~
[dropcap]శీ[/dropcap]తలరాత్రుల విడిదితో
అలరించిన మంచుబిందువుల
బంధువులకు ఇక వీడ్కోలు-
తలలెత్తే కొత్త వూహలకు మాత్రమే స్వాగతం
చేదును తీపి చేసుకొమ్మనే
వగరు వెన్నెలల పరిమళపు జల్లులు-
చిన్ని నవ్వుల జలతారులతో
వేపరెమ్మల పెనవేత
పలుకు పలుకునా మధురిమను
నింపమని నిలువెత్తు రగడలు-
చెరకు తోటల తీపిగలగల
కొమ్మ కొమ్మనా
తీపి పులుపుల రసాస్వాదనకు
వేలకొలది తాయిలాలు –
కన్నుగీటుతూ మామిడి కొమ్మల
ముసిముసి సంబరాలు
తొలి ఉదయపు
కొత్త తోరణపు మత్తైన అత్తరులు-
మల్లెలతోట మనసైన గుబాళింపు
కొత్త ఆశల కోలాహలానికి
రాతిరివర్ణపు పక్షుల రంగుల కచేరీ-
కవ్వింపచేసే కోయిలల సరిగమల ఆట
మరొక మంచి యుగారంభానికి
మనుషుల గుండెల్లో చిరు ఆశ-
మురిపిస్తూ చిగురిస్తున్న ఉగాది సిరి