ఖాళీ జేబుల కనకయ్య

0
3

[dropcap]తె[/dropcap]ల్లారింది… సూర్య భగవానుడు బాగానే పైకి వచ్చినా భగ భగలు పుట్టించటం లేదు… కొద్దిగా సుతారంగా చురుక్కు మనిపిస్తున్నాడు.

రోడ్డు పక్కన పడుకున్న కుక్కలు అప్పుడప్పుడు తల ఎత్తి చూసి ఆసక్తికరమైన విషయాలు ఏమి కనిపించక మళ్ళీ పడుకుంటున్నాయి… ఆవులు తినడానికి ఏమైనా దొరుకుందేమో అని వెతుకుతూ తిరుగుతున్నాయి…. ఇంతకు ముందులా వాళ్ళకి పోస్టర్ల చెత్త తిండి దొరకటం లేదు. మంచి తిండి అసలే లేదు…

కరోనా కావడంతో మామూలుగా ఉండే మనుషుల రద్దీ ఏమీ కనిపించటల్లేదు.

అప్పుడప్పుడు ఒక మనిషి స్కూటర్ మీదో, సైకిలు మీదో ముసుగు పెట్టుకుని నిదానంగా వెళ్తూ కనిపిస్తున్నారు.

కొంచం దూరంగా ఉన్న మసీదు నుంచి అజాన్ వినసొంపుగా వినిపిస్తోంది… రాముల వారిగుడి లోంచి భక్తి గీతాలు వినిపిస్తున్నాయి… వెంకటేశ్వర స్వామి గుడిలోంచి సుప్రభాతం వినిపిస్తోంది… గుడిలోనూ ఇతర ప్రార్థన స్థలాల్లోను మనుషులు అస్సలు కనిపించటల్లేదు… ఇందు గలడందు లేదనే సందేహం తీరి పోయిందో…. లేక దేహం మీద దురభిమానం ఎక్కువైయిందో.

ఖాళీ జేబుల కనకయ్య ఇంట్లోంచి బయల్దేరాడు… పొద్దున్నే డబ్బు గురించి భార్యతో మాటా మాటా వచ్చి చిరాగ్గా ఉన్నాడు… పాపం భార్య అడిగినవేమీ మణి మాణిక్యాలు కాదు… పిల్లల భవిష్యత్తు కోసం పెట్టాల్సిన ఖర్చులకోసం మాత్రమే అడుగుతుంది… తనకి కొత్త చీర కొని ఎన్నాళ్ళయిందో గుర్తులేదు కనకయ్యకు.

కానీ వచ్చిన జీతం వచ్చినట్టే ఖర్చయిపోతోంది… తిండి గింజలకీ, ఇప్పట్లో చాల అవసరం అని ఉదరగొట్టేస్తున్న కూరలు పళ్ళు కొనడానికి, పిల్లల చదువులకి, బట్టలకి… ఒక్కటేమిటి ఎటుచూసినా ఖర్చులే… ఆదాయం మాత్రం ఒక్క జీతమే…

ఈ రోజుల్లో పని వత్తిడి… ప్రజల నుంచి వచ్చే సమస్యలూ ఎక్కువైపోతుంటే.. వాటికీ డబ్బు సమస్యలు కూడా కలిసి వత్తిడి విపరీతంగా పెంచేసాయి.

ప్రజలకు నెమ్మది నెమ్మదిగా సిగ్గు పడడం పోయి… తప్పు చెయ్యడం లేదా చెయ్యక పోవడం వల్ల కలిగే లాభ నష్టాలు బేరీజువేసుకుని… కావాలనే తప్పులు చేసే వారు పెరగడం కూడా కనకయ్య లాంటి వాళ్ళకి సమస్యే… డ్యూక్ యూనివర్సిటీలో మనోవైజ్ఞానిక, ప్రవర్తన అర్ధశాస్త్రాలు బోధించే డాన్ అరియేలీ గారన్నట్టు మామూలు మనిషి తాను చేసే పనుల్లో తప్పు ఒప్పు చూడడు.. లాభం నష్టం మాత్రమే చూస్తాడు… అశ్వత్థామ హతః అని ధర్మరాజు గారే అంటారు మహాభారతంలో..

దానికి తోడు, ఒక తప్పుకి కేవలం జరిమానాలు వెయ్యడం ప్రజలకి ఆ తప్పు చెయ్యడం మీద సిగ్గు పోతుందంటారు… మన పుణ్య దేశంలో ప్రజలు ఒక పద్ధతి ప్రకారం బతకడానికి తప్పొప్పులను మతానికి ముడిపెట్టారు మన పెద్దలు… దానివల్ల తప్పు చెయ్యాలంటే ఒక రకమైన దోష భావం తనకి తాను వేసుకునే శిక్ష లా పనిచేసేది దోస్తవిస్కీ గారి నేరము శిక్ష లాగ… ఇప్పుడీ కొత్త జరిమానాల సంస్కృతి వల్ల ఆ దోష భావం పోతుందని ప్రజలు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఉంటుందని అంటారు అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు స్టీవెన్ లెవిట్ గారు.

ఈ జ్ఞానం లేని కనకయ్య లాంటివాళ్లు తమ అనుభవంతో మనుషులలో మార్పులు వస్తున్నాయి అని గ్రహిస్తారు గాని కారణాలు అర్ధం చేసుకోలేరు… దీని వల్ల వాళ్లకు తీవ్రమైన నిరాశ నిస్పృహలు  కలుగుతాయి… తనమీద తానే అతిగా వత్తిడి చేసుకునేలా చేస్తాయి… వాటి నుంచి పారిపోయే ప్రయత్నంలో వాళ్ళు పొగ, మద్యం లాంటివి తాగడానికి అలవాటు పడతారు. ఉన్న ఖర్చులకు తోడు ఇవి కూడా పెరిగి వల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి…

ఈ కోవిడ్ కాలంలో కొత్త సమస్యలు వచ్చాయి… మాట వినకుండా తిరగబడే ప్రజలే కాదు.. ఇంట్లో పిల్లలు కూడా గొడవలు చేస్తున్నారు…

స్కూల్ మొదలయ్యింది… పిల్లల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు.. వాటికోసం కంప్యూటరో, స్మార్ట్ ఫోనో కొనాలిట… ఇప్పుడు అంత డబ్బెక్కడి నుంచి తేవడం? వాళ్లకు ఇంటర్నెట్ కూడా కావాలిట…అదెలా పెట్టించడం? ఈ ఏర్పాట్లు చెయ్యకపోతే పిల్లల చదువులు ముందుకెళ్ళవు… వాళ్ళు కూడా తనలాగే మామూలు బతుకుకి కూడా రోజు యుద్ధం చెయ్యాలి…

పిల్లలు ఎదుగుతున్నగొద్దీ వాళ్ళ మీద ఖర్చులు కూడా పెరుగుతున్నాయి… ప్రాజెక్టులు చెయ్యడానికి అట్టముక్కలు ఇంకా ఏవో అర్థం కానీ వస్తువులు కొనాలి… స్కూల్ వాళ్ళు తీసుకెళ్లే టూర్లు.. ఒకటేమిటి… దాని పైన పిల్లలు మిగతా పిల్లలతో పోటీ పాడటానికి అడిగే వస్తువులు సరే సరి…

ఆలోచనలతో సతమతమౌతూ కనకయ్య పోలీస్ స్టేషన్ చేరాడు… లొంగి పోవడానికి కాదు… డ్యూటీ ఎక్కడానికి. కనకయ్య ఆ పోలీస్ స్టేషన్‌లో ఒక కానిస్టేబుల్.

ఎస్ఐ గారు కనకయ్యని పిలిచారు.. గబా గబా టోపీ పెట్టుకుని, ముసుగు సవరించుకుంటూ ఎస్ఐ గారి గదికి పరిగెత్తాడు… బూట్లు నేలకేసి మోది సెల్యూట్ చేసాడు. 

“ఆ కనకయ్యా, ఇవ్వాళ నువ్వు మార్కెట్ యార్డ్ దగ్గర డ్యూటీ చెయ్యి… అక్కడ వాహనాల రద్దీ ఎక్కువైపోతుందిట… కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పెడుతున్నారట… ఆ ప్రాంత కార్పొరేటర్ ఇందాక ఫోన్ చేసాడు… ఎవ్వరు దొరికినా వాయించేయి… కార్పొరేటర్ గారికి తేడా కనిపించాలి… నువ్వైతే దక్షత ఉన్నవాడివని నిన్నే పంపిస్తున్నాను” అన్నాడు.

తన అదృష్టానికి తానే మురిసి పోయాడు కనకయ్య… మార్కెట్ యార్డు కరోనాకి ముందు రోజుల్లో ఒక బంగారు గని… ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో… ఎంతలేదన్నా ఒకటి రెండు అవకాశాలైన వస్తాయి నాలుగు డబ్బులు చేసుకోవడానికి అనుకున్నాడు.

తనతో బాటు పనిచేసే కానిస్టేబుల్ రవి కూడా “గురూ ఇవాళ నక్క తోక తొక్కావు… మామూలు భయాలతో బాటు ఈ కోవిడ్ భయం వల్ల జనం గబుక్కున నాలుగు డబ్బులు మన చేతిలో పెట్టి తుర్రుమంటారు” అన్నాడు.

“సరే సార్…” అని బయల్దేరాడు… మార్కెట్ యార్డ్ దగ్గర మూడు నో పార్కింగ్ బోర్డులు ఉన్నాయి.. ఇవాళ ఎలాగైనా డబ్బులు రాలసినదే… కరోనా భయం ఉన్నా సరే ఇవాళ నేను కరెన్సీ చూడాలి అనుకున్నాడు.

అసలే కరోనా వల్ల బాగా నష్టాల్లో ఉన్నారు ప్రజలంతా… వాళ్ళను పీడించడం తప్పేమో అనిపించింది… చిన్నప్పుడు చదువుకున్న వేమన శతకంలో ఒక పద్యం గుర్తుకు వచ్చింది ఎందుకనో…

పాలసాగరమున బవ్వళించిన హరి
గొల్ల పల్లె పాలు గోర నేల?
నెదుటి వారి ద్రవ్య మెల్ల వారికి దీపి
విశ్వదాభి రామ వినుర వేమా

అంతేలే …కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది… మన ఈ బతుక్కి ధర్మ పన్నాలు కూడానా అనుకున్నాడు…అలా వసూలు చెయ్యడం తప్పా రైటా అని ఆలోచించే పరిస్థితిలో లేడతను… అవసరాలు… వత్తిడులు అతని లోని నైతికతని కప్పేసాయి …

ఈ ప్రజల కోసం మేము ప్రాణాలు తెగించి డ్యూటీ చేస్తున్నాము… ఈమాత్రం  ఫలం ఆశించడం ఏమీ తప్పు కాదు అని ఎదురు తిరుగుతున్నమనసుకి సద్ది చెప్పాడు.

సాయంత్రం భార్య  చేతిలో ఎంతో కొంత పెట్టవచ్చు.. పొంగి పోతుంది పాపం పిచ్చిది అనుకున్నాడు …కొద్దిగా బాధేసింది.

ఏమైనా ఇవాళ అరుచుకోవడాలుండవు… పోనిలే అనుకున్నాడు… చాలా ఉత్సాహం వచ్చేసింది.

మార్కెట్ యార్డ్ రోడ్డు మీద నాలుగు రౌండులు వేసాడు… ఎక్కడ చుసిన వాహనాలే… కానీ పార్కింగ్ చేసి లేవు… ఒకరు మార్కెట్ లోకి కొనుక్కోవడానికి వెళ్తే మరొకరు వాహనం మీద కూర్చుని ఎదురు చూస్తున్నారు..

చట్టం స్థిరంగా ఉన్న స్థితినే గుర్తిస్తుంది… ఎటూ కాని స్థితిని గుర్తించదు… ఎవరైనా పార్కింగ్‌లో వాహనాన్ని పెడితే అది చట్ట ప్రకారం చేయదగిన పనే… పార్కింగ్ కాని చోట పెడితే కూడని పని అందుకనే శిక్షార్హం..ఎటూ కాకుండా రోడ్డు మీద నిల్చో పెట్టి దాని మీద కూర్చుని ఎదురు చూస్తుంటే ముందుకి వెళ్ళండి అని గద్దించగలం గానీ ఫైన్ వెయ్యలేం…. జనాలు మరీ తెలివి మీరిపోయారు అనుకున్నాడు నీరసంగా.

ప్రభుత్వం ఈమధ్యనే వాహన చట్టం సవరించి… వేరేవాళ్లకి  ఇబ్బంది లేదా ప్రమాదం కలిగేలా  ఎక్కడ నిల్చోపెట్టినా నేరమే అన్నారు సెక్షన్ 3  లో… కానీ ఆ విషయం కనకయ్యకు గుర్తు రాలేదు… 

ఇంతలో కనపడింది… నో పార్కింగ్ బోర్డుని అనుకుని ఉన్న నీలం రంగు మోపెడ్… అమ్మయ్య ఇవాళ్టి బోణి అవుతుంది… పొద్దున్నే ఎవరి మొహం చూశానో అని చిరాగ్గా ఉంది ఇప్పటి వరకు అనుకున్నాడు..

ఆ మోపెడ్ దగ్గరికి వెళ్లి “ఎవల్దీది” అని గద్దించి అడిగాడు… ఎవ్వరూ సమాధానం చెప్పలేదు… మరి రెండు సార్లు రెట్టించాడు… ఒకసారి లాఠీతో మోపెడ్ సీట్ మీద కొట్టాడు కూడా…అయినా ఎవ్వరూ పలకలేదు…

బహుశా మోపెడ్ ఇక్కడ పెట్టి కూరలు కొనుక్కోవడానికి వెళ్లారేమో… కాసేపు ఇక్కడే ఉంటే ఇవాళ్టికి కొంచమైనా గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు.

మోపెడ్ స్టాండ్ తీసి, సీట్ మీద ఠీవి గా కూర్చుని ఫోన్ చూస్తూ సమయం గడపసాగారు కనకయ్య.

పదినిముషాలు గడిచింది… భుజం మీద ఎవరో తట్టినట్టు అనిపించింది… “కాస్త లేస్తావా  బండి తీసుకోవాలి” అని వినిపించింది.

చిర్రెత్తు కొచ్చింది కనకయ్యకు.

నో పార్కింగ్‌లో బండి పెట్టడమే కాకుండా, యూనిఫారంలో ఉన్న తన్ని అడ్డు లేవమనే ధైర్యం ఎవరికుంది అనుకున్నాడు.

వెనక్కి తిరిగి చూసాడు… అక్కడో ముసుగు వీరుడు నిలబడి ఉన్నాడు… ఎక్కడో తెలిసిన వ్యక్తే… సరిగ్గా పోల్చుకోవడం కష్టంగా ఉంది.

“ఆ కనకయ్యా ఇవాళ ఇక్కడా డ్యూటీ?” అనడిగాడు ముసుగు వీరుడు.

అకస్మాత్తుగా గుర్తుపట్టాడు … వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఆంథోనీ… గబుక్కున సెల్యూట్ చేసాడు కనకయ్య…

ఆంథోనీ మఫ్టీలో ఉండడం వల్ల… ముక్కు మీదనుంచి సొగసైన ముసుగు పెట్టుకుని ఉండడం వల్ల గుర్తు పట్టలేదు… “క్షమించండి సార్…కూరలకొచ్చారా?” అనడిగాడు.

“అవును కనకయ్య… మా ఇంటావిడ ఒక్కటే పోరు.. కాసిని కూరలు తెచ్చి పడెయ్యమని… మా అబ్బాయి మాట వినడు కదా.. నేనే వచ్చాను” అన్నాడు.

“మీది తళ తళ లాడే మోటార్ బైక్ కదా సార్… ఈ మోపెడ్ ఏమిటి” అడిగాడు నిరాశను కప్పి పుచ్చుకుంటూ.

“నా బైక్ మా అబ్బాయి వేసుకెళ్లాడు లే… ఇవాళ వాళ్ళ స్నేహితులు అందరు కలిసి ఎక్కడికో వెళ్తున్నారుట” అన్నాడు ఆంథోనీ.

“ఈ కరోనా రోజుల్లో తిరుగుడులేమిటి సార్… ఆపెయ్యక పోయారా?” ఆశ్చర్యంగా అడిగాడు కనకయ్య.

“చెప్పానయ్యా… ఇంట్లో కూచుని కూచుని పిచ్చెక్కుతోంది వాడికి… ఆపడం మా వల్ల కాలేదు… అందుకే నా మోటార్ సైకిల్ వాడికిచ్చి నేను వాడి మోపెడ్‌లో తిరుగుతున్నాను… నా బండి అయితే దాని మీద పోలీస్ స్టికర్ ఉంటుంది కదా …ఎవరైనా ఆపినా పరవాలేదు” అన్నాడు ఆంథోనీ.

చట్టాన్ని అమలు పరిచే బాధ్యత తీసుకున్నా మనం కూడా మనుషులమే కదా…అందరికి ఉండే సమస్యలు మనక్కూడా ఉంటాయి అనుకున్నాడు కనకయ్య.

“మరొస్తాను కనకయ్య” అంటూ బయల్దేరాడు ఆంథోనీ.

సెల్యూట్ చేసి నిరాశగా ఖాళీ జాబులతో వెనక్కు తిరిగాడు కనకయ్య.  

ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న సామ్రాజ్యవాద పద్ధతుల్లో తన ఊహకే అందని అభివృద్ధిని అర్థం చేసుకోలేక… దాని వల్ల తన జీవితం మీద పడే బరువు గురించి ఊహించలేక సతమతమౌతున్నఒక మధ్యతరగతి మనిషి కనకయ్య మంచి చెడ్డలు… నీతి న్యాయం… అవసరాలు సమస్యలు మధ్య సాగుతున్న అంతర్యుద్ధంలో నలిగి పోతూ ఒంటరిగా మిగిలాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here