[dropcap]నా[/dropcap]న్న నా చేతులు తనచేతిలోకి తీసికొన్నాడు
తామరమొగ్గలలా వున్న నా ఎర్రటి అరచేతులను అపురూపంగా
మృదువుగా
సుతిమెత్తగా
నాకేమన్నా నొప్పిపుడుతుందేమోనన్నట్లు
సుతారంగా నా అరచేతులు
తన చేతిలోకి తీసుకొన్నాడు
అదేమో నాన్నచేతులు మెల్లగా
కంపింస్తున్నాయి
అప్పుడెప్పుడో చిన్నప్పుడు
నాఅరచేతుల్లో అమ్మ గోరింట పెట్టినప్పుడు
అది బాగాఎర్రగా పండినప్పుడు
నాన్నకి చూపించినప్పుడు
ఇలా ఇప్పటిలాగే
నా అరచేతులను
ఆప్యాయంగా తనచేతిలోకి
తీసుకొనేవాడు
అరచేతులలో మ్చు మ్చు అంటూ ముద్దులు కురిపించేవాడు
మళ్ళీ ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు
నాన్న నా చేతులను
తనచేతిలోకి తీసుకొన్నాడు
ఆనాడెప్పుడూ కంపించని
నాన్న చేతులు
మరిప్పుడెందుకో కంపిస్తున్నాయి
తను ఏరికోరి తెచ్చినవాని చేతిలో
నా చేతులను
పాలలోముంచి అతని చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు ఈనాడు
మరి ఎందుకో నాన్నచేతులు
కంపిస్తున్నాయి