[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]
[dropcap]ఉ[/dropcap]త్తర రామాయణంలో ప్రస్తావించిన పలు కథలను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఈ కథలకు మూలకథకు సంబంధం ఏమిటనిపిస్తుంది. మాయలుంటాయి.. మంత్రాలు వస్తాయి.. దేవుడొస్తాడు.. మహిమలు కనిపిస్తుంటాయి. కుక్కలు, గుడ్లగూబలు, గద్దలు.. అన్నీ కూడా రాముడి దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు దేవుడివి.. నీ రాజ్యంలో మాకు సమస్యలు వచ్చాయి. పరిష్కరించాలని వేడుకుంటుంటాయి. ఆయన వాటి సమస్యలను విచారించి ధర్మం న్యాయం చెప్తుంటాడు. ఏ రాక్షసులను వధించడానికి రాముడికి చిన్ననాటి నుంచి లంకలో యుద్ధరంగం దాకా సహకరించిన ఋషులు, ఇంటెలెక్చువల్స్.. ఉత్తరకాండకు వచ్చేసరికి అదే రాక్షసులను పొగుడుతుంటారు. రావణుడు లంకను ఆక్రమించడం.. కుబేరుడిని వెళ్లగొట్టడం కథ కూడా ఇందులోనిదే. ఒకటా రెండా.. చెప్పుకుంటూపోతే బోలెడు. ఈ కథలన్నిటికి కూడా మొదటి ఆరు కాండల్లోని కథకు.. పాత్రలకు, కథా సంవిధానానికి ఎలాంటి పొంతన కూడా ఉండదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఉత్తరకాండ తొలి సర్గ ప్రారంభంలో రాక్షసులందరినీ సంహరించి రాజ్యాన్ని ఏలుతున్న రాముడిని అభినందించడానికి ఋషులంతా వచ్చి ఆయన దర్శనాన్ని కోరుతారు. దర్శనమిచ్చిన రాముడి దగ్గరకు వచ్చిన ఋషి పుంగవులంతా ఇంద్రజిత్తు గురించి విపరీతంగా ప్రశంసిస్తుంటారు. రాముడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇంతమంది రాక్షసులుండగా ఒక్క ఇంద్రజిత్తునే ఎందుకు పొగుడుతున్నారు మీరంతా.. అతని గొప్పతనం ఏమిటి? నాకు కాస్త ఆ స్టోరీ తెలియజేయండి అని అడుగుతాడు. ‘గొప్ప పరాక్రమము గల కుంభకర్ణుని, రావణుణ్ణి కాదని మీరు ఇంద్రజిత్తును ఎందుకు ఇంతగా ప్రశంసిస్తున్నారు? గొప్ప పరాక్రమము గల మెదర, ప్రహస్త, విరూపాక్షులను, మత్తోన్మత్తులను ఎదురింప శక్యముకాని దేవాంతక, నరాంతకులను కాదని ఇంద్రజిత్తును ఎందుకు ప్రశంసిస్తున్నారు? అతికాయుణ్ణి, త్రిశిరస్తును, ధూమ్రాక్షుడిని.. మహా బలవంతులైన వీళ్లందరినీ కాదని ఇంద్రజిత్తును ఎందుకు ప్రశంసిస్తున్నారు? అతని ప్రభావము ఎట్టిది? బలము ఎట్టిది? పరాక్రమము ఎట్టిది? అతను ఏ కారణము చేత రావణుని కంటే గొప్పవాడు. నేను వినుటకు యోగ్యమైనచో.. చెప్పుటకు అది రహస్యము కానిచో నేను వినవలెనని కోరుచున్నాను. చెప్పుడు. కానీ మిమ్ములను ఆజ్ఞాపింపజాలను. అతను దేవేంద్రుణ్ణి కూడా ఎట్లా జయించినాడు. వరములు ఎట్ల పొందినాడు. కుమారుడే ఎట్ల అధిక బలవంతుడు? తండ్రి ఎందువలన కాడు?’ ఇది ఉత్తరకాండలో తొలి సర్గలో మునులను రాముడు అడిగిన ప్రశ్న. దీనికి మునులు ఇంద్రజిత్తు కథ, రావణుడి కథ, కుంభకర్ణుడి కథ చెప్తాం వినమని.. రావణుడు అండ్ కో కథ చెప్పడం మొదలుపెడతారు. ఇదే చిత్రమైన సందేహం. రాముడు ఆల్రెడీ రాక్షసులను చంపాడు. వాళ్ల పరాక్రమం వీళ్లందరికంటే.. కూడా ఆయనకే బాగా తెలుసు.. పోనీ యుద్ధం చేయడానికి ముందు ఈ ప్రశ్న అడిగాడంటే అర్థముంది? యుద్ధం అయిపోయి గెలిచిన తర్వాత ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది. రాముడిని అభినందించడానికి వచ్చిన ఋషులందరూ మొదటి ఆరు కాండల్లో ఏదో సందర్భంలో రాముడిని కలిసినవారే. రాముడిని యుద్ధానికి ప్రేరేపించినవారే. అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చినవారే. అక్కడెక్కడా ప్రస్తావన రాని రాక్షసరాజ చరిత్ర అంతా ఐపోయిన తర్వాత రావడమేమిటి? పోనీ చరిత్ర అంటే తెలియదనుకొందాం. రావణుడు ఎప్పుడు పుట్టాడు.. ఎవరిని పెండ్లి చేసుకున్నాడు.. ఏమేం ఘనకార్యాలు చేశాడన్నది తెలియదనుకుందాం.. ఏమీ తెలియకుండానే.. భార్యను ఎత్తుకుపోయినవాణ్ని రాముడు గుడ్డిగా చంపేసి వెనక్కి వచ్చేశాడనుకొందాం. ఇంద్రజిత్తు స్టామినా ఏమిటో? ఎంతో తెలియకపోవడం ఏమిటి? విచిత్రంగా లేదా? ఇంద్రజిత్తుతో యుద్ధం.. యుద్ధ కాండలో మొత్తం దాదాపు పదిహేను సర్గల్లో కొనసాగుతుంది. విస్తారంగా చర్చ జరుగుతుంది. ఇంద్రజిత్తు.. రామ లక్ష్మణుల యుద్ధం భీకరంగా జరుగుతుంది. మిగతా ఏ రాక్షసులతోనూ రామ లక్ష్మణులు ఇంత భీకరమైన యుద్ధం చేయనేలేదు. ఇంద్రజిత్తు చేతిలో రామలక్ష్మణులిద్దరూ నాగపాశ బంధంలో చిక్కుకుంటారు. లక్ష్మణుడు మూర్ఛపోతాడు. హనుమంతుడు సంజీవని మూలికను తెచ్చి మరీ వారిని తిరిగి చైతన్యవంతులను చేస్తాడు. విభీషణుడు, ఇంద్రజిత్తుల మధ్య ఘోరమైన సంవాదం జరుగుతుంది. నికుంభిల ఆలయానికి వెళ్లిన ఇంద్రజిత్తు.. అక్కడ పూజలు చేయడం.. లక్ష్మణుడు అక్కడికే వెళ్లి యుద్ధంచేసి ఇంద్రజిత్తును వధించడం జరుగుతుంది. రామలక్ష్మణులు ఇంత భీకరంగా ఎవరితోనూ యుద్ధం చేయనేలేదు. రావణుడితోనూ జరిగిన యుద్ధంలో ఇన్ని రకాల వ్యూహాలు, తంత్రాలు మనకు కనిపించవు. ఇంద్రజిత్తు అతి వేగంగా ప్రయాణిస్తాడు. ఒక చోటినుంచి మరోచోటికి క్షణాల్లో మారిపోతాడు. రకరకాల వెపన్స్‌తో దాడిచేస్తాడు. రామాయణంలో న్యూక్లియర్ వెపన్‌ను సైతం ఇతనే ప్రయోగించాడు. దానికి రామలక్ష్మణులే తట్టుకోలేకపోయారు. ఇంత భీకరంగా తాము యుద్ధం చేసి.. గెలిచిన యోధుడి పరాక్రమం గురించి రాముడు ఏమీ తెలియనట్టు.. ఋషులను, మేధావులను అడగడమేమిటి? ఇంద్రజిత్ పరాక్రమం గురించి సంపూర్ణంగా తెలిసినవాడు, యుద్ధంలో అనుభవం కలిగినవాడు అమాయకంగా అడగడం విచిత్రం కాదా? యుద్ధకాండలో ఇంతగా ఇంద్రజిత్ బీభత్సరసాన్ని రాముడికి చవిచూపించిన వాల్మీకి మహాశయుడు.. ఉత్తర కాండలో పనిగట్టుకొని ఇంద్రజిత్ గురించి రాముడికి ఏమీ తెలియదన్నట్టుగా రాశాడని ఎలా అనుకోవాలి? వాల్మీకి నుంచి ఇలాంటి కథనాన్ని ఊహించగలమా? పండితులెవరైనా చెప్పాలి.
ఆ తరువాత వరుస సర్గలలో రావణుడి జన్మవృత్తాంతం.. పర్సనల్ లైఫ్.. పరిపాలన, దురాక్రమణలు.. వంటి కథలు వరుసగా వస్తాయి. చిత్రమేమంటే.. ఇవన్నీ సదరు ఋషులు రాముడికి చెప్తున్నట్టుగానే కథనం సాగుతుంది. రావణుడి గురించి ఏమీ తెలియకుండానే రాముడు యుద్ధం చేశాడా అన్నది పెద్ద అనుమానం. గమ్మత్తేమిటంటే.. సనత్కుమారుడు రావణుడి దగ్గరకు వచ్చి.. రాముడి మహత్యాన్ని చెప్తాడు. లక్ష్మీనారాయణులు సీతారాములుగా అవతరిస్తున్నారని చెప్పి వెళ్తాడు. వెంటనే రావణుడు.. రాముడి చేతిలో ఎలా చనిపోవాలా అని ఆలోచిస్తుంటాడు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రాముడిని రప్పించి.. అతనిచేతిలో చనిపోయాడన్నమాట.. ఇక్కడ మనం గమనిస్తే.. ఉత్తరకాండ తొలినుంచీ.. రాముడు విష్ణువుగా పూర్తిగా ట్రాన్స్‌ఫామ్ చెందుతాడు. అంతకుముందు ఆరుకాండల్లో లేని దైవత్వం ఒక్కసారిగా ఉత్తరకాండ ప్రారంభం నుంచి మనకు కనిపిస్తుంది. యుద్ధకాండలో రావణ సంహారం అనంతరం ఇంద్రాదులు వచ్చి.. రాముడిని పరాత్పరుడిగా కొనియాడటం తప్ప మరెక్కడా రాముడికి దైవత్వం ఆపాదించలేదు. మనదేశంలో సమాజానికి మేలుచేసిన వారిని దేవుడిగా కొలవడం మొదట్నుంచీ ఉన్న సంప్రదాయమే. అందువల్లే రావణుడిని చంపిన రాముడిని ఆ విధంగా ప్రశంసించి ఉండవచ్చు. కానీ, ఉత్తరకాండలో మాత్రమే.. రాముడిని దేవుడిగా, విష్ణువుగా జస్టిఫై చేయడానికి అనుకూలమైన కథలు.. కథనాలు ఒకదానివెంట ఒకటిగా వస్తుంటాయి.
ఉత్తరకాండలోనే మరో కథనం ఉన్నది. రావణుడు తన అన్న కుబేరుడిని లంకాపురి నుంచి వెళ్లగొట్టి.. ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత కొంతకాలానికి కుబేరుడు ఒక దూతను రావణుడి దగ్గరకు పంపించినాడు. రావణుడు చేస్తున్న దురాగతాలను విని అతనికి హితవు చెప్పాలని దూతను పంపించాడు కుబేరుడు. సదరు దూత ముందుగా విభీషణుడి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. విభీషణుడు చాలా సంతోషించి.. కుశల ప్రశ్నలు వేసి.. చాయ్‌పానీ, బ్రేక్‌ఫాస్ట్ లాంటి అతిథి మర్యాదల అనంతరం జయీభవ అంటూ అతడిని రావణ సభకు పంపించాడు. రావణుడికి సదరు దూత తన రాజు కుబేరుడు చెప్పమన్న మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దీంతో రావణుడు దూతపై తీవ్రంగా ఆగ్రహించాడు. దూషించాడు. నిందించాడు. కండ్లనిండా నిప్పులు చిమ్మాడు. చివరకు దూతను అక్కడికక్కడే హతమార్చాడు. సదరుసభలో విభీషణుడు కూడా ఉన్నాడు. ముందుగా చెప్పినట్టు అంతకుముందు దూతను అన్నగారి సభకు తీసుకొచ్చిందే అతను. సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణకు వచ్చి.. అశోకవనాన్ని ధ్వంసంచేసిన అనంతరం ఇంద్రజిత్తు బంధించి రావణసభకు తీసుకువెళ్తే.. రావణుడు ఆగ్రహించిన సందర్భంలో అన్నా దూతను చంపవద్దంటూ.. విభీషణుడు సలహా ఇస్తే.. తోకకు నిప్పంటించి వదిలేస్తాడు రావణుడు. వాస్తవానికి హనుమంతుడు దూతగా రాలేదు. లంకలోకి చొరబడ్డాడు. అశోకవనాన్ని ధ్వంసంచేశాడు. రావణ కుమారుడైన అక్షయకుమారుడిని హతమార్చాడు. ఇంత జరిగిన తర్వాత రావణ సభలో తాను రాముడు పంపగా వచ్చానని చెప్పగానే దూతగా పరిగణించాడు. సందేశాన్ని విన్నాడు. ఆ తర్వాత విభీషణుడు చెప్పగానే.. చంపకుండా వదిలేశాడు. సొంత అన్న కుబేరుడు దూతను పంపితే నిర్దాక్షిణ్యంగా హతమార్చిన రావణుడు, హనుమంతుడి విషయంలో ఎందుకిలా చేశాడు? అసలు రామాయణంలోని రావణుడి వ్యక్తిత్వానికి.. ఉత్తరకాండలోని రావణుడి పోకడలో ఉన్న అతి పెద్ద తేడా ఇది? రావణుడు మారిపోయాడా? ఉత్తరకాండలో రావణుడి క్యారెక్టర్‌ని మార్చివేశారా?
ఈ సందేహాన్ని పెద్దలు, పండితులు తీర్చాలి.
రామాయణాన్ని మహర్షి వాల్మీకి 24 వేల శ్లోకాలలో రచించాడని బాలకాండలోనూ.. ఉత్తర కాండలోనూ ప్రస్తావన ఉన్నది.
బాలకాండ77 సర్గలు2268 శ్లోకాలు
అయోధ్యకాండ119 సర్గలు4301 శ్లోకాలు
అరణ్యకాండ 75 సర్గలు2448 శ్లోకాలు
కిష్కింధకాండ67 సర్గలు2463 శ్లోకాలు
సుందరకాండ68 సర్గలు2810 శ్లోకాలు
యుద్ధకాండ128 సర్గలు5820 శ్లోకాలు
మొత్తం 534 సర్గలు 20110 శ్లోకాలు
ఉత్తరకాండ111 సర్గలు 4102 శ్లోకాలు
ఉత్తరకాండతో కలిపి మొత్తం శ్లోకాల లెక్క చూసుకొంటే.. 645 సర్గలు.. 24, 212 శ్లోకాలు కనిపిస్తాయి. ఉత్తరకాండ వాల్మీకి రాశాడని చెప్పే పండితులు.. ఈ శ్లోకాల లెక్కను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు. ఎందుకంటే.. గాయత్రీ రామాయణం మనకు పారాయణ గ్రంథంగా చాలాకాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నది. గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలను తొలి అక్షరాలుగా చేసుకొని వాల్మీకి రామాయణంలోని శ్లోకాలను ఏకత్రితం చేస్తే.. వాటిలో రామాయణ సమగ్ర కథ నిక్షిప్తమై ఉంటుంది. నిస్సందేహం. దీన్ని ఆధారంచేసుకొని మన పండితులు వాల్మీకి రామాయణాన్ని 24 వేల శ్లోకాల్లో రచించాడని చెప్పారు కాబట్టి.. ఇందుకు అనుకూలమైన వాదన తీసుకొని వచ్చి.. ఉత్తరకాండ వాల్మీకి రాశాడని ఖరారుచేసే ప్రయత్నం జరిగింది. రామాయణంలో ప్రతి వెయ్యవ శ్లోకం తొలి అక్షరం గాయత్రీ బీజాక్షరంతో మొదలవుతుందని.. ఉత్తరకాండ లేకుండా 24 వేల శ్లోకాలు లెక్క తేలడం లేదు కాబట్టి.. అందులోని (ఉత్తరకాండలోని) ఒక శ్లోకంతోనే 24 వ వేల శ్లోకం పూర్తవుతుందని విశ్వసిస్తారు. గాయత్రీ రామాయణంలోని శ్లోకాలను ఆవిధంగానే పరిగణనలోకి తీసుకొంటారు. వాస్తవానికి రామాయణంలో అనేక బీజాక్షరాలు, బీజమంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. రామాయణం స్వయంగా వేదం. రామాయణం ప్రణవం. కుండలినీ యోగ ప్రసారానికి ఆధారభూమిక. సీతారాములు స్వయంగా శక్తిచైతన్య స్వరూపులు. ఆమె శక్తి.. ఆయన కార్యనిర్వాహకుడు. ఆమె సంకల్పమాత్రం చేతనే.. సమస్త రాక్షస సంహారం జరిగింది. ఇది నిజం. ఈ అంశంపై మరింత లోతుగా చర్చ చేయాల్సి ఉన్నది.
వాల్మీకి రామాయణాన్ని 24 వేల శ్లోకాలలో రాశాడని బాలకాండ నాలుగో సర్గలో మనకు కనిపిస్తుంది. రామాయణం అసలు కథ బాలకాండలోని ఐదో సర్గతో ప్రారంభమవుతుంది. ఇక్కడినుంచి ఉత్తరకాండ వరకు లెక్కిస్తే సుమారు 29 శ్లోకాలు తక్కువగా 24 వేల శ్లోకాలున్నాయి. తొలి సర్గనుంచి లెక్కిస్తే 212 శ్లోకాలు ఎక్కువగా ఉన్నాయి. యథాతథంగా కచ్చితంగా 24 వేల శ్లోకాలు లేవు. ఇది వాల్మీకి రామాయణాన్ని ఆక్షేపించడం ఎంతమాత్రం కాదని పాఠకులు స్పష్టంగా గ్రహించాలి. ఇలాంటి చిన్న చిన్న కారణాలు చూపించి ఉత్తరకాండ కర్తృత్వాన్ని వాల్మీకికి ఆపాదించి.. మర్యాదాపురుషోత్తముడైన రాముడి వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు జరిగిన ఒక మహా కుట్రను తెలియజేయాలన్న ప్రయత్నమే ఈ వ్యాసం. ఇంతకాలం దుర్మార్గులు మహామానుషమూర్తిని.. ధర్మానికి విగ్రహ స్వరూపుని అతి దారుణంగా చిత్రిస్తూ.. ఆయన వ్యక్తిత్వంపై చేసిన వక్రభాష్యానికి జవాబు చెప్పే ప్రయత్నమే ఇది.
బాలకాండలోని తొలి సర్గలో తొలి శ్లోకంలోని తొలి అక్షరం గాయత్రి బీజాక్షరంగా పెద్దలు నిర్ణయించారు. గాయత్రీ మంత్రం ‘ఓం భూర్భువస్వః తత్‌సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్’ అన్నది. ఇందులో తత్‌సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహీ ధీయోయోనః ప్రచోదయాత్ అన్న పాదాల్లోని అక్షరాలనే గాయత్రీ రామాయణంగా స్వీకరించారు. దీని ప్రకారం ‘తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం’ అన్న శ్లోకంతో రామాయణ కావ్యం మొదలవుతుంది. ఆ తరువాత 969వ శ్లోకంలో ‘సహత్వా రాక్షసాన్ సర్వన్‌యజ్ఞఘ్నాన్ రఘునందనః’ అన్న శ్లోకం రెండో శ్లోకంగా.. ఆ తరువాత 972వ శ్లోకం ‘విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితమ్’ అన్న మూడో శ్లోకం వస్తుంది. ఈ విధంగా 24 శ్లోకాలతో గాయత్రీ రామాయణం సాగుతుంది. ఇందులో ఇంతకాలం అందరూ చెప్తున్నట్టుగా నియమబద్ధంగా రామాయణంలో ప్రతి వెయ్యవ శ్లోకం గాయత్రి బీజాక్షరంతో మొదలుకాలేదు. కానీ.. గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24 శ్లోకాలు.. సమస్తమైన రామాయణ కథాగానాన్ని సమగ్రంగా చేస్తున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరో ముఖ్యాంశం ఉన్నది. గాయత్రీ రామాయణంలోని చివరి ఒకే ఒక్క శ్లోకం మాత్రమే.. ఉత్తరకాండలోనిది. ‘యమేవ రాత్రిం శతృఘ్న, పర్ణశాలం సమావిషద్, తమేవ రాత్రిం సీతాపి, ప్రసూత ద్వారకాద్వయం’ వాల్మీకి ఆశ్రమంలో శతృఘ్నుడు బసచేసిన రాత్రి సీతాదేవి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది’ ఇదీ ఈ శ్లోక తాత్పర్యం. ఇది ఉత్తరకాండలోని 66 వ సర్గలో జరిగిన సన్నివేశం. ఆ తర్వాత మరో 55 సర్గల మేర రామాయణ ఉత్తరకాండ సాగింది. సుమారు రెండువేల శ్లోకాలు కొనసాగాయి. అంటే.. కేవలం గాయత్రీ బీజమంత్రాన్ని ఆధారం చేసుకొని ఉత్తరకాండను వాల్మీకికి ఆపాదించడం ఎంతమేరకు సమంజసమన్నది పండితులైనవారు వివరిస్తే ఈ తరానికి మరింత స్పష్టత వస్తుంది. ఇవాళ రాముడిపైన, సీతపైన అవాకులు పేలేవారి నోళ్లు మూతలు పడుతాయి.
బహుభాషా ప్రవీణులు, మహామహోపాధ్యాయ శ్రీమాన్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రామాయణాన్ని యథాతథ మూలానువాదం చేశారు. ఇందులో ఆయన అనువదించిన ఉత్తరకాండలో 13 ప్రక్షిప్త సర్గలు ఉన్నాయని ఆయనే పేర్కొన్నారు. వాటిని ప్రక్షిప్త సర్గలుగానే ఆయన అనువదించారు. ఈ ప్రక్షిప్తాలను పరిగణనలోకి తీసుకోకపోతే.. రామాయణ కావ్యం 24 వేల శ్లోకాలకు పరిపూర్ణం కావడంలేదు. పుల్లెల శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రక్షిప్తాలని స్పష్టంచేశారు. వారిని ప్రామాణికంగా తీసుకొంటే ఆ పదమూడు సర్గలూ వేరుగా జతచేసినవేనని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా.. రామాయణంలోని ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాకపోవచ్చునని అర్థమవుతుంది.