నేను సీతని కాను

0
3

[dropcap]ఇం[/dropcap]టిముందు క్యాబ్ దిగి వస్తున్న గీతని అడిగాడు. “ట్రిప్ బాగా జరిగినట్టుంది, మొహం ఆనందంతో వెలిగిపోతోంది, బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు” అని.

గిరిధర్ మొహంలో హేళన కనిపిస్తోంది, కాసేపు ఆలోచించి సమాధానం ఇచ్చింది “చాలా బాగా ఎంజాయ్ చేసాము” అని, ప్రతి మాటా వత్తి పలుకుతూ.

“సుబ్బమ్మా, మాంచి టిఫిన్, కాఫీ తీసుకురా అమ్మా, మీ అమ్మగారు ట్రిప్‌ని ఎంజాయి చేసే క్రమంలో పాపం వేళకి తిన్నారో లేదో?” వెటకారం ఘాటెక్కుతోంది.

పనిమనుషుల ముందు కూడా హేళనగా మాట్లాడుతున్న భర్త తీరు నచ్చక, మౌనంగా, బాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది గీత.

***

ఆఫీసుకెళ్తూ దారిలో ఆలోచిస్తోంది, గిరి ఎందుకిలా మారిపోయాడు? వ్యంగ్యత చోటుచేసుకుంది అతని మాటల్లో. సాయంత్రం ఇంటికెళ్ళాక, గిరితో మాట్లాడాలి అని, ఆ విండోని మినిమైజ్ చేసేసింది.

***

గీత, గిరిధర్ ఛార్టర్డ్ అకౌంటెన్సీలో క్లాస్మేట్స్, అక్కడే వారి ప్రేమ చిగురించి, మారాకు తొడిగింది. ఇద్దరూ వేర్వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడిటింగ్ పనిమీద ఇద్దరూ వారమేసి రోజులూ, పదేసి రోజులూ క్యాంపుకి వెళ్లడం పరిపాటే.

***

గీత, తన జూనియర్ శ్రావ్య, ఇద్దరు ఆడిటింగ్‌కి బొంబాయి వెళ్లారు. శ్రావ్యకి మూడేళ్ళ పాప ఉంది. అయితే రెండ్రోజుల్లో క్యాంపు అయిపోతుంది అనగా, శ్రావ్య భర్త ఫోన్ చేసేడు, పాపకి చాల జ్వరంగా ఉందని, శ్రావ్యని కలవరిస్తోందని.

***

సాయంత్రం శ్రావ్య వాళ్ళ పాపని చూడ్డానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ వంటావిడ కాఫీ ఇస్తూ అంది “మొన్న గిరిధర్ బాబు గారు, సూపర్ మార్కెట్‌లో కలిశారండీ. మీ అమ్మగారు లేరు కదా, పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నావా అని అడిగారండి. అమ్మగారు ముందు రోజే వచ్చేశారని చెప్పానండి.”

ఓహో ఇదన్నమాట గిరిధర్ వ్యంగ్యోక్తులకి కారణం. మామూలుగానే గిరి చాలా త్వరగా అపార్థం చేసేసుకుంటాడు. ఇప్పుడిక చెప్పేదేముంటుంది?

***

గీత చెప్పినదేది వినకుండా, “ఆడిటింగ్ రెండ్రోజులు ముందే అయిపోయిందటగా, అక్కడేవో కొత్త స్నేహాలు నిన్ను ఆపేసి ఉంటాయి.” గూడార్థంగా మాట్లాడాడు

చాలాసేపు ఇద్దరు వారి వారి వెర్షన్‌లు చర్చించుకున్నాక, గిరి అడిగాడు గీతని “కెన్ యు ప్రూవ్ ఇట్?” అని కఠినంగా.

“అగ్ని పరీక్షా?” వెటకారంగా అడిగింది గీత.

“ఎస్” అన్నాడు.

“ఓకే, రేపు మనింట్లో డిన్నర్‌కి, నాతో క్యాంపుకి వచ్చిన ఇతరులని పిలుస్తాను. నువ్వే వాళ్ళతో మాట్లాడి క్లారిటీ తెచ్చుకో.” అంది గీత

ప్రేమ స్థానాన్ని అతి త్వరగా ఆక్రమించుకోగలిగేది ఒక్క ‘ఇగో’ మాత్రమే.

***

సెల్‌లో ఎఫ్.ఎం. రేడియో పెట్టుకుని వింటూ, లంచ్ చేస్తోంది గీత.

అప్పట్లో విడాకులు తక్కువగా ఉండడానికి కారణం, అప్పుడు ఆడవారికి చదువు, ఉద్యోగం ఉండేవి కాదని, భర్త ఎలా చూసుకున్నా, సర్దుకుపోయేవారని, ఇప్పుడు ఆడవారికి చదువులు, లక్షల జీతాలిచ్చే ఉద్యోగాలు ఉండడం వలన, ఇగో లతో విడాకులు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని, శ్రోతలు తమ అభిప్రాయాలని, అనర్గళంగా చెప్పుకుపోతున్నారు.

***

“ఇంకా ఎవరు డిన్నర్‌కి రాలేదేంటి? పార్టీ లేదా?” అడిగాడు గిరి.

“నేను ఎవరిని డిన్నర్‌కి పిలవలేదు.”

“నేను నీతో మాట్లాడాలి గిరీ!”గీత కంఠం సీరియస్‌గా ఉంది.

“నేను ‘అగ్ని పరీక్ష’కి నిలబడితే, నువ్వే కాదు, నన్ను నేను కూడా శంకించుకున్నట్టే. గిరీ! భార్య భర్తల మధ్య ఉండవలిసింది ‘నమ్మకం’ అది లేనినాడు, ఆ బంధం గట్టిదనాన్ని కోల్పోతుంది.”

“ఒక మడేలు చెప్పిన మాట విని, మహాసాద్వి సీత ఒకసారి అగ్ని పరీక్షకి నిలబడాల్సి వచ్చినందుకే, తన తల్లి భూదేవి చెంతకి వెళ్ళిపోయింది. ప్రతిరోజు అగ్నిపరీక్షకి గురవుతున్న ఈనాటి నారీమణులు ఎలా ప్రతిస్పందించాలి?”

“నువ్వు కూడా నేను లేకుండా, అడవిలో ఉన్నావు, శూర్పణఖ నీకోసం పరితపించింది, నువ్వు కూడా అగ్ని పరీక్షలో నెగ్గితేనే, నేను నీతో కాపురం చేస్తాను అని సీతే గనక ఆనాడు రాముణ్ణి నిలదీసి ఉంటే?”

“మీరు కూడా పార్టీలకని, క్యాంపులకని వెళ్తుంటారు, మేము కూడా మిమ్మల్ని అనుమానిస్తే? అగ్ని పరీక్షని కోరితే?”

“నువ్వు ‘అగ్నిపరీక్ష’ని నమ్మితే, నేను ‘మనస్సాక్షి’ని నమ్ముతాను. నువ్వు కూడా ‘మనస్సాక్షి’ని నమ్ముకుంటే, మన బంధం శాశ్వతాలు చూస్తుంది.

నేను సీతని కాను!! నేటి గీతని!!”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here