ఇతివృత్తం:
[dropcap]చి[/dropcap]న్నపిల్లలే కదా… అని తేలిగ్గా తీసుకుని తల్లిదండ్రులు, వాళ్ళ ముందే, అనుచితంగా ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తన ముందు ముందు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భవిష్యత్తులో అనేక రకాల దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. విపరీతమైన అనర్థాలకు కూడా దారితీయవచ్చు… అని వివరించి చెప్పేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఈ నాటిక…
ఇందులో పాత్రలు:
లీలాకృష్ణ : 29 సంవత్సరాలు, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
దామోదర్ : 29 సంవత్సరాలు, ఇండియాలో బ్యాంకు ఆఫీసరు.
యుగంధర్ : 29 సంవత్సరాలు, ఇండియాలోని కంపెనీలో సేల్స్ మేనేజరు.
ఉపోద్ఘాతం:
లీలాకృష్ణ, దామోదర్, యుగంధర్… ముగ్గురూ చిన్ననాటి నుండీ ప్రాణస్నేహితులు. లీలాకృష్ణ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా జాబ్ చేస్తున్నాడు. ఇంకా బ్యాచిలరే!
దామోదర్… ఓ జాతీయ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్. రెండేళ్ళ క్రితమే పెండ్లైంది మాధవితో… వాళ్ళకు ఏడాది పాప కూడా. యుగంధర్.. ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్. ఓ సంవత్సరం క్రితమే జ్యోతితో పెండ్లైంది.
అందరూ పుట్టి పెరిగింది హైదరాబాదులోనే. ప్రస్తుతం లీలాకృష్ణ అమెరికాలో వుంటుండగా, దామోదర్, యుగంధర్ వుండేది హైదరాబాద్‍లోనే…
***
ఆ రోజు తెల్లవారుఝామునే అమెరికా నుండి వచ్చాడు లీలాకృష్ణ. పగలంతా విశ్రాంతి తీసుకుని, బడలికను వదిలించుకున్నాడు. సాయంత్రం ఇద్దరు మిత్రులకు ఫోన్ చేస్తాడు.
***
లీలాకృష్ణ : హలో… దామోదర్!
దామోదర్ : హల్లో… లీలాకృష్ణ… ఎలా వున్నావ్‍రా?
లీలాకృష్ణ : నేను బాగనే వున్నాన్రా! విషయం ఏమిటంటే, ఈ రోజు తెల్లవారుఝామునే హైదరాబాదు వచ్చాను!
దామోదర్ : అయితే నువ్విప్పుడు హైదరాబాద్‍లోనే వున్నావా!! అదేంట్రా… ఒక ఫోన్ లేదు… ఒక మెసేజ్ లేదు. సడన్‍గా ఊడిపడ్డవేంట్రా! ఏమైనా విశేషమా!!
లీలాకృష్ణ : అదేం లేదు లేరా! రావాలనిపించింది వచ్చాను… అంతే! అది సరే ఇవాళ ఫ్రీయేనా?
దామోదర్ : ఆ, ఫ్రీయేరా…. కలుద్దామా?
లీలాకృష్ణ : అయితే… రాత్రి ఏడుగంటలకల్లా హోటల్ తాజ్‍కి వచ్చేయ్! వస్తావుగా!
దామోదర్ : డౌటా… నువ్వొచ్చావంటే రాకుండా ఎలా వుంటాన్రా! ఠంచన్‍గా ఏడు గంటలకు అక్కడ వుంటాను!
లీలాకృష్ణ : సరే! యుగంధర్‍కి కూడా రమ్మని చెప్తాను… ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం!
దామోదర్ : ఓకేరా!
లీలాకృష్ణ : (ఫోన్ కట్ చేసి, యుగంధర్‍కి ఫోన్ చేస్తాడు) హలో యుగంధర్!
యుగంధర్ : (ఆఫీసులో ఏదో పనిలో ఉండి, మొబైల్ స్క్రీన్‍పై చూడకుండా) ఎవరండీ?
లీలాకృష్ణ : ఏంట్రా…. వెటకారమా! నా గొంతు గుర్తుపట్టలేదా? స్క్రీన్‍పై నా పేరు కనిపించలేదా?
యుగంధర్ : అరెరే! సారీరా! ఏదో పనిలో వుండి…. (నసిగాడు)
లీలాకృష్ణ : సర్లేగాని… ఈ రోజు రాత్రి ఏడుగంటలకు హోటల్ తాజ్ దగ్గరికి రా! దామోదర్ కూడా వస్తున్నాడు… ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం….!
యుగంధర్ : ఎట్టెట్టా! అయితే నువ్విప్పుడు హైదరాబాద్‍లో ప్రత్యక్షమయ్యావా?!
లీలాకృష్ణ : ఇవాళ తెల్లవారుఝామునే వచ్చాన్లేరా! నువ్వు నీ ఆశ్చర్యాన్ని కాస్త పక్కనబెట్టి, పని తెముల్చుకుని, ఏడుగంటలకల్లా అక్కడికి రా! వస్తావుగా!!
యుగంధర్ : భలేవాడివిరా! నువ్వు రమ్మంటే రాకపోవడమా! నువ్వు చెప్పిన టైంకి పావుగంట ముందే అక్కడ వుంటాన్లే!
లీలాకృష్ణ : వెరీగుడ్…. కలుద్దాం మరి!
(ఫోన్ కట్ చేశాడు)
***
హోటల్ తాజ్‍లో… సమయం రాత్రి ఏడుగంటలు… ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు…. ఆలింగనాలు… ఆ తరువాత కుశలప్రశ్నలు… ఆనందాల వెల్లువలో తేలియాడుతూ… రిజర్వ్ చేయబడిన టేబుల్ చుట్టూ ఆసీనులవుతారు…
***
లీలాకృష్ణ : మరేటి! మొదలెడదామా!
దామోదర్/యుగంధర్ : యా! ష్యూర్!!
(అప్పుడే ఆర్డర్ తీసుకోడానికి వచ్చి నిల్చున్నాడు బేరర్)
లీలాకృష్ణ : నాకు రెడ్ వైన్! మీక్కావల్సింది మీరు చెప్పండి!
[మద్యపానం ఆరోగ్యానికి హానికరం!]
దామోదర్ : అబ్బ! నువ్ అమెరికా వెళ్ళినా ఏం మార్లేదురా!
యుగంధర్ : సరే! ఇవ్వాల్టికి మేమిద్దరం కూడా నీ తోటే! ఏమంటావ్ దామోదర్!
దామోదర్ : అలాగే… నో ప్రాబ్లమ్!
లీలాకృష్ణ : సరే! (బేరర్ వైపు చూసి) ముగ్గురికీ రెడ్ వైన్…. తరువాత, వెజ్, నాన్‍వెజ్ స్నాక్స్… వేడివేడిగా పట్టుకొచ్చేయ్!
(బేరర్ వెళ్తాడు)
దామోదర్ : అవున్రా లీలాకృష్ణ! ఇప్పుడు నీ రాకకు ఏమైనా ప్రత్యేకమైన కారణం వుందా?
యుగంధర్ : పప్పన్నం పెట్టిస్తాడేమోరా!!
లీలాకృష్ణ : పప్పన్నమా!…. పప్పన్నమేంట్రా?
దామోదర్ : అదేరా… పెండ్లి భోజనం!!
లీలాకృష్ణ : (మౌనంగా వుంటాడు)
యుగంధర్ : ఏంట్రా! పెండ్లంటే అంత సిగ్గా!!!
దామోదర్ : మరి ఎప్పుడ్రా ఆ శుభదినం?
లీలాకృష్ణ : హే! ఆపండ్రా మీ పెండ్లిగోల!! మీరూ!!! (సీరియస్‍గా అరుస్తాడు)
(ఊహించని ఆ పరిణామానికి సైలెంట్ అయిపోతారు యుగంధర్, దామోదర్)
(బేరర్ డ్రింక్స్, స్నాక్స్ సర్వ్ చేస్తాడు)
లీలాకృష్ణ : ఆ బేరర్! గ్రీన్ సలాడ్! బాయిల్డ్ పల్లీలు! అవి కూడా తెచ్చిపెట్టు!
(బేరర్ వెళ్ళిపోతాడు)
లీలాకృష్ణ : (తన గ్లాసు చేతికి తీసుకుంటూ) చూస్తారేంట్రా? మొదలెట్టండి!
(యుగంధర్, దామోదర్ బిక్కమొహాలు పైకెత్తి చూస్తారు… విషయం గ్రహిస్తాడు లీలాకృష్ణ)
లీలాకృష్ణ : సారీరా! నేనలా అని వుండాల్సింది కాదు! టేకిట్ ఈజీ ప్లీజ్!
(కాస్త తేరుకున్న యుగంధర్, దామోదర్ తమ గ్లాసులను చేతుల్లోకి తీసుకుంటారు)
లీలాకృష్ణ : ఛీర్స్!
యుగంధర్ : ఛీర్స్!
దామోదర్ : ఛీర్స్!
[మద్యపానం ఆరోగ్యానికి హానికరం!]
(అప్పుడే బేరర్ గ్రీన్ సలాడ్, బాయిల్డ్ పల్లీలు టేబిల్ పై పెట్టి వెళ్తాడు)
(ముగ్గురూ స్నాక్స్ తింటూ డ్రింక్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.)
లీలాకృష్ణ : ఆ! ఇక మాట్లాడుకుందామా?
యుగంధర్: ఆ…ఆ!! ఏంట్రా అమెరికా సంగతులు?
దామోదర్ : అంతా ఎంజాయ్‌మెంటేనా?
లీలాకృష్ణ : ఏడిశార్లే! పనిభారంతో సతమతమవుతూ తట్టుకోలేక, కొద్దిరోజులు ఇక్కడ రెస్టు తీసుకుందామని వచ్చాను! అంతే! నా సంగతి సరేలే…. మీ సంగతులేంటి? పెండ్లి కూడా చేసుకున్నారు కదా! ఆ!! ఎలా వుంది మీ మ్యా..రీ…డ్… లైఫ్? ఆ… ఎలా వుంటుంది… అల్లల్లాడిపోతుంటారు… ఆ…ఆ!! ఎందుకు చేసుకున్నామా… ఈ పెండ్లి!!?? అని తలలు బాదుకుంటున్నారా? నరకం అనుభవిస్తున్నారా??
యుగంధర్ : ఏంట్రా…. నీ మాటలు చాలా వింతగా వున్నాయ్!!
దామోదర్ : మా విషయంలో నువ్వెందుకలా ఆలోచిస్తున్నావో మాకైతే అర్థం కావడంలేదు! మేమైతే చాలా హ్యాపీగా వున్నాము!!
లీలాకృష్ణ : ఆపండ్రా… మీ వేషాలు! నేనేమనుకోన్లే… నిజం చెప్పండి…. అప్పుడు పెండ్లి చేసుకున్నందుకు… ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు కదూ!
యుగంధర్ : నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటిరా? నిజంగా… మేం హ్యాపీగా వున్నాం!!
దామోదర్ : అసలు మేం హ్యాపీగా లేమని నీకెందుకనిపిస్తుందిరా?
లీలాకృష్ణ : మీరేకాదు… పెండ్లి చేసుకున్నవారెవరు హ్యాపీగా వుండలేరు! ఎందుకంటే ఆ పెండ్లితోనే హ్యాపీనెస్ అనేది… అంతర్ధానం అవుతుంది! అయినా… ఏముందిరా? ఈ వివాహజీవితంలో!
అనుమానాలు…. అవమానాలు!
అపోహలు… అపార్థాలు!
ఏడుపులు… పెడుబొబ్బలు!
పోట్లాటలు… తగాదాలు!
నిరాశా… నిస్పృహ!
ఆందోళన… అలజడి!
అసంతృప్తి…. అశాంతి!
చెప్పండ్రా… ఇవి కాక ఇంకేమైనా ఉంటాయా?
యుగంధర్ : అదేంట్రా… వివాహ జీవితం గురించి నీకు అంత ఘోరమైన అభిప్రాయాలు ఎలా ఏర్పడ్డాయిరా?
దామోదర్ : అందుకేనన్నమాట! నీ స్నేహితులమైన మేమిద్దరం పెండ్లిళ్ళు చేసుకున్నా, నువ్వింకా పెండ్లి చేసుకోలేదు!!…. పైగా పెండ్లి మాటెత్తితేనే కస్సుమంటున్నావు!!
యుగంధర్ : అవున్రా… పెండ్లి చేసుకుంటే అలా ఉంటుందని నీకెవరు చెప్పార్రా??
దామోదర్ : పోనీ… పెండ్లి చేసుకుని అలా బాధలు పడేవారిని నువ్వెక్కడన్నా చూశావా??
లీలాకృష్ణ : నాకెవరూ చెప్పనక్కర్లేదు…. నేనెక్కడా చూడనక్కర్లేదు!! నాకంతా తెలుసు!
యుగంధర్ : నీకంతా తెలుసా!!
దామోదర్ : అదెలా???
లీలాకృష్ణ : తెలుసుకోడానికి మా ఇల్లే చాలు!! మా అమ్మానాన్నల వివాహ జీవితమే ఓ మంచి ఉదాహరణ!
(కొంచెం బాధపడుతూ, తలవంచుకుంటాడు)
యుగంధర్/దామోదర్ : మాకేం అర్థం కావట్లేదురా!!
లీలాకృష్ణ : (నిర్లిప్తంగా) నా చిన్నతనం నుండి మా ఇంట్లో… మా అమ్మానాన్నలను చూస్తున్నాను…! హు… వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం, సఖ్యతగా ఉండడం, కలిసి బయటకెళ్ళడం, నేనెప్పుడూ చూడలేదు!
యుగంధర్ : అంటే… వాళ్ళిద్దరూ… అసలు మాట్లాడుకోరా?
లీలాకృష్ణ : ఆ….ఆ….! మాట్లాడుకుంటారు…. ఎందుకు మాట్లాడుకోరు… తగాదాడుకునేటప్పుడు, పోట్లాడుకునేప్పుడు చాలా గట్టిగా మాట్లాడుకుంటారు!!
దామోదర్ : అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందిరా!
లీలాకృష్ణ : ఎలా వుంటుంది… భయంతో వణకిపోతాను. ఏం జరుగుతుందో అని ఊహించుకుంటూ…!!
యుగంధర్ : వింటుంటే చాలా బాధనిపిస్తుందిరా!
దామోదర్ : ఇప్పటికీ అంతేనా?
లీలాకృష్ణ : అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ… అంతే!!
(శూన్యంలోకి చూస్తాడు)
దామోదర్ : బంధువుల ఇళ్ళకైనా కలిసి వెళ్తారా?
లీలాకృష్ణ : లేదు…. వాళ్ళు మా బంధువుల ఇళ్ళకు వెళ్ళడం గాని, బందువులెవరూ మా ఇళ్ళకు రావడంగాని ఎప్పుడూ జరుగలేదు!
యుగంధర్ : అదెలారా?
లీలాకృష్ణ : నాన్న తరపు బంధువుల విషయంలో మా అమ్మ ఒప్పుకోదు!… అమ్మ తరపు బంధువుల విషయంలో మా నాన్న ఒప్పుకోడు!
దామోదర్ : పోనీ…. నిన్నైనా మీ బంధువుల ఇళ్ళకు పంపేవారా?
లీలాకృష్ణ : లేదు! నాకు వెళ్ళాలనే వుంటుంది! కాని, మా నాన్న తరపు బంధువుల ఇంటికి వెళ్తానంటే మా అమ్మ అడ్డుచెప్తుంది! మా అమ్మ తరపు బంధువుల ఇంటికి వెళ్తానంటే మా నాన్న మోకాలడ్డుతాడు!
యుగంధర్ : అద్సరే… నువ్వింతవరకు పెండ్లి చేసుకుని సంతోషంగా గడిపే భార్యాభర్తలని ఎక్కడా చూడలేదన్నమాట!
లీలాకృష్ణ : చూడలేదు!… అయినా అలా సంతోషంగా జీవించే భార్యాభర్తలు… వుంటేనే కదా… చూడ్దానికి!!
దామోదర్ : ఇప్పుడు అసలు విషయానికి వద్దామా! పెండ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు మీ అమ్మా, నాన్నల జీవితంలాగా వుంటుందని నీ విశ్వాసం! అవునా?
లీలాకృష్ణ : అవును… అంతేగా!!
యుగంధర్ : అందుకే నువ్ పెండ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నావా?
లీలాకృష్ణ : అవును మరి!…. అబ్బ… ఈ పెండ్లి టాపిక్ వదిలేయండ్రా బాబూ! ఇంకేమైనా మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు కదరా?
(యుగంధర్, దామోదర్ ఒకరి మొఖలు ఒకరు చూసుకుంటున్నారు)
యుగంధర్ : ఇక డిన్నర్ ఆర్డర్ చేద్దామా?
దామోదర్ : ఆ! మెనూలో చూసి మెయిన్ కోర్సు ఆర్డర్ చేద్దాం!
లీలాకృష్ణ : ఇప్పుడే ఏంట్రా…. ఇప్పుడు టైం ఎనిమిది అయింది. ఎనిమిదిన్నరకు ఆర్డర్ చేద్దాం! పదిగంటలకు ఇళ్ళకు చేరుకుందాం! ఓకేనా?
యుగంధర్/దామోదర్ : ఓకే… ఓకే…. (ఒకేసారి కలిసి చెప్తారు)
(డిన్నర్ పూర్తి చేసుకుని రాత్రి పదిగంటలకు ఎవరిళ్ళకు వారు చేరుకుంటారు)
***
(మరుసటిరోజు సాయంత్రం ఆఫీసు పని ముగించుకుని దామోదర్, సరాసరి యుగంధర్ ఆఫీసుకుని వస్తాడు)
యుగంధర్ : (దామోదర్‍ని చూసి) : ఏంట్రా ఏంటి? కనీసం ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చావేంటి?
దామోదర్ : ఏం లేదురా…. నీతో ఓ విషయం గురించి మాట్లాడదామని వచ్చాన్రా… అలా బయటికెళ్ళి పార్కులో కాసేపు ప్రశాంతంగా కూర్చుందామా?
యుగంధర్ : సరే! ఒక్క పదినిమిషాలు ఇక్కడే వెయిట్ చెయ్యి! ఓ ముఖ్యమైన విషయం మా సేల్స్ హెడ్‍కి చెప్పి వస్తాను! తరువాత బయటికెళ్దాం!
దామోదర్ : సరే! త్వరగా రా!
యుగంధర్ : చెప్పానుగా! పదే పది నిమిషాల్లో వస్తా! (క్యాబిన్ బయటికెళ్తాడు)
***
(దామోదర్, యుగంధర్… పార్కులో ఒక మూలగా వున్న బెంచీపై కూర్చుని, వచ్చేపోయే సందర్శకులను, ఆటపాటలతో సరదాగా గడిపే పిల్లలను, వాళ్ళ తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు)
యుగంధర్ : ఏంట్రా…. ఏదో మాట్లాడాలన్నావ్!
దామోదర్ : ఏంలేదురా… నువ్వూ, నేనూ, లీలాకృష్ణ, మన ముగ్గురం, చిన్నతనం నుండి మంచి స్నేహితులం కదా!
యుగంధర్ : అవును… అందులో డౌటేముంది?
దామోదర్ : కాని ఒక విషయం తలుచుకుంటే బాధనిపిస్తుందిరా!!
యుగంధర్ : ఎందుకురా?
దామోదర్ : మనిద్దరం పెండ్లి చేసుకుని హాయిగా వుంటున్నాము…. పాపం… లీలాకృష్ణ మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా, బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నాడు!
యుగంధర్ : నిజమే…. అనుకో! కాని వాడికి పెండ్లిమీద ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది కదా! అందుకే పెండ్లి చేసుకునేందుకు విముఖత చూపిస్తున్నాడు!
దామోదర్ : అలాగని… వాడ్ని అలాగే వదిలేద్దామా? ఆలోచించు… వాడు కూడా మనలాగా పెండ్లి చేసుకుంటే బాగుంటుంది కదరా!
యుగంధర్ : అందుకు మనమేం చేయగలం?
దామోదర్ : ఏదో ఒకటి చేయాల్రా! కాస్త సీరియస్‍గా ఆలోచిద్దాం!!
యుగంధర్ : సరే… వాడు పెండ్లి చేసుకోననడానికి అసలు కారణం ఏంటి?
దామోదర్ : ఏముంది… పెండ్లి చేసుకుంటే, భవిష్యత్తులో సంతోషం అనేదే వుండదని జీవితమంతా… వాళ్ళ అమ్మానాన్నల జీవితంలా నరకంలా వుంటుందని వాడి నిశ్చితాభిప్రాయం!!
యుగంధర్ : అవును…. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే, వాడు ఇంతవరకు, నిరాశా నిస్పృహల మధ్య కొట్టుముట్టాడుతున్న తన అమ్మానాన్నలను మాత్రమే చూశాడు కాని, పెండ్లి చేసుకుని, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవించేవాళ్ళని చూడలేదు!
దామోదర్ : అవును…. యు ఆర్ కరెక్ట్!! అయితే ఒక పని చేద్దాం! పెండ్లి చేసుకుని సుఖంగా జీవిస్తున్నవారిని గుర్తించి, వాళ్లని మన లీలాకృష్ణకు చూపిద్దాం! మరి అలాంటివారు మనకు తెలిసిన వాళ్ళలో ఎవరున్నారబ్బా! (అంటూ ముక్కుమీద వేలేసుకు ఆలోచించడం మొదలెడ్తాడు)
యుగంధర్ : అంటే… ఏంట్రా నువ్వనేది? ఏం… మనం పెండ్లి చేసుకుని హ్యాపీగా జీవించలేదనా!…. హు… ఎవరో ఎందుకురా… మనం లేమా?
దామోదర్ : నువ్ చెప్పింది నిజమేరా! అయినా… నేనేంటి…. పిచ్చోడిలా… పిల్లిని చంకన బెట్టుకుని ఊరంతా వెతుకుదామంటున్నానేంటి?
యుగంధర్ : మరింకేం… సరే! ఇప్పుడు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్… ఏంటంటే… వాడ్ని ఒక రెండ్రోజులు మీ ఇంట్లో ఉండమని నువ్వడుగు… ఆ తరువాత రెండురోజులు మా ఇంట్లో ఉండమని నేనడుగుతాను!
దామోదర్ : అప్పుడు వాడు… మన ఇళ్ళల్లో వున్నన్నిరోజులు, పెండ్లి చేసుకున్న మనం ఎంత సంతోషంగా వుంటున్నామో, భార్యాపిల్లలతో ఎంత అన్యోన్యంగా వుంటూ, ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఎంత హ్యాపీగా గడుపుతున్నామో కళ్ళారా చూస్తాడు!!
యుగంధర్ : యస్… “‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అంటారు కదా! అప్పుడు వాడి అభిప్రాయం తప్పక మార్చుకుంటాడు!!
దామోదర్ : పెండ్లికి ‘సై’ అంటాడు!!
యుగంధర్ : మరి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్… రేపే మొదలెడదాం… ఓకేనా?
దామోదర్ : ఓ… యస్… తప్పకుండా మొదలెడదాం!! (హైఫైలు చెప్పుకుని… పార్కునుండి ఇళ్ళకు బయలుదేరుతారు)
***
దామోదర్, యుగంధర్ వాళ్ళ ఇళ్ళలో నాలుగురోజుల పాటు వున్నప్పుడు, ఆ భార్యాభర్తల మధ్య వున్న ప్రేమానురాగాలను కళ్ళారా చూస్తాడు లీలాకృష్ణ. వాళ్ళ అన్యోన్య దాంపత్యాలను చూసి మిక్కిలిగా ఆశ్చర్యపోతాడు. పెండ్లిచేసుకున్నవాళ్ళు, ఇలా కూడా అత్యంత ఆనందంగా, సంతోషంగా ఉంటారని తెలుసుకుంటాడు లీలాకృష్ణ. ఐదోరోజు తన ఇంటికి తిరిగి వచ్చిన లీలాకృష్ణ… ఆలోచనల్లో… ఆ నాలుగురోజుల తీపిజ్ఞాపకాలే పరుగులు తీస్తున్నాయి. ఒకోసారి, తాను చూసింది నిజమేనా… అనే సంశయం వచ్చేది. అక్షరాలా నిజమేనని అంతలోనే అవగతమయ్యేది…
***
లీలాకృష్ణ : (తనలో) అయితే, ఇంతకాలం పెండ్లి చేసుకోవడంపై నాకున్న అభిప్రాయం తప్పా? అవును తప్పే! మా అమ్మానాన్నల వివాహ జీవితాన్ని అతి దగ్గరలో చూసి, ప్రతి ఇంట్లోనూ ఇలాగే ఉంటుందనుకోవడం… నా విషయపరిజ్ఞాన లోపమే!!! అంటే…. నేను మా ఇంట్లో తప్ప, వేరే వాళ్ళ ఇళ్ళల్లో భార్యాభర్తల వివాహ జీవన విధానం చూడకపోవడం, పెండ్లి గురించి నాలో బలంగా ఏర్పడిన ఒక క్లిష్టమైన వ్యతిరేక ధోరణికి కారణ భూతమయినది! ఏమైతేనేం… నా ప్రాణస్నేహితులు దామోదర్, యుగంధర్ నా కళ్ళు తెరిపించారు! పెండ్లి విషయంలో నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేశారు!! అందుకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి వాళ్ళిద్దరికీ ఈరోజు ఓ ట్రీట్ ఇస్తాను!
***
అనుకున్నట్లే, దామోదర్, యుగంధర్‍లను హోటల్‍కి ఆహ్వానించాడు లీలాకృష్ణ. రాత్రి ఏడు గంటలకు హోటల్‍లో ముగ్గురూ కలుసుకున్నారు. రెడ్ వైన్, గ్రీన్ సలాడ్, బాయిల్డ్ పల్లీలు, వేడి వేడి వెజ్, నాన్‍వెజ్ స్నాక్స్…. మాటామంతీ… అంతా సహజంగా జరుగుతుంటుంది.
[మద్యపానం ఆరోగ్యానికి హానికరం!]
లీలాకృష్ణ : దామోదర్…. యుగంధర్… మీరిద్దరూ నన్ను మీ ఇళ్లకు ఆహ్వానించి, వివాహ జీవితంలోని మధురానుభూతులను నా కళ్ళముందు ఆవిష్కరించారు! తద్వారా… పెండ్లి చేసుకున్నవారంతా… నానా కష్టాలు పడుతుంటారనే… నాలో వ్రేళ్ళూనుకొని ఉన్న దురభిప్రాయాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేశారు!
తత్ఫలితంగా నా ఆలోచనా విధానంలో సమూలమైన మార్పు వచ్చింది! ఇప్పుడు నాలో… పెండ్లి చేసుకుని… మీలాగే సంతోషమైన జీవితాన్ని గడపాలనే కోరికకు అంకురార్పణ జరిగింది!!
ఈ విషయంలో మీరిద్దరూ నాకు చేసిన మేలును నా జన్మలో మరిచిపోలేను! అందుకు మీకు నా కృతజ్ఞతలు!!
దామోదర్ : లీలాకృష్ణ… మనలో మనకేంటిరా కృతజ్ఞతలు! నువ్వు కూడా మాలాగే పెండ్లి చేసుకుందామనుకుంటున్నావ్! మాకదే సంతోషంరా!!
యుగంధర్ : మొత్తానికి… నేను, దామోదర్ అనుకున్నదే… అనుకున్నట్లే… జరిగింది! నువ్వు కూడా ఓ ఇంటివాడవు కాబోతున్నందుకు చాలా ఆనందంగా వుందిరా!!
దామోదర్ : మరి… పప్పన్నం ఎప్పుడ్రా?!
లీలాకృష్ణ : ఆరునెలల్లోపే… ఇండియాలోనే… మీ అందరి సమక్షంలోనే నా పెండ్లి జరుగుతుంది లేరా!!
దామోదర్/యుగంధర్ : శుభం!!!
(డిన్నర్ ముగించుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు లీలాకృష్ణ, దామోదర్, యుగంధర్‍లు)
సమాప్తం