[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]
జనవరి ఇరవయ్యారు!
[dropcap]ఈ[/dropcap] రోజు ఇన్ని ప్రశ్నలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయేందుకు?
మనసుకు ఆనందమే లేదేందుకు?
మనం కన్న ఆ అందమైన కలలన్నీ ఏమయ్యాయి?
సంపద పెరిగే కొద్దీ దారిద్య్రం కూడా ఎందుకు పెరిగి పోతున్నది దేశంలో?
అభివృద్ధికి అసలు అర్థం ఎందుకు మారిపోయింది?
రండి…రండి..మనం అందరం.. తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్నలు ఇవి!
చెప్పండి…ఆలోచించండి
ఒక్కసారి..!
ఏరీ ..వారేరీ ??
ఉరికొయ్యల వీధుల్లో మన పక్కనే నడిచిన ఆ కామ్రేడ్లు..
మనతో కలిసి నడిచిన వాళ్లంతా ఏమయ్యారు ఈ రోజు?
అమరత్వం చిందించిన నెత్తురుకి ఇదేనా మూల్యం?
ఎవరిని శిక్షించడానికి సర్వమూ ఒడ్డి సిద్ధమయ్యామో…
ఆ నేరస్థులు ఏమయ్యారు?
అంత సురక్షితంగా ఎందుకున్నారు వాళ్ళు?
అసలు…
మనుషుల నఘ్నమైన నిస్సహాయతకు ..
దుఃఖానికి విలువే లేదు..
పట్టు లాంటి మృదువైన.. మన వాగ్ధానాలన్నీ ఏమయ్యాయో అర్థమే కాదు…!
ప్రజాస్వామ్య వాదులారా..
శాంతీ ..మానవత్వపు ప్రేమికులారా…
మనం మనకి తగిలించుకున్న
ఈ బిరుదులన్నీ..నిజమేనంటారా… ఏమైపోయాయి అవన్నీ?
ఎందుకని మత రోగానికి ఇంకా మందు లేదు?
మత మూఢత్వాన్ని తగ్గించే
అమూల్యమైన..అరుదైన..
ఆ మందు చీటీలన్నీ ఏమైపోయాయి?
ప్రతీ వీధీ …
అగ్నిని వెదజల్లే పంట పొలమైంది.
ప్రతీ నగరం ఒక కబేలాగా మారింది.
జీవితంలోని ఏకత్వపు సూత్రాలు ఎటు పోయాయో తెలీకుండా ఉంది.
జీవితం..భయంకరమైన కీకారణ్యపు అంధకారంలో ..
లక్ష్యం లేకుండా తిరగాడుతున్నది..
భూమ్యాకాశాల అంచుల్లో ఉదయించిన ఆ చందమామలూ కనిపించటమే లేదు!
ఇన్ని ప్రశ్నలేస్తున్న నేను
నీకు… నేరస్థుడి నంటావా…
నాకు నువ్వూ నేరస్థుడివే !
నువ్వేనా …
జాతి నాయకులంతా
నేరస్థులే !
మీరంతా…పాపాత్ములే…!
అందుకే …
ఈ రోజు జనవరి ఇరవైయ్యారు..అయితేనేం?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలిగా…?
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి