[dropcap]శా[/dropcap]ర్వరి ఉగాదిన మొదలయింది యుద్ధం
అదృశ్య శత్రువు నెదుర్కొంటూ సమరరథమెక్కి
ప్రతి మనిషొక యోధుడై చేస్తున్న పోరాటం
ఏడాదిగా సాగుతూనే ఉంది నిర్విరామంగా
కనబడని రాకాసి కొరోనా నోరు తెరిచి
సమస్త మానవాళి పై విరుచుకుపడింది
ఎందరికో ఉపాధి పోగొట్టి వీధిపాలు చేసింది
మానవజాతి యావత్తూ భీతావహమైంది
వెల్లువెత్తిన అసామాన్య పగ సైన్యం అది
వైద్యసిబ్బంది సహా ఎందరినో పొట్టనపెట్టుకుని
రక్కసిలా బడుగుల జీవితాల్ని ఛిద్రం చేసి
నేడు బహురూపిగా మారిన క్రౌర్యం దానిది
ఈ అప్రకటిత యుద్ధంలో ప్రజలే సైన్యం
పారిశుధ్యం, పరిశుభ్రత,స్వచ్ఛతే బాణాలు
మనుష్య సమూహంపై పగబట్టిన దండుని
మనమంతా యోధులమై తుదముట్టించాలి
ముగ్గులూ,మావిడితోరణాలూ, బంధుమిత్రులూ
పండిత పంచాంగ శ్రవణాలూ, పిండివంటల
వేడుకలన్నీ వచ్చే ఉగాదికి వాయిదా అడిగి
పండగ సంబరాలు పక్కకి పెట్టి నడవాలిపుడు
వైరి వైరస్ తో పోరుకు స్వీయ రక్షణే ఆయుధం
గృహ నిర్బంధం, సమదూరం,మాస్క్ ధారణ
మరవని దీక్షాకంకణ బద్ధులమై కొనసాగుదాం
మానవకోటి ఆరోగ్యసాధనే ప్రపంచ శాంతి నేడు
తెనుగు సంవత్సరాదిన జనావళి, కోవిడ్ మహమ్మారి పై
యుద్దసన్నద్ధమై మొక్కవోని ఉక్కుసంకల్పంతో
ఈ శర్వరీ ప్రవాహం బారినుండి, నూతన ఉగాది
‘ప్లవ’ రక్షణతో సాగిపోవాలి శుభకృతు దిశగా…!