లోకల్ క్లాసిక్స్ – 50: తొలి న్యూవేవ్‌తో మృణాల్

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మృణాల్ సేన్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘భువన్ షోమ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘భువన్ షోమ్’ (హిందీ)

[dropcap]బెం[/dropcap]గాలీ సమాంతర సినిమాల త్రిమూర్తులైన సత్యజిత్ రే, మృణాల్ సేన్, ఋత్విక్ ఘటక్ లలో రే, సేన్ లు భిన్న ధృవాలు. రే సినిమాలు ఆశావాదం, ప్రేమ, సుఖాంత సాఫల్య చిత్రణలతో నిండి వుంటే, సేన్ సినిమాలు నిరాశావాద దృక్పథంతో, చీకటి కోణాల స్పర్శతో, రాజకీయ సంకేతాలిచ్చే, ఆకస్మిక ముగింపులతో వుంటాయి. ఆయన మార్క్సిస్టు కావడంతో ఈ తేడా. పైగా రే దేశీయ సమాంతరమైతే, సేన్ విదేశీయ సమాంతరం. ఫ్రెంచి న్యూవేవ్ సినిమాకి దేశీయ నమూనా ఇచ్చి, దేశీయ సమాంతర సినిమాని న్యూవేవ్ దిశగా మళ్ళించాడు.

ప్రారంభ దినాల్లో ఏకంగా ఫ్రెంచి న్యూవే సినిమా మాంటెజెస్ కళని ఉన్నదున్నట్టు, ఒకలాంటి కసితో, ఎవరేమనుకుంటే ఏమిటని, మొహమాటం లేకుండా బాహాటంగా అనుకరించాడు. ఇది ఫోర్సుడుగా కనిపించినా వెరవ లేదు. 1969 లో ‘భువన్ షోమ్’ తో ఇలా జరిగింది. ‘భువన్ షోమ్’ కి పూర్వం 1955 నుంచి ’66 వరకూ తీసిన 8 బెంగాలీ దేశీయ సమాంతరాలతో ఏమీ లాభం లేకపోయింది. 1969లో దిశమార్చి హిందీలో ‘భువన్ షోమ్’ అనే ఫ్రెంచి న్యూవేవ్ సినిమా నమూనాని ప్రతిపాదించడంతో, సేన్ దశ మారిపోయింది. సమాంతరానికి న్యూవేవ్ పితామహుడయాడు.

ఇప్పుడు 52 ఏళ్ళ తర్వాత, 2021 కళ్ళతో ‘భువన్ షోమ్’ని చూస్తే, ఇవ్వాళ మనమున్నది ‘భువన్ షోమ్’ లోకం లోనే కదా అన్పించక మానదు. భువన్ షోమ్ అనే ఈ డాబుసరి వ్యక్తి కోవిడ్‌ని చూడలేదు. కానీ 1969 దగ్గరే ఠీవీగా నిలబడి చెప్తున్నట్టు అన్పిస్తాడు- నేను చెప్పలేదా ఇంటా బయటా భౌతిక దూరం అవసరమనీ? నా వెనకాల నన్ను చూసి నవ్వుకుంటారా? ఇంతలో కోవిడ్ సెకండ్ వేవ్ రాలేదా? నేను తిననూ, తిననివ్వనూ అంటే తిట్టుకుంటారా? ఇన్నిన్ని సీబీఐ కేసులతో నాయకులు లబోదిబో మనడం బావుందా? నేను పక్షుల వేట కెళ్తే చట్టవ్యతిరేక మన్పించిందా? ఇప్పుడు అన్నలు అడవుల్లో చట్టాన్ని వేటాడుతోంటే బావుందా? నేను వేటగాడిలా పక్షులకి అన్పించకూడదని, పల్లె పడుచు నా వేషం మారిస్తే, కుట్రలో భాగస్వామి అయిందా? అన్నలకి తోడ్పడే అడవి పడుచుల మాటేమిటి? నేను రైలు పట్టాలు వదిలేసి జోడెడ్ల బండి మీద పడితే నవ్వొచ్చిందా? మీ రైలు ముప్ఫై మైళ్ళు వెనక్కి పరిగెడితే బావుందా? ఒరిస్సా వెళ్ళాల్సిన రైలు బెంగుళూరు చేరుకుంటే మరీ బావుందా? మనుషులే వుండని స్టేషన్‌కి నేను పెద్ద రైల్వే ఆఫీసర్‌గా అతిగా అన్పించానా? ప్రైవేటు దొరల చేతిలో పురుగే వుండని రైల్వే ప్లాట్‌ఫామ్స్‌ని రేపు మీరు చూడబోరా? నేను సొంత కొడుకునే అవినీతి కేసులో పట్టిస్తే కోపమొచ్చిందా? ఆ రోజు 2042 కైనా మీకూ రాబోదా?… ఇలా చాలా నిలదీస్తాడు భువన్ షోమ్.

కథ

భువన్ షోమ్ (ఉత్పల్ దత్) రైల్వేలో పెద్దాఫీసరు. ధూమ్ ధాం చేస్తాడు. అవినీతిని అస్సలు సహించడు. ఒక టికెట్ కలెక్టర్‌ని పట్టుకుని సస్పెండ్ చేస్తాడు. భార్య లేదు, కొడుకుని అవినీతి కేసులో పట్టించాడు. ఒంటరిగా వుంటాడు. ఎవర్నీ దగ్గరికి రానివ్వడు. హుష్ అంటే తన చుట్టూ మనుషులు పక్షుల్లా ఎగిరి పోవాలని కోరుకుంటాడు. సిగార్ పీలుస్తాడు. బెంగాలీ అయినందుకు గర్విస్తాడు. పిచ్చిగా తనలో తాను నవ్వుకుంటాడు. తానో గొప్ప పక్షి వేటగాణ్ణని నమ్ముతాడు. పక్షి శాస్త్రాన్ని చదువుతాడు. ఉన్నట్టుండి పక్షుల్ని వేటాడాలన్పించి, సెలవు పెట్టి తుపాకీ పట్టుకుని బయల్దేరతాడు.

రైలులో వెళ్ళి వెళ్ళి సౌరాష్ట్ర ఎడారి చేరుకుంటాడు. అక్కడ దున్నపోతు వెంటబడితే ఓ పల్లె పడుచు కాపాడి ఇంటికి తీసి కెళ్తుంది. ఈ పల్లె పడుచు గౌరి (సుహాసినీ మూలే) తను సస్పెండ్ చేసిన టీసీ ఆ భార్యేనని తెలుసుకుని తేలు కుట్టిన దొంగలా వుంటాడు. ఆ సస్పెండ్ చేసిన కోపిష్టి ఆఫీసర్ తనేనని బయట పడకుండా నటన మొదలెడతాడు. ఇలా పక్షుల వేట కొచ్చిన అతడికి వేట కూడా నేర్పుతూ, మనుషులతో మెలగడం కూడా నేర్పుతూ, మనుషులతో కలిసి జీవించడం కూడా నేర్పుతూ వుండేసరికి, మారిన మనిషై పోతాడు భువన్ షోమ్ అనే పరమ మొండి ఘటం …

ఎలా వుంది కథ

ఇది బాలాజీ చంద్ ముఖోపాథ్యాయ్ రాసిన బెంగాలీ కథ. ఈ కథ దూరదృష్టితో సార్వకాలిక కథగా రాసినట్టు అన్పిస్తుంది నేటి కాలానికీ వర్తించే అనేక సింబాలిజాలతో. నిజానికిది సినిమా నిడివంత కథ కాదు. షార్ట్ ఫిలిమ్‌కి సరిపోయే కథ. అందుకని సినిమాకి పెంచడానికి దృశ్యాల్ని పరిమితికి మించి సాగదీయడం కనిపిస్తుంది. భువన్ షోమ్ జోడెడ్ల బండెక్కి వెళ్ళే దృశ్యం పది నిమిషాలకి పైగా సాగుతుంది. అలాగే దున్నపోతు వెంట పడే దృశ్యం నాలుగు నిమిషాలకి పైనే వుంటుంది. పాత్రల మధ్య ఏమీ జరగని దృశ్యాలు కూడా నిశ్శబ్దంతో గ్యాప్ తీసుకుంటాయి.

ఈ కథ ప్రధానంగా భువన్ షోమ్ వ్యక్తిత్వ అధ్యయనం. ఈ అధ్యయనానికి ఉత్పల్ దత్ అనితర సాధ్య నటన బలాన్నిచ్చింది. ఈ బంగాలీ నటుడు తర్వాత హిందీ సినిమాల్లోకి వెళ్ళి అనితర సాధ్యమైన కామిక్ విలనీతో, చూసే చూపుతో, డైలాగులు పలికే తీరుతో వెర్రెత్తించాడు. భువన్ షోమ్‌లో ఉత్పల్ దత్ భువన్ షోమ్ గా కన్పించడు, భువన్ షోమే ఉత్పల్ దత్ గా కనిపిస్తాడు. కొంత తిక్క, కొంత పైశాచికానందం, కొంత సూడో ఆఫీసరీ తనం, మరికొంత అపర మేధావితనం. ఇవన్నీ గౌరీ చేతిలో శుభ్రంగా లైఫ్ బాయ్ స్నానమై, మనిషిలాటి మనిషై మంచి సుగంధాలు వెదజల్లడం.

గౌరీగా అమాయక పాత్ర అద్భుతంగా నటించిన సుహాసినీ మూలే ఆ తర్వాతి కాలంలో హిందీలో పెద్ద క్యారక్టర్ నటి అయింది. ఇదే భువన్ షోమ్ అమితాబ్ బచ్చన్‌కి కూడా బాలీవుడ్ కి టికెట్టిచ్చింది. భువన్ షోమ్‌కి అతను వాయిసోవర్ ఇస్తూ సినిమా రంగ ప్రవశం చేశాడు. ఆ వాయిస్ నిర్మాతల్ని ఆకర్షించింది. మిగతాది చరిత్ర. మృణాల్ సేన్ దీన్ని పూర్తి స్థాయి ఫ్రెంచి న్యూవేవ్ శైలిగా తీయలేదు. భువన్ షోమ్ వ్యక్తిత్వ చిత్రీకరణ కోసం అలాటి మాంటేజెస్ ప్రయోగించాడు. అదే పెద్ద సంచలనమైంది. మూడు జాతీయ అవార్డులు లభించాయి. నేటికీ ఈ న్యూవేవ్ క్లాసిక్ గురించి దేశ విదేశ పత్రికలు రివ్యూలు రాస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here