ప్రేమించే మనసా… ద్వేషించకే!-17

0
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు మీనాక్షి, సుందరి బట్టలు కొనుక్కోవడం కోసం అని బజారుకెళ్లి రాలేదు.

టైపు ఇనిస్టిట్యూట్ నిండి వచ్చాడు సుదర్శన్.

సుజాత మంచి నిద్రలో వుంది.

స్వప్న కుర్చీలో కూర్చుని హాల్లో చదువుకుంటుంది.

“రా బావా, అక్కను లేపకు, నేను వడ్డిస్తాను… భోజనం. అక్క గాఢ నిద్రలో వుంది. అందుకని లేపలేదు. అక్క చాలా సున్నితం బావా! ఎందుకనో తెలియదు కాని బావా, అక్కను చూస్తుంటే ఏదో చెప్పలేని బాధ కలుగుతుంది. నిండుగా హుందాగా తిరగవలసిన మనిషి అలా మంచం మీద పడుకోని వుందంటే మనసంతా బాధగా వుంటుంది” అంది.

మౌనంగా భోజనం టేబుల్ వద్ద కూర్చున్నాడు.

“ఏం బావా! డాక్టరు ఏమన్నారు అక్క గురించి” అంది అన్నం కంచంలో వడ్డిస్తూ.

“ఇంకా కొద్ది రోజులు రెస్ట్ అవసరంఅన్నారు” అని ఏం మాట్లాడాలో తెలియని వాడిలా ఇబ్బందిగా అటు ఇటు చూసాడు.

కిలకిలా నవ్వింది. “ఏం బావా నేనంటే అంత భయం. నేను… నేను… అంత భయంకరంగా వున్నానా” అంది.

స్వప్న అలా నవ్వడంతో చివ్వున తల ఎత్తాడు.

ఛామనచాయగా వున్న కళైన ముఖం. పెద్ద పెద్ద కళ్లు, కోటేరేసిన నాసిక, లక్కపిడత లాంటి నోరు. తీరైన శరీరం.

“ఏంటి బావా, భయంకరంగా ఉన్నానో లేదో అని చూస్తున్నావా?” పకపకా నవ్వేసింది స్వప్న.

“అబ్బే అది కాదు… నువ్వు… నువ్వు… నువ్వు భోం చేసావా లేదా” అన్నాడు ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు.

కళ్లు తిప్పి ఆశ్చర్యంగా చూసింది. “అమ్మో! ఎన్నాళ్లకి స్వప్న మీద అభిమానం, జాలి కలిగాయి” అంది.

ఒక్కక్షణం స్వప్న ముఖంలోకి తల ఎత్తి చూసాడు.

“స్వప్నా ఈ రోజు గాదు నీ మీద జాలి… అభిమానం; నీ జీవితంతో భగవంతుడు ఆడుకున్న రోజు నుండే నా మనసులో నీ మీద ఏదో తెలియని అభిమానం, బాధ ఏర్పడిందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే నా వలనే నీకింత అన్యాయం జరిగింది. నువ్వు నా గురించి ఏ మనుకుంటున్నావో ఏమోగాని నిన్ను చూస్తున్నపుడల్లా నా అన్యాయానికి బలయిపోయావు అనిపిస్తుంది. ఇది నా బలహీనతో లేక మరేమిటో అర్థం కావటం లేదు” అన్నాడు.

తనతో మాట్లాడటానికి బిడియపడే సుదర్శన్ మనసులో తన పట్ల జాలి, అభిమానం వున్నాయి అని తెలిసేటప్పటికి స్వప్న హృదయం ఆనందంతో నిండిపోయింది.

“నేను ఎవరి సానుభూతి, జాలి భరించలేకనే యిక్కడకు వచ్చాను బావ, కాని నీ నోటి వెంట ఆ మాటలు వింటుంటే నా కెంతో సంతోషంగా వుంది. నీ తత్వం, నీ అభిమానం తెలిసే మా యింట్లో యిక్కడకు వెళ్లటం ఇష్టం లేకపోయినా  ఆ పల్లెలో రేగిన గాయం, నా హృదయాన్ని ఇంకా రేపటానికి చూసే ఆ ఊరు మనుష్యుల మధ్య ఉండలేక, వాళ్ల సానుభూతి భరించలేక పరుగెట్టుకు వచ్చేశాను. నేను చేయని నేరానికి నా మీద నింద వేస్తుంటే నేను ఎలా భరించగలనో నువ్వు చెప్పు బావా? నా నుదుట పసుపు కుంకుమ తక్కవ వ్రాయబట్టే ఆయన పోయారట. ప్చ్!  అవన్నీ గుర్తుచేసుకోవటం అనవసరం అనుకో బావ… కాని నువ్వుంటున్న మాట నాకేం నచ్చలేదు బావ. నీ వలన నాకు అన్యాయం జరగటం ఏమిటి బావ. ఎవరికి ఎక్కడ వ్రాసిపెట్టి వుందో” అంది.

“నువ్వు భోంచెయ్యి స్వప్న” అన్నాడు సుదర్శన్.

నిద్రలో వాళ్ల మాటలకు మెలకువ వచ్చి…. వింటున్న సుజాత మనసు అగ్ని శిఖ అయింది. వాళ్ల సంభాషణలో తప్పు పట్టటానికి ఏం కనిపించకపోయినా తన సుదర్శన్ తనకి దూరం కావటం లేదు కదా అనిపించింది. అయినా సుజాత మనసు కీడు శంకిస్తూనే వుంది.

తనని ఆప్యాయంగా తట్టి లేపి ‘భోంచేసావా’ అని అడిగి, చేయకపోతే ‘రా సుజీ!’ అని పిలిచే సుదర్శన్ తనని లేపకుండానే స్వప్నని భోజనానికి కూర్చోమంటున్నాడా? చూస్తున్నపుడల్లా సుదర్శన్ వల్ల అన్యాయం జరిగిందని  బాధపడుతున్నాడా? ఆలోచనలతో సుజాత తల బ్రద్దలయిపోవటం మొదలు పెట్టింది.

వాళ్లిద్దరు అలా మాట్లాడుకుంటూ భోజనం చేయసాగారు.

గదిలో సుదర్శన్ వచ్చిన అలికిడికి అయ్యింది. నెమ్మదిగా కళ్లు ఎత్తి చూసింది.

“సుజీ ఎంత సేపయింది లేచి?” అని “భోం చేస్తావా?” అన్నాడు.

“మీరు భోంచేసారా” అంది, సుదర్శన్ ఏమి చెబుతాడో వినాలన్నట్లు సుజాత.

“ఆఁ ఇప్పుడే భోం చేసాను సుజీ!” అన్నాడు.

సుదర్శన్ ఒక్కడే భోజనం చేసినట్లు ‘భోం చేసాను’ అని చెప్పడంతో సుదర్శన్ తన దగ్గర దాస్తున్నాడు, సుదర్శన్ వాళ్లు  అనుకుంటున్నట్లు మారిపోయాడా అని సుజాత మనసు అనుమానించసాగింది.

ఎంత మనసుని సమాధాన పరచుకోవాలన్నా మనసులో ఏ మూలనో సుదర్శన్ మీద అనుమానం పొర ఏర్పడసాగింది.

“బావా అక్క లేచిందా? అన్నం కంచంలో వడ్డించి కూరలు అక్కడికే తెస్తాను. అక్కను ఇక్కడకు తీసుకురాకు” అని డ్రాయింగ్ రూంలోంచి కేక వేసింది స్వప్న.

స్వప్న అభిమానంగా అక్కడకే తెస్తాను అన్న మాట విని చెప్పలేని  కోపం వచ్చింది సుజాతకు. “నన్ను… నన్ను…  మంచం మీద కట్టి పడవేయవద్దు స్వప్న. నేను రాగలను” అని మంచం మీద నుంచి లేచింది సుజాత. సుజాత నిష్ఠూరంగా అదోలా మాట్లాడిన మాట విని అవాక్కయిపోయాడు.

నాలుగు అడుగులు వేసి తలుపు దగ్గరకు నడచి “అమ్మా” అని తలుపు ఆసరా చేసుకుని నిలబడింది.

పరుగున సుదర్శన్ వచ్చి సుజాతను పొదివిపట్టుకొని అక్కున చేర్చుకొని “సుజీ ఏమయింది? కళ్లు తిరగుతున్నాయా? లేవద్దని చెప్పానా! అసలు నా మాట వినిపించుకోవు? ఆరోగ్యం సరిగా లేనపుడు అక్కడికి భోజనానికి వెళ్లాలా?” అని ప్రేమతో కూడిన మందలింపుగా అన్నాడు సుదర్శన్.

సుదర్శన్ ప్రేమగా మందలిస్తున్నా ఏమిటో తెలియని బాధ, అనుమానం… ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు… తన సుదర్శన్ పరాయి వాడైపోతున్నాడా… మొదలైన ఆలోచనలతో సుజాత మనసు బరువెక్కిపోయింది. దుఃఖం ఎంత ఆపుకుందామన్నా ఆగలేదు సుజాతకు. వెక్కి వెక్కి ఏడ్వసాగింది.

సుదర్శన్ ఒక్క నిముషం అయోమయంగా చూసాడు సుజాత వైపు.

సుజాత ఏడుపుకు కారణం ఏమిటో తెలియక, మరుక్షణంలో సుజాత బాధకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్నట్లు “సుజీ! నువ్వు దేని కోసం బాధపడుతున్నవ్! చెప్పు సుజీ!” అని ప్రేమనంతా స్వరంలో నింపుకుని అడుగుతున్న సుదర్శన్‌కి ఏం సమానాధానం చెప్పాలో తెలియని దానిలా సుదర్శన్‌ని పెనవేసుకుపోయింది సుజాత.

***

పోస్టుమాన్ అందించిన కవరు అందుకొని చించి చదివిన సుదర్శన్‌, సంతోషంతో  పొంగిపోయిన సుదర్శన్ ఇన్‌స్టిట్యూట్ నుండి పెద్ద పెద్ద అంగల్లో సుజాత దగ్గరకొచ్చాడు.

మంచం మీద కూర్చుని పొడవైన కురులను దువ్వెన్నతో నెమ్మదిగా చిక్కులు తీయటం మొదలు పెట్టింది సుజాత.

“సుజీ ! సుజీ! నీకొక గుడ్ న్యూస్” అని సుజాత దగ్గరకొచ్చాడు.

“ఏమిటి, ఉద్యోగం గాని వచ్చిందా?” అంది ఆతృతగా సుజాత.

“ఆమ్మో! తెలివైనదానివే. నీకెలా తెలిసింది” అన్నాడు కళ్లు ఆశ్చర్యంగా పెట్టి సుదర్శన్.

“ఏముంది గుడ్ న్యూస్ అంటే అదే గదా?” అంది తేలికగా నవ్వుతూ.

అప్పటికే సుజాత మనసు రకరకాల ఆలోచనలతో ఏవేవో ఊహించుకోవటం మొదలు పెట్టింది.

నాలుగు అంతస్తుల ఏ.సి బంగ్లా తన తండ్రికున్నా, ఆ నిముషంలో సుజాతకు గుర్తు రాలేదు. కాని ముచ్చటయిన చిన్న యిల్లు, దానికి తను సుదర్శన్ అధికారులు. తనను అక్కడ సూటి పోటీ మాటలు అనే వాళ్లు కాని, తనన తక్కువగా చూసేవాళ్లు కాని ఎవరు వుండరు. భర్త అనురాగంలో తను మునిగి తేలుతూ ఇద్దరు పిల్లలకు తల్లి అయి సుఖ సంతోషాలకు లోటు లేకుండా బ్రతుకుతుంది. తను కలలు కన్న జీవితం దగ్గర అవుతంది. అంతకన్నా తను ఇంకేం కోరుకోదు కూడా. ఆ ఊహ నిజమైనట్లు సుజాత మొఖంలో సంతోష రేఖలు చోటుచేసుకున్నాయి.

సుజాత ముఖంలో సంతోషం చూసి “నీకు నేను యిచ్చిన మాట నిలబెట్టుకునే రోజులు దగ్గిరపడ్డాయి” ఆనందంగా అన్నాడు సుదర్శన్.

అతని కళ్లలో వింత కాంతి మెరుస్తుంది.

“ఓరి నాయనోయ్! ఓరి దేవుడోయ్! బాబు! సుదర్శన్! మీ నాన్నకి మళ్లీ నొప్పి వచ్చిందిరా” అని గొల్లు గొల్లున రంగారావు గది నుండి మీనాక్షి అరుపులు విని సుదర్శన్ హాడావిడిగా వెళ్లాడు.

రంగారావు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. టాక్సిని పిలిచి రంగారావును కారులో ఎక్కించుకొని అప్పటికపుడు సుదర్శన్ మీనాక్షి హాస్పటల్‌కి తీసుకెళ్లారు. ఒక ప్రక్క దేవుడులాంటి మావగారికి రెండోసారి నొప్పి రావటం బాధ అనిపించినా తాము ఈ యింట్లో నుంచి వెళ్లిపోవటానికి మావగారి అనారోగ్యం కారణం కాదు గదా! అనే అనుమానంతో మనసులోనే భయపడసాగింది సుజాత.

చీకటి పడుతున్నదనగా సుదర్శన్ హాస్పటల్ నుండి తిరిగి వచ్చాడు. ముఖంలో బాధ కొట్టవచ్చినట్లు కనపడుతుంది.

“ఏమండి మావగారికి ఎలావుంది? డాక్టరు ఏమన్నారు” అంది సుజాత.

“సుజీ! మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చింది. రేపు ప్రొద్దున్న వరకు ఏం చెప్పలేం అన్నారు. నిజం చెప్పాలంటే అమ్మకన్నా… నాన్న దగ్గరే…”

“ఏమండీ బాధపడకండి, దేవుడు లాంటి మావయ్యకు భగవంతుడు అన్యాయం చేయడు.” అంది సుదర్శన్‌ని ఊరుకోపెట్టాలన్నట్లు కాని సుజాతకు భయంగానే వుంది రెండోసారి హార్ట్ ఎటాక్ రావటంతో.

“సుజీ! ఈ పరిస్థితులలో… నాన్నగారు ఎలా వుంటారో తెలియని సమయంలో మనం… మనం ఎలా వెళదాం సుజీ” అన్నాడు సుదర్శన్.

అంతే ఒక్కసారి గుండె ఆగిపోయినట్లనిపించింది సుజాతకి.

“ఏమిటండీ మీరంటున్నది… ఏమిటి మనం…” కంగారుగా అంది.

ఒక్కక్షణం అదోలా చూసాడు సుజాత వైపు. “అమ్మకి నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి ఒకటే ఏడుపు మొదలు పెట్టింది. కొంపదీసి… ఉద్యోగం వచ్చిందని మీ నాన్నని ఈ పరిస్థితులలో వదిలి వెళ్లిపోతావేమిరా? ఆయన బ్రతుకుతారో లేదో, మగదిక్కు లేని దానిని. మీ నాన్నను ఎలా చూసుకోను… ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసాను. కష్టంలో తండ్రికి ఆసరా అవ్వవా? రెక్కలు రాగానే ఎగిరి వెళ్లిపోతారా? అని ఏడుపు మొదలు పట్టింది. ఆవిడ ఎటువంటిదైనా ఆవిడ మాటల్లో నిజం లేకపోలేదు” అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here