[dropcap]ఉ[/dropcap]దయాన్నే సూర్యుడి పరుగుతో పాటు శ్రీ వేంకట పద్మజ పరుగు మొదలు.
అష్టాదశ వర్ష భవేత్ కన్య అన్నట్లు 18 ఏళ్లకే పెళ్లిచేసి అత్తారింటికి మద్రాస్ పంపారు. కొత్త కోడలిగా అత్తగారి డైరెక్షన్‌లో సిటీ అంశాలు నేర్చుకుంది కొత్త కోడలు. అందులో పెద్దింటి పిల్ల గారాల పందిరి నుంచి సరాగాల పందిరిలో ఎన్నో రకాల అనుభవాలు అనుభూతులు.
కాలంతో పాటు పరుగులో చెల్లెలు సత్య కీర్తి కూడా వచ్చి మద్రాస్ జీవితం ఇష్టపడింది. కష్టం అనుకోకుండా అక్క వెంట అక్క అత్తింటి వారి ఇంట పూల దండలో దారంలా అల్లుకు పోయింది. ఆడబడుచుల్లా కాక అక్కాచెల్లెళ్ళ మాదిరి అందరూ ఆనందంగా జీవిస్తున్నారు.
కాలగమనంలో పద్మజ ఇద్దరు పిల్లల తల్లి అయ్యింది. చక్కని జీవితము. సిటీ అందాలు, అనుభవాలు, అనుభూతులు పద్ధతులు నేర్చుకుంది.
భర్త అస్సాంలో భాధ్యత గల ఉద్యోగం. మామగారు పిల్లల చిన్నప్పుడే లేరు. అత్తగారే అన్ని చూసుకునేది. పిల్లలకి అత్తలు బామ్మ దగ్గర, కీర్తి పిన్ని దగ్గర బాగా అలవాటు.
***
కాలగమనంలో పిల్ల ప్రియాంక ఎమ్మెస్ చేసింది. యూనివర్సిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది. శ్రీ శివ పార్వతి కళ్యాణంలో శివుడి వేషం అద్భుతంగా వేసింది. 48 గంటల యూనివర్సిటీ కార్యక్రమంలో గిన్నిస్ బుక్ అవార్డ్స్ పొందింది.
పిల్లాడు రాహుల్ ఎంటెక్ పూర్తి చేసి పరిశోధన చేస్తున్నాడు. వీళ్ళతో పాటు స్నుపీ ఆ ఇంటి పెట్ డాగ్, అందరికీ ఇష్టం. తెల్లగా బొద్దుగా సున్నితంగా నెమ్మదిగా అరుస్తుంది. అసలు మారం చెయ్యదు. దాన్ని రాహుల్ కావాలని కొని తెచ్చుకుని పెంచుతున్నాడు. చెల్లెలు దానికి పాలు ఇతర ఆహారం పెడుతుంది.
ఇక్కడ ఒక విషయం! పద్మజ తాత గారు పెద్ద జమీందారు. ఒక ఎకరం స్థలంలో పెద్ద మేడ, గదులు. చెరువు. నెమళ్లు, కుందేళ్ళు ఇలా ఎన్నో రకాల అందాలతో పెద్ద మేడ ఉండేది. వాళ్ళకి ఇంట్లో కుక్కలు పెద్ద పెద్దవి పెంచే వారు. ఇంటి దగ్గరలో రైలు స్టేషన్ ఉండేది. రైలు కుయ్యగానే బొవ్ బోవ్ అని మొరుగుతు దొడ్డి అంతా తిరిగేవి. అలాంటి జమీందారు వంశంలో పుట్టిన పద్మజ చెన్నైలో ప్రకృతి అందాల ప్రదేశాలు చూస్తూ అత్తగారి ఆధీనంలో ఎన్నో విషయాలు నేర్చుకుంది
ఇప్పుడు అక్కడ ఎందరో స్నేహితులు, హితులు ఉన్నారు. అంతా కలిసి పండుగలు పబ్బాలు చేసుకుని పేరంటాలు చేసుకుంటారు. అత్తగారు పిల్లల ఇంట్లో అవసరానికి వెళ్లి ఉంటు ఉంటుంది.
***
పెద్దలు కాలంలో కలసి పిల్లల పెత్తనాలు వచ్చాయి.
పిల్లకి తెలుసున్న స్నేహితుల సంబంధం, బెంగుళూర్‍లో సెటిల్ అయిన వారికిచ్చి ఘనంగా చేశారు. ఆంధ్ర, చెన్నై, కర్ణాటక తెలంగాణ బంధువులతో విదేశీ బంధువుల మధ్య రంగ రంగ వైభవంగా పెళ్లి చేసి అందరికీ బట్టలు, గిఫ్ట్స్ ఇచ్చారు.
స్నుపికి కూడా పట్టు గౌను తొడిగారు. మెళ్లో గొలుసు, కళ్ళకి కళ్ళజోడు, కాళ్లకి పట్టీలు పెట్టి అలంకరించారు. నుదుటన అంజనేయ స్వామి కుంకుమ పెట్టారు. పెళ్ళిలో అది ఘల్లు ఘల్లు అంటూ గెంతుతూ తిరిగింది. చాలా గారంగా ఇంటి పిల్లలా పెంచుతున్నారు. పెళ్ళిలో అందరితో పాటు ఘనంగా అది కూడా సందడి చేసింది.
పిల్ల పెళ్లి ఘనంగా జరిగింది. అనుకోకుండా రాహుల్ క్లాస్మేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లిలో ఎంతో సందడి చేసింది. అంతా మెచ్చుకున్నారు కూడా. అయితే ఆ అమ్మాయి ప్రియదర్శిని తల్లినీ తండ్రినీ తీసుకుని వచ్చి తనకు రాహుల్ ఇష్టం ఉన్నట్లు చెప్పింది. పెళ్లికి వప్పుకోమని అడిగారు.
వెంటనే పద్మజ “కుటుంబ సభ్యులతో ఆలోచించి ముహూర్తాలు పెడదాము” అని చెప్పింది. ఈ లోగా ప్రపంచం అంతా సమస్యల వలయంలో చిక్కుకుని పోయింది.
పెళ్లి వాళ్ళ కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. పిల్లాడు ఆడపడుచు, పిన్న అత్త కీర్తి వెళ్లి వచ్చారు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అని పెద్దలు అంటారు.
అటు పద్మజ, కృష్ణ కూడా వెళ్ళలేదు. ఎంత తమాషాగా విధి రాత ఉంటుందో తెలియదు. పద్మజ కోడలికి ఆన్లైన్‌లో బట్టలు, నగలు, ఇతర పెళ్లి సామాను తెప్పించి పంపింది. ఇంట్లోకి వచ్చేక బంధువులు ఆ ఊళ్ళో ఉన్న వారిని అడబడుచు పిల్లల్ని పిలిచి శ్రీ సత్య నారాయణ వ్రతం, శ్రీ వేంకటేశ్వర దీపారాధన చేశారు. భోజనాలు పెట్టారు.
కాలం కలిసి వస్తే ఇట్టే అన్ని జరిగిపోతాయి. అపార్టుమెంట్ నిమిత్తం కట్టిన ఇల్లు పూర్తి అయి చేతికి వచ్చింది. కోడలు వచ్చింది ఇంట్లో త్రిబుల్ బెడ్ రూమ్ అవసరం ఉంది. ఎవరి గది వాళ్ళకి ఏర్పాటు చేసుకొన్నారు.
కోడలు ఉద్యోగం చేస్తోంది. సారే పెడతామన్నారు కానీ, “మాకు వద్దు అన్ని ఉన్నాయి ఇక్కడ. మీ పిల్లకి బ్యాంకులో డిపాజిటివ్ చెయ్యండి. వాళ్ళకి ఎప్పుడు కొత్త మోడల్ కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు” అన్నది.
వియ్యాల వారు సరే అని బ్యాంకులో డిపాజిట్ చేసి ఇచ్చారు. చాలా తమాషాగా పిల్లల పెళ్ళిళ్ళు ఒకే సంవత్సరంలో ఉగాది ముందు వెనుక అయ్యాయి.
***
పిల్లలు ఆనందంగా ఇంట్లో ఉన్నారు. కొడుకు కోడలు నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ చక్కగా ఉన్నారు. అల్లుడు దుబాయిలో ఉన్నాడు, కూతురు ఇక్కడ జాబ్ చేస్తోంది
ఏది కావాలన్న కోడలు “ఉండండి అత్తగారు నేను చేసి చూపిస్తా” అంటుంది. వాళ్ళ ఇద్దరు తెల్లరగట్ల లేచి ఇడ్లీ గాని, దోసె గాని చేసుకుని తిని బాక్స్‌లో పెట్టుకుని వెళ్ళిపోతారు. కొడుకు, కోడలు, కూతురు ముగ్గురు రెండు స్కూటర్‌లలో వెడతారు. వాళ్ళు వెళ్ళే టైమ్‌కి పద్మజ లేచి కాఫీ తాగుతుంది.
పనిమనిషి తమిళమ్మాయి. వచ్చి అంట్లు తోమి ఇల్లు తడి బట్ట పెట్టీ, బట్టలు ఉతికి ఆరేసి వెడుతుంది. పద్మజ నెమ్మదిగా లేచి కూరలు తరిగి వంట చేసుకుని తింటుంది. స్నుపికి పాలు ఇచ్చి అన్నం పెడుతుంది. అది చక్కగా తోక ఆడిస్తూ ఇల్లంతా తిరుగుతూ పద్మజకి తోడు ఉంటుంది. పిల్లలతో పాటు పెంచినందుకు విశ్వాసమును కలిగిన మేలు అన్నట్లు చాలా తోడుగా ఉంటుంది.
పద్మజ కోడలు మాత్రం ఆదివారం వస్తే “వంటిల్లు ఇంఛార్జి నేనే అత్తయ్యా” అంటుంది. “రోజూ మీరు మేము వచ్చేటప్పటికి వంట చేసేస్తారు” అంటుంది.
వస్తూనే టీ తాగి మురుకులు, మిక్సర్ వంటి స్నాక్స్ తిని స్నానం చేసి రాత్రి పూర్తి భోజనం అంతా కలసి డైనింగ్ టేబుల్ పై తింటారు. ఆ యింట్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది. అంతా కలసి ఆనందంగా తింటారు, ఉంటారు.
కాలము వింత ఏమిటంటే అల్లుడు రితేష్ కూడా గల్ఫ్ నుంచి వచ్చి చెన్నయ్‌లో సెటిల్ అయ్యాడు. అల్లుడు వేరే చోట ఇల్లు కొన్నాడు. ఆదివారం వస్తే అందరూ ఆ ఇంటికి వస్తారు. అడుతు పాడుతూ వండుకుంటారు లేదా హోటల్‌కి వెళ్లి తింటారు.
కూతురికి ఇద్దరు, కోడలికి ఇద్దరు. రెండు స్కూటర్‌లు వేసుకుని వదిన అడవడుచు, ఎక్కితే అత్తగారు మనుమలు ఇంకో స్కూటర్ వేసుకుని బయటకు వెడతారు. సరదాగా పద్మజ కూతురికి కోడలికి మనుమలకి ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
పిల్లల పూర్తి పెంపకం పద్మజ చూసుకుంటుంది. మనుమలని చూసుకోవడం, కథలు చెప్పడం అన్ని బాధ్యతలు తీసుకుంది. కోడలు, కొడుకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. కృష్ణ కూడ బట్టలు పిల్లలకి తెచ్చాడు.
***
చదువుకున్న కోడలికి ఈ తరం అత్తగారు సహకరించాలి గాని విమర్శిస్తూ, రోగాలు చెప్పుకుని కోడళ్ళను దూరంగా పెట్టడం కాదు అని ఎప్పుడు పద్మజ చెపుతుంది. కాదు ఆచరించి చూపుతుంది. కోడలు, అత్త పిల్లలని చెరో ఒకళ్ళు ఎక్కించుకుని స్కూటర్‌పై వెడుతూ ఉంటారు. కారు డ్రైవింగ్ వచ్చిన సరే, షాపింగ్‌కి కార్‌లో వెడితే పార్కింగ్ కష్టం అని స్కూటర్‌పై వెడతారు.
కోడల్ని కూడా ఒక కూతురులా, ఫ్రెండ్‌లా పద్మజ చూసుకుంటుంది. తన కొడుకుని ప్రేమించి పుట్టిల్లు వదిలి అత్తింటికి వచ్చిన పిల్ల, మనం కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఈ తరం మామగారు కూడా ఏకీభవిస్తాడు. “జీవిత కాలం అత్తింటిలో ఉండాల్సిన పిల్ల. మనం జాగ్రత్తగా చూసుకోవాలి” అని వత్తాసు పలికాడు మామగారు.
కోడలు నవ్వుతుంది. కొడుకు ఎప్పుడైనా కోడల్ని విమర్శిస్తే, పద్మజ కోడల్ని వెనకేసుకుని వస్తుంది.
ఆ ఇంట్లో నాలుగు రాష్ట్రాల వారు ఉన్నారు, అయినా ఏనాడు గొడవ లేదు. ఓ రోజు కర్ణాటక వంట, ఇంకో రోజు తమిళనాడు, మరో రోజు అంద్రా, మరి ఇంకో రోజు తెలంగాణ వంట. ఇలా రకరకాల వంటలు చేసుకుని తింటారు. విమర్శ ఉండదు, వెక్కిరింత ఉండదు, ఈ తరం అత్తగారు పెద్దగా చదువుకోకపోయినా కళలు, కధలు బాగా నేర్చినది పద్మజ. వంటలో అందే వేసిన చెయ్యి.
అందుకే కుటుంబంలో కలతలు రాకుండా చూసుకోవాలి, అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. వృద్ధాప్యంలో సమస్యలు రాకుండా జీవితాలు వెడతాయి. ఇలా ఎంత మంది ఆలోచిస్తారు? అయిన పిల్లలను చేసుకుని బాధలు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ఎంత సేపు మాకేమి తెచ్చావు? అని అడిగి అల్లరిచేస్తూ కొడుకుని కోడల్ని ఎలా అల్లరి పెడదామా అన్న ధోరణి మనుషులు ఉన్నారు.
కొడుకు పెళ్లి చేసుకున్న పిల్ల మన ఇంటి పిల్లగా చూసుకోవాలి, ‘నీకు నా కొడుకు బాగానే దొరికాడు భయం భక్తి లేదు’ అంటూ సాధిస్తే ఆ పిల్ల ఏమి చేస్తుంది? ఇంటికి కోడలిగా వచ్చిన పిల్లని ప్రేమగా చూసుకుంటే ఇల్లు ఆనంద నిలయం అవుతుంది.
ఈ తరం అత్తగారిగా పద్మజ కోడలు ప్రేమ పొందగలిగింది.
ఇలా అందరూ అత్తలు ఉంటే ఇంకా సమస్యలు ఉండవు. కట్నాలు లాంఛనాలు అంటూ ఏ గొడవలు ఉండవు. మరి ఆ మార్పులు ఈ తరం అత్తగార్ల వల్లే అని అంతా తెలుసుకోవాలి కదా.
నానాటి బ్రతుకు నాటకం అన్నట్లు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకేశ్వరస్వామి కీర్తనల సారం తెలుసుకుని కుటుంబాలు బాగు చేసుకుంటే మంచిది కదా.