[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]
[dropcap]ఇం[/dropcap]డియా, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకున్న నేపథ్యంలో 1966- తాష్కెంట్ శాంతి ఒప్పందం జరిగి 1965 యుధ్ధాన్ని ఆపగలిగింది. యుధ్ధాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన తీవ్రమైన ప్రజావ్యతిరేకతను సమర్థిస్తూ అప్పటి మేధావులు, కవులు, కళాకారులు తమ, తమ రంగాల్లో ‘శాంతి కోసం కవిత్వం’ అనే పేరిట సాహిత్య సృజన చేసి తమవంతు బాధ్యతను నెరవేర్చారు.
సాహిర్ ఆ యుధ్ధ సమయంలో రాసిన కవిత ఈ ‘యుధ్ధాన్ని ఆపడమే మంచిది!’.
యుద్ధం వద్దు..!
యుధ్ధాన్ని ఆపండి., అదే మంచిది
అది ఎవరి భూమిలో అయినా సరే
యుధ్ధాన్ని ఆపడమే మంచిది!
దీపాలు వెలుగుతూ ఉండడమే మంచిది
రక్తం చిందక పోవడమే మంచిది..
నీ దేశానిదైనా.. నీ దేశానిదైనా.. ఎవరిదైనా రక్తం.. రక్తమే!
మనిషి రక్తం కదా..!
యుద్ధం జరిగేది తూర్పునా.. పడమరనా అని కాదు..
హతం అయ్యేది చివరికి ప్రపంచ శాంతే కదా.. మరి?
యుద్ధం.. తనంత తానే మహా విధ్వంసకరమైనది.
ఏ బాధని కూడా విముక్తం చేయలేనిది..
ఈ రోజు నువ్వు చిందించే మానవ రక్తం..
నీలో రగిలే యుధ్ద జ్వాల.. చాల దయ గలదిగా..
నీ దేశాన్ని రక్షించేదిగా నీకు కనిపించవచ్చు.
కానీ ఇదే రేపు అన్నార్తులను ఆకలికి బలి చేస్తుంది.
నీ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం మనుషుల రక్తాన్ని పారించడం అవసరమా చెప్పు?
నీ ఇంటిని వెలుగులతో నింపేయ్యడం కోసం..
మరొకరి దేశాన్ని అంధకారంలో ముంచెయ్యడం న్యాయమా ఆలోచించు!
దేశ సరి హద్దులలో.. ఇళ్ల మీదా.. నీ బాంబులు కురవచ్చు గాక..
కానీ అవి మనో మందిరాల ఆత్మను నాశనం చేస్తాయి!
కాలి బూడిదైపోయిన పంట పొలాల భూమి..
అది నీదైనా.. నాదైనా
బీద ప్రజలను ఆకలితో మెలి తిప్పే దుర్భిక్షం లోకి నెట్టేస్తాయని మరిచిపోకు!
యుద్ధ ట్యాంకులు ముందుకే సాగచ్చు… తిరుగు ముఖం పట్టనూ వచ్చు
కానీ గుర్తు పెట్టుకో..
భూమి గర్భం మాత్రం అసఫల బంజరుగ మిగిలిపోతుంది.
యుద్ధం నీకిచ్ఛే విజయాపజయాల మధ్య దుఃఖిస్తావో.. ఆనందిస్తావో కానీ
జీవితం మాత్రం..
వ్యర్థమైపోయిన వాటికోసం శ్మశాన వీధుల్లో..
దీనంగా దుఃఖాలాపన చేస్తూనే ఉంటుంది!
అందుకే.. నేను ప్రార్థిస్తున్నదేమంటే..
బాంబులూ.. అధికారం చేతుల్లో ఉన్న
మనుషుల్లారా… ఇక యుద్దాన్ని ఆపండి!
దేశం ఎవరిదైనా
అసలు యుద్ధమే వద్దు..!
ఇక్కడైనా.. అక్కడైనా.. అసలు ఎక్కడైనా సరే
మీ ఇంట్లో అయినా.. మా ముంగిలిలో అయినా..
దీపాలు వెలుగుతూ ఉండడమే కావాలి!
యుద్ధం ఆగి పోవడమే కావాలి!
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి