[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]సొ[/dropcap]సైటీలో నేను చాలా దెయ్యాలు వదలగొట్టించా! ముఖ్యంగా ‘గ్రీడ్’ అనే దెయ్యాన్ని. కొంతమందికి ఎదుటివారి నుండి ఏదో ఒకటి అడగడం అనే ‘దెయ్యం’ పట్టుకుంటుంది “మీ ఇంట్లో మంచి పుస్తకాలున్నాయిగా, ఇస్తారా?”, “మీ ఇంట్లో మొక్కలున్నాయా, మేం వస్తాం”, మీ ఇంట్లో ఆవకాయ పెట్టారా? కొంచెం పంపండి, పెడదాం అంటే మా ఇంట్లో ఎవరూ తినరు”, “పోనీ మీరు ఫ్రీనా? మేం వస్తాం, మీ టైం వేస్ట్ చెయ్యడానికీ” ఇలాగన్న మాట. “ఏదైనా వేషం ఇప్పించండీ, మా ఆడబిడ్డ కొడుకు. ఎందుకూ పనికిరాకుండా తిరుగుతున్నాడూ!” అంటారు… వీళ్ళకి ఆర్టిస్టులు అంటే ఎంత చిన్నచూపూ? టీవీ ఆర్టిస్టులు కూడా వేషం దొరకటానికి ఆడిషన్స్ ఇచ్చి, టాలెంట్ రుజువు చేసుకుని, ట్రైనింగ్ అయితే తప్ప, ఒక్క నిమిషం పాటు కనిపించే వేషం కూడా దొరకదు! “ఏ పనీ సరిగ్గా చెయ్యడు, చాత కాదు… సినిమాల్లో ఏదైనా చూస్తావా?” అని ఊరోళ్ళే కాదు… పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళూ, NRIలు కూడా నన్ను అడుగుతూ వుంటారు! చదువుకీ, లోకజ్ఞానానికీ సంబంధం లేదు అనుకోండీ!
***
2021 జనవరి 25వ తారీఖున మదనపల్లెలో విద్యాధికులైన ఓ కుటుంబంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది! అదే నా చేత ఈ టాపిక్ రాయించింది! మేథ్స్‌లో గోల్డ్ మెడల్ పొందిన ఓ తల్లీ, ప్రొఫెసర్‍గా పని చేస్తున్న ఓ తండ్రీ, తమ యుక్త వయస్కులైన ఇద్దరు కూతుళ్ళనీ, చంపేసారు. ఇది మీ అందరూ టీవీలో, యూట్యూబ్‍లో చూసారు, విన్నారు. ఆ తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తం నాయుడూ, పిల్లలు ఆలేఖ్యా, సాయి దివ్యాలు. తల్లి మేథ్స్‌లో పీ.జీ. చేసి గోల్డ్ మెడల్ పొంది, మాస్టర్ మైండ్స్ అనే స్కూల్‍కి కరెస్పాండెంట్‍గా పని చేస్తోంది. తండ్రి ప్రభుత్వ కళాశాలలో వైస్-ప్రిన్సిపాల్, కెమిస్ట్రీలో ప్రొఫెసర్. పెద్ద అమ్మాయి అలేఖ్య ఐ.ఏ.ఎస్.కి ప్రిపేరవుతూ, మణిపాల్‌లో, శలవులకి ఇంటికొచ్చింది, కరోనా కారణంగా. చిన్న అమ్మాయి సాయి దివ్య ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అకాడెమీలో మ్యూజిక్ నేర్చుకుంటూ, తనూ కరోనా వల్ల కాలేజీ మూసేయ్యడం వలన ఇంటికొచ్చింది. చాలా డబ్బున్న వాళ్ళు. కొత్తగా భవనం కట్టుకుని అందులోకి మారారు. మొదట నుండీ మెహర్ బాబానీ, షిర్డీ సాయి బాబానీ, ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన జగ్గీ వాసుదేవ్‍నీ నమ్మేవారుట. ఈ కరోనా లాక్‌డౌన్‌లో ఏకాంత వాసంలో బాగా స్పిరిట్యువల్ బుక్స్ చదివారుట. పెద్ద అమ్మాయి అలేఖ్యా ‘మెలూహా’ నాగా సిరీస్ కూడా బాగా వంటపట్టించుకుని, ‘నేనే శివా’ అని, తను శివుడి రూపం అని చెప్పేదిట! ఇవన్నీ నేను యూట్యూబ్‍లో చూసి ఆ సోర్స్ వల్లే తెలుసుకున్నాను. మరి ఏమైందో ఏమో సడెన్‍గా తండ్రి తన కొలీగ్‌కి ఫోన్ చేసి, “మా ఇద్దరు కుమార్తెలనీ చంపేసాం… ఈ రాత్రికి మేం ఇద్దరం కూడా చనిపోతాం… మా కూతుళ్ళు తిరిగి బతికొచ్చి మమ్మల్ని బతికిస్తారు, సత్యలోకం కోసం ఇదంతా చేస్తున్నాం! మా వల్లే సత్యలోకం వస్తుంది, శివుడు చెప్పాడు” అన్న భావం వచ్చే మాటలు చెప్పాడుట. ఆ కొలీగ్ ఎవరో ఇంకా పేరు బయటపెట్టలేదు కానీ, పోలీసులకి ఇన్‌ఫార్మ్ చేసాడు. పోలీసులు వెళ్ళేసరికి తల్లీ, తండ్రీ కూడా నగ్నంగా వున్నారట… చచ్చిపడి వున్న కుమార్తులూ నగ్నంగా పడి వున్నారట. చిన్న కూతురిని, ముగ్గురూ కలిసి త్రిశూలంతో పొడిచి చంపిన తర్వాత, పెద్ద కూతురు అలేఖ్యని, నోట్లో దీపం కుందె పెట్టి, డంబెల్‍తో నెత్తి మీద మోది చంపారుట తల్లీ, తండ్రీ. ఆ ఘటన జరిగిన తర్వాత వెళ్ళిన పోలీస్ ఇన్‍స్పెక్టర్ వాళ్ళతో, చాలా సామరస్యంగా, పొలైట్‍గా మాట్లాడి, “బూట్లతో పూజగదిలోకి వెళ్ళొద్దని చెప్పండీ… అమ్మాయిలు బట్టలు లేకుండా పడి వున్నారు… వెళ్ళొద్దు అని చెప్పండీ… ఒక్క రాత్రికి మీరు వదిలి పెట్టేస్తే వాళ్ళు బతికొస్తారు” అన్న ఆ తల్లి మాటలకి విలువిచ్చి, షూస్ విప్పి, పూజ గదిలోకి వెళ్ళి దణ్ణం పెట్టుకోవడం మనం అంతా యూట్యూబ్‌లో చూసాం! ఆ తల్లి ట్రాన్స్‌లో వుండి “నేనే శివుడు… కరోనాని నేనే సృష్టించాను… నా గొంతులో హాలాహలం వుంది” అంటూ ఎగరడం, చేతులు తిప్పుతూ పిచ్చి చేష్టలు చెయ్యడం వ్యాన్ ఎక్కించేటప్పుడు… ఇదంతా కూడా యూట్యూబ్‍లకి సొమ్ము చేసుకోడానికి బాగా పనికొచ్చింది!
కానీ ఇంత చదువుకున్న ఈ తల్లి తండ్రులు కన్న బిడ్డల్ని చంపుకునేంటంతగా క్షుద్రవిద్యల్ని ఎందుకు నమ్మారు? ఆ పిల్లలు కాబోయే కలెక్టర్లు, చనిపోవడానికి సిద్ధమై తల్లి తండ్రులకి ఎందుకు సహకరించారూ? నిజంగా వారి కుటుంబానికి ఎవరైనా హిప్నాటిజం లాంటివి చేసి లోబరుచుకున్నారా? మొత్తానికి మొత్తం అందరూ ఒకేసారి లాక్‌డౌన్‍లో మతులు పోయి పిచ్చోళ్ళు అయ్యారా? ఇవన్నీ ఎవరికీ తెలీదు. రకరకాల కథనాలు… ఆస్తుల కోసం ఎవరో చేతబడి చేసారనీ, మొదటినుండీ వాళ్ళు సైకలాజికల్‍గా సరిగ్గా లేరు, ఆ పద్మజ తండ్రి కూడా మానసిక సమస్యలకి ట్రీట్‍మెంట్ తీసుకుంటూనే పోయాడనీ, బోలెడు వార్తలొచ్చాయి. నిజం ఆ పరమేశ్వరుడి కెరుక! ఆ తల్లీ తండ్రీకి కూడా ఎరుకే కానీ, జరిగిన వాస్తవం అర్థమయి, తాము హంతకులమని అర్థమయ్యాకా, ట్రాన్స్ లోంచి బయటపడినా, పిచ్చివాళ్ళు గానే నటిస్తారు. లాయర్స్ కూడా రంగంలోకి దిగారు కదా! ఇది సస్పెన్స్‌గానే వుంటుంది.
మీకు తెలిసిన న్యూస్‍నే నేను ఎందుకు మళ్ళీ చెప్పానంటే, పక్క ఇంట్లో కాని, బంధువుల ఇళ్ళల్లో కాని అసహజమైన ప్రవర్తన కానీ, పూజలు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకి తెలియజెయ్యండి, మనకెందుకు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని వదిలెయ్యకండి! అభం శుభం తెలీని పసిపిల్లలు ఆడుకుంటుంటే, చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకుపోయి బలి ఇవ్వడం, కన్నె పిల్లలన్ని బలి ఇస్తే నిధులు దొరుకుతాయని, ఎత్తుకుపోయి చంపెయ్యడం, కన్న కూతుళ్ళనే బలి ఇవ్వడం, స్వర్గానికి వెళ్తామని ఢిల్లీలో ఓ కుటుంబంలో ఏడుగురు సభ్యులు పిల్లలతో సహా ఉరి వేసుకుని, ఆత్మలు బయటకిపోవడానికి గొట్టాలు కూడా అమర్చుకుని చనిపోవడం; ఇవన్నీ మనం, మన చుట్టూ వున్న సమాజంలో అసహజత్వాలని పట్టించుకోనందువల్లే జరుగుతున్నాయి! మనిషికి అయాచితంగా వచ్చే నిధుల మీద ఆశ! పదవి మీద ఆశ! కీర్తి మీద ఆశ! నిన్న ఏదో రైస్ పుల్లింగ్ కేస్‍లో సినీనటి జయచిత్ర కుమారుడి అరెస్ట్ అన్న వార్త! మన గుళ్ళ మీద పెట్టే కలశాలలో ‘ఇరీడియం’ అనే ఖనిజం వుంటుందిట… రైస్ వేస్తే ఎట్రాక్ట్ అవడం, వాటిని పుల్లింగ్ చెయ్యడం, మేగ్నెట్ ఇనుముని ఆకర్షించినట్లు దాని గుణంట! ఈ రైస్ పుల్లింగ్ యంత్రం వుంటే వాడు పెద్ద శ్రీమంతుడు అయిపోతాడుట… అందుకని ఈ అంబరీష్ అనే అతనికి కోట్లు ఇచ్చాడుట ఒకతను. అసలు అలాంటి యంత్రం వుంటే ఎవడైనా బుర్ర వున్నవాడు ఎందుకు అమ్ముతాడు అని ఆలోచించరా?
(సశేషం)