ప్రేమించే మనసా… ద్వేషించకే!-16

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]“అ[/dropcap]మ్మా, భోజనాలు టేబులు మీద పెట్టాను రండమ్మా!” అని తాయారమ్మ రెండు చేతులు కట్టుకొని వచ్చి నిలబడింది. తాయరమ్మ మాటలకి ముందు తేరుకుంది సునీత! “ఇపుడుపుడే చేయంలే, నువ్వు భోంచేసి వెళ్లి పడుకో” అంది.

“అదేంటమ్మ తమరు చేయకుండానా?  కొద్దిగా అయినా వచ్చి తినండమ్మా!” అంది.

తాయరమ్మ చాలా మంచి మనిషి. సునీతను పెంచి పెద్ద చేసింది ఆవిడే…. తాయారమ్మ అభిమానానికి సంతోషించింది సుజాత! తాయారమ్మకు తన పట్ల వున్న అభిమానం చూసి సునీతకు తాయారమ్మంటే ప్రత్యేక అభిమానం. కాని ఇపుడు తాయారమ్మ అభిమానం చిరాకు అనిపించింది.

“అబ్బబ్బ… వద్దులే తాయారమ్మ!… వద్దులే. చల్లని మజ్జిగ తీసుకురా” అంది ఏం తీసుకోకపోతే ఊరుకునేలా లేదని.

బాధగా వెనుదిరిగింది తాయారమ్మ. పొద్దుట్నుండి సుజాతమ్మగారు చిన్నమ్మగారితో ఏదో బాధపడుతూనే చెబుతున్నారు. ‘యిన్నాళ్లయింది కాని యింత సేపు అమ్మగారు ఎపుడు చిన్నమ్మగారితో మాటలు చెప్పలేదు. అమ్మగారికి ఏం కష్టం తోచిందో పాపం’ అనుకున్న తాయారమ్మ కళ్లలో నీళ్లు నిండుకునాయి. రెండు గ్లాసులు మజ్జిగ తీసుకెళ్లి వాళ్ల ముందు పెట్టి వెళ్లి పోయింది తాయారమ్మ.

ఇంకా సుజాత గత స్మృతుల వలయం నుండి తేరుకోలేని దానిలా కళ్ల మీద చేయి వుంచి వెనక్కి జారపడే వుంది.

“మమ్మీ! టేక్ ఇట్ మమ్మీ!” అని తల్లి వైపు చూసింది. తల్లిని చూస్తేంటే మనసంతా బరువుగా తయారయింది. తను ఒక గ్లాసు తీసుకొని మరో గ్లాసు సుజాత చేతికిచ్చింది. చేతిలో మజ్జిగ గ్లాసు వుందే గాని సుజాత హృదయం బాధతో మూలుగుతుంది. తనకు ఊహ తెలిసినాక ఎపుడు మమ్మీ యింత అప్‌సెట్ కాలేదు. తను యింట్లో లేని సమయంలో ఏ భగవద్గీత చదువుకుంటూనో… లేకపోతే సగం కాలం అనాథ శరణాలయానికి… సేవా సదనానికి వెళ్లి అక్కడ మంచీ చెడ్డలు చూసేది. నిజం చెప్పాలంటే మమ్మీకీ టైం చాలదనే చెప్పాలి. ప్రతి వాళ్లు… మమ్మీ సలహాలు… సహాయాలు అందజేయకపోతే ముందుకు నడవలేం అన్నట్లు వుంటారు. మమ్మీతో కలసి గడిపే కాలమే తక్కువ…. ఆ సమయంలో తామిద్దరి మధ్య యిలా దేని గురించో ఒక దాని గురించి తను అడగటం… దాని మీద మమ్మీ ఎంతో చక్కగా చర్చ జరపడం జరిగేవి. మొదటిసారిగా తల్లి కళ్ల వెంట నీళ్లు చూస్తున్న సునీత ముఖంలో దుఃఖం వెల్లుబుకుతుంది.

“మమ్మీ తీసుకో” అనటంతో ఆలోచనల నుండి తేరుకుని త్రాగింది.

తల్లి చెప్పే దానికి ఆతృత పడే దానిలా సుజాత వైపే చూడసాగింది సునీత.

“ఆ రోజున జరిగిన సంఘటనతో సగం చచ్చిపోయాను. సునీతా, యిప్పటి వరకు ఆ యింట్లో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే చెప్పాను… ఆ రోజు నేను ఎంత ఆవేదనకు లోనయ్యానో చెబుతాను విను.”

“లక్షల ఆస్తిని… తల్లితండ్రులను గడ్డి పరక కన్నా తక్కువగా చూసి వచ్చేశాను… నా భర్త… నా వాడు… తల్లితండ్రులకున్న లక్షల ఆస్తి కన్నా అధికుడని… అతని ప్రేమ అనురాగాల ముందు… ఎవరు… అసలు ఈ ప్రపంచమే నాకు కనిపించలేదు… అతనే నా సర్వస్వమని… అతనే నా ఊపిరి… అసలు నేను పుట్టింది సుదర్శన్ ప్రేమ కోసమే అన్నట్లు పిచ్చి ప్రేమలో వాళ్లు నన్ను ఎన్ని బాధలకు గురి చేసినా… ఎన్నన్నా భరించే దానిని… అటువంటిది ఆ రోజు… నా ప్రాణంకన్నా ఎక్కువ… నాకు తప్ప మరెవరికి ఏం కాదు… నా స్వంతం అనుకున్న సుదర్శన్ గురించి వినకూడని మాటలు విన్నాను… అవి తలచుకుంటేనే నా శరీరం… బాధతో ముల్లు గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది. సునీతా!” అని ఆలోచనల సుడుల్లోకి జారుకుంది సుజాత!

***

మంచం మీద పడుకుంది సుజాత. సరిగ్గా నెలయింది ఆ రోజుకి. నెలయింది హాస్పిటల్ నుండి వచ్చి…. ఎంత లేచి తిరుగుదామనుకున్నా కాళ్లల్లో వణుకు. గుండెల్లో దడ… శరీరం అంతా చెమటలు పట్టటం.

సుదర్శన్ ఇనిస్టిట్యూటు కెళ్లిన దగ్గర్నుండి అత్తగారు, ఆడపడుచు సూటి పోటి మాటలు సుజాత వినేటట్లు అనటం మొదలు పెట్టారు.

“బాగుందమ్మా, పుట్టింటికి వచ్చి సుఖపడదాం అని వస్తే నీ కోడలు మంచం ఎక్కింది. ఇక నీ చేత నా పని కూడా చేయించుకుంటానా? ఆవిడకు లేకపోతే లేదు బుద్ధి, నాక్కూడా లేదనుకున్నవా?”  అని ఎందుకో ఏమిటో తెలియదు సుందరి గొణుక్కోవడం సుజాతకు వినిపించింది.

“ఏం చేయమనంటావు తల్లీ! ఇంటికి అరిష్టం వచ్చింది. చక్కగా ఆరోగ్యంగా తిరిగే ఆయన మంచం పట్టుకుని కోలుకోనేలేదు. ఈవిడగారు మంచం ఎక్కి సేవలు చేయుచుకుంటుంది. హవ్వ, దిక్కుమాలిన పుట్టింటి వాళ్లు. ఎక్కడా చూళ్లేదు… వీళ్లు ఆస్తి మండిపోను… ఎవడికి గొప్ప… అక్కడ నుండి లేచిపోయి ఇక్కడకు వచ్చినాక… ఒక్కసారి వచ్చి చూసిన పాపానపోలేదు. నాకే అలాంటి పుట్టింటి వాళ్లు వుంటే వురిపోసుకు చస్తాను” అంది మీనాక్షి.

మంచం మీద పడుకుని వాళ్ల మాటలు వింటున్న సుజాతకు దుఃఖం ఆగలేదు. ఛ!… ఛ!… వాళ్లు అనుకుంటున్నట్లు ఇంకా తను బ్రతికే వుంది ఎందుకు? మొన్న హాస్పిటల్లోనే చచ్చిపోయివుంటే ఎంత బాగుండును? త్వరగా భగవంతుడు చావు యిస్తే బావుణ్ణు…! అని తొలిసారిగా చావు యివ్వమని భగవంతుని కోరుకుంది. కాని అంతలోనే సుదర్శన్ గుర్తు వచ్చాడు. తను… తను…  తను లేకపోతే సుదర్శన్ బ్రతుకుతాడా! తను కాదన్నది అని పిచ్చివాడై మంచం పట్టలేదు…

“అమ్మ! మాటే…. నాకు… చాలా రోజుల నుండి అనుమానంగా వుందమ్మా! నేను ఊహించింది కరక్టే అనుకో! అయినా ఈ విడగారు వుండగా ఎలా అని అనలేదు. డాక్టరమ్మ ఆర్నెల్లు రెస్టు అవసరం అంది కద! అయినా తర్వాత సుకుమారికి ఆరోగ్యం ఎలాగుంటుందో?

మగవాడు ఎన్నాళ్లు ఊరుకోగలడు? చూసావా తమ్ముడి వాలకం? తమ్ముడు స్వప్న ప్రక్కన కూర్చుని టైపు ఎలా చెయ్యాలో చెబుతుంటే చూడ ముచ్చటగా వున్నారు యిద్దరు జంటగా. పాపం అసలు స్వప్నే వాడి పెళ్లాం కావాలసింది కాదూ! కాలేజీలో ఒక చోట చదువుకో బట్టి… అందులోని తెల్ల తొక్క కదూ… తళుకులు… బెళుకులూ చూపించి వాడిని పడేసుకుంది. కాని వాడికి స్వప్న అంటే యిష్టమే! స్వప్న తమ్ముడుంటే పడి చస్తుంది. తలకి నీళ్లు పోసుకోవటానికి వాడు త్రిమూర్తులుని పిలుస్తుంటే ‘నేను పోయినా బావ తల మీద నీళ్లు’ అని అడిగింది.

వాడొక అమాయకుడు. కంగారుపడిపోయాడు. నిన్న రాత్రి నువ్వు పడుకున్నావా? అన్నం వడ్డించడానికి నేను వచ్చే లోపల చదువుతున్న పుస్తకం ప్రక్కన పెట్టి ‘నేను వడ్డస్తానులే వదినా’ అంది.

అంత దాకా ఎందుకు ప్రొద్దున్న బి.ఎ పుస్తకాలు రెండు మూడు షాపుల్లో అడిగాను దొరకలేదు. నువ్వు కొంచెం నాతో రా బావా షాపులన్ని వెతుకుదాం ఉన్నాయో లేదో? అంది. చదువుకోవాలంటే నేను కొని తెస్తానులే అన్నాడు.

‘ఏం బావా నాతో రావడం యిష్టం లేదా? అలాగైతే నేను రానులే’ అంది. అపుడు చచ్చినట్టు వెళ్లాడునకో.

నేను ఒక కంట వారిని కనిపెడుతునే వున్ననమ్మా. వాడు ఊఁ అనాలేగాని నిముషాల్లో వాణ్ణి చేసుకుంటానికి ఒప్పకుంటుంది. వీడుగాని ఈ రోగిష్టి పెళ్లానికి భయపడతాడేమో!గాని” అంది.

“నెమ్మదిగా మాట్లాడవే సుందరి… అదే జరిగితే అంత కన్నా ఏం కావాలే మనకి. దీని పుట్టింటి వాళ్ళు గుమ్మం ఎక్కలేదు. ఇక ఆడగటానికి వస్తారేమిటి? అమ్మో! సుదర్శన్‌కి యిదంటే వల్లమాలిన ప్రేమ. ఒక పట్టాన ఒప్పుకుంటాడో లేదో!” అంది మీనాక్షి.

“అబ్బబ్బ నువ్వలా చూస్తుండమ్మా! వాడు స్వప్నని చేసుకోకపోతే నన్నుడుగు” అంది సుందరి.

మంచం మీద పడుకున్న సుజాతకు తనను ఎవరో అగాధంలోకి త్రోస్తున్నట్లునిపించింది.

సుందరి చెప్పింది నిజమా? సుదర్శన్ స్వప్నను ఇష్టపడుతున్నాడా? ఇన్నాళ్లు తనకి ఒకే ఒక్కటి ప్రియం అనుకన్న సుదర్శన్ హృదయంలో తనకు గాక వేరొక స్త్రీకి స్థానం వుందా? ఉంటే తను భరించగలదా? భరించడం మాట దేవుడెరుగు… తను ఒక్కక్షణం భరించలేదు. వెర్రిదానిలా రకరకాలుగా ఆలోచిస్తూంటే… చివరికి సుదర్శన్ అన్న మాటలు గుర్తు వచ్చాయి ‘నీకు తప్ప నా హృదయంలో మరెవరికి స్థానం లేదు సుజీ!’

అంతే మరు నిముషంలో అంత వరకు అనుభవించన నరకం మరచి గుండె తేలికయింది… అంతలోనే యిన్నాళ్లు తన స్వంతం… తన సర్వస్వం… అనుకున్న సుదర్శన్ వాళ్లు అనుకుంటునట్లు మారిపోడు కదా? అదంతా సుందరి వూహేనా… లేక… ఏమో!…. ఏమైనా సుదర్శన్ ప్రవర్తనలో అనుమానం వచ్చి… మరి నాలుగు చేర్చి అలా అందా? ఏమో! ఒక కంట కనిపెట్టి చూడాలనుకొంది సుజాత!

తనది అనుకున్న వస్తువుపై మమకారం… ప్రేమ ఆ వస్తువు తాలూకా మనిషికి ఉంటుంది, కాని వేరే వాళ్లకి దానిపై వీసమెత్తు కూడా వుండదు.

ఇది అంతే! తన సర్వం అనుకున్న సుదర్శన్ తనకే స్వంతం, మరెవరికి కాకూడదు అని ఆరాట పడటంలో తప్పు లేదు.

***

సుజీ! సుజీ! అని మృదువుగా మధురంగా పిలవసాగాడు సుదర్శన్.

నిద్దరలో మధురంగా ప్రేమగా వినిపిస్తున్న స్వరం విని కళ్లు తెరిచి చూసింది. ఎదురుగా సుదర్శన్. పళ్ల రసం గ్లాసుతో నిలబడ్డాడు.

“సుజీ! కొంచెం త్రాగి పడుకో” అని మంచం మీద నుండి లేవనెత్తాలన్నట్లు మంచం మీద సుజాత ప్రక్కగా కూర్చొని సుజాతను లేవనెత్తి తన హృదయానికి చేర బెట్టుకొని ఎడం చేతిని సుజాత నడుం చుట్టూ పోనిచ్చి పట్టుకొని కుడి చేత్తో రసం తాగించాడు సుదర్శన్.

రసం త్రాగి అలాగే… సుదర్శన్ గుండెల మీద వాలిపోయింది. ప్రొద్దుట్నుంచి తను అనుభవించిన సంఘర్షణ తాలుకా దుఃఖం అన్నట్లు వెక్కి వెక్కి ఏడ్వసాగింది చిన్న పిల్లలా.

ఎపుడు కళ్ల వెంట నీళ్లు పెట్టని సుజాత ఒక్కసారి బేలగా చిన్న పిల్లలా ఏడుస్తుండటం చూసి కంగారు పడిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతుందని అందుకే ఏడుస్తుందనుకొని “సుజీ! ఈ మాత్రం దేనికే యింతగా బాధపడాలా? లే! కళ్లు తుడుచుకో, కొద్ది రోజుల్లో మామూలు అయిపోతావు… అంతే కాదు నిన్ను యిలా మంచం మీద ఎందుకు బంధించానో తెలుసా? మన కలల పంటకు హాని జరగకూడదని! ఈ మాత్రం దానికే యిలా బెంబేలు పడితే ఎలాగు? ప్లీజ్! సుజీ నువ్వు నా కోసం సంతోషంగా వుండాలి. ఏది… కళ్లు తుడుచుకొని ఒక్కటే నా బుగ్గ మీద తియ్యటి ముద్దు ఇవ్వవూ” అన్నాడు సుజాతని ఊరడించాలని సుదర్శన్.

తను… తను… ఎంత పొరపాటు పడింది? ఇలాంటి ప్రేమమూర్తిని అపార్థం చేసుకుంటుందా? అని మనసులో పశ్చాత్తాపపడింది సుజాత.

రోజులు దొర్లుతున్నాయి. కొంచెం కొంచెం లేచి తిరగగలుగుతుంది సుజాత.

సుజాతను డాక్టరు వద్దకు తీసుకెళ్లాడు సుదుర్శన్. సుజాతను పరీక్షించి “అదృష్టవంతులు మీరు… అసలు ఆ రోజు జరిగిన దానికి అబార్షన్ అయ్యేది. బేబి పొజిషన్ బాగుంది. కాని ఎటొచ్చి తల్లికి రక్తం అసలు లేదు. మంచి డైట్, ప్రొటీన్స్ బాగా యివ్వండి. తర్వాత ముఖ్యమైన విషయం… తల్లి అసలు ఏమి పని చేయకూడదు… అంతే గాదు రెస్టు బాగా అవసరం. అంతే కాదు సెక్సువల్ లైఫ్‌కి దూరంగా వుండాలి కొంత కాలం” అన్నారు డాక్టరు గారు.

ఒక వైపు తల్లి అవుతున్నందుకు సంతోషం, మరో వైపు భర్త సాన్నిధ్యానికి దూరమైనందుకు బాధ సుజాతను వేధించసాగింది. సుదర్శన్ పరిస్థితి అలాగే వుంది. కాని తను బాధపడి బయటపడితే సుజాత మనసు ఎక్కడ బాధపడుతుందో అని పైకి ఏ బాధలేనివాడిలా “సుజీ! మనం… మన ప్రేమకు భగవంతుడు పరీక్ష పెట్టాడు. ఆ రోజు జరిగిన సంఘటనకు ఎంత ఘోరం జరిగేదో?” అన్నాడు వాతావరణం తేలిక పరచాలన్నట్లు సుదర్శన్.

ఏం మాట్లాడాలో తెలియని దానిలా రెండు క్షణాలు కళ్లు ఎత్త సుదర్శన్ వైపు చూసింది. ఆ చూపు నన్ను… నన్ను…. క్షమించు సుదర్శన్… నీకు… నీకు… బాధ కలిగించాను అన్నట్లుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here