శ్రీపర్వతం-64

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 64వ భాగం. [/box]

[dropcap]గ[/dropcap]దిలోకి అడుగు పెట్టిన మోహన్ ఆశ్చర్యంతో ఆగిపోయాడు.

“హాయ్… గ్రేట్ ఆర్కియాలజిస్ట్” అంటూ ప్రొఫెసర్ మంజిత్ సిన్హా వచ్చి మోహన్‌ని కౌగలించుకున్నాడు.

వెనకే వస్తున్న శశికళతో “వండర్‌ఫుల్ మేడమ్… మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది” అన్నాడు.

ఇద్దరూ కూర్చోగానే స్పెషల్ లస్సీ వచ్చింది.

“మీ ప్రాజెక్ట్ రిపోర్టు చూశాను. అద్భుతంగా ఉంది. నాగార్జున సాగర్‌కి సంభందించి ఇన్ని విశేషాలు ప్రకటిస్తున్నది మీరే. బౌద్ధులకు, సనాతన ధర్మానుయాయులకు నడుమ ఎలాంటి వైషమ్యాలు లేవనీ, మీ రీసెర్చ్ నిరూపిస్తోంది. అది చాలా గొప్ప విషయం, ఇంత కాలం మత సంఘర్షణలు చెలరేగాయని, అందరం అనుకుంటున్నాం. కానీ నీ రిపోర్ట్ అదంతా తప్పన్న ఆలోచనను కలిగిస్తోంది. ఐయామ్ రీయల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ రీసెర్చ్” అన్నాడు మంజీత్ సిన్హా.

అతడి మాటలను వింటు అతడిని జాగ్రత్తగా పరిశీలించాడు మోహన్. అతని మాటలు మనసులోంచి వస్తున్నట్టే ఉన్నాయి. నిజాయితీ ఉట్టిపడుతున్నాయి. మరి ఇతడేనా తన రీసెర్చ్ వాడుకోవాలని ప్రయత్నించింది?

అయితే మోహన్‌కి ఆలోచిచుకునే సమయం ఇవ్వలేదు మంజిత్ సిన్హా.

“నేను మీ ఇద్దరికీ ఓ ప్రతిపాదన చేయాదలచుకున్నాను” అన్నాడు.

“ఏమిటది” అడిగాడు మోహన్.

“నేను ‘Buddhist Esoterism’ అన్న అంశం మీద పరిశోధన చేయాదలచుకున్నాను. ఇది పెద్ద ప్రాజెక్ట్. ఆఫ్ఘనిస్తాన్, తిబ్బెత్తు, ఇండోనేషియా, కొరియా, చైనా. జపాన్ వంటి దేశాలలో బౌద్ధం రూపు రేఖలను మార్చుకుంది. భారతీయ యోగ, తంత్ర వంటివి దశమూ, దిశమూ మార్చుకుని వినూత్న మార్పులతో విస్తరించాయి. ఇదంతా పరిశోధించి, మూలాలు శోధించి, అంతుతేల్చాలని ఉంది నాకు. శ్రీపర్వతంలోని, తంత్ర, మంత్ర గురించి నువ్వు రాసిన అధ్యాయం చదివిన తరువాత నాకీ ఆలోచన వచ్చింది. మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే మీ ఇద్దరూ నాతో ఈ ప్రాజెక్ట్‌లో చేరవచ్చు. మీకు అవసరమైన సెలవులు పర్మిషన్లు నేనిప్పిస్తాను. ఆలోచించుకుని చెప్పండి. ఇంకో విషయం…” అని … ఇద్దరి వైపు చూశాడు మంజిత్ సిన్హా.

వేగవంతంగా సంభవిస్తున్న పరిణామాలను అర్థం చేసుకోవాలని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు మౌహన్, శశికళలు.

వారిద్దరూ తమకు తెలియకుండానే ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకున్నారు. “ఇంకో విషయం” అని ఆగిన మంజిత్ సిన్హా వైపు ప్రశ్నార్ధకంగా చూశారు.

“మీరు విదేశాలన్నీ హనీమూన్‌కి వెళ్లినట్టు వెళ్లొచ్చు. మిక్సింగ్ బిజినెస్ అండ్ ప్లెజర్” అన్నాడు మంజిత్ సిన్హా.

“మీకెలా తెలుసు?” అడిగింది శశికళ అప్రయత్నంగా.

“మీ నాన్న నాకు చాలా సన్నిహితుడు. ఈయన (సెక్రటరీ వైపు చూపిస్తూ) కూడా నాకు సన్నిహితుడు. మీ రిపోర్టు చూసి ఇంత మంచి రిపోర్టు నా పేరు మీద ఉండాలని భావించి, నాతో చెప్పకుండా పిచ్చి ఆలోచనలు చేశాడు. మీ నాన్న ఫోన్ చేసి అడిగే వరకూ నాకీ విషయం తెలియదు. ఆయామ్ సారీ. నా ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనల వల్ల మీకు ఇబ్బంది కలిగినందుకు నాకు బాధగా ఉంది. కానీ ఈ రకంగా మీలాంటి పరిశోధనాత్మక జీవులతో పరిచయం కలగటం సంతోషంగా ఉంది” అన్నడు.

మోహన్, శశికళలు ఏం మాట్లాడాలో తెలియలేదు.

ఆశ్చర్యం, ఆనందం కలగసిన భావన ఉప్పెనలా ఎగసింది వాళ్లల్లో.

***

దాదాపుగా 25 ఏళ్ల తరువాత మోహన్, శశికళలు నాగార్జున సాగర్ చేరారు. అంతా మారిపోయి ఉంది.

ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు.

“ఇదేమిటి నాన్నా, మీరెంతో గొప్పగా చెప్తారు, ఇలా ఉందేమిటి?” విసుగ్గా అడిగింది తార, వాళ్ల కూతురు.

“మార్పు… అభివృద్ధి… మారటం జీవలక్షణం” మాటల కోసం తడబడ్డాడు మోహన్. ముగ్గురూ నాగార్జున సాగార్ డామ్ దాటి ముందుకు వెళ్లారు.

“బోటింగ్ లేదు సార్” కృష్ణానదిలో బోటింగ్ అబ్బాయి చెప్పాడు.

“మ్యూజియమ్‌కు ‌వెళ్లాలి” అన్నాడు మోహన్.

“అటు వెళ్లండి. టూరిజం డిపార్టుమెంట్ వాళ్లు బోటు నడుపుతారు. ద్వీపంలో మ్యూజియం ఉంది. తిరుగు బోటులో వచ్చేయండి ” చెప్పాడు.

ముగ్గురూ ఆ వైపు వెళ్లారు.

బోటు క్రిక్కిరిసి ఉంది.

బోటులో ఉన్న వారంతా పాటలు పాడుతున్నారు. ఫోన్‌లో మాట్లాడుతున్నారు. తార కూడా తన వయసు యువతితో మాటలు కలిపింది. మాచెర్ల నుంచి వచ్చారు వారు. ‘సైట్ సీయింగ్’ అట.

మోహన్, శశికశళ ఇద్దరి ముఖాలలో తీవ్రమైన నిరాశ కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఎవ్వరికీ తెలిసినట్టు లేదు. శ్రీపర్వతం స్పృహ ఉన్నట్టు లేదు.

మ్యూజియం నిర్జన ప్రతిమలతో నిర్జీవంగా ఉంది.

అధికులు చకచకా నడచి బయట ఉన్న క్యాంటిన్ చేరుతున్నారు.

అక్కడ ఉన్న శిల్పాలు, వాటి ప్రాధాన్యం, అవి ప్రదర్శిస్తున్న చరిత్రల గురించి అవగాహన, ఆసక్తి ఉన్నట్లు లేదు. అసలు తాము అడుగుపెట్టిన నేల ఎంతో అద్భుతమైన చరిత్రను, విజ్ఞానాన్ని అణువణువునా పొదుగుకుని ఉన్నదన్న ఆలోచన లేదు. అడిగితే చాలు అనంతమైన విజ్ఞానాన్ని అందించేందుకు అర్రులు చాస్తున్నదన్న స్పృహ లేదు. తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు.

అరగంటలో మ్యూజియం చూడటం అయిపోయింది.

నిజానికి మోహన్ శశికళలు అక్కడి ఒక విగ్రహం చూస్తుంటే ఏవేవో జ్ఞాపకాలు వస్తున్నాయి.

వాటిని చూస్తూ మైమరచిపోతున్నారు.

కానీ తారకు విసుగ్గా ఉంది.

“ఏం చూస్తారు అంత సేపు? ఏముంది దాన్లో. బోరొస్తోంది. పదండి” అంటూ వాళ్లని బలవంతాన లాగేస్తోంది ముందుకు.

గబగబా ముగించి బోటు పట్టుకుని నాగార్జున సాగర్ చేరారు.

“ఇక్కడే రిక్రియేటెడ్ విగ్రహాలున్నాయి” అన్నారెవరో.

ముగ్గరూ ఆటోలో ఆ వైపు వెళ్లారు.

అవి కూడా నిర్జీవంగా, నిశ్చలంగా ఉన్నాయి.

పిల్లలు పార్కులో అడినట్టు అడుతున్నారు.

విగ్రహాల శిఖరాలు మౌనంగా నిల్చుని ఉన్నాయి. స్థూపాల పలకలను పేర్చి ఉంచారు.

శశికశ, మౌహన్‌లకు ఇంకా చూడాలనిపించలేదు.

తారకు శిఖరాలపై ఆసక్తి లేదు. చెట్లు చేమలు చూసింది.

“ఈ రాళ్లనేం చూస్తాం అమ్మా?” అడిగింది.

ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.

తమకు సర్పం పడగపట్టిన ప్రాంతం నీట మునిగిపోయింది. గత చరిత్ర అనవాళ్లు సజీవంగా ఎదురుగా ఉన్నా చరిత్ర అదృశ్యమయిపోయింది.

మోహన్ మనసు విషాదంగా అయిపోయింది.

శ్రీపర్వతం పేరు చరిత్రలో మిగిలింది.

దాని స్థానంలో కృత్రిమ శ్రీపర్వతం అనే టూరిస్ట్ ఆకర్షణ వనం వెలసింది.

తమ హోటల్ గది చేరగానే తార రిక్రియేషన్ రూమ్‌కి పరుగెత్తింది.

శశికళ, మౌహన్‌లు ఇద్దరూ ఒంటరిగా గదిలో మగిలారు.

ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

ఒకరి చేయి ఒకరు పట్టకుని హోటల్ గదిలోంచి ఒంపులు తిరిగి ప్రవహిస్తున్న నీటిని దాన్లో ప్రతిఫలిస్తున్న వెలుతురునూ చూస్తున్నారు.

“మనం ఎంతో పరిశోధించాం. బౌద్ధధర్మాలకి సంబంధించిన అనేక పత్రాలను ఆవిష్కరించాం. కానీ ఇక్కడ ఎవరికీ తమ గతాన్ని శోధించాలని, సాధించాలని, అవగాహన చేసుకోవాలన్న తపన లేదు. రాళ్లు నిర్జన ప్రతిమలు… మట్టి… ఇంతే…” అంది నిష్ఠూరంగా. మోహన్ మాట్లాడలేదు

 “శశి…. కొన్న వందల ఏళ్ల తరువాత ఈ ప్రాంతం ఇలా ఉంటుందని చెప్పలేము. నది మార్గం మార్చుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా మట్టితో కప్పబడి పోవచ్చు. అప్పుడు భవిష్యత్తు తరాల వారు తవ్వితే వారికి ఏం దొరుకుతాయి? ఈ హోటళ్లు, డ్యామ్‌లు… రోడ్లు…. వాళ్లు మన గురించి ఏమనుకుంటారు? మన జీవితాల గురించి ఏమాలోచిస్తారు? వాళ్లు ఎంత తెలుసుకున్నా, మన గురించిన అసలు విషయాలు వారికి తెలియవు. కానీ నువ్వు, నేను… ఆ సమయంలో జన్మిస్తాము… బౌధ్దుల కాలంలో సెలీనా, ఆనందుల లాగా, ఈ కాలంలో శశికళ, మోహన్‌ల లాగ, అప్పుడు ఏదో పేరుతో జీవిస్తాము. ఇదంతా…. మన గత జన్మలను మళ్లీ అనుభవిస్తాం…. ఇది జగతి రీతి. శూన్యం నుంచి వచ్చిన వాళ్లం శూన్యంలో కలిసిపోవల్సిందే. అంతా శూన్యం. మన అస్తిత్వం శూన్యం. మన జీవితాలు శూన్యం. దీన్లో దేని గురించి బాధ. దేని గురించి ఆశ. దేని గురించి ఆరాటం…”

శూన్యంలోకి చూస్తూ మంద్రంగా అంటున్న మోహన్ మాటలు, శశికళ అంతరంగాలో కల్లోలం కలిగించాయి.

ఆమె మెహన్‌ను గట్టిగా పట్టుకుంది.

ఇద్దరి మనస్సుల్లో ఒకే ద్వనులు వినిపిస్తున్నాయి.

బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి…

దూరంగా కృష్ణానది మౌనంగా ప్రవహిస్తోంది.

నాగార్జున పర్వతం నిశ్సబ్దంగా నిలుచుని ఉంది.

సర్వ ప్రకృతి మౌనంగా ఉంది.

శూన్యంలోంచి జనించి శూన్యంలో కలిసిపోయే జగతి శూన్యమంత మౌనం వహించింది.

ఓం శాంతి శాంతి శాంతిః

(శ్రీపర్వతం నవల సమాప్తం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here