[box type=’note’ fonts1ze=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
7
[dropcap]ఆ[/dropcap] రోజు సి.ఎ.ఐ.ఐ.బి పార్టు 1 లో అక్కౌంట్స్ పేపరు వ్రాయాలని గుర్తొచ్చింది. వెంటనే తయారయ్యేందుకు శుక్లా, బాట్లిబాయ్ అక్కౌంట్స్ బుక్స్ కొన్నాను. బాగా కష్టపడి చదివి, ఎలాగైనా పార్ట్ 1 పాసవ్వాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని అమలు పరచే దిశగా, వినూత్నంగా ఆలోచించి, ఒక ఎ.4 సైజు పోస్టర్ తయారు చేశాను. ఆ పేపర్ పై సి.ఎ.ఐ.ఐ.బి. అని నల్లసిరాతో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి, మూడు కాపీలు తీసుకుని, మా యింట్లో హాల్లో, మిగతా రెండు గదుల్లో ప్రస్ఫుటంగా కనిపించే చోట అంటించాను. ఎందుకంటే ఆ పోస్టర్ చూసినప్పుడల్లా, నాకు సి.ఎ.ఐ.ఐ.బి. గుర్తుకు రావాలి. నేను శ్రద్ధ పెట్టి చదివి, సి.ఎ.ఐ.ఐ.బి.ని సాధించాలనే పట్టుదల నాలో పెరగాలి. ఆ పోస్టరు నా లక్ష్యాన్ని నాకు గుర్తు చేస్తూ, ఆ లక్ష్యాన్ని చేరుకునేలా నన్ను నడిపిస్తుందని నా నమ్మకం.
ఈ వినూత్న ఆలోచనకు నేపథ్యం గురించి ఇక్కడ చెప్పుకోవాలి.
***
అవి నేను కాలేజీ చదువుకునే రోజులు, హాస్టల్లో వుండేవాడ్ని. ఒక రూమ్‌లో ముగ్గురం ఉండేవాళ్లం. ఒక్కోక్కరికి ఒక్కో మంచం, ఒక కప్ బోర్డు, ఒక టేబిలు, ఒక కుర్చీ వుండేవి. నా కప్ బోర్డులో ఎ.4 సైజు పేపరుపై సంగీత ప్రియులందరికీ సుపరిచతమైన ఓ సినిమా పాటను, నల్ల సిరాతో, పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి అంటించాను.
ఆ పాటే, నేను ప్రతి రోజూ వీలైనన్ని సార్లు చదువుకునే పాట!
ఆ పాటే, సమస్య వస్తే పరిష్కారం కోసం చదువుకునే పాట!
ఆ పాటే, కష్టం వస్తే ఎదుర్కొనేందుకు చదువుకునే పాట!
ఆ పాటే అలజడిని, దుఃఖాన్ని పారదోలేందుకు చదువుకునే పాట!
ఆ పాటే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు చదువుకునే పాట!
ఆ పాటే నా జీవితానికి ఓ అర్థం చెప్పిన పాట!
ఆ పాటే నా జీవన గమనాన్ని నిర్దేశించిన పాట!
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారు అభినయించిన పాట!
కీ.శే. పెండ్యాల నాగేశ్వరరావు గారు స్వరకల్పన చేసిన పాట!
కీ.శే. ఘంటసాల వెంకటేశ్వరరావుగారు భావగంభీరంగా పాడిన ఓ గొప్ప పాట!
అందరూ మనసుకవి ఆచార్య ఆత్రేయగారు వ్రాశారు… అనుకునే పాట!
ఆ పాటే, వాస్తవానికి మహాకవి శ్రీశ్రీగారి అంతరంగం నుంచి పెల్లుబికిన పాట!
ఆ పాట, అలనాటి మేటి సినిమా, ‘వెలుగు నీడలు’ సినిమాలోని పాట…
“కలకానిదీ… విలువైనది…, బ్రతుకూ… కన్నీటి ధారలలోనే బలిచేయకూ….”
***
అప్పుడే తెలిసింది. నా స్నేహితుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేసే మహేష్ గురించి. తను సి.ఎ.ఐ.ఐ.బి. పరీక్షలకు తయారయే వారికి, అక్కౌంట్స్ ట్యూషన్ చెప్తాడట! ఇంకేం… పార్ట్ 1 లో నాకు మిగిలివున్న అక్కౌంట్స్ పేపర్ కోసం ట్యూషన్ చెప్పమని కోరాను మహేష్‌ని. ఏ మాత్రం ఆలోచించచుకోకుండా, రేపటి నుండే, ఉదయం ఏడుగంటలకల్లా, వాళ్ల రూమ్‌కి వస్తే, ఎనిమిది గంటల వరకు ట్యూషన్ చెప్తానన్నాడు.
మరసటి రోజు ఉదయమే, అప్పటికే నేను కొనుక్కున్న శుక్లా, బాట్లిబాయ్ అక్కౌంట్స్ పుస్తకాలను, ఓ లాంగ్ నోట్ బుక్‌ను, తీసుకొని మహేష్ రూమ్‌కి వెళ్ళాను.
ఒకటి రెండు రోజులు గడిచాయి. అక్కౌంట్స్ అంతగా అర్థం కావడం లేదు నాకు. కష్టంగా అనిపిస్తుంది. విషయం మహేష్‌కి వివరించాను. అతను పెదవులు బిగించి, కళ్లు మూసుకుని, ఒక్క నిమిషం ఆలోచించి…
“ఆ!… అయితే ఒక పని చేయ్! ఈ రోజే నువ్వు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అక్కౌంట్స్ పుస్తకం, తెలుగు మీడియం కొనుక్కో! రేపు ఆ పుస్తకం తీసుకొనిరా! పరీక్షలకు, ఇంకా రెండు నెలలు టైం వుంది. ఓ నెల రోజులు ఆ తెలుగు మీడియం పుస్తకం ద్వారా అక్కౌంట్స్ నేర్పుతాను. అప్పుడు నీకు చాలా సులభంగా అర్థమవుతాయి. ఆ తరువాత నెలలో ఇంగ్లీషు మీడియంలో నేర్పిస్తాను… అలా చేద్దాం..!” అని చెప్పాడు మహేష్.
“అలాగే!” అని చెప్పి ఇంటికి బయలుదేరాను.
ఆ రోజే ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం తెలుగు మీడియం అక్కౌంట్స్ బుక్ కొన్నాను. ఆ తరువాత రోజు నుండి, మహేష్ తెలుగులో చెప్పడం మొదలెట్టాడు. మొత్తానికి మహేష్ ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడం మొదలెట్టింది. బాగా అర్థమవుతున్నాయి అక్కౌంట్స్. రెండో నెల నుండి ఇంగ్లీషు మీడియంలో చెప్పడం మొదలెట్టాడు. రెండు నెలలు పూర్తయేసరికి, అక్కౌంట్స్‌లో పక్కగా తయారయ్యాను. పరీక్షలో ఉత్తీర్ణుడనవుతాననే గట్టి నమ్మకం కుదిరింది. మహేష్‌కి నా ఆనందాన్ని తెలియపరిచి, కృతజ్ఞతలు తెలియజేశాను.
***
ఆ రోజే నా అక్కౌంట్స్ పరీక్ష. బ్రహ్మాండంగా వ్రాశాను. ఏ మాత్రం డౌట్ లేదు. గ్యారంటీగా పాసవుతాననిపించింది. ఆ విషయాన్నే, ఆ రోజు సాయంత్రం, స్నేహితులమంతా కలిసినప్పుడు, మహేష్‌కి చెప్పాను. చాలా సంతోషించాడు. ఆ సంతోషంతో మరో సలహా ఇచ్చాడు.
“అన్నట్లు సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 2 లో అడ్వాన్స్‌డ్ అక్కౌంటెన్సీ పేపరు వుంటుంది. అది చాలా టఫ్‌గా వుంటుంది… సరే! … ఒక పని చేద్దాం… ఎటూ నువ్ పార్ట్ 1 అక్కౌంట్స్ పేపరులో పాసవడం ఖాయమైంది కాబట్టి, రేపటి నుండి పార్ట్ 2 లోని అడ్వాన్స్‌డ్ అక్కౌంటెన్సీకి ట్యూషన్ కంటిన్యూ చేద్దాం. ఈ టెంపోలోనే ఆ పరీక్షకి తయారైతే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి, చాలా సులభంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఆరు నెలల టైం వుంది. అక్కౌంట్స్ పేపరుతో పాటు, మరో మూడు పేపర్లు, మొత్తం నాలుగు పేపర్లకి ప్రిపేర్ అవ్వు. ఆ నాలుగు పాసయిన తరువాత, మిగిలిన ఆ రెండు కష్టమైన పేపర్లు…, అంటే, కమర్షియల్ లా మరియు ఫారెన్ ఎక్స్ఛేంజి,… వాటిని మరో విడతలో రాద్దువుగాని… అర్థమయిందా?… సి.ఎ.ఐ.ఐ.బి. పార్టు 2 పాసవడానికి, ఇదీ మన స్ట్రాటజీ…, ఏమంటావ్?…” నవ్వుతూ అడిగాడు మహేష్.
“అదిరిపోయింది భయ్యా!… నీ స్ట్రాటజీ!… దాన్నే అమలు చేద్దాం!!.. రేపటి నుంచే స్టార్ట్!” హై ఫై ఇస్తూ మహేష్‌కి చెప్పాను.
8
అనుకోకుండా ఆరోజు సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 1 రిజల్స్ వచ్చాయి. కవరు తెరిచి చూసిన నాకు కండ్లు బైర్లు కమ్మాయి. తల మీద పిడుగు పడినట్లనిపించింది. అందుకు కారణం, అక్కౌంట్స్ పేపర్‌లో నేను ఫెయిల్ అయ్యాను! అదేంటి…?? నేను ఫెయిల్ అవడమేంటి?!… ఎంతో కష్టపడి చదివాను… నేను…! నో… నో…! నమ్మశక్యంగా లేదు. ఏ కోణంలో ఆలోచించినా… ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు…!.. మరి ఇప్పుడు నేనేం చేయాలి?… మహేష్‌కి నా ముఖం ఎలా చూపించాలి?…
వెంటనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి, వారికి ఓ రిప్రజెంటేషన్ పంపాను. నా పేపరును రివాల్యూ చేయమని అర్థించాను…
వారం తిరక్క ముందే సమాధానం వచ్చింది. రివాల్యూ చేసే అవకాశం లేదని, ఇన్‌స్టిట్యూట్ నిర్ణయమే అంతిమ నిర్ణయమని, ఈ విషయంపై ఉత్తర ప్రత్యుత్తరాలు వుండవని తెలియజేశారు.
విషయం తెలుసుకున్న నేను కుంగిపోలేదు. ఎందుకంటే… నా పైన, నా ప్రయత్నాల పైన, అంత నమ్మకం ఉంది… నాకు. మహేష్‌తో అదే చెప్పాను. పార్ట్ 2 లో అక్కౌంట్స్ పేపరు, మరో మూడు పేపర్లుకు, నా ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నాను…., వచ్చిన రిజిల్టును ఖాతరు చేయకుండా….!!
***
మరో వారం రోజులు గడిచాయి. ఐ.ఐ.బి., బొంబాయి నుండి ఓ కవర్ వచ్చింది…, ఏమయ్యుంటుదబ్బా!… గుండె నిమిషానికి వందసార్లు కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతులతో, కవర్ ఓపెన్ చేసి చదివాను.
ఆశ్చర్యం…!.. అద్భుతం….!!…
“మేము మీకు పార్ట్ 1 అక్కౌంట్స్ పేపరులో ఫెయిల్యూర్ నోట్‌ను పొరపాటున పంపాము. అందుకు క్షంతవ్యులం. మీరు ఆ పేపరులో పాసయ్యారు. పార్ట్ 1 పాస్ సర్టిఫికెట్‌ను కూడా ఇందులో జతపరుస్తున్నాము. మీకు అభినందనలు!”
ఆ విషయం చదివిన నేను, ఎగిరి గంతేశాను. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆఫీసులో అందరికీ విషయం తెలియజేసి స్వీట్సు తెప్పించి పంచాను.
సాయంత్రం ఆరు గంటలకు నాజ్ సెంటర్‌కి వెళ్లి, నా ప్రియమిత్రులందరికీ స్వీట్లు పంచాను. వాళ్లందరూ నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మహేష్, నా భుజం తట్టి…
“మొత్తానికి… సాధించావ్!…” అని సగర్వంగా నా వైపు చూశాడు. నిజమే కదా! శిష్యుడు పాసయితే, గురువుగారికి సంతోషంతో పాటు, గర్వం కూడా… వుండడం సహజమే కదా!
ఆనందంతో బరువెక్కిన హృదయంతో ఇంటికి బయలుదేరాను…
ఇల్లు చేరుకోగానే పార్ట్ 1 పాసయినట్లు నా శ్రీమతికి చెప్పాను. చాలా సంతోషించింది. ఇద్దరం ఒకరికొకరం స్వీట్లు తినిపించుకున్నాము. కొంచెం సేపు తనలోనే ఏదో ఆలోచించుకున్న నా శ్రీమతి…
“ఏవండీ! నేనొక ముఖ్యమైన విషయం మీకు చెప్దామనుకుంటున్నానండి! చెప్పమంటారా!”
“నిక్షేపంగా! చెప్పు… ఏంటి? పార్ట్ 1 పాసయినందుకు మనవాళ్లందర్నీ పిలిచి పార్టీ చేసుకుందామా?”
“అబ్బే… అదేం కాదండీ!”
“మరేంటి? త్వరగా చెప్పు!”
“ఏం లేదండీ! ఇప్పుడు పార్ట్ 1 పాసయినందుకు మీకు ఒక ఇంక్రిమెంట్ ఇస్తారుకదా! అలా వచ్చే డబ్బును మన కోసం ఖర్చు పెట్టుకోకుండా, మన పిల్లల కోసం పొదుపు చేద్దామండీ! ఏమంటారు?”
“ఎంత మంచి ఆలోచన! తప్పకుండా అలాగే పొదుపు చేద్దాం. దేవుడి దయ వల్ల పార్ట్ 2 కూడా పాసయితే మరో రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆ డబ్బును కూడా పిల్లల కోసమే పొదుపు చేద్దాం. అలా మూడు ఇంక్రిమెంట్ల తాలుకూ డబ్బుని, దాచుకుంటూ పోతే, పిల్లలు పెద్దయ్యే సరికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు తయారవుతుంది. ఆ డబ్బు మన పిల్లల పై చదువులకు ఉపయోగపడుతుంది!”
“చాలా సంతోషమండీ! నా మాటకు కాదననందుకు!”
“నువ్వు చెప్పే పని కొచ్చే మాటలను నేనెప్పుడన్నా కాదన్నానా!”
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వంట గది వైపు వెళ్లింది తను. అప్పుడే నిద్ర లేచిన బాబును ముద్దాడాను నేను.
***
చూస్తుండగానే ఆరు నెలలు గిర్రున తిరిగాయి. సి.ఎ.ఐ.ఐ.బి. పరీక్షలు వచ్చాయి. అప్పటి వరకు మహేష్ దగ్గర ట్యూషన్ నిరాటంకంగా కొనసాగింది. అక్కౌంట్స్ పేపరు, మిగతా మూడు పేపర్లు బాగా వ్రాశాను. కష్టపడి చదివాను కాబట్టి, పాసవడంలో వీసమెత్తైనా సంశయం లేదు.
కొద్దిరోజుల తరువాత రిజల్ట్సు వచ్చాయి. నాలుగు పేపర్లులో పాసయ్యాను. ఆ రోజు సాయంత్రమే, మహేష్‌తో పాటు, మిగతా స్నేహితులందరికీ, గుంటూరు శంకర్ విలాస్‌లో మంచి పార్టీ యిచ్చి, వారితో నా ఆనందాన్ని పంచుకున్నాను.
(మళ్ళీ కలుద్దాం)