఉండాల్ననీ… దేవునికి దణ్ణం పెట్టుకుంటా… పోనీ నాకే జరం రావాలె… మా అమ్మ రావాలె… అని దణ్ణం పెట్టుకుంటుంటా. అట్ల కోరుకోవడం తప్పే కదా! కానీ ఏమి చెయ్యాలా మరి? అప్పుడప్పుడన్నా మా అమ్మను చూడాలే కదా!” అర్చన కళ్ళలోకి చూస్తూ అడిగింది.

అర్చన కావేరిని గట్టిగా గుండెలకు హత్తుకుని వెక్కివెక్కి ఏడ్చేసింది. ‘ఇట్లా దగ్గరకు తీసుకోవడం తప్ప ఏమి చెయ్యగలనీ పిల్లకోసం…?’ అనుకున్న అర్చన మనసు మరింత భారమయ్యింది. మబ్బులు మరింతగా కమ్ముకున్నాయి. చీకట్లు మరింతగా ఆవరించాయి”…

ఇదీ ‘రెడపంగి కావేరి’ కథ. చదివి ముగించిన వారికి గుండె అరల్లో చెప్పుకోలేని సలుపు కలుగుతుంది. కావేరి నవ్వే కళ్ళూ, ఏడ్చే పెదవుల వెనుక గల విషాదం – అదే అర్చన తెలుసుకోదలచిన ప్రత్యేకత – తనకూ తెలిసి కలత చెందుతారు.

కథా నిర్మాణం కళాకృతి నిర్మాణమే! ఈ కథలో ఇతివృత్తాన్ని ఉమాదేవిగారు సంఘటనాత్మకంగా పొరలు పొరలుగా విప్పుకుంటూ పోయి, అద్భుతమైన సజీవ శిల్పాన్ని కళ్ళముందు నిలిపారు! అందుకనే, ఉమాదేవి కథలు – బుర్రని గిరికీలు కొట్టించే అణుగీతాలు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here