[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]
[dropcap]ఒ[/dropcap]కతను కోపముగా “డాలరు… డాలరు ఇవ్వు” అన్నాడు. నా దగ్గర డాలర్లు లేవంటే రెండువేలడిగారు. అక్షరాల రెండు వేలు. అమ్మో అనుకున్నా.
“మీ డస్సు ఎందుకు నలుపు రంగులో వుంది” అడిగాను. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు కానీ మాట్లాడలేదు. నేను 500 రూపాయిల నోటు తీసి ఇచ్చాను. వారు పెద్దగా తృప్తి పడలేదు. నేను ఇంక చెయ్యగలిగినది ఏమీలేక వస్తుంటే వాళ్ళలో ఒకతను లేచి వచ్చాడు.
“మేము అఘోరీలము” అన్నాడు.
“అంటే” అడిగాను.
“వెయ్యి ఇస్తే వివరాలు చెబుతాను” అన్నాడు.
“నీవు జర్నలిస్టువా” అడిగాడు నన్ను.
కాదని తల అడ్డంగా వూపాను. “దర్శనముకై వచ్చాను” అని చెప్పాను.
“సౌత్?” అన్నాడు ఎగాదిగా చూస్తూ. అవునని తలవూపాను. ఎందుకో అతనిది పగటి వేషమనిపించింది. కేవలము డబ్బు కోసము ఈ వేషమేశారా ఏమిటి? అనుకున్నా.
“మీ గురువు ఎవరు?” అని అడిగాను. అతను నేనడిగిన వాటికి సమాధానము చెప్పక తాను చెప్పదలచుకున్న విషయము ఇలా చెప్పుకొచ్చాడు:
పరిశోధనలో అఘోరాలు నాలుగు దశలుగా పూజావిధానాలు సాగిస్తారు..
కొత్తగా అఘోరాగా మారవలసిన వారు ముందుగా కఠిన నియమాలు పాఠించాలి..
శివ పూజ నిరంతరం చేయాలి ..మనిషి మాంసాన్ని తినాలి.. వందరోజుల ఈ దీక్షలో చనిపోయిన వ్యక్తి లభిస్తేనే ఆహారం లేకుంటే లేదు.. తరువాత దశలో గురువు మంత్రోపదేశం చేస్తాడు… ఆ మంత్రాలను పఠిస్తూ సుధీర్ఘమైన ధ్యానం చేయాలి ..నెలల తరబడీ అలా ధ్యానం చేస్తూనే ఉండాలి .. కొన్నాళ్ళు ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే సడలింపు ఉంటుంది, తరువాత సడలింపు ఉండదు.. తరువాత ఈ దశలో ఆ అఘోరా సామాన్యులకు కనిపించడు. అదృశ్య రూపంలో గురువు ఉపదేశించిన మంత్రోచ్చారణ చేస్తూ పది నుండీ పదునైదు సంవత్సరాలు దీక్ష చేస్తాడు. దీక్ష ముగియగానే గురు దర్శనం.. అలాగే ఈ విద్యలను తన స్వవిషయాలకోసం ప్రయోగించననీ అలా చేస్తే తల పేలిపోవాలనీ శాఫాన్ని శిరోధార్యంగా స్వీకరించి.. దీక్ష ప్రారంభిస్తారు
శివాసాయుజ్యం పొంది అఘోరాగా నిత్యం దైవచింతనతో శవానిగా జీవిస్తారు.. అంటూ చెప్పి చెయ్యి చాచాడు. నేను అతనికి రెండు వేల రూపాయుల నోటు ఇచ్చి నమస్కరించాను.
అతను వెళ్ళి అతని ప్రక్కన కూర్చున్నాడు. నేను చూస్తుండగానే ఒక విదేశీ యాత్రిక బృందము వారి ముందు డాలర్లు కుమ్మరించి వింత వింత ఫోటోలు తీసుకోవటము చూశాను. వారు చెప్పిన వివరాలు కొంత ఆసక్తి కలిగించినా నాకు అఘోరీల మీద భయం తగ్గలేదు. కాని నిజంగా వీరు అఘోరీలైతే ఈ డబ్బు కేసము ఈ కక్కుర్తి ఎందుకు. వీళ్ళు వేషగాళ్ళా? అన్న అనుమానము నన్ను వదలలేదు.
ఆ రోజంతా నేను వూరు చూడటానికి నిర్ణయించుకున్నాను. ఒక ఆటోను పిలచి మాట్లాడుకున్నాను. “చూడవలసినవి చూపరా నాయనా” అని ఆటో అతనిపైనే భారము వేసి ఆటోలో కూలబడ్డాను.
***
నేను ముందుగా ‘వారాణస్యాం విశాలాక్షీ’ అనుకొని ముందుగా అమ్మవారైన విశాలక్షి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ దర్శనము చేసుకున్నాను. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో వారణాసి ఒకటి. అమ్మవారు సతిదేవిగా వున్నప్పుడు దక్షప్రజాపతి చేసే యాగానికి పిలుపు లేకపోయినా వెడుతుంది. ఆమెకు అక్కడ అవమానము జరుగుతుంది. అందుచే దక్షుని యజ్ఞవాటికలో యోగాగ్నికి తను దగ్ధమయ్యింది. శివుడు అతిశయించిన కోపముతో జడ నుంచి ఉద్భవించిన వీరభద్రుని పంపి దక్షయజ్ఞవాటికను నాశనము చేయిస్తాడు. తదనంతరము శివుడు మరణించిన సతి శరీరమును భుజము మీద వుంచుకు తిరుగుతుంటే, విష్ణువు సుదర్శనము పంపి ఆమె శరీరమును ముక్కలు చేస్తాడు. ఆమె శరీరము వివిధ ప్రదేశాలలో పడింది. అలా కాశీలో అమ్మవారి కన్నులు పడ్డాయన, అమ్మవారిని విశాలక్షిగా పూజిస్తారు. అమ్మవారి దర్శనము చేసుకున్నాను. తరువాత కాశీలో అమ్మవారు అన్నపూర్ణగా కూడా వున్నది.
‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే।
జ్ఞానవైరాగ్యసిద్ధర్థము భిక్షాందేహీచ పార్వతీ॥’
అమ్మవారు అన్నపూర్ణ దేవిని కొలిచిన జీవితములో అన్నలోపము వుండదు కదా. అన్నపూర్ణమ్మను సదా తలవ వలసిన తల్లి. ఆమె కరుణ వుంటే కడుపు నిండితే ఏ అన్వేషణ అయినా ఫలిస్తుంది.
గురువుకై వెతుకుతున్న కొందరికి అడివిలో వేటగాడు కలసి భోజనపు వేళైయినది తిని వెళ్ళమని కోరుతాడు. ఒక్కరు తప్ప మిగిలిన వారు పట్టించుకోక వెళ్ళిపోతారు. భోజనము చేసిన యాత్రికునకు గురువు దర్శనము కలుగుతుంది. కాదని వెళ్ళిన వారు ఆకలితో గురువు విషయము మరచి తిరుగుతూ నశిస్తారు. అందుకే అన్నపూర్ణ తల్లి కృప వుంటే అంతా పూర్ణమే కదా. అందుకే ఆ తల్లిని నా గురువు వద్దకు నన్ను చేర్చమని కోరి బయటకు వచ్చాను.
తరువాత నేను కాలభైరవ దర్శనముగా చేసుకున్నాను.
ఆయన క్షేత్రపాలకుడు కదా. ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు వుంటాడు. ఆయన అనుమతి లేక ఎవ్వరూ ఆ క్షేత్రములోనికి ప్రవేశించలేరు. కాలభైరవుని కృప వల్లనే నేను వారణాసిలో ప్రవేశించ గలిగానని కృతజ్ఞతతో నేను ఆ స్వామికి నూనెను సమర్పించాను. అక్కడ నూనెను భక్తులు ఒక పెద్ద గిన్నెలో పొస్తూ వుంటారు. తరువాత ఆ నూనెతో అభిషేకము చేస్తారు. అందుకని నేను కూడా నూనెతో అభిషేకము చేసి బయటకు వచ్చాక అక్కడ తాడు కట్టించుకొని బయటకొచ్చాను. మానవులే కాదు కాశీ విశ్వనాథుని యక్ష కిన్నెక విద్యాధర సకల దేవతలూ, సిద్ధులూ కొలుస్తారు. వారిలో ఒకరు ఏదో పాపము చేశారట, కాశీ ప్రవేశము వారికి నిషేదించబడిందట. కుర్తాళము స్వామి వారు కాలభైరవ ఉపాసకులు కూడా. వారు వచ్చి స్వామితో తమ తరుఫున కాలభైరవునకు వినతిని పంపినారట. స్వామి కోరిన మీదట వారికి మళ్ళీ కాశీ నగర ప్రవేశము సంభవించినదని మాకు స్వామి ఒకసారి చెప్పివున్నారు. ఇవి మనకు తెలియని సిద్ధ భూమికలు. స్వామి వారు తపోనిష్ఠులు కాబట్టి వారికి సర్వము తెలుసు. మొత్తానికి నాకు కాలభైరవుని అనుగ్రహము వుంది కాబట్టి కాశీ నగర ప్రవేశము కలిగింది.
మా ఆటో డ్రైవరు నన్ను అక్కడ్నుంచి తులసీ మానస మందిరము తీసుకుపొయాడు. నేను లోపలికి వెళ్ళి రాముని దర్శించి గోడల మీద వున్న రామచరితను చూచి ఆనందపడ్డాను. అటు పై నన్ను దుర్గా దేవి గుడికి తీసుకుపొయినాడు. ఆ గుడి ఎర్రటి రంగుతో ఆశ్చర్యకరమైన ఆర్కిటెక్చరుతో అద్భుతముగా వుంది. నేను అక్కడ దర్శనము, దానము చేసి వచ్చాను. నేను అక్కడ్నుంచి రామనగర్ కోటకెళ్ళాను. కొటకెడుతూ దారిలో నేను బెనరసు హిందూ మహావిద్యాలయము చూశాను. అక్కడ వున్న శివాలయములో దేవదేవుని దర్శించి విశాలమైన ఆ విశ్వవిద్యాలయపు రాజసము చూచి ఆశ్చర్యపోయాను.
రామనగర్ కోట కెళ్ళే సరికే వాన మొదలయ్యింది. వానలో తడుస్తూ ఆ కోటలో అటు ఇటు తిరగటము, కోట కిటికి వద్ద నుంచి గంగా నదిని చూడటము మరవలేని అనుభవాలు. ఆ నగరము ఎన్ని యుగాలను, జనులను, రాజులను చూచినదో. ఆహా! కాశీ రాజు నివాసములో నే తిరుగుతానని ఒక్కనాడు అనుకోలేదు. విశ్వనాథుని ప్రియ భక్తులు ఆ కాశీరాజులు. ఎన్నో కథలలో చదువుకున్నాము కాశీ రాజని. ఆ చందమామ కథలన్నీ గుర్తుకు వచ్చాయి.
బయటకొచ్చాక నేను మా ఆటో డ్రైవరు కలసి లంచ్ చేశాము. కాశి ప్రసిద్ధ మలైలస్సీని త్రాగాము. దాని రుచి అత్యద్భుతముగా వుంది. నేను మళ్ళీ త్రాగాలనుకున్నా నాకు కుదరలేదు.
అక్కడ్నుంచి మేము సారనాథ్ వెళ్ళాము. నేను సారనాథ్‌లో బుద్ధుని దేవాలయాలు చాలా వున్నాయి. అక్కడ వివిధ దేశాలు వారి వారి శిల్పరీతులలో గుడులు కట్టారు. వారి ఆచార వ్యవహారాలు మనకు కనపడి కను విందు చేశాయి.
శ్రీలంక వారు కట్టిక, థాయ్ వారి బౌద్ధ దేవాలయాలను చూశాను. ఆ దేవాలయము ప్రక్కనే వున్న చెట్టు ప్రత్యేకమైనది. ఆ చెట్టు క్రిందనే కదా గౌతమ బుద్ధుడు తన ఐదు మంది మిత్రులకు మొదటి భోధ చేసింది. అందుకే సారనాథ్ బౌద్ధంలోని ముఖ్యమైన ఐదు ప్రదేశాలలో ఒకటి. ఆయన సత్యము కోసము అన్వేషణలో బోధగయ వద్ద వున్న వనములో వైశాఖ పున్నమి రోజున జ్ఞానోదయము కలిగి, తిరిగి సారనాథ్ వస్తాడు. సిద్ధార్థ గౌతముని వదిలిన మిత్రులు ఆయనను రావటము చూచినా దూరముగా వుండాలని అనుకుంటారు. జ్ఞానముతో వెలుగుతున్న ఆయన ముఖములో తెలియని ఆకర్షణకు లోనై ఆయన చెంత చేరుతారు. తను బుద్ధుడనయ్యానని తెలుపుతాడాయన. వారికి అక్కడి చెట్టుక్రింద తనకు తెలిసిన జ్ఞానమును ఉపదేశిస్తాడు. అలా ఆ సారనాథ్ నేల పై మొగటి బౌద్ధదర్మము ప్రవచించబడింది. అంటే బౌద్ధం పుట్టింది.
(సశేషం)