తొలి భారతీయ మహిళా వైద్యురాలు డా॥ ఆనందీబాయి జోషి

11
3

[dropcap]మా[/dropcap]ర్చి 31 వ తేదీ శ్రీమతి ఆనందీబాయి జోషి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఒకప్పుడు మనదేశం బాల్యవివాహాలకు, చిన్నారి పెళ్ళికూతుళ్ళకు, శిశుమరణాలకు నెలవు. ఈ మూడింటికి ఉండే సంబంధం నాటి మహిళలకు సమాజంలో గల స్థానమేమిటో చెప్పకనే చెపుతుంది. వీటికి కారణాలు అజ్ఞానం, మూఢాచారాలు, అవిద్య మొదలైనవి. మరో ముఖ్య కారణం వైద్య సౌకర్యాల లేమి.

ఆరోజులలో మహిళా గైనకాలజిస్ట్‌లు లేకపోవడం, ఉన్న కొద్ది పురుష గైనకాలజిస్టుల దగ్గరికి మహిళలు వెళ్ళలేని పరిస్థితుల మూలంగా ప్రసవ సమయాలలో స్త్రీలు, శిశువులు మరణించడం సర్వసాధారణం. ఆ పరిస్థితి స్వయంగా అనుభవించి, ఆవేదన చెందిన ఒక మహిళామణిని ‘పుత్రశోకమే వైద్యురాలిని చేసింది’. ఆ వైద్యురాలే తొలి భారతీయ మహిళా వైద్యురాలు శ్రీమతి ఆనందీబాయి.

వీరు 1865వ సంవత్సరం మార్చి 31వ తేదీన (నాటి బొంబాయి ప్రెసిడెన్సీ) నేటి మహారాష్ట్రలోని పూనాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు గుణాబాయి జోషి, గణపతిరావు అమృతేశ్వర్ జోషిలు. వీరి మొదటి పేరు యమున. ధనిక కుటుంబమే అయినా కొన్ని కారణాల వలన బీద కుటుంబంగా మారింది. అప్పటి ఆచారాల ప్రకారం 9 ఏళ్ళ వయసులోనే శ్రీ గోపాలరావు జోషితో వీరి వివాహమయింది. గోపాలరావు భార్య పేరును ఆనందీబాయిగా మార్చారు. స్వతహాగా గోపాలరావుకి చదువంటే ఇష్టం.

అయితే సంస్కృతం, మరాఠీ భాషల వలన అంత ఉపయోగం లేదని గ్రహించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్లభాష నేర్చుకోవాలని ఆకాంక్షించారు. స్వయంగా భార్యకు ఇంగ్లీష్ భాష చదవడం, వ్రాయడం నేర్పించారు.

ఆయన పోస్టల్ ఉద్యోగి కావడంతో జాతీయ, అంతర్జాతీయ పత్రికలు అన్నీ చదివేవారు. ఆయనకు స్వతహాగా చదువంటే ఇష్టం. భార్యను పై చదువులు చదివించాలనుకునేవారు.

ఇలా ఉండగా 14వ ఏట ఆనంది ఒక కుమారునికి జన్మనిచ్చారు. కాని 10 రోజుల వయసులోనే శిశువు మరణించాడు. దీనికి కారణం తనకూ, శిశువుకీ సరైన వైద్యం అందక పోవడమేనని ఆనందికి అర్థమయింది. ఆ సమయంలో సహజంగా ఎవరికైనా స్మశాన వైరాగ్యం కలుగుతుంది. కాని ఆమె కళ్ళముందు లక్షలాది మంది సాంప్రదాయిక కుటుంబాలకి చెందిన గర్భవతులు, బాలింతలు, నవజాత శిశువులు కన్పించారు. వారందరి బాధ ఆమెకు అనుభవైకవేద్యం. డాక్టరయి అటువంటి సోదరీమణులకు వైద్య సేవలందించాలని నిర్ణయించుకున్నారు. భర్త గోపాలరావు కూడా ఈ దిశగా భార్యను ప్రోత్సహించారు.

ఆమెను చదివించే ఆలోచన చేశారు. వివిధ పత్రికలలో అచ్చయిన వైద్య విద్యకు సంబంధించిన ప్రకటనలను చదివేవారు.

ఆనందిని డాక్టరు చేయాలని ఉందని సాయం చేయమని అమెరికాలోని ‘రాయల్ విల్డర్ మిషనరీ’ని కోరారు. ఆ మిషనరీ వారు భార్యాభర్తలని క్రిస్టియన్ మతాన్ని స్వీకరించమని కోరారు. వీరు నిరాకరించారు. అయితే ఈ ఉత్తర ప్రత్యుత్తరాల అంశాన్ని తమ మిషనరీ స్వంత పత్రిక అయిన ‘ప్రిన్స్‌టన్ మిషనరీ రివ్యూ’లో ప్రచురించారు.

ఈ కథనాన్ని న్యూజెర్సీకి చెందిన థియోడెసియాకార్పెంటర్ చదివారు. ఆమె గోపాలరావుకి ఒక ఉత్తరం వ్రాశారు. ఆనందిని చదివించడానికి, అమెరికాలో వసతి కలిగిస్తానని ప్రోత్సహించారు. ఆనందికి ఉత్తరాలలో ప్రోత్సాహాన్నందించారు. ఆనంది అమెరికా వెళ్ళేలోగా వీరిద్దరి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో బాల్యవివాహాల కారణంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించేవారు.

ఒకసారి ‘సెరంపోర్ కాలేజి’లో ఆనందీబాయి మాట్లాడారు. భారతదేశంలో మహిళా వైద్యురాళ్ళ అవసరాన్ని వివరించారు. భారత వైస్రాయి 200 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. గోపాలరావు కోసం అమెరికాలో ఉద్యోగ ప్రయత్నం ఫలించలేదు. ఆనందీబాయి ఒక్కరే వైద్య విద్య నేర్చే నిమిత్తం 1883 జూన్‌లో అమెరికా వెళ్ళారు. కార్పెంటర్ ఆనందీబాయిని స్వంత కుమార్తెలా ఆదరించారు. ఫిలడెల్ఫియాలోని మహిళా వైద్యకళాశాలలో ఆనందిని చేర్పించారు. అక్కడ వదిలి వెళుతూ కార్పెంటర్ విలపించిన తీరు ఆమెకు ఆనంది పట్ల గల ప్రేమాభిమానాలను తెలియజేస్తుంది.

కాలేజి యాజమాన్యం ఆనందీబాయికి సంవత్సరానికి 200 అమెరికన్ డాలర్లను ఉవకారవేతనంగా అందించి ఆమె విద్యాభ్యాసానికి సహాయం చేశారు. అయితే ఆమెకి వసతిగా ఇచ్చిన గదిలో ఫైర్ ప్లేస్ (శీతల ప్రదేశాలలో చలిని కాచుకునేందుకు వాడే ఫైర్ ఉండే ప్రదేశం)కు వీలుగా లేదు. కట్టెపుల్లల మంట నుండి వచ్చే పొగ ఆమె ఊపిరితిత్తులలోకి వెళ్ళి అనారోగ్యాన్ని కలగజేసింది. 2 సంవత్సరాలు గడిచేటప్పటికి అపస్మారకంలోకి వెళ్ళిపోయింది. దగ్గు మొదలయ్యి జీవితాంతం వెంటాడింది.

ఈలోగా గోపాలరావు కూడా అమెరికా వెళ్ళారు. భార్య అనారోగ్యాన్ని, కార్యదీక్షాదక్షతనీ గమనించారు. అనారోగ్యాన్ని చూసి బాధపడ్డారు కాని భార్య అంత ఉన్నత స్థితికి ఎదగడాన్ని పురుషాహంకారం భరించలేకపోయింది. మానసికంగా మాటలు తూటాలతో వేధించారు. వ్యాధి మరింత ముదిరింది. క్షయగా నిర్ధారించారు.

1886 మార్చి 11 వ తేదీన వైద్య విద్యలో పట్టాను పొందారు. వారి పరిశోధనాంశం ‘ఆర్యహిందువులలో స్త్రీ జననాంగ-శిశు సంబంధిత వైద్యం’. ఈ సందర్భంలో తమ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పౌరురాలు ఆనందీబాయి తొలి భారతీయ మహిళా డాక్టర్ అయినందుకు విక్టోరియారాణి అభినందన సందేశాన్ని పంపడం గొప్ప విశేషం. ఫిలడెల్సియా వైద్య విభాగంవారు ఆనందికి వైద్య పట్టాని ప్రదానం చేస్తూ తొలి భారతీయ మహిళా వైద్యురాలు అని ప్రకటించారు. ఈ స్నాతకోత్సవంలో పండిత రమాబాయి, గోపాలరావు జోషిలు కూడా పాల్గొన్నారు. ఆరోగ్యం రోజు రోజుకీ దిగజారసాగింది ఆనందికి. వైద్యులు భారతదేశానికి తిరిగి వెళ్ళమని సలహాయిచ్చారు.

ఈలోగా ఇక్కడ భారతదేశంలో కొల్హాపూర్ మహారాజు తన సంస్థానంలోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ మహిళా వైద్యశాలలో మహిళా వైద్య విభాగానికి అధిపతిగా ఆనందీబాయిని నియమించారు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు

భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు ఆనంది భర్తతో కలిసి. ఎప్పుడెప్పుడు తన సోదరీమణులకు వైద్యసాయం చేద్దామా అని వారి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. అయితే ఆరోగ్యం మాత్రం సహకరించడం లేదు.

నౌకలో ప్రయాణిస్తున్న పాశ్చాత్య వైద్యులు వీరికి వైద్యం చేయడానికి నిరాకరించారు కారణం ‘బ్రౌన్ ఉమన్’ కావడం (భారతీయులను పాశ్చాత్యులు బ్రౌన్ పీపుల్ అని పిలుస్తారు).

1886 నవంబర్ 16వ తేదీన బొంబాయి చేరుకున్నారు. వారికి ఘనస్వాగతం లభించింది. అయితే వ్యాధి మరింత ప్రబలమయింది. ఆయుర్వేద చికిత్స చేయిస్తే మేలని కుటుంబీకులు ప్రయత్నించారు. అయితే నౌక మీద ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన ఆనంది భ్రష్టురాలయిందని చెప్పి వైద్య సేవలను అందించడానికి నిరాకరించారు ఆయుర్వేద వైద్యులు.

ఈ విధంగా భారతీయులపట్ల పాశ్యాత్యులు, విదేశ ప్రయాణం చేసి వచ్చినందుకు స్వదేశీయులు వివక్షతో ఒక గొప్ప వైద్యురాలి ప్రాణాన్ని నిలబెట్టలేకపోవడం ఎంత దారుణం? ఈ సంఘటన ప్రపంచంలోను, స్వదేశంలోను భారతీయుల దుస్థితిని కళ్ళకు కట్టిస్తుంది.

చివరకు అమెరికా నుండి కార్పెంటర్ పంపించిన మందులు వాడారు, అయినా ఫలితం దక్కలేదు. 1887వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన తన సోదరీమణులకు వైద్యం చేయలేకపోయాననే బాధతోనే మరణించారు ఆనంది. వీరి చితాభస్మాన్ని కార్పెంటర్‌కు పంపారు గోపాలరావు. న్యూయార్క్‌లో తమ కుటుంబ శ్మశానవాటికలో ఈ భస్మాన్ని కార్పెంటర్ భద్రపరిచారు. ఆనంది పట్ల తన అవ్యాజమైన ప్రేమానురాగాలను ఈ విధంగా వ్యక్తపరిచారు కార్పెంటర్.

డా॥ ఆనందీబాయి జోషి వైద్యసేవలను అందించలేదు. కాని తొలి భారతీయ మహిళా వైద్యురాలిగా చరిత్రను సృష్టించారు. అయితేనేం ఒక మహా సందేశాన్ని అందించారు. మనం అనుకున్నది సాధించాలనే తపన, నిబద్ధత, పట్టుదల, అకుంఠిత దీక్షలకు తోడు మనం గమనించవలసిన ముఖ్య విషయం ఒకటుంది. ఎవరికి వారు స్వీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను ఆనంది ఇరవైరెండేళ్ళ చిరుజీవితం మనకు తెలియజేస్తుంది.

‘క్రౌంచ పక్షి శోకమే శ్లోకమై రామాయణ ఆవిర్భావానికి నాంది పలికినట్లు’గా పుత్రశోకం ఆనందీబాయి వైద్యురాలవడానికి కారణమయింది. ఆమె అనారోగ్యం/ఆరోగ్యం పట్ల ఉండవలసిన అప్రమత్తతను మనందరికీ తెలియజేసింది.

వీరి జయంతి మార్చి 31 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***                                                         

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here