రామం భజే శ్యామలం-34

0
3

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణాన్ని కాదనడానికి, రాముడిని తిరస్కరించడానికి, చరిత్రను పుక్కిటి పురాణంగా.. మిథ్‌గా మార్చడానికి నిర్హేతువాదులకు ఆబగా దొరికిన అంశం రామాయణంలోనే అంతర్భాగమని భావించిన.. భావిస్తూ ఉన్న ఉత్తరకాండ అనే విభాగంలోని కొన్ని పిట్ట కథలు. భారతదేశ పరిపాలనకు, సామాజిక జీవనవిధానానికి మౌలిక ఆధారంగా, ఆదర్శంగా ఉండాల్సిన రామాయణాన్ని పక్కనపడేసి.. లక్ష మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన అశోకుడనే అరాచకవాదిని గొప్ప చక్రవర్తిని చేశారు. పాఠాలు చెప్పి.. తరతరాల మెదళ్లలోకి ఎక్కించారు. అదేమంటే.. రాముడు ఆదర్శ పురుషుడు కాదన్నారు. సీతను అవమానించాడన్నారు. అడవుల్లో వదిలేశాడన్నారు.. అబ్బో.. బోలెడు కథలను జిగిబిగిగా అల్లుకుంటూ పదే పదే ప్రచారం చేస్తూ వచ్చారు. ఎవరో శూద్రుడిని హత్యచేశాడని చెప్పారు… ఇవన్నీ సదరు ఉత్తరకాండలోని పిట్ట కథలే.

ఇవన్నీ నిజమేనా? రాముడు ఇంత దుర్మార్గుడే అయితే.. గర్భవతి అయిన భార్యను అడవుల్లో వదిలేసినవాడే అయితే.. ఒక రాజుగా అమాయకుడిని చంపినవాడే అయితే.. ఇన్ని వేల ఏండ్లుగా ఆసేతు హిమాచలం సమస్త భారతీయుల గుండెల్లో ఎలా కొలువై ఉండగలిగాడు? రాముడి పేరు తలచినంత మాత్రాన్నే సమస్త పాపాలు తొలిగిపోతాయన్నంత ఆరాధనీయుడుగా ఎలా నిలబడగలిగాడు? ఎన్ని దుర్వ్యాఖ్యానాలు చేస్తున్నా.. ఎంత దుష్ప్రచారం చేస్తున్నా.. రాముడికి గుడి కడతామంటే.. పసివాడి నుంచి పండు ముదుసలి దాకా ఉడతాభక్తిగా నిధులు పంపించి నెల రోజుల వ్యవధిలోనే రెండువేల కోట్ల రూపాయలు ఎలా సమకూర్చగలిగారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే.. అది రామాయణం కాబట్టి.. ఆయన రాముడు కాబట్టి.

నిజమే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఆధారం ఎక్కడినుంచి వచ్చింది అని ప్రశ్నించుకొన్నప్పుడు ప్రధానంగా మనకు కనిపించేది ఉత్తర రామాయణం. రామాయణంలో యుద్ధకాండ అనంతరం మరో కాండగా వచ్చిచేరిన ఉత్తర కాండ. జాతీయ, అంతర్జాతీయ తిట్టుడువాదులందరికీ రాముడిని తిట్టడానికి కావాల్సినంత స్టఫ్ ఈ ఉత్తర కాండలోనే లభిస్తుంది. ఇందులోనే ఎవడో తాగుబోతు మాట విన్న రాముడు సీతను సింపుల్‌గా నట్టడివిలో వదిలేశాడు. ఎక్కడో ముక్కుమూసుకొని తపస్సు చేసుకొంటున్న శంబూకుడు అనే శూద్రుడిని కులం కారణంగా చంపేస్తాడు. ఉత్తర కాండ అంతా ఇలాంటి సిల్లీ కథలతోనే ఫుల్లుగా నిండి ఉంటుంది. యుద్ధకాండలో పరిసమాప్తమైన రామాయణం.. ఉత్తరకాండలో చిత్రవిచిత్రమైన కథనాలతో మొదలవుతుంది. ఏ ఒక్క కథకూ పొంతన ఉండదు. కంటిన్యూటీ అస్సలు కనిపించదు. తొలి ఆరు కాండలు ఒక అద్భుతమైన ప్రవాహశైలిలో సాగిన మహాకావ్యం ఏడవకాండకు వచ్చేసరికి ఎందుకు ఇంతలా మారిపోయింది. వాల్మీకి శైలి ఒక్కసారిగా ఎందుకు తేడా కొట్టింది? దీనిపై లోతుగా పరిశీలిస్తే చాలా చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఉద్భవిస్తాయి. మొట్టమొదటి ప్రశ్న నిజంగా ఉత్తరకాండ వాల్మీకి రాసిందేనా? ఆయనే రాసి ఉంటే.. తొలి ఆరు కాండలు మొత్తం ఏకరీతిన సాగిన రామాయణ కావ్యమంతా ఉత్తరకాండలో ముక్కలు ముక్కలుగా కథలు కథలుగా ఎందుకు విడిపోయింది? సాధారణంగా ఒక కావ్యాన్ని కవి రచించినప్పుడు ఫలశ్రుతితో ముగిస్తాడు. వాల్మీకి యుద్ధకాండ చివరన ఫలశ్రుతి స్పష్టంగా ఉన్నది.

‘ప్రజలు ఎక్కడ చూచినా రాముడు, రాముడు, రాముడు అని ఎల్లప్పుడూ రాముడిని గూర్చిన కథలు చెప్పుకొనిరి. రాముడు రాజ్యమును పాలించు కాలములో జగత్తు అంతా రామమయం అయిపోయెను. అప్పుడు వృక్షములు ఎట్టి వ్రణములు అనగా క్రిమి కీటకాదుల వలన గాయములు లేక నిత్యము పుష్పఫలములతో నిండి యుండెను. మేఘము తగిన కాలమునందు వర్షించుచుండెను. వాయువు స్పర్శ సుఖకరముగా యుండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దురాశలేక తమ తమ పనులతోనే తృప్తి చెందుచు తమ తమ కర్తవ్యములు చేసికొనిచుండిరి. రాముడు రాజ్యము పాలించుచుండగా ప్రజలు ధర్మ తత్పరులై అసత్యమనేది లేక నివసించుచుండిరి. ప్రజలందరూ ఉత్తమ క్షణ సంపన్నులే అందరూ ధర్మమునందు ఆసక్తి కలవారే. రాముడు ఈ విధముగా పదివేల సంవత్సరములు రాజ్యము చేసెను. (శ్రీమద్రామాయణము యుద్ధకాండ, 103-106). అంతేకాదు.. ‘ఓ జనులారా.. పూర్వము ఈ విధముగా జరిగిన ఈ ఇతిహాసమును అడిగినవారికి నిర్భయముగా లేదా దృఢ విశ్వాసముతో చెప్పుడు. మీకు క్షేమమగుగాక. విష్ణువు బలము వృద్ధి చెందుగాక. ఈ రామాయణమును పఠించిన.. వినిన దేవతలు అనుగ్రహించెదరు. రామాయణమును వినుటచే.. పితృదేవతలు సంతోషింతురు…. (శ్రీమద్రామాయణము యుద్ధకాండ 128వ సర్గ.. 121-125).. ఇది వాల్మీకి రామాయణంలో యుద్ధ కాండ చివరన ఉన్న ఫలశ్రుతి. దీన్ని కావ్యానికి ముగింపు అంటారే తప్ప కొనసాగింపు కానేరదు. అలాంటప్పుడు ఉత్తర కాండ ఎక్కడినుంచి పుట్టుకొచ్చింది? ఆ ఉత్తరకాండను వాల్మీకి రాశాడని ఇన్నేండ్లుగా ప్రచారం జరుగుతుంటే.. దీనిపై ఒక హేతుబద్ధమైన చర్చ జరిగి.. పరిశోధన చేసి.. నిజానిజాలు నిర్ధారించాల్సిన పండిత ప్రకాండులు సైతం.. ఉత్తర రామాయణాన్ని అనువాదాల మీద అనువాదాలు చేస్తూ ఎలా చేస్తూపోయారంటే వారు ఉత్తర రామాయణాన్ని విశ్వసించారా? లేదా అందులోని నాటకీయ కథలు వారిని ఆకర్షించాయో తెలియదు.

ఉత్తరరామాయణం అన్నది పూర్తిగా రామాయణానికి భిన్నమైన ఆఖ్యానం. మూలకథతో ఏ విధంగానూ సంబంధం లేని కథలన్నింటినీ గుదిగుచ్చి రాముడి చరిత్రకు పంకిలం అంటించేందుకు చేసిన ఒకానొక మహాదుర్మార్గమైన కుట్ర. రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేందుకు వంచనపరుల దురాగతానికి ఉత్తర రామాయణం ఒక మచ్చుతునక. ఈ మాట ఊరకే అనడం లేదు. ఇవాళ నేను మాత్రమే వ్యాఖ్యానించడం లేదు. ఇంతకుముందు చాలామంది చెప్పారు. చెప్తూనే ఉన్నారు.

రామాయణ ఉత్తరకాండ కర్తృత్వంపై దేశవ్యాప్తంగా సుదీర్ఘమైన చర్చే జరిగింది. వాదోపవాదాలూ జరిగాయి. మనకు తెలిసినంతవరకు రామాయణ ఉత్తరకాండ కథనానికి సంబంధించి మనకు సమీప అతి ప్రాచీనంగా కనిపిస్తున్నది భవభూతి ఉత్తర రామచరిత్ర నాటకం. భవభూతి క్రీస్తుశకం 8వ శతాబ్దానికి చెందినవాడు. రామాయణ మూలకథకు భిన్నంగా సీతా పరిత్యాగాన్ని ఇతివృత్తంగా తీసుకొని.. కల్పిత పాత్రలతో కరుణ రసాత్మకమైన నాటకాన్ని రచించాడు. ఇది ఏడు అంకాల నాటకం మాత్రమే. ఈయన ఇతివృత్తాన్ని వాల్మీకి రామాయణం నుంచి స్వీకరించాడా? లేక.. కథనాన్ని కల్పితం చేశాడా అన్నది ఆలోచిస్తే.. ప్రచారంలో ఉన్నకథనం కంటే.. భవభూతి కల్పితమే ఎక్కువగా గోచరిస్తుంది. ప్రచారంలో ఉన్న కథకు పూర్తి భిన్నంగా కొత్త కథనాన్ని సృష్టించి నిర్మించాడు. ఇందులో సీత పరిత్యాగం ఒక్కటే ఉత్తరకాండగా చెప్పే భాగంలోని ప్రచారంలో ఉన్న అంశం. మిగతా అన్నీ కూడా భవభూతి సొంత కథే. వాల్మీకి ఆశ్రమానికి చేరిన సీత.. గంగలో దూకుతుంది. గంగలోనే ఇద్దరు కవలలను కంటుంది. ఆ కవలలను గంగ.. వాల్మీకి ఆశ్రమానికి చేరుస్తుంది. సీత పాతాళలోకంలో భూదేవి, గంగతో కలిసి ఉంటుంది. అశ్వమేథయాగం సమయంలో లక్ష్మణుడి కుమారుడు చంద్రకేతువు వచ్చి లవుడితో యుద్ధంచేస్తాడు. చివరకు సీతారాముల కలయికతో నాటకం ముగుస్తుంది. ఈ కథనం అంతా నాటకీయత కోసం భవభూతి స్వతంత్రీకరించిందా? లేక.. జానపదుల్లో ప్రచారంలో ఉన్న కథలనుంచి ఈ రకమైన కథనాన్ని స్వీకరించాడా? ఎందుకంటే.. సీతారాములు.. భారతదేశ సమాజంలో అంతర్భాగమైనవారు. దాదాపు అన్ని సమాజాల్లోని జనజీవనాల్లోనూ సీతారాములు మమేకమై ఉంటారు. సీతారాముల పాత్రలతో జానపదులు వేలు.. లక్షల కొద్దీ కథలు అల్లుకున్నారు.. చెప్పుకుంటూ వచ్చారు. భవభూతి స్వతంత్రీకరించిన నాటక ఇతివృత్తం కూడా ఇలాంటిదేనా? పండితులు చెప్పాలి.

వాల్మీకి రామాయణానికి సంస్కృతంలో మూడు వ్యాఖ్యానాలు లభిస్తాయి. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైనది.. ప్రాచీనమైనది గోవిందరాజ్ వ్యాఖ్యాన సహితం. గోవిందరాజ్ తన గురించి.. తన గురువు గురించిన పరిచయం రామాయణం బాలకాండ మొదట్లో.. యుద్ధకాండ చివరలో పేర్కొన్నారు. మధ్యలో ఎక్కడ కూడా తన గురించిన ప్రస్తావన చేయలేదు. గోవిందరాజ్ ముందు ఉత్తరకాండ ఉన్నట్టయితే.. ఆయన తన పరిచయాన్ని యుద్ధకాండకు బదులు ఉత్తరకాండలో ఇచ్చేవాడు. 19వ శతాబ్దం ప్రారంభం వరకు గోవింద్‌రాజ్ వ్యాఖ్యాన సహిత రామాయణం పలుమార్లు ప్రచురితమైంది. అందులో ఎక్కడా ఉత్తరకాండకు వ్యాఖ్యానం లేదు. 1930లో వచ్చిన సంస్కరణలో ఉత్తరకాండకు కూడా గోవిందరాజ వ్యాఖ్యానం ప్రచురితమైంది. మొదటి ఆరు కాండలకు.. చేసిన వ్యాఖ్యానానికి.. ఉత్తర కాండ వ్యాఖ్యానానికి పొంతనే ఉండదు. ఇది తరువాత చేర్చిందేనని స్పష్టంగానే అవగతమవుతుంది.

వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో రామాయణ అనువాదాలు వచ్చాయి. తమిళంలో కంబ రామాయణం, తెలుగులో రంగనాథ రామాయణం, కన్నడంలో తోరవే రామాయణం, హిందీలో తులసీదాస్ రామచరితమానస్ ఇలా అనేకం వచ్చాయి.

కంబ రామాయణం: దీని రచనాకాలం దాదాపు 12 వ శతాబ్దం. ప్రాంతీయ భాషల్లో వెలువడిన రామాయణాల్లో బహుశా ఇదే అతి ప్రాచీనమైందని చెప్పవచ్చు. మహాకవి కంబన్ ఈ కావ్యానికి కర్త. ఈ తమిళ రామాయణం 1962లో బీహార్ రాజ్‌భాషా పరిషత్ హిందీలోకి అనువాదం చేయించింది. ఇందులో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకే రామాయణ గాథ ఉన్నది. పట్టాభిషేకం అనంతరం రాముడు దర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రశంసించడంతో ఈ కావ్యం ముగుస్తుంది. ఈయనకు కూడా ఉత్తరకాండ లభించలేదేమో.. ఒకవేళ ఉండి ఉంటే.. కచ్చితంగా రాసేవాడే కదా.. ఆరు కాండలతోనే ముగించాల్సిన అవసరం ఏమున్నది?

రంగనాథ రామాయణం: రంగనాథ రామాయణం తెలుగు రామాయణం. దాదాపుగా క్రీస్తుశకం 1380 ప్రాంతాల్లో రచించబడింది. దీనికి 1961 బీహార్ హిందీ పరిషత్ వారే హిందీలోకి అనువదింపచేశారు. ఇది కూడా యుద్ధకాండలో రాముడి పట్టాభిషేకం.. రాజదర్బారు దృశ్యంతోనే ముగిసిపోతుంది. రంగనాథ రామాయణం కూడా ఉత్తరకాండ గురించి ప్రస్తావించలేదు.

తోరవే రామాయణం: ఇది కన్నడ రామాయణం. 15వ శతాబ్దిలో తోరవే నరహరి ఈ రామాయణాన్ని రచించాడు. రాముడు పట్టాభిషక్తుడు కావడం, సుగ్రీవాది ప్రముఖులకు రామచంద్రుడు వీడ్కోలు పలకడం, అనంతరం రాముడి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించడం.. ఆ తర్వాత రామాయణం విన్నా.. చదివినా జరిగే లాభాల గురించి వర్ణించడంతో ఈ రామాయణ కావ్యం ముగుస్తుంది.

ఆధునిక కాలంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణం ఆరు కాండలేనన్నారు. రామాయణ కల్పవృక్షాన్ని అంతవరకే రాశారు. ఉత్తరకాండను ఆయన అంగీకరించనేలేదు.

ది ఇలియడ్ ఆఫ్ ఈస్ట్ అన్న పేరుతో ఫ్రెడ్రికా రిచర్డ్‌సన్ రామాయణాన్ని ఇంగ్లీష్‌లో రాశారు. ఈ కావ్యాన్ని మాక్‌మిల్లన్ అండ్ కో 1870లో అచ్చువేసింది. రిచర్డ్‌సన్ కూడా రామాయణం ఆరు కాండలతోనే ముగించాడు. ఉత్తరకాండ రాయడానికి ఈయనకేం భేషజాలు ఉండాల్సిన అవసరం లేదు కదా.. మరి ఎందుకు రాయలేదో..

1874లో రాల్ఫ్ టీ హెచ్ గ్రిఫిత్ రామాయణాన్ని ఇంగ్లీష్‌లోకి అనువదించాడు. ఈ గ్రంథాన్ని లండన్‌లో ట్రబ్నర్ అండ్ కో, భారత్‌లో బనారస్‌కు చెందిన లాజరస్ అండ్ కో ప్రచురించాయి. ఇందులోనూ రామాయణం ఆరు కాండలతో ముగుస్తుంది. యుద్ధకాండ ముగింపులో అనువాదకుడు గ్రిఫిత్ ఉత్తరకాండ ప్రస్తావన చేశాడు.

`The Ramayan ends epically complete, with triumphant return of rama and his rescued queen to ayodhya and his consecration and coronation in the capital of his forefathers even if the story were not complete, the conclusion of the last canto of the sixth book evidently the work of a later hand than valmiki`s, which speaks of Rama`s glorious and happy reign and promises blessings to those who read and hear the ramayan, would be sufficient to show that when these verses were added, the poem was considered to be finished`

గ్రిఫిత్ కూడా ఉత్తరకాండ ఇతరులు రాశారని స్పష్టంగానే పేర్కొన్నాడు. మనదేశంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంటుంది. మనవాళ్లు చెప్పింది ఏదైనా.. ఎలాంటిదైనా సరే మనవాళ్లు నమ్మరు. ఆ మధ్య కొన్నేండ్ల క్రితం అమెరికాలో ఎవరో ఒక పరిశోధకుడు ఉదయాన్నే పెరుగన్నం తింటే ఆరోగ్యం బాగుంటుందని ఓ రిసర్చ్ పేపర్ రాసి డాక్టరేట్ తెచ్చుకున్నాడు. అది పీటీఐలో వార్త వస్తే.. మేము మహాద్భుతమని కండ్లకద్దుకొని పత్రికలో వార్త రాసుకొన్నాం. ఆశ్చర్యమేసింది. మన దేశంలోని దాదాపు అన్ని దేవాలయాల్లో.. ముఖ్యంగా దక్షిణభారత దేవాలయాల్లో ఉదయాన్నే స్వామివారికి లేదా అమ్మవారికి బాలభోగం కింద దద్ధోజనం పేరుతో నైవేద్యం సమర్పించేది పెరుగన్నమే కదా.. దాన్నే కదా.. భక్తులకు ప్రసాదంగా పెట్టేది. విచిత్రంగా లేదూ.. అందుకే రామాయణం విషయంలోనూ బయటివాళ్లు చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ ప్రస్తావించాలని భావించాను. మరో విదేశీ విద్వాంసుడు హర్మన్ జాకోబ్ దాస రామాయణం రాశారు. ఇందులో ఆయన ఒకచోట.. ‘మన ప్రాచీనమైన అనేక రచనల్లో ఒక్కో కొత్త తరం.. ఎంతో కొంత కొత్త భాగాన్ని జతచేరుస్తూ పోయింది. లేదా పాత పాఠాంతరానికి మరమ్మతు చేసింది. కానీ.. మూల రచనకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడింది. రామాయణంలో కూడా ఇలాంటి మార్పులు జరిగాయి. ఇవి మనకు స్పష్టంగానే గోచరిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు. రామాయణంలో ప్రక్షిప్త భాగాన్ని ఆయన విస్పష్టంగానే తేల్చిచెప్పారు.

వీటన్నింటికంటే ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది తులసీదాస్ రామచరితమానస్ గురించి. వాల్మీకి తరువాత అంతటివాడు తులసీదాస్. ఆయన రామచరితమానస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తులసీదాస్ 1511-1623 మధ్య కాలంలో జీవించి ఉన్నవాడు. అంటే అప్పటికే మనదేశంపై తురుష్కులు బాగా పాగా వేసిన కాలం. ఈయన రామచరితమానస్ లోని ఉత్తరకాండలోని విభాగాలను తరచిచూడండి. కొంత విస్తారంగానే ఇక్కడ ప్రస్తావిస్తున్నా.. 1. భగవన్నుతి, 2. అయోధ్యలో శ్రీరామభరతుల సమాగమం, 3. శ్రీరామ పట్టాభిషేకం, 4. వేదపురుషులు శ్రీరాముని స్తుతించుట, 5. పరమేశ్వరుడు శ్రీరాముని స్తుతించుట, 6. సుగ్రీవాదులకు వీడ్కోలు, 7. రామరాజ్యము, 8. సనకాదులు శ్రీరాముని దర్శించుట. 9. సోదరులకు శ్రీరాముని ఉపదేశము. 10. పౌరులకు శ్రీరాముని హితబోధ. 11. శ్రీరామునకు వశిష్ఠుని విన్నపము, 12. నారదుడు శ్రీరాముని స్తుతించుట, 13. కాకభుశుండి వృత్తాంతము. 14. సంక్షిప్త రామాయణం, 15. మాయా ప్రభావము. 16. భుశుండి పూర్వజన్మ వృత్తాంతము, 17. కలియుగ లక్షణములు, 18. భుశుండికి శివుని శాపము. 19. పరమేశ్వర స్తవము, 20. భక్తిమార్గ వైశిష్ట్యము, 21. సప్త ప్రశ్నలు- సమాధానములు, 22. శ్రీరామకథా శ్రవణ ఫలము, 23. ఈ పాఠ్య విశేషముల గురించి ఒక్కమాట, 24. శ్రీరామ శలాకా ప్రశ్నావళి, 25. శ్రీ జానకీ జీవనాష్టకమ్, 26. శ్రీరామాయణ హారతి, సంకీర్తన, 27. శ్రీరామ మంగళాశాసనమ్.

వీటిని జాగ్రత్తగా గమనిస్తే.. ప్రస్తుతం ఉత్తరకాండలో కనిపించే ఏ ఒక్క కథనం కూడా ఇందులో మచ్చుకు కూడా కనిపించదు. మరింత జాగ్రత్తగా పరిశీలిస్తే.. యుద్ధకాండ చివరలో రావణ వధానంతరం అయోధ్యకు సీతారాముల రాకతో తులసీదాసుడి ఉత్తర కాండ ప్రారంభమవుతుంది. ఆ తరువాత పట్టాభిషేకము.. పరిపాలన తదితర అంశాలు వరుసగా వస్తాయి. ఇది యుద్ధకాండకు కొనసాగింపుగా ఉంటుంది. మరి తులసీదాసుకు మనం ఇప్పుడు చూస్తున్న ఉత్తరకాండ కనిపించలేదా? కనిపించినా ఎందుకు వదిలేశాడు?

ఇక్కడ మనం మరింత స్పష్టపరచుకోవలసిన విషయమేమంటే.. ప్రస్తుతం మనకు కనిపించే ఉత్తరకాండ.. మిగతా ఆరు కాండలకు కొనసాగింపు ఎంతమాత్రం కాదు. ఉత్తరకాండలోని తొలి సర్గతోనే దాని లక్ష్య లక్షణాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. తొలి సర్గ రాక్షసుల వర్ణనతో ప్రారంభమవుతుంది. ఇంద్రజిత్, కుంభకర్ణాదుల పరాక్రమం.. వీర విక్రమాదుల వర్ణనలతో మొదలవుతుంది. అది కూడా ఆత్రేయ, నముచి, ప్రముచి, అగస్త్యుడు, అత్రి, సుముఖుడు, విముఖుడు, కవషి, ధౌమ్యుడు, కౌషేయుడు వంటి రుషులతోపాటు, వశిష్టుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు కూడా వచ్చి.. రాక్షసులను పొగడటంతో ప్రారంభమవుతుంది. రావణాదులు, మేఘనాథుడు, కుంభకర్ణుడు, విరూపాక్షుడు, మెదరుడు, ప్రహస్తుడు, వికటుడు.. ఇలాంటి వారందరినీ కేవలం అదృష్టవశాత్తూ నీవు చంపగలిగావు అని అంటారు. అదృష్టవశాత్తూ చంపడమేమిటి? రాముడి వీరవిక్రమాదులన్నీ ఏమైపోయాయి?

ఇదేంటి మీరు రాక్షసులను పొగుడుతున్నారు అని రాముడు అడుగుతాడు.. ముఖ్యంగా ఇంద్రజిత్తును వారు ఎక్కువగా పొగుడుతుంటారు. అప్పుడు ఇంద్రజిత్తును స్పెషల్‌గా పొగుడుతున్నారు? ఆయన కథ చెప్పండి అని ప్రశ్నిస్తాడు రాముడు? అప్పటికే ఇంద్రజిత్తును చంపేశాడు కదా లక్ష్మణుడు. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడే.. ఇంద్రజిత్ గురించిన ప్రస్తావన యుద్ధకాండలో వస్తుంది. పర్టిక్యులర్‌గా మళ్లీ కథ చెప్పాల్సిన అవసరం ఏమి వచ్చింది?

ఇంద్రజిత్తు కథ ప్రారంభంతోనే ఉత్తరకాండలోని తొలి సర్గ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇంద్రజిత్తు కథ, రావణాసురుడి వీరపౌరుషాదులు అన్నీ కూడా వరుసపెట్టి వస్తాయి. తొలి ఆరుకాండల్లో ఎక్కడా లేని ఈ ప్రశంసావాక్యాలు.. ఉత్తరకాండలో చాలా చాలా ఎక్కువగా కనిపిస్తాయి! రాక్షసులను అదే పనిగా ప్రశంసించడం.. రాముడి వ్యక్తిత్వాన్ని తక్కువచేయడం లక్ష్యంగా ఇందులోని కథనాలు ఒక్కటొక్కటిగా మనకు కనిపిస్తాయి. రాక్షసులు గొప్పవారే అయితే.. ఏదో లక్కీగా రాముడు వాళ్లను గెలవడం వాస్తవమే అయితే.. మొదటి ఆరు కాండల్లో రాయడానికి వాల్మీకికి అడ్డం పడ్డవారెవరు? అంతా రాసేసి.. పదివేల ఏండ్లు పాలించి స్వర్గానికి వెళ్లిపోయాడని రాసేసిన తర్వాత.. తీరిగ్గా కూర్చున్నప్పుడు వాల్మీకికి రాక్షసుల గొప్పతనం.. రాముడి తక్కువతనం గుర్తుకొచ్చాయా?

వాల్మీకి రామాయణం తొలి ఆరు కాండల్లో రాముడు సంపూర్ణంగా మనిషిలాగానే కనిపిస్తాడు. బాల్యం నుంచి పట్టాభిషేకం దాకా మనలాగానే అన్ని కష్టాలు, సుఖాలు, కోపతాపాలు, అలకలు.. అనునయాలు అన్నీ అనుభవించాడు.. చేశాడు. యుద్ధ కాండ వరకూ రాముడు ఇలాంటి సామాన్య మానవ క్షణాలతోనే కనిపిస్తాడు. కోపం ఉంటుంది. ప్రేమ ఉంటుంది.. భార్య కిడ్నాప్ అయితే వలవల ఏడుస్తాడు. ఫ్రెండ్‌కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ప్రజాజీవితంలో అడుగుపెట్టేముందు రాజు ఎలా ఉండాలో అలాగే వ్యవహరిస్తాడు. ఎక్కడ కూడా దేవతా ఛాయలు కనిపించవు. కానీ ఉత్తర కాండలో రామచంద్రుడు తాను విష్ణువు అవతారంగా దర్శనమిస్తాడు. మనుజుడను నేను.. మనుజ ధర్మంబు నాది.. అన్న రాముడు ఉత్తరకాండలో విష్ణువుగా ఎలా మారిపోయాడన్నది అస్పష్టం. క్రీస్తు శకం ఏడో శతాబ్దం నాటికే భారతదేశంలో ముస్లిం రాజుల ఛాయలు కనిపించనారంభించాయి. గుజరాత్‌లో అప్పటికే కొందరు ముస్లిం రాజులు ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో మామ్లుక్ వంశం, ఉమయ్యాడ్ ఖాలీఫత్‌కు చెందిన మహ్మద్ బీన్ ఖాసిం తదితరులు భారత్‌లో పాగా వేశారు. అప్పటినుంచే క్రమంగా భారతీయ సారస్వతంలో మార్పులు, చేర్పులు మొదలయ్యాయేమో..

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here