[dropcap]ఆ[/dropcap] రోజు మధు ఆఫీసులో మొబైల్ చూస్తున్నాడు. అంతలోనే వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. తన స్నేహితుడు పిల్లబాబు, ‘స్నేహితులు’ అనే వాట్సప్ గ్రూపులో ఓ సందేశం పెట్టాడు. అందులో, “నేను ఈ రోజు భలే ఖుషీగా ఉన్నాను. కారణం, ‘సేవచేస్తా డాట్ కామ్’ అనే సంస్థకి పది వేలు విరాళం పంపాను. ఈ సంస్థ, ప్రతి వారం పేదలకి అన్నదానం చేస్తుంది. పెద్ద వాళ్ళకి చేతి కర్రలూ, పిల్లలకి పెన్సిళ్లూ కొనిస్తుంది. వృద్ధాశ్రమాలకి పళ్ళు, కాయలు పంచుతుంది. మనుషులనే కాదు, జంతువులని కూడా పట్టించుకుంటుంది. వీధి కుక్కలకి కూడు పెట్టి వాటి ఆకలి తీరుస్తుంది. తప్పిపోయిన ఆవుల్ని చేరదీసి గడ్డి పెట్టి పోషిస్తుంది. అలాంటి ఈ సంస్థకి నేను ఈ మాత్రం విరాళం ఇవ్వడం ఎంతో గర్వంగా ఉంది. ఇవాళ పిచ్చి సంతృప్తిగా ఉంది నాకు. నా శరీరం నలు మూలల నుండీ ఏదో తెలియని ఆనందం కలుగుతోంది” అని వ్రాసిన ఆ మెసేజ్ చదివాడు మధు.
ఆ మెసేజ్ రాగానే, ఆ గ్రూప్ సభ్యులు అందరూ, పొలోమని, నువ్ సూపర్ మామా అని ఒకడూ, నీ పేరు పిల్ల బాబు, మనసులో నువు పెద్దబాబు, ఈస్ట్ ఆర్ వెస్ట్ పిల్లబాబు ఈస్ బెస్ట్, మనిషి మంచోడు, గుణం మల్లెపువ్వు అని ఇంకొకడూ, మంచి పని చేశావ్ అని ఒక స్నేహితురాలూ, నువ్ సమాజం పట్ల ఇంత బాధ్యతగా ఉండటం చూస్తుంటే, ఆనందంతో నా గుండె బోండాలా పొంగిపోతోంది. నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే, వర్షాలు పడినా కరెంట్ పోవట్లేదు అంటూ మరో స్నేహితురాలూ ఒకరి వెంట ఒకరు చక చకా అభినందనలతో ముంచెత్తారు.
దాంతో పిల్లబాబు, మైదా పూరీలా పొంగిపోయాడు. అసలే గొప్పలంటే పడి చచ్చిపోతాడు. అలాంటిది ఇన్ని పొగడ్తలు వస్తే బూమ్మీద నిలబడతాడా? అందుకే ఇక అప్పటి నుండీ ఆ ‘సేవచేస్తా డాట్ కామ్’ సంస్థకి డబ్బులు పంపడం, ఆ పంపిన స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టడం. మిగతా స్నేహితులంతా వహ్ వా, వహ్ వా దాన వీర శూర కర్ణా అంటూ పొగిడేయడం. అవి చూసి పిల్లబాబు మైదా పూరీలా పొంగిపోవడం జరిగేది. ఇతన్ని చూసి, మరికొందరు కూడా ఆ సంస్థకి విరాళాలు విచ్చలవిడిగా పంపారు. మధు కూడా కొంత విరాళం ఇస్తే బావుంటుందని అనుకున్నాడు. అయితే, ఓ పది వేలు ఇస్తే, పదిమందికి గొప్పగా చెప్పుకోవడానికీ, ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పెట్టుకోవడానికీ కాస్త బావుంటుంది అని ఆలోచించాడు. వెంటనే, ఆ నెంబర్‌కి ఆన్లైన్‌లో డబ్బు పంపించేశాడు. ఇలా పంపీ పంపగానే, ఆ ‘సేవచేస్తా డాట్ కామ్’ నుండి ఓ సందేశం వచ్చింది. దాంతో పాటు ఓ ఫోటో కూడా రావడం జరిగింది. మధు చాలా ఆసక్తిగా ఆ ఫోటో చూశాడు. ఓ ఆయుదుగురు కుర్రాళ్ళు, ‘సేవాచేస్తా డాట్ కామ్’ అనే టీ షర్ట్ లు వేసుకుని ఓ అన్నదాన కార్యక్రమంలో ఉన్నారు. ఆ ఫోటో చూసిన తరువాత, దాని కింద సందేశం కూడా చూశాడు, “సార్ మీరు మాకు విరాళం పంపడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇలానే చాలా అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాం. ఈరోజు మా గ్రామ రామాలయంలో అన్నదానం చేస్తున్నాం. మీరు కూడా చూడాలని ఇలా ఫోటోలు తీసి పంపుతున్నాము. మీరు మాకు ఇలానే విరాళాలు ఇస్తూ ఉంటే, మేము ఇలానే చక్కగా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీకు తెలిసిన వారికి ఈ మెసేజ్ పంపండి” అని రాసి ఉంది. కొద్దిరోజుల తర్వాత తన భార్య పుట్టిన రోజు రాబోతోంది. ఆ రోజు తన శ్రీమతి పేరు మీద కూడా ఓ పది వేలు ఈ ‘సేవచేస్తా డాట్ కామ్’కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, డబ్బుకి సంబందించిన ఏ విషయం చెప్పినా, “ఇది ఎందుకు ఇలా చేశారు. చేసే ముందు నాకు ఓ మారు చెప్పాలనిపించలేదా? ఇలాంటి పనికి మాలిన పనులన్నీ మీరే ఎలా చేయగలుగుతున్నారు. అయినా మీరు పనికి వచ్చే పనులు చేయడం మీకు ఇక ఈ జన్మకి రాదని నా నమ్మకం” అంటూ అతన్ని తిట్టి పోస్తుంది.
అందుకే మధు, పరిణామాలు అన్నీ ఓ క్షణం ఆలోచించి, ‘అబ్బే, ఈ సేవ కార్యక్రమం గురించి చెబితే మాత్రం అలా అనదు. తప్పక మెచ్చుకుంటుంది. ఆమె పుట్టిన రోజుకి తన పేరు మీద అన్నదానం చేయడానికి ఈ డబ్బు ఇచ్చానని చెబితే, సంబర పడిపోతుంది. కనుక చెప్పా పెట్టకుండా ఓ పది వేలు విరాళం ఇస్తాను. వారు పంపే ఆ స్క్రీన్ షాట్, ఆ అన్నదానం ఫోటోలు చూసి ఎగిరి గంతేస్తుంది. నన్ను పొగడ్తలతో ముంచేస్తుంది. ఇంత మంచి పని తన పుట్టిన రోజున చేసినందుకు మురిసి ముద్దైపోతుంది. ఆ తరువాత నన్ను వాటేసుకుని…’ అని ఏవేవో ఊహించుకుని, మెలికలు తిరిగిపోయాడు.
ఇంతలో ఆమె, “ఏవండీ నేను గుడికి వెళ్లి వస్తాను” అని చెప్పింది.
“సరే వచ్చాక నీకో బ్రహ్మాండమైన సర్ప్రైస్ ఉంది” చెప్పాడు ఉత్సాహంగా.
“సరే” అంటూ ఆమె హడావుడిగా గుడికి వెళ్ళిపోయింది.
“వచ్చాక చూపిద్దాం” అని పది వేలు ఆ ‘సేవచేస్తా డాట్ కామ్’ నెంబర్‌కి ఫోన్ ద్వారా పంపేశాడు. సరే తన భార్య లలిత, గుడి నుండి వచ్చే లోపు టీ.వి చూద్దాం అని టీవీ ఆన్ చేసి, వార్తలు చూస్తున్నాడు. ఇంతలో ఏదో కొంప బద్దలైనట్టు, లైవ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ వేసి, వేసి కొంత సేపు ఊరించిన తరువాత, కొందరు యువకులని చూపిస్తూ. “ఈ ముఠా, సేవ చేస్తా అనే సంస్థతో కొద్ది వారాలుగా సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరిస్తున్నది. రామాలయం, శివాలయం, అమ్మవారి గుడి దగ్గర జరిగే అన్నదాన కార్యక్రమాలకి ఒకే రకమైన టీ షర్ట్‌లు వేసుకుని వచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని ఫోటోలు దిగుతారు. ఆ తరువాత, ఆ అన్నదాన కార్యక్రమం వారే చేశారని, వేరే ఊళ్ళల్లో ఉంటున్న వారికి ఆ ఫోటోలు పంపుతారు. ఇలానే అన్నీ మోసపూరితంగా చేయనివి చేసినట్టు సృష్టించి ఆన్లైన్‌లో డబ్బులు వేయమని నమ్మబలుకుతారు. ఓ వ్యక్తి వీరి సంస్థపై అనుమానంతో ఫిర్యాదు ఇవ్వడంతో ఇలా పట్టుబడ్డారని పోలీసులు వివరించారు”. కథనం ముగిసింది.
అప్పుడే వచ్చి ఆ వార్త చూసిన లలిత, “అయ్యో ఎంత దారుణవండీ? అందుకే అన్నారు, తే-మీ మానుష రాక్షసాః, పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే అని. అంటే, ఎవరు తమ ప్రయోజనాల కొరకు ఇతరులకు నష్టం కలిగిస్తారో వారు మానవ రూపంలో ఉన్న రాక్షసులని. అయినా ఇలాంటి వాళ్ళని సోషల్ మీడియాలో గుడ్డిగా నమ్మి, వీళ్ళకి విరాళాలు ఇచ్చే వారిని అనాలి” అంది లలిత అసహనంగా. ఆమె మాటలతో ఉలిక్కిపడి, తరువాత కొద్దిసేపటికి తేరుకుని, తత్తర బిత్తరగా చూస్తూ ఔను అన్నట్టు చెక్కబొమ్మలా తలూపాడు.
ఆమె లోనికి వెళ్ళ బోతూ, “ఏవండీ ఇందాక మీరు నాకు ఏదో సర్ప్రైస్ ఇస్తాను అన్నారు. ఇవ్వండి. అసలే ఈరోజు నా పుట్టిన రోజు కూడానూ” అడిగింది లలిత గోముగా.
“ఇస్తాను” అని ఆమెతో అనేసి, పదివేలు పంపమని అతని స్నేహితుడికి సందేశం పెట్టాడు.
ఆ తరువాత ఆ స్నేహితుడు పంపిన డబ్బులు ఆమె అకౌంట్‌కి పంపుతూ, ఆమెకి నచ్చిన చీర కొనుక్కోమని వ్రాశాడు. ఆమె ఎగిరి గంతేసి మరీ సంతోష పడింది.
తరువాత, ఈ సంస్థకి డబ్బులు పంపండీ, అదీ, ఇదీ అని సందేశాలు పెట్టిన పిల్ల బాబుకి ఫోన్ చేశాడు. నో ఆన్సర్ వచ్చింది. గ్రూప్‌లో పిల్లబాబుని కడిగేయాలి అని పళ్ళు పట పటా కోరుకుతూ వాట్సప్ ఓపెన్ చేశాడు. అప్పటికే ఆ సమూహ సభ్యులు అతన్ని ఓ రకంగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ‘అందుకే అన్నమాట, వీడు నా ఫోను లిఫ్ట్ చేయలేదు’ అని ఓ క్షణం మనసులో అనుకుని, ‘విరాళాలు ఇవ్వాలనే విశాల హృదయం మంచిదే, కానీ ఏది సరైనది, ఏది కాదు అని తెలుసుకోకుండా విరాళాలు ఇస్తే, ఇలానే ఉంటుంది మరి’ అనుకున్నాడు అసహనంగా ముఖం చిట్లిస్తూ.