[dropcap]వి[/dropcap]లాసాల మత్తులో ఆనందపు గమ్మత్తులో
ఆదమరచి నిద్రించే ఆధునిక యువతరమా !
పాశ్చాత్య విషకోరలకు బందీ ఐన నవతరమా!!
అజ్ఞానపు ఆవేశంలో ఆధునికత ముసుగులో
మన సంస్కృతిని మంట కలిపి
విదేశీ సంస్కృతికి పట్టం కడితివి….
పండుగలు వదిలి డేల పేరిట
దుబారా ఖర్చు వ్యసనాలతో
దుష్టాచారానికి బానిసవయితివి….
పట్టుచీర కట్టు బొట్టును మరచి
బట్టలే బరువెక్కినాయని
కంఫర్టబుల్ కబుర్లు చెబితివి…..
మాయ టీవీ మొహమున చిక్కి
స్త్రీ అందానికి పోటీ పెట్టి
మగువ పవిత్రతను మంట కలిపితివి…
సమాజ హితమును పక్కన పెట్టి
నడుమంత్రపు ప్రేమ పేరిట
సిగ్గు వదిలి షికార్లు చేస్తివి……
పాశ్చాత్య సంగీతపు మోజులో
పిచ్చెక్కి కుప్పిగంతులేస్తూ
పరదేశపు ఫ్యాషన్ లు నడిస్తివి……
ఓ యువతీ యువకుల్లారా!!
వివేకానందుని వీర వారసులారా!!!
మీరు పయనిస్తోంది స్వేచ్ఛప్రపంచంలోనా
కాదు కాదు అది అంధకార భావదాస్యం
ఇకనైనా వీడండి విదేశీయ మగతనిద్ర
సింహాలై కదిలిరండి
నవభారతావనిని నిర్మింప…………