[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
[dropcap]జ[/dropcap]మాల్, మజ్ను వేషంలో ఉన్న మైనాకుడు హేమాంగి నాగరాణిని కలుసుకోవటానికి మొగలిపొదల వద్దకు రాగా, వారిని గుర్తించిన సర్పము పొదల నుండి వెలువడింది. “నాగరాణి! నీవు కోరిన వ్యక్తులు మాకు తెలియ రాలేదు. పైగా నీవు సుల్తానును చంపినావని నిన్ను చంపటానికి భటులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నీవు త్వరగా ఇక్కడ నుంచి మరొక చోటుకు వెళ్ళి పోవడం మంచిది” అన్నారు.
“నేను సుల్తాన్‌ని చంపలేదు” అని నాగరాణి చెబుతున్న సమయంలో కొందరు సైనికులు కత్తులు, కర్రలు పట్టుకుని వచ్చారు. వారి ముందు మంత్రవేత్త గూండా ఫకీరు కూడా ఉన్నాడు. వారిని చూసి నాగరాణి మళ్ళీ పొదలోకి వెళ్లిపోయింది. వెంటనే ఫకీరు ఒక నాగస్వరం బుర్ర పట్టి ఊదడం మొదలు పెట్టాడు. మధ్యలో ఏవో మంత్రాలు కూడా పఠిస్తున్నాడు. కాసేపటికి మొగలి పొదలో ఉన్న పాము బుసలు కొడుతూ వెలుపలికి వచ్చింది. చుట్టూ వున్న వారందరూ కర్రలతో కొట్టారు. అది క్షణాల్లోనే ప్రాణాలు వదిలింది. ఆ సర్పము నుండి వెంటనే ఒక దివ్యమైన ఆకారం వెలువడడం చూసి అక్కడవారు ఆశ్చర్యపోయారు. “నాగరాణి నీవు నాకు పరిచితురాలవే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సుల్తాన్‌ను ఎందుకు చంపావు” అని అడిగాడు ఫకీరు. “నేను సుల్తానును చంపలేదు” అన్నది నాగరాణి. “అవన్నీ మాకు తెలియదు. నువ్వు తక్షణం మా రాణి దగ్గరికి రావలసినది” అని దండనాథుడు అనగా “నాకు అభ్యంతరం లేదు. మీ రాణిని కలుసుకోవటానికి నేను ఉత్సాహపడుతున్నాను” అని చెప్పి వారి వెంట నూర్జహాన్ వద్దకు వెళ్ళింది నాగరాణి.
అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న నాగసుందరిని చూడగానే రాణి బేగం ఆశ్చర్య పోయింది. జరిగిన విషయం అంతా భటులు చెప్పారు. వారు వెళ్లిపోయాక “నేను నాగలోక రాణిని. మా పెద్దలు నాకు సమర్పించిన దేవమందారాన్ని దోచుకొని వచ్చి, మీ రాజ్యంలో దాగిన మైనాకుడు హేమాంగి అన్న వారు నాకు కావాలి” అన్నది నాగ రాణి.
“తప్పక సహాయం చేస్తాను. నీవు మా రాణీవాసంలోనే ఉండవచ్చు” అని చెప్పింది బేగం. అక్కడ ఆనందంగానే కొన్ని రోజులు ఉన్న మంజూష దేవికి నూర్జహాన్ బేగం మరియు మిగిలిన రాణులు బానిసలతో యథేచ్ఛగా కామకలాపాలు చేయటం గమనించి, ఏవగింపు కలిగింది. బేగంతో చెప్పనైనా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
నూర్జహాన్ బేగం మత్తులో మునిగి తేలటం చూసి మంత్రి, దండనాయకులు విజృంభించి ప్రజలను కొల్లగొట్టడంలో ఉద్దండులై, పన్నులు పెంచారు. ధనం వసూలు చేసి తాము అనుభవించసాగారు. ప్రజలలో, పొరుగు రాజ్యాలలోనూ అలజడి కలిగింది. రత్నగర్భ అని పేరు మోసిన మురారి సామ్రాజ్యంపై అనేకమందికి ఆశ కలిగింది. వారిలో అశ్వరాజు అనే రాజు కప్పము కట్టకుండా ఒకరోజు నూర్జహాన్ బేగంకి ఆ విషయాన్ని లేఖ రూపముగా విన్నవించుకుని, ‘కావాలంటే మేము పాండ్య రాజ్యాధిపతి అయిన మహాబల చక్రవర్తుల సహాయము కోరుతాం’ అని కొంత బెదిరింపు ధోరణి ప్రకటించాడు.
అంతటితో ఆగక ఆ అశ్వరాజు ఈ విషయాన్ని మహాబల చక్రవర్తికి కూడా ఒక లేఖరూపంలో విన్నవించుకున్నాడు.
మహాబల చక్రవర్తి మురారి నగరంలో జరుగుతున్న అన్యాయాలు, సామంతరాజులు పడుతున్న కష్టాలు విని కరిగిపోయాడు. అసలు ఈమధ్య ఆయనలో ఏదో మార్పు వస్తున్నది. బహుశా చిలుక సారంగి చెప్పే ఆ కథ వల్ల కాబోలు ఆయనలో ఒక నిర్లిప్తత చోటు చేసుకుంటోంది. ‘నిస్సహాయులకు మనం తప్పక సహాయం చేయాలి’ అని మంత్రి సామంతులకు చెప్పాడు.
పన్నెండవ రాత్రి కథ చెప్పసాగింది సారంగి.
మాధురి బేగం దగ్గర ఉండే అవంతి అను మహా పతివ్రత రక్త బిందువులుచే మృతురాలైన తన భార్య చిత్రరేఖ తిరిగి బ్రతుకుతుందని తెలుసుకొన్న వక్రనాథుడు నారికేళద్వీపం నుంచి సింహళద్వీపానికి భార్య కళేబరంతో వచ్చి చేరాడు. మకరంద్ మనోరమ తారానాథ్‌లను ఒక విడిదిలో వుంచి, ఒంటరిగా పోయి మాధురి కలుసుకొన్నాడు. తన కథను వివరించి చెప్పాడు. తన పెద్ద భార్య మాత్సర్యం వల్ల అకాల మరణం పొందిన తన చిత్రరేఖను అవంతి అనే మహాపతివ్రత మాత్రమే బ్రతికించగలదు అని అతడు చెప్పిన దానిని విని మాధురి బేగం, మగవేషంలో ఉన్న అవంతి ఆశ్చర్యపోయారు.
తప్పక సహకరిస్తాను – అన్న మాధురి బేగం మాటతో సంతోషంగా వెనుతిరిగి వచ్చిన వక్రనాథుని మకరందాదులు ఆతృతతో అడిగారు ‘అక్కడ జయంతుడు అనే అతను ఉన్నాడా’ అని. ‘ఉన్నాడు’ అని అతను చెప్పగనే మర్నాడే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు
గాయాలతో వున్నప్పుడే జయంతుడు పురుష వేషం వేసుకున్న అవంతి అని గుర్తించిన మాధురి అవంతి పట్ల స్నేహభావం తోనే ఉన్నది. ‘ప్రజల సమక్షంలో వివాహమని ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాము, ఇప్పుడు ఎలా’ అని ఖిన్నురాలై ఉంది. అయినా ఆ అసంతృప్తిని బయటకు కనిపించకుండా “నువ్వు మహా పతివ్రతవి అనీ, మృతులైన వారిని సైతం సజీవులుగా చేయగల మహత్తర శక్తి నీలో ఉందని తెలిసిన మీదట నా అసంతృప్తి నశించి ఆనందంగా ఉంది’ అన్నది. అవంతి కూడ “నాలో ఆ శక్తి ఉందంటే నాకూ ఆశ్చర్యంగానే ఉంది” అన్నది.
అంతలో తెల్లవారుజామున కళ్యాణ మండపంలో మంగళ వాద్యాలుప్రారంభమైనాయి. కాసేపటికి తన భర్త రానున్నాడు, ఏమిచేయాలో తోచడంలేదు అవంతికి. ప్రజలలో ఈ వివాహానికి అంతగా ఆదరణ లేదని మాధురి బేగం కూడా కంగారు పడుతూనే ఉంది. అయినా ఇద్దరు సర్వాలంకార భూషితులై వివాహ మండపానికి చేరారు.
కానీ అక్కడ సేనాపతి అమీర్ మిగిలిన వాళ్ళందర్నీ రెచ్చగొట్టి ‘ఈ వివాహం జరగడానికి వీలు లేదు’ అని ఒక విప్లవాన్ని లేవదీశాడు. వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరగానే ‘మీరెవరు నన్ను అడ్డగించటానికి’ అని బేగం కరవాలం దూసింది. అమీర్ రెచ్చగొట్టడంతో సైనికులు రాణీ మీదనే వ్యతిరేకత ప్రకటించి చుట్టుముట్టారు. గత్యంతరం లేక మాధురి బేగంతోపాటు కరవాలం దూసింది అవంతి. వారిలో లాల్ కూడా ఉండటంతో కసితో మరింత రెచ్చిపోయింది మాధురి బేగం. భీకరంగా పోరు సాగుతుండగా మకరందాదులు ప్రవేశించారు. వారితోపాటు వచ్చిన వక్రనాథుడు కూడా తనకు సహాయం చేస్తానన్న మాధురి బేగం కోసం విజృంభించి పోరాడాడు. చివరకు అమీర్‌ను సంహరించి, సైనికుల తిరుగుబాటును అణచి వేశారు.
“సైనికులారా ఉద్రేకం ఆపి నా మాటలు వినండి. నాకు భర్త ననిపించుకుంటూ ఇంతవరకు లాల్మియా జరిపించిన పరమ కిరాతక మోసాలు మీకు అందరికీ తెలిసినవే. అతడు బ్రతికి ఉండగా నేను వివాహమాడటం మీ అందరితో పాటు నాకూ నచ్చదు. అందుకే అతని మరణ వార్త విన్న తర్వాతనే నేను ఈ వివాహం చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు అతను ఇక్కడికి రావడంతో అతని మరణ వార్త అబద్ధం అని తెలిసినది. మీ అందరి కోరిక ననుసరించి నేను ఈ వివాహ ప్రయత్నం మానుకొంటున్నాను. మీరిక నాపై ద్వేషం విరమించుకోండి” అంది మాధురి బేగం. “అలా అయితే మీరే మా రాణి. మీకు మేము పూర్తి మద్దతు ఇస్తాం” అన్నారు అందరు. అవంతి, మకరంద్ ల మనసులు కుదుట పడ్డాయి.
ఆనంద కోలాహలం మిన్నుమిట్టుతుండగా మనోరమ భీకరమైన ఆక్రందనలు వినిపించాయి. అందరూ కంగారుగా అక్కడికి వెళ్లేసరికి, సైన్యం పోరాడుతుండగా మెల్లగా తప్పుకున్న లాల్ మనోరమపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యం చూసి మాధురి బేగం విపరీతమైన కోపంతో ‘ఇక నిన్ను బ్రతకనివ్వను’ అని కత్తి విసిరింది. చాలా తెలివిగా దానిని తప్పించుకుని మళ్ళీ పారిపోయాడు లాల్.
(పారిపోయిన లాల్ మళ్లీ ఎక్కడికి చేరాడు? ఏమి పన్నాగాలు పన్నుతున్నాడు? అవంతి చిత్రలేఖను బ్రతికించకలిగిందా?… తరువాయి భాగంలో….)
(సశేషం)