[dropcap]రా[/dropcap]త్రి సంభాషణల పేజీల్లోంచి
గాలి మెల్లిగా చిగుర్లు వేస్తోంది
కొద్ది సేపట్లో తెల్లారుతుంది
ఆనంద కవితను నువ్వు కోరిన జ్ఞాపకం
గొంతులో దిగబడిన ముల్లయింది!
ఒంటరి దుఃఖాన్ని కొంతయినా తుడిచేసే శక్తి
కవిత్వ పంక్తులకే ఉంటుంది.
పిచ్చి బొమ్మల్ని చిత్రలేఖనాలుగా ఊహిస్తూ
వాటిని ఇంకా ఇంకా తీర్చిదిద్దుకుంటూ
కంప్యూటర్‍లో భద్రపరుచుకునే నా బిడ్డ
తీగలు మంటల్లో కాలిన వీణలా కన్పిస్తున్నాడు
తనని తాను మాయ చేసుకుంటున్నాదు
ఇప్పుడింక కలంతో ఏం రాయను?
అగ్గిపుల్లతో ఆరని జ్వాల రగిలిస్తాను
నిప్పు గడ్డ కట్టినట్లుగా
తూర్పు ఆకాశం ఎర్రబడింది చూడు
సూర్యుడు మరింత ఎఱ్ఱ ఎఱ్ఱగా
కొబ్బరాకు సందుల్లోంచి
అల్లల్లాడే గాలిపటం కోసం
గాలికి ఎదురు నిల్చి పరిగెత్తే కుర్రాడిలా…
నా కళ్ళ ముందే
రాత్రింబవళ్ళు రగుల్తున్నాయి
ఊపిరాడకుండా పరిగెత్తుతున్నాయి.