కాశ్మీర దీపకళిక – యాత్రా వచన కావ్యం

3
3

[dropcap]నా[/dropcap]యని కృష్ణ కుమారిగారు రచించిన యాత్రా చరిత్ర ‘కాశ్మీర దీపకళిక’. “అది కేవలం యాత్రా కథనం కాదు, అది ఒక వచన కావ్యం” అన్నారు చేకూరి రామారావు గారు. కాశ్మీరు లోని ప్రకృతి సౌందర్యానికి పరవశంచి, రచయిత్రి కవితావేశం తో చెప్పిన వచనం ఇది.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకిగా విద్యార్థులను 1967 జూన్‌లో కాశ్మీరు యాత్రకు తీసుకుని వెళ్ళారు రచయిత్రి. ఆ యాత్రానుభవాలను డైరీలో రాసుకున్నట్టుగా నమోదు చేసారు సహజంగా కవయిత్రి. విద్యార్థినిగా ఉన్నప్పుడే ‘ఆంధ్రుల చరిత్ర’ను రాసిన సహజ రచయిత్రి. జానపద విజ్ఞానంలో అగ్రగణ్య పరిశోధన కావించారు. విద్యాధికురాలు, ప్రాచీన సాహిత్యంలో పాండిత్యం కలిగినవారు.

ఇల్లు వదిలి అయిదు రోజులయింది. ముందుగా పది రోజులు పాటు జరుగబోయే పర్యటనానుభవానికి కొంత జంకు కలిగింది. ఎక్కడో రవ్వంత నిరుత్సాహం కలిగింది. “భారంగా జీవితాన్ని వెళ్ళదీసే డబ్బు లేని బహుకుటుంబీకుడిలా ఉంది రైలు. ఎప్పుడూ ఎడతెగని ఆలోచనలతో సతమత మవుతూ పరిష్కారం కనుక్కోలేని అస్థిరచిత్తుడి మల్లే ఊగిపోతుంది రైలు. మెల్లగా కదిలే టప్పుడు చేసే చప్పుడులో ఏదో జాలి….”. “ఎవరిదో అదృశ్య హస్తం గాఢమైన నల్లరంగు పులిమినట్లు చీకటి…..” అంటూ భేషజం చూపకుండా మనసులోని బెంగను వ్యక్తీకరించారు.

కాని అంత సుందరమైన భూ ఖండాన్ని సర్వాత్మనా సందర్శించి మనసులో చెరగని ముద్రగా వేసుకోవాలన్న బలీయమైన ఆకాంక్ష ఉత్తేజ పరచింది. వారి నేతృత్వాన 1967 జూన్ 18న శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ మకాం వేసారు. వెయ్యి అడుగుల ఎత్తున ఉన్న శంకరాచార్య పర్వతాన్ని అధిరోహించారు. ఆ కొండకు ఉత్తరాన మరొక కొండ ఉంది. ఈరెంటికి నడుమ జీలం నది నానుకుని శ్రీనగర్ పట్టణం విస్తరించింది. ఆ పట్టణానికి ఇరు వైపులా విశాలమైన బాటలు. ఇరు వైపులా చీనార్ చెట్లు, బాట మీద కొద్ది దూరం నడవగానే జీలం నది కాలువలు. అక్కడక్కడా దారికి అడ్డం వచ్చే కొండవాగుల్లో నీళ్లు ఎర్రగా మరగగాచిన చిక్కని ఇరానీ హోటళ్లలోని టీ రంగులో ఉన్నాయి, అంటూ ఇరానీ చాయ్‌ని గుర్తుకు తెచ్చుకున్నారు..

ఆ పర్వతం మీద నుండి చూస్తే శ్రీనగర్ అద్భుతంగా చిన్న పిల్లల కోసం సద్దిన బొమ్మల కొలువులా ఉంది. ఎత్తు నుండి చూసినప్పుడు కనుపించిన నగర నిర్మాణ సౌందర్యాన్ని గుర్తించారు.

పల్లపు చోట్ల నీరు నిలువ ఉండి సరస్సులుగా మారిన వైనం కనుపించింది. శ్రీనగర్‌లో ఉన్న సరస్సుల్లో దాల్ ఒకటి. దాల్ లేక్‌లో నౌకా విహారం చేస్తూ దారి చుట్టూ రమణీయంగా విప్పిన నెమలి పురిలో కన్నులు కుదురు కున్నట్లుగా అమరిన పూల తోటలు చూడడం ఆనాటి మా కార్య కార్య క్రమం అన్నప్పుడు రమ్యమైన వచన దృశ్యం గోచరిస్తుంది

ఈ సరస్సు ఒక ఒడ్డు నుండి మరొక ఒడ్డుకు చేరుకునేందుకు, నౌకలు మెత్తటి సీట్లను అమర్చి ఉన్నాయి. నౌకా విహారం చేసారు.

చష్మె చాహి చష్మై పూలతోటకు వెళ్ళారు. ఈమాటకు గొప్ప ఊట అని అర్థం.. అక్కడ నుంచి నావలో నిషాత్ బాగ్ వెళ్ళరు, అంటే సంతోష వనం అని అర్థం. ఆ తోటంతా మెట్లు మెట్లుగా ఉంది. కొండ నుంచి జారే జల ఒకటి ఈ మెట్లనుంచి జారి దాల్ సరస్సులో కలసి పోతుంది.

అటు తరువాత చార్ చినార్ తోటను చూసారు. ఆ తోటకు నాల్గు పక్కలా చీనార్ చెట్లు ఉన్నాయి. వ్యవధి లేనందువల్ల మొఘల్ తోటలని పిలిచేషాలిమార్ తోటలకు వెళ్ళ లేక పోయారు.

1587లో అక్బర్ చక్రవర్తి కాశ్మీర్‌ను జయించి మొగల్ పరిపాలన లోనికి తెచ్చాడు. ఈ తోటలన్నీ షాజహాన్ కాలం నాటివి. మధ్యలో ఆగ్రాలో దిగి తాజ్‌మహల్ చూసినప్పటి ఆమె ఆలోచనలు చెప్పుకోదగ్గవి. తాజ్ లోని పనితనాన్ని, సౌందర్యాన్ని ప్రశంసిం చదగినవి అంటూనే –భర్త మనసులో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ముంతాజ్ వ్యక్తిత్వం నన్ను కదిలిస్తుంది.” – అని ఒక వనితకు భర్త కలిగించిన అందమైన గౌరవాన్ని ప్రస్తుతించారు.

సౌందర్యాత్మకమైన, ఐతిహాసికమైన, దేశభక్తి పూరితమైన విశేషం ఏదీ వారి దృష్టిని దాటిపోలేదు.. కను చూపు మేరలో ప్రకృతి శోభ తప్ప మరొకటి కనిపించని దారిలో మధ్యమధ్యన అక్కడక్కడా మిలటరీ హెడ్ క్వార్టర్స్ అడ్డుతగిలేవి. ముదురాకుపచ్చ యూనిఫారంలో విధి నిర్వహణలో విలీనులై మైళ్లకు మైళ్ల దూరాన ఉన్న బంధువుల్ని, పుట్టి పెరిగిన పరిసరాల్ని, వదిలేసి తల్లినేల రక్షణ బాధ్యత వహించిన ఈ వ్యక్తుల్ని చూస్తే ఎవరి మనస్సు గౌరవంతో నిండి పులకరించిపోదు!.అన్న వాక్యాలు ఆమె మనసులోంచి పుట్టు కొచ్చినవి.

అడ్డువచ్చిన పర్వత శరీరాన్ని దొలుచుకుని ప్రకృతిని ఇలా జయిస్తున్నామనే గర్వరేఖ, మనిషి తన ముఖం మీద వెలయించుకోడానికి అవకాశమిచ్చే మానవ సృష్టి అది. దాని పేరు జవహార్ టన్నెల్. పిర్‌పంజల్ పర్వత శ్రేణిని దూసుకుని దాన్ని దాటుకుంటూ కిందనున్న కాశ్మీర్ లోయలోకి దిగడానికి అదే మార్గం. జవహర్ టన్నెల్ ను చూసి మానవ సృష్టికి గర్వంతో ఉప్పొంగిన ఆమె స్వగతం మనల్ని మెత్తగా తాకుతుంది.

“మధ్యాహ్నం ఎండ గంజి పెట్టిన నూలు గుడ్డలా ఫెళ ఫెళలాడుతుంది” అన్న వాక్యంతో ఆరంభమైన యాత్రా చరిత్ర అనేక పద చిత్రాల విన్యాసంతో కొన సాగుతుంది. వానచినుకుల్ని… “తొందర కత్తె అయిన ఇల్లాలు పని వేళ ఇంట్లో చేసే హడావుడిని తలపిస్తూ చిటపటా రాలడం మొదలు పెట్టాయి” అంటూ మానవ చేష్టలుగానూ, “మంచుముసుగు వేసుకుని అవకుంఠిత శిరస్క అయిన కులీన స్త్రీకి మల్లే కించిద్వినమ్ర భావం వెలారుస్తూ ఓ పర్వత శిఖరం…” అంటూ “అందమైన మెటఫర్స్ తోనూ, శ్రీనగరానికి తూర్పు దిశ నున్న ఈ సరస్సుకు ఆవలి వైపు పర్వత శ్రేణి నిటారుగా నిల్చొని సరస్సు అందాన్ని తదేకంగా పరికిస్తున్న రస హృదయుడైన వ్యక్తిలా కనిపిస్తుంది”, అంటూ మూర్త వస్తువునకు అమూర్త కల్పనలనూ కావించి రసాత్మక వాక్య నిర్మాణం కావించారు.

సుందర దృశ్యాలను చూసినప్పుడు మనసు పొందే ఉద్వేగాన్ని తాత్వికతలో ఇముడ్చుకున్నారు.

ఈ రమణీయకం ఇలా శాశ్వతంగా కళ్ళ ముందు ఎటువంటి వికృతత్వాలనూ పొందకుండా నిలిచిపోతే ఈ అనంత ప్రకృతి స్వర్గ సంపదను అనుక్షణమూ అనుభవించడానికి ఇప్పుడున్న స్థితి లోనే అజరామరమైన అమృతత్వాన్ని పొంద గలిగితే అన్న మాటలలో తాదాత్మ్యత పులినమౌతుంది.

అపారమైన వచన కథనంలో క్రియ్యూట, నేలకట్టు, వంటి పూర్వ కావ్య పద ప్రయోగం, ఇగం, పొక్తాతనం లాంటి జానపద మాండలిక, పద ప్రావీణ్యం తేటతెల్లమౌతాయి. కాశ్మీరు యాత్రలో వినిపించిన పిట్ట కథలు, గాథా సేకరణలో రచయిత్రి ప్రామాణికతకు, ఊహా శాలీనతలో చారిత్రక నిరూపణకు సాక్ష్య మిచ్చాయి.

నీళ్ళల్లో కదులు తున్నప్పుడు సరస్సు ప్రదర్శించే అందాన్ని ఆస్వాదిస్తూ మెల్లిగా సాగించిన ఆ ప్రయాణం అద్భుతంగా ఉంది. ..పడవలకు కట్టిన దీపకళికలూ, అవి నీళ్ళల్లో వెలుగుల్లా మొగ్గలుగా వెదజల్లిన అందాలను మనస్సుల్లో నింపుకుంటూ చదువుతున్నప్పుడు ‘కాశ్మీర దీపకళిక’ పఠితల మనస్సులలో మంచు సానువుల ధవళ కాంతులను విస్తరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here