జ్ఞాపకాల పందిరి-54

49
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఆన్షికి… ఆత్మీయంగా..తాత!!

[dropcap]చి[/dropcap]న్న పిల్లలు ఏమి ఇష్టపడతారు? సాధారణంగా రకరకాల బొమ్మలు ఇష్టపడతారు. లేకుంటే ప్రీతిపాత్రమైన తినుబండారాలు ఇష్టపడతారు. చాకోలెట్లు, కేకులు, ఐస్ క్రీమ్ వగైరాలను ఇష్టపడతారు. బంధువులు చూడడానికి వస్తే, పిల్లలకోసం ఇటువంటివే బహుమతులుగా తెస్తారు. లేకుంటే బట్టలు తెస్తారు. అలాకాకుండా అప్పటికప్పుడు వాళ్లకిష్టమైనదేదో కావాలని మారాము చేస్తారు. ఇందులో కొన్ని తాత్కాలికమైనవి. క్షణాల్లోనో,నిముషాల్లోనో వాటి పని అయిపోతుంది. తర్వాత పిల్లలు వాటి గురించి మరచిపోతారు కూడా. కొన్ని బొమ్మలూ – ఆటవస్తువులూ కొద్దీ కాలం పిల్లలకు ఆటల్లో విందును అందిస్తాయి. అవి కూడా పిల్లలు ఎదిగే కొద్దీ మారిపోయి కొత్త ఐటమ్స్ రంగంలోకి దిగుతాయి. పుట్టిన రోజుకు కొందరు బంగారం వస్తువులు, మరికొందరు వెండి ఆభరణాలు, ఇంకొందరు పిల్లలకు నిత్యజీవితంలో ఉపయోగపడే వస్తువులు బహుమతులుగా ఇస్తుంటారు. ఇలా రకరకాలుగా బహుమతులు ఇచ్చే సంప్రదాయం కాలం మారుతున్నకొద్దీ రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఏదో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో, తిరుగు సారె.. మాదిరిగా ‘రిటర్న్ గిఫ్ట్’ సంప్రదాయం కూడా మొదలైంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, పేదరికంలో మగ్గుతున్నవాళ్ళు కూడా,ఇలాంటి సంప్రదాయాలకు ఆకర్షితులవుతున్నారు.

సరే ఎవరి ఇష్టం వారిది. సమాజంలో తమ తమ హోదాలను ప్రదర్శించుకునే విషయంలో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టలేము.

నా విషయానికి వస్తే, పిల్లలకు నేను ఎప్పుడూ బొమ్మలు కొనింది లేదు, ఖరీదైన బహుమతులు ఇచ్చింది లేదు, పిల్లలు ఖచ్చితంగా ఎప్పుడూ నన్ను అడిగిందీ లేదు. మా ఇద్దరికీ తగ్గట్టుగానే, పిల్లలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని, మాకు సహకరిస్తూ, మా బాట లోనే పెరిగి పెద్దవాళ్ళు అయినారు. అయితే పిల్లల పిల్లలు విషయానికొస్తే, చిత్రం, చిత్రంగా మారిపోతుంది. దానికి మేము కూడా అతీతులం కాదు. ఇప్పటికి మాకున్న ఒక్కగానొక్క మనవరాలు (కూతురి కూతురు) ఆన్షి సహాజంగా ప్రత్యేకమే! బట్టలూ -బంగారం -వెండీ మామూలే! వీటితో పాటు వీటికి భిన్నంగా ఏదైనా చేయాలనీ, అది కూడా మొదటి పుట్టిన రోజుకు చేయాలని నాకు ఆలోచన వచ్చింది. నేను తీసుకునే కొన్ని నిర్ణయాలకు తిరుగుండదు. పైగా మనవరాలు ఆన్షి విషయంలో ప్రశ్నించే అవకాశం కుటుంబంలో ఎవరికీ లేదు. ఆన్షి పుట్టిన తేదీ జనవరి -24, కనుక మనవరాలి మొదటి పుట్టిన రోజుకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. వెంటనే ఆన్షి పుట్టినప్పటినుండి సంవత్సరకాలం ఫోటోల వేటలో పడ్డాను.

మొదటి పుట్టినరోజు కోసం రూపొందించిన పుస్తకం
పనసతొనలు ఆవిష్కరణ కోసం కుటుంబం
సోదరుడు శ్రీ గుజ్జు రాజు(వరంగల్ జిల్లా ట్రెజరరీ ఆఫీసర్)పనసతొనలు ఆవిష్కరణ చేస్తున్న దృశ్యం.

అవి చాలా మట్టుకు మొబైల్‌తో తీసినవే! అప్పుడప్పుడూ నేను రాసిన కవితలు కొన్ని సేకరించాను. ఆశీస్సులు అందిస్తున్నట్టుగా కొంతమంది మిత్రులు (శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి, రేణుక. సుసర్ల, లక్ష్మీ పద్మజ, డా. ఎన్.వి.ఎన్. చారి మొ..) కవితలు రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా చేర్చాను. అది ఒక పుస్తకం రూపానికి వచ్చింది. సెంటినరీ బాప్టిస్ట్ చర్చి పెద్దలు పాస్టర్ నిరంజన్ బాబు, పాస్టర్ గాబ్రియేల్ (గుంటూరు), చిన్నాన్న కుసుమ వెంకటరత్నం గారూ ఆశీర్వచనాలు అందించారు. మిత్రులు – గురుతుల్యులు పుస్తకాన్ని సమీక్షిస్తూ ముందుమాట రాశారు. పుస్తక ముఖ చిత్రాన్ని ప్రియ మిత్రులు ‘సరసి’ గారు వేసి ఇచ్చారు. అంకితం మనవరాలు ఆన్షికే ఇచ్చాను. సకాలంలో అందమైన పుస్తకంగా శ్రీ దీప్తి ప్రింటర్స్ కృష్ణ గారు పూర్తి కలర్‌లో ముద్రించి ఇచ్చారు. మనవరాలిని ‘పండు’ ముద్దు పేరుతో పిలుస్తాను గనుక, పండు అర్థం వచ్చేలా పుస్తకానికి ‘పనస తొనలు’ అని పేరు పెట్టాను. సకాలంలోనే పుస్తకం తయారయింది. ఆన్షి పుటిన రోజున కుటుంబ సభ్యుల మధ్య ఆవిష్కరించాలని నిర్ణయించాను. సమాచారం అంతా కుటుంబ సంబంధమైనది కనుక దానికి వెల నిర్ణయించలేదు. అమూల్యం అని పెట్టేసాను.

పనసతొనలు..స్వీకరిస్తున్న సోదరుడు డా.ఓ.నాగేశ్వరరావు

2018 జనవరి -24 న, ఆన్షి పుట్టిన రోజు ‘హోటల్ మోక్ష్’ (సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టాండు దగ్గర)లో ఘనంగా జరిగింది. బంధుమిత్రులు చాలా మంది మిత్రులు హాజరైనారు. నా సహాధ్యాయి ప్రొఫెసర్ హరనాథ్ బాబు, ప్రియ మిత్రులు తోట సాంబశివ రావు గారూ కుటుంబ సమేతంగా, సోదరుడు గుజ్జు. రాజు (జిల్లా ట్రెజరీ అధికారి -వరంగల్) రావడం ఆనందమని పించింది. ప్రధాన కార్యక్రమం పూర్తి అయిన తర్వాత, ‘పనసతొనలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది సోదరుడు రాజు చేతుల మీదుగా, పుస్తక ఆవిష్కరణ – అంకితోత్సవం జరిగిన తర్వాత, వచ్చిన అతిథులందరికీ పుస్తకం బహుకరించడం జరిగింది.

ఈ ఆనందోత్సవంలో, నా పుత్ర రత్నం రాహుల్ ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. తరువాత ఇలాంటి బహుమతి ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. తెలుగుభాష పట్ల ఉత్సాహం తగ్గి పరిస్థితుల ప్రభావం వల్ల నా మనవరాలు ఆంగ్ల భాషకు అంకితం అయినా, తన చిన్నతనంలో తనకోసం తాత రాసిన పుస్తకాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని అయినా తెలుగు భాష నేర్చుకుంటుంది అన్నది నా ఆశ. నా ఆశలో స్వార్థం వున్నా తన అభివృద్ధికి ఆటంకం రాని స్థాయిలో తెలుగును తెలుసుకుంటుంది అన్నదే నా నమ్మకం.

ఇక నా తదుపరి పుస్తకం కేవలం మానవరాలికోసమే చిన్న.. చిన్న కవితలకు ఆన్షి ఫోటోలు జోడించి పుస్తకం వేసాను. ఈ పుస్తకం పురుడు పోసుకోవడానికి వెనుక కొంత చరిత్ర వుంది. నేను ‘మొలక’ అనే అంతర్జాల చిన్న పిల్లల పత్రికకు ప్రతిరోజూ చిన్నపిల్లలకు అనుకూలంగా చిన్న చిన్న కవితలు రాస్తూండేవాడిని. ఈ పత్రిక సంపాదకులు, గతంలో ‘వార్త’ దినపత్రికలో పనిచేసిన సహృదయులు శ్రీ వేదాంత సూరి గారు. ఆయన వార్త – ఆదివారం అనుబంధంలో చిన్న పిల్లలకు సంబందించిన ‘మొగ్గ’ పేజీ చూసేవారు. ఆయన మొలక అంతర్జాల చిన్నపిల్లల పత్రికలో రాయమని ప్రొత్సాహించారు. అంతమాత్రమే కాదు, ఒకరోజు నాకు ఫోన్ చేసి మీరు తప్పకుండా ఈ కవితలు మీ మనవరాలి కోసం పుస్తకం వేయాలని ప్రోత్సహించారు. నాకు కూడా ఆయన సలహా నచ్చింది. 2020 సంవత్సరం, ఆన్షి పుట్టినరోజుకి బహుమతి ఇవ్వాలని మనసులోనే అనుకుని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వేదాంత సూరిగారు, స్వప్న అనే బుక్ డిజైనర్ (హైదరాబాద్) పరిచయం చేశారు. ఆవిడకు స్క్రిప్ట్ పంపించాను. ఆవిడ పుస్తకాలంకారణ నాకు నచ్చింది. ఓ.కె. చేసేసాను. ముఖ చిత్రం కోసం మిత్రులు ‘సరసి’ గారిని అడిగాను. అయన చాలా బిజీగా వుంటారు. అయినా నాకోసం ఆయన బొమ్మ వేసి పంపారు. ముందుమాట గౌరవ పూర్వకంగా వేదాంత సూరిగారిని రాయమన్నాను. ఆత్మీయ వచనాలు మిత్రమణి, నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ. కొప్పిశెట్టి రాశారు. పుస్తకాన్ని నా పుత్ర రత్నం, ఆన్షి -మేనమామ, రాహుల్ కానేటి (బోస్టన్ -అమెరికా)కి అంకితం చేసాను. స్వప్న గారు పుస్తకాన్ని చాలా బాగా తీసుకొచ్చారు.

మనవరాలు ఆన్షి కోసం రెండవ బహుమతి
కుటుంబ సభ్యులు ఆవిష్కరిస్తున్న చిలకపలుకులు..పుస్తకం
చిలక పలుకులు ఆవిష్కరణ
చిలకపలుకులు స్వీకరిస్తున్న ఆకాశవాణి-హైదరాబాద్ మిత్రులు

పుస్తకం లోకల్‌గా శ్రీ దీప్తిలో అచ్చువేయించాను. మనవరాలు పుట్టిన రోజువరకూ ఈ పుస్తకం వేసిన విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా వుంచాను. కరోనా కారణంగా, పుస్తకావిష్కరణ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం ఏమీ తలపెట్టలేదు. సఫిల్ గూడా (సికింద్రాబాద్) ఇంట్లో 24, జనవరి 2021న, బంధువులందరము కలసి పుస్తకం ఆవిష్కరించాము. దీనిని చాలామంది మెచ్చుకున్నారు, సమీక్షలు రాశారు. నేను అడగకుండానే సమీక్షలు రాసి ఇచ్చిన, సహృదయులు శ్రీ నక్కా సుధాకర్ (ఆకాశవాణి -హైదరాబాద్)గారికీ, ప్రముఖ రచయిత్రి, సమీక్షకురాలు, విమర్శకురాలు, ఉపన్యాసకురాలు డా. సి. హెచ్. సుశీల గారికీ ఎంతగానో రుణపడివుంటాను నేను. ఈ పుస్తకానికి ‘చిలక పలుకులు’ అని నామకరణం చేసాను. దానికి సరిపడా సరసిగారి బొమ్మ మంచి ఆకర్షణీయమైంది.

రెండు పుస్తకాలకూ ముఖ చిత్రాలు వేసిపెట్టిన ప్రియ మిత్రులు ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ సరసి గారు

నా మనమరాలు కోసం నేను ఆత్మీయంగా రూపొందించిన బహుమతులు నాకు ఎంతో తృప్తిని కలిగించాయని గట్టిగా చెప్పగలను. ఇలా ఇంకా భవిష్యత్తులో ఏమైనా చేయగలనేమో చెప్పలేను. కానీ.. ఆన్షి మంచి ఎదుగుదలను, కనులారా చూసే అదృష్టాన్ని మాత్రం నిత్యం కోరుకుంటాను. తెలుగు భాషలో మంచి పట్టు సాధిస్తుందని తప్పక నమ్ముతాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here