[dropcap]నే[/dropcap]నేం చేసినా…తప్పంటావు నువ్వు!!
నువ్వు చేసేది సరికాదంటాను నేను!!
ఇక మన మధ్య సయోధ్య ఎక్కడ???
పరస్పర వైరుధ్య భావాలు,
అయినా… తప్పని సాహచర్యం!!
నా భావాలకు, ఆదర్శాలకు,భవితకి…నేనో రక్షరేకు గీసుకున్నా…!!
నేనది దాటను!!!
రేఖకు ఆ వైపున,
తీవ్రభావాలతో…క్రుద్ధంగా,
నిద్ర లేని,రాని అలజడిలో,
అసంతృప్త మనస్కమై,
ఆకలితో కాక కపటంతో,
వేటు వేయాలనుకునే….
దొంగ పిల్లిలా… నువ్వు!!!!
ప్రపంచమంతా చూపుడు వేలై,
నిను మందలిస్తున్నా…,
నాల్గు కలుగులులున్నాయనే…
పొగరుతో…,
నాపై విసరడానికి రాళ్ళు దొరకక,
వెతికి, వెతికి మరీ దుమ్ము విసిరి,
ముఖమంతా పులుముకున్నావు!!!
నేను గీత దాటకుండానే…
కర్తవ్యం నిర్వహిస్తుంటాను!!
గుండెల్లో నెగళ్ళు వేసుకుని,
గడ్డ కట్టే చలిలో…., అహర్నిశలు..
కంటికి రెప్పలా కావలి కాస్తుంటా!
విశ్వ వేదికపై జయపతాకనై
మువ్వన్నెలతో ..ఎగురుతుంటాను…!!!