దధీచి

0
5

[dropcap]ద[/dropcap]ధీచి హిందూ పురాణాలలో ప్రసిద్ధిచెందిన త్యాగమూర్తి. శివ భక్తుడు. దధీచి భార్గవ వంశంలో సుకన్య, చ్యవన మహర్షుల పుత్రుడు (దధీచి, కర్దమ ప్రజాపతి పుత్రికయైన శాంతి కుమారుడని కొందరంటారు). దధీచి చిన్నతనము నుండి సరస్వతి నది దగ్గర ఆశ్రమము ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అయన తపశ్శక్తి వల్ల వచ్చిన తేజస్సును చూసి సరస్వతి నది ఆనందపడుతూ ఉండేది. కానీ అతని తపస్సుకు భయపడి ఇంద్రుడు తపస్సును విఘ్నము చేయటానికి ఆలంబుస అనే అప్సరసను పంపుతాడు. వీరిద్దరికి పుట్టిన వాడే సారస్వతుడు. అతనిని సరస్వతి పెంచింది. ఆతను కూడా మంచి తపస్సంపన్నుడు.

సుకన్య శర్యాతి మహారాజు పుత్రిక. ఒకనాడు ఆమె తండ్రితో క్రీడార్ధం అడవులకు వెళ్ళింది. అక్కడ చ్యవన మహర్షి తపోనిష్ఠలో వున్నాడు. శరీరమంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహాతేజస్సుతో వెలుగుతున్నాయి. సుకన్య వానిని మిణుగురులని భావించి పుల్లతో పొడవగా అతని కండ్లు పోయాయి. జరిగిన అపచారం తెలుసుకుని శర్యాతి చ్యవనుని క్షమాభిక్ష కోరాడు. చ్యవన మహర్షి సుకన్యనిచ్చి తనకు వివాహం చేస్తే దోషం పరిహరమౌతుందంటాడు. శర్యాతి బాధపడినా, విజ్ఞురాలైన సుకన్య వివాహానికి అంగీకరించింది. పరమ సౌందర్యరాశియైన సుకన్య అంధుడైన చ్యవన మహర్షికి సహధర్మచారిణిగా భక్తిశ్రద్ధలతో జన్మను సార్ధకం చేసుకుంటున్నది.

ఇంద్రుడు అయాచితంగా అతని దగ్గరికి వచ్చి అనేక మహా అస్త్రాలను, బ్రహ్మవిద్యను దధీచికి నేర్పాడు. అయితే వీటిని దధీచి మరెవ్వరికీ నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దధీచి శిరస్సును ఖండిస్తానని స్పష్టం చేశాడు. అశ్వినీ దేవతలు దధీచిని ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందిగా కోరారు. దధీచి అందుకు అంగీకరించాడు. అయితే ఇంద్రుడు విధించిన నిబంధనను వారికి తెలియజేశాడు. శస్త్రవిద్యా నిపుణులైన దేవవైద్యులు చతురులు. వారు దధీచి తలను స్వయంగా ఖండించి, ఆ స్థానంలో ఒక అశ్వం శిరస్సును ఉంచి, తద్వారా మహాశాస్త్రాలను అధ్యయనం చేశారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దధీచి అశ్వ శిరస్సును ఖండించాడు. వెంటనే అశ్వనీ దేవతలు తాము భద్రపరిచిన దధీచి నిజ శిరస్సును తిరిగి స్వస్థానంలో అతికించారు

ఒకసారి దధీచి తన బాల్య స్నేహితుడైన క్షువుడు అనే రాజును చూడటానికి వెళతాడు. ఇద్దరు మాటల సందర్భములో దధీచి బ్రాహ్మణుడు గొప్ప అని, క్షువుడు రాజు గొప్ప అని వాదించుకుంటారు. ఈ వాదనలో కోపము వచ్చిన దధీచి క్షువుడిని పొడుస్తాడు. క్షువుడు కూడా ఆగ్రహముతో దధీచిని ముక్కలుగా నరికి వేస్తాడు.

అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆ ముక్కలను అతికించి దధీచిని బ్రతికించి శివుడి కోసము తపస్సు చేయమని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. దధీచి శివుడి కోసము ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ధధీచికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే వరము ఇస్తాడు. అంతేకాకుండా వజ్రముతో సమానమైన శరీరాన్ని, ముల్లోకాలను జయించగలిగే శక్తిని కూడా ఇస్తాడు. వరాలు పొందిన దధీచి క్షువుడి దగ్గరకు వెళ్లి అతనిని కాలితో తన్ని,”నీవే కాదు నీవు కొలిచే విష్ణువు కూడా నన్నేమి చేయలేడు” అని చెప్పి వస్తాడు. తనకు జరిగిన అవమానాన్ని విష్ణువుకు క్షువుడు వివరించగా ,విష్ణువు, “దధీచి మహా తపస్వి. అతనిని మనము ఏమి చేయలేము. నీవు దధీచిని క్షమాపణ అడుగు” అని సలహా ఇస్తాడు. ఆ సలహా మేరకు క్షువుడు దధీచిని క్షమాపణ అడుగుతాడు. బ్రాహ్మణుడి కోపము నీటి మీద రాత లాంటిది, కాబట్టి దధీచి క్షువుడిని క్షమిస్తాడు. ఆ విధముగా ఇద్దరి కథ సుఖాంతము అవుతుంది.

దక్షుడు తాను చేస్తున్న యజ్ఞానికి దధీచిని అతని శిష్యులను ఆహ్వానిస్తాడు. కానీ దక్షుడు దధీచితో, “నేను శివుడిని పిలవలేదు శివభక్తుడివైన నీకు ఇష్టము లేకపోతే నీవు వెళ్లిపోవచ్చు” అని అంటాడు. ఈ మాటలు విన్న దధీచి ఆగ్రహముతో దక్షుడిని సర్వనాశనం అవుతావని, యజ్ఞానికి వచ్చిన వాళ్ళు అందరు నాశనము అవుతారని శపిస్తాడు. అందుచేతనే వీరభద్రుడి వలన యజ్ఞము సర్వ నాశనము అవుతుంది.

దేవతలకు దానవులకు మధ్య యుద్ధ విరమణ జరిగింది. యుద్ధంలో అమితమైన నష్టం జరిగింది. మళ్ళీ యుద్ధం జరుగకుండా ఉండాలంటే అస్త్రశస్త్రాలేవీ లేకపోవడమే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. వాటిని ధ్వంసం చేయకుండా దాచి ఉంచడమే మంచి మార్గమని వారికి తోచింది. దధీచి బ్రహ్మజ్ఞాని, మహతపస్వి, శక్తి సంపన్నుడు. ఆయన ఆశ్రమం శత్రువులను కూడా సఖ్యపరచు శాంతి వనము. అందువల్ల దేవతలు తమ ఆయుధాలను దధీచి మహాముని వద్ద దాయడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. దేవతల కోరికను దధీచి అంగీకరించాడు. ఆయన సతీమణి మహా పతివ్రత. పతి క్షేమం దృష్ట్యా అందుకు అభ్యంతరం తెలిపింది. కానీ ఎంత కాలము అయినా వారు రాకపోయేసరికి అస్త్రాలను నీరుగా మార్చితాగాడు. తర్వాత దేవతలు మా అస్ర్తాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి వున్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకొమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది. ఆ విధముగా దధీచి తన ఎముకలను దానముగా ఇవ్వటమే కాకుండా ఏ రకమైన స్వార్థము లేకుండా మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాలను త్యాగము చేసిన మహానుభావుడుగా హిందూ పురాణాలలో ఎనలేని కీర్తి సంపాదించాడు. ఇంద్రుడు దధీచి శరీరమునుండి తీసిన ఎముకలతో తయారు అయిన వజ్రాయుధముతో లోకకంటకులైన అసురులను చంపగలిగాడు.

ఋగ్వేదంలోని కథనం ప్రకారము దేవతలను దేవలోకము నుండి వృతాసురుడు అనే రాక్షసుడు తరిమేస్తాడు. ఆ రాక్షసుడు అప్పటి వరకు ఉండే ఏ ఆయుధాల వల్ల చావు లేకుండా వరాన్ని పొందాడు. అందుచేత ఇంద్రుడు శివుడిని బ్రహ్మను, విష్ణువును ప్రార్ధించి ఆ రాక్షసుడిని ఎలా ఏ ఆయుధముతో చంపాలి అని అడిగితే, విష్ణువు దధీచి ఋషి యొక్క ఎముకలతో తయారుచేసిన వజ్రాయుధముతో ఆ రాక్షసుడిని చంపవచ్చు అని చెపుతాడు. అప్పుడు దేవతలు దధీచిని చంపి ఎముకలు తీసుకోవటానికి సందేహిస్తారు. ఎందుచేతనంటే వారికి బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకుంటుంది. ఈ పరిస్థితిలో ఇంద్రుడు దధీచిని ప్రార్ధించగా తాను ప్రాణత్యాగానికి ఒప్పుకొని చనిపోయేముందు అన్ని పవిత్రమైన నదులలో స్నానము చేయాలని తన కోరికను ఇంద్రునికి తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు అన్ని నదులను నైమిశారణ్యానికి తెప్పించగా దధీచి తన యోగ శక్తితో ప్రాణత్యాగము చేసి ఎముకలను ఇంద్రునికి ఇస్తాడు. ఆ ఎముకలలో దధీచి వెన్నెముకతో చేసిన వజ్రాయుధముతో ఇంద్రుడు ఆ రాక్షసుని చంపి ఆ వజ్రాయుధాన్ని తన ఆయుధముగా చేసుకుంటాడు. ప్రాణత్యాగము చేసిన దధీచి శివుడిలో ఐక్యం అవుతాడు. దధీచి మరణించే సమయానికి అయన భార్య సువర్చల గర్భవతి. ఆవిడ దేవతలు వద్దని వారించినా వినకుండా ఆ పిల్లవాడిని పిప్పల వృక్షము వద్ద వదలి ఆవిడ కూడా ప్రాణత్యాగము చేస్తుంది. ఆ పిల్లవాడే పిప్పలాదుడు అనే గొప్ప ఋషి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here