[dropcap]’వా[/dropcap]న తగ్గింది కానీ మళ్ళీ మొదలయ్యేలా ఉంది’ అనుకున్నాడు భవానీ శంకర్, వరాండాలో నిల్చుని ఆకాశం వైపు చూస్తూ.
మద్యాహ్నం రెండు గంటలకు మొదలైన వాన ఆరు గంటలవరకూ ఏకధాటిగా కురిసింది. ఆ నాలుగు గంటలూ వరాండాలోనే కూర్చుని తెలుగు డిటెక్టివ్ నవల చదువుతూ గడిపాడు. నవల చదవడం పూర్తవడం, వాన నిలచిపోవడం ఒకేసారి జరిగాయి. నవలలోని శృంగార సన్నివేశాలు ఇచ్చిన ఉల్లాసానికి చల్లటి వాతావరణం కూడా తోడవడంతో అతని మనసు ఆహ్లాదంగా మారిపోయింది.
‘ఈ సమయంలో ఓ అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఎంత బాగుంటుంది? ఈ చల్లని సాయంత్రాన్ని మథురమైన అనుభవంగా మలచుకోవచ్చు’ అనుకున్నాడు. అతనికి ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే ఎదురుగా కనిపించింది ఓ అమ్మాయి. వీధి చివరినుంచి వేగంగా నడచుకుంటూ వస్తూంది. ‘మళ్ళీ వాన మొదలయ్యేలోపు ఇల్లు చేరుకోవాలని ఆ వేగం కాబోలు’ అనుకున్నాడు. సరిగ్గా ఆమె అతని ఇంటిముందుకు వచ్చేసరికి వాన జోరున కురవసాగింది. ఆమె చుట్టూ చూసి, పరుగెత్తుకుంటూ వచ్చి అతని ఇంటి వరాండాలో నిల్చుని అతనివైపు చూసింది. అతను పలకరింపుగా నవ్వాడు. ఆమె చిన్నగా నవ్వింది. భవానీ ఆమెని పరిశీలనగా చూడసాగాడు.
ఆమె చాలా అందంగా ఉంది. ఆమె ధరించిన తెల్ల చుడీదార్ పూర్తిగా తడిసిపోయి ఆమె అందాల చిరునామాను తెలుపుతున్నాయి. మంచి రంగు, చక్కటి కనుముక్కు తీరుతో పాటు తీర్చిదిద్దినట్లున్న అవయవాల పొందికతో చాలా ఆకర్షణీయంగా ఉంది.
“కూర్చోండి” అన్నాడు తనకు ఎదురుగా ఉన్న అరుగును చూపిస్తూ. ఆమె కూర్చోలేదు.
“మీరు వెళ్ళాలేమో. కాని ఎలా వెళతారు? నా గొడుగు ఇచ్చినా గాలి తీవ్రతకు అది నిలువదు.పైగా చీకటిపడింది. రోడ్డుపై మనుషులెవరూ కనిపించడం లేదు. ఒంటరిగా వెళ్ళడం రిస్కే” అన్నాడు.
ఆమె అవునన్నట్లు తలూపింది.
“మీ ఇంట్లోవాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళతారు”
“నేను హాస్టల్‌లో ఉంటున్నాను”
“మీరు ఆలస్యంగా వెళితే గేటు వేసెయ్యడం, వార్డెన్ తిట్టడం లాంటివి ఉంటాయా?
ఆమె అవునన్నట్లు తలూపింది మళ్ళీ.
“మరేం చేద్దాం?” ఆమె వైపు తదేకంగా చూస్తూ అన్నాడు.
“ఈ రాత్రి మీ ఇంట్లొ ఉండి రేపు ఉదయం వెళ్ళిపోతాను”
ఆమె ఆ మాట అనగానే అతని కళ్ళు మెరవడం ఆ చిరుచీకట్లో ఆమెకి కనిపించింది.
***
ఆమె వంటగదిలో ఉప్మా తయారు చేస్తూంది. భవాని వంటగదికి ఆనుకుని ఉన్న డైనింగ్ రూములోని ఓ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేతిలో అయితే న్యూస్ పేపర్ ఉంది కానీ అతని దృష్టంతా ఆమె మీద, ఆమె నడుము మీది మడతల పైన ఉంది.
“టిఫిన్ రెడీ” ఉప్మా ఉన్న ప్లేట్లను టేబుల్ పై పెడుతూ అంది ఆమె.
“మీకు శ్రమ ఇచ్చాను” అన్నాడు ప్లేటు తన దగ్గరికి లాక్కుంటూ.
“ఇందులో శ్రమేం లేదు. చాలా సులువుగా చేసే టిఫిన్ మీరు కోరారు”అంది అతని ఎదురుగా కూర్చుంటూ.
“చెప్పడం మరచాను. నా పేరు భవాని” అన్నడు భవాని.
“నా పేరు శ్రీలత”
“మీ పేరు బాగుంది, మీలాగే”
శ్రీలత నవ్వింది.
“శ్రీలతగారూ. ఈ కాలం అమ్మాయిలు ధైర్యవంతులని తెలుసుగాని రాత్రిపూట ఓ ఒంటరి మగాడి ఇంట్లో గడిపేంత ధైర్యం వారికి ఉంటుందని నేను ఊహించలేదు”
“ఆత్మల ఉనికిని పరిశీలించడానికి స్మశానాలకే వెళుతుంటాను. అటువంటిది ఓ మగవాడితో ఉండటానికి నాకెందుకు భయం?”
“ఆత్మలను పరిశీలిస్తారా? ఎందుకు?” ఆశ్చర్యంగా ఆమెవైపు చూస్తూ అన్నాడు.
“నేను ఆత్మలపై రీసెర్చ్ చేస్తున్నాను”
“ఆత్మల పైనా? మైగాడ్!”
“ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు?”
“ఆత్మలపైన రీసెర్చ్ అంటేనే ఓ సాహసం. అది ఓ అమ్మాయి చెయ్యడం మరింత సాహసం. ఓ రకంగా విడ్డూరం కూడా”
“మహిళలు అంతరిక్షంలోకే వెళుతున్నారు సార్. ఇక భూమ్మీద ఉండి ఆత్మలమీద రీసెర్చ్ చెయ్యడంలో వింత ఏముంది?”
“నిజమే. ఇంతకూ ఆత్మలూ, దెయ్యాలూ ఒకటేనా?”
“హహ. ఒకటే. కాస్త పాలిష్డ్ లాంగ్వేజీలో ఆత్మలని చెప్పాను. అవంటే నాకు భలే ఇష్టం “
“ఇష్టమా? కొంపదీసి మీరు దెయ్యం కాదు కదా?” భయం నటిస్తూ అన్నాడు భవాని.
“ఏమో…కావచ్చు” అంది శ్రీలత నవ్వుతూ.
“మీరు దెయ్యం కాదు లెండి. మీరు వరాండాలో నిల్చుని ఉన్నప్పుడు వాన చినుకులు మీ తెల్లని పాదాలను తాకడం చూశాను. అప్పుడు మీ పాదాలు ముందుకు తిరిగే ఉన్నాయి”
“దెయ్యాల పాదాలు వెనక్కి తిరిగి ఉండటం, దెయ్యాలు అర్ధరాత్రి తెల్లచీర ధరించి వచ్చి పాట పాడుతూ తిరగడం, కళ్ళు వికృతంగా త్రిప్పడం, జుట్టు విరబోసుకుని ఉండటం…ఇవన్నీ సినిమావాళ్ళ కల్పనండీ”
“మరి దెయ్యాలు ఎలా ఉంటాయంటారు?”
“అవి బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కాకపోతే కాస్త చిక్కినట్లు, కళ తప్పినట్లు కనిపిస్తాయి”
“కొన్ని సినిమాల్లో దెయ్యాలు మనిషిని తాకితే ఆ స్పర్శ ఆ మనిషికి తెలియదన్నట్లు చూపిస్తారు. మరికొన్ని సినిమాల్లో దెయ్యం మనిషి గొంతు పట్టుకు పిసుకుతూంటే ఆ మనిషి కళ్ళు తేలేసినట్లు చూపిస్తారు. ఇంతకూ దెయ్యం స్పర్శ మనకు తెలుస్తుందా లేదా?”
“చెప్పాగా…సినిమావాళ్ళు ఏదైనా సృష్టిస్తారని. నేను రీసెర్చ్ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇంకా అంతదాకా
రాలేదు. కాని ఓ ఇల్లు చూసి అది హాంటెడ్ హౌసా కాదా అన్నది చెప్పగలను”
“అంటే ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతూందా లేదా అని చెబుతారా?”
అవునన్నట్టు తలాడించింది శ్రీలత.
“మా ఇంట్లో తిరుగుతూందేమో చూసి చెబుతారా? నవ్వుతూ అడిగాడు భవాని.
“నన్ను పావుగంట వదిలేస్తే పరిశీలించి చెబుతాను”
“ఓకే. మీకు అభ్యంతరం లేకపోతె నేను సిగరెట్ కాల్చుకుంటూ టీవీ చూస్తాను. ఆ సమయంలో మీరు పరిశీలించండి”
“తప్పకుండా” అంది శ్రీలత.
పావుగంట తర్వాత శ్రీలతను సమీపించి ” మీ పరిశీలన పూర్తయిందా?” అని అడిగాడుభవాని.
అయిందన్నట్టు తలూపింది శ్రీలత.
“మరి రిజల్ట్ ఏమిటో చెప్పండి. మా ఇంట్లో దెయ్యం తిరుగుతూందా?”
అవునన్నట్టు తలూపింది శ్రీలత.
ఎక్కడో పిడుగు పడ్డ శబ్దం వినిపించడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
వెంటనే శ్రీలత అతని వైపు చూసింది.
అతని ముఖంలో భయం స్పస్టంగా కనిపించింది ఆమెకు.
***
“హార్లిక్స్ రెడీ” అంటూ ఓ కప్పు అతని చేతికిచ్చి అతని ఎదురుగా కూర్చుని తన కప్పు లోని హార్లిక్స్‌ని సిప్ చేసింది శ్రీలత.
“శ్రీలతా. నువ్వు నన్ను ఉడికించాలని అలా చెప్పావు కదా” అని అడిగాడు భవాని.
అతని సంబోధన ఏకవచనంలోకి మారడం గమనించింది ఆమె.
“ఏది.. దెయ్యం గురించేనా? నేను నిజమే చెప్పాను”
“నేను నమ్మను. మేము ఇల్లు కట్టుకుని దాదాపు పదేళ్ళవుతూంది. ఇంతవరకూ మాకే దెయ్యం కనిపించలేదు. కనీసం అది ఉన్న సూచనలు కూడా కనపడలేదు” అన్నాడతను అసహనంగా.
“ఆ దెయ్యం ఈ రోజు ఉదయమే మీ ఇంట్లో ప్రవేశించింది”
“అదెలా చెబుతావు? ఆ దెయ్యం నీకు కనిపించిందా?”
“లేదు. బట్ ఐ కెన్ ఫీల్ ఇట్. అవన్నీ వివరంగా చెప్పాలంటే గంటసేపు పడుతుంది. రాత్రిపూట చెబితే మీరు భయపడొచ్చు. అందువల్ల రేపు ఉదయం చెబుతాను. అన్నట్టు మీరు ఎప్పట్నుంచి ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు?”
“అమ్మానాన్నలు ఈరోజు ఉదయమే ఊరెళ్ళారు. అప్పట్నుంచే”
“చూశారా? నేను చెబితే మీరు నమ్మలేదు. మీ ఒంటరితనం మొదలైన వెంటనే ఆ దెయ్యం మీ ఇంట్లో ప్రవేశించింది”
“ఇంతకూ అది ఆడ దెయ్యమా లేక మగ దెయ్యమా?” అని అడిగాడు భవాని.
“యుక్తవయస్సులో ఉన్నప్పుడు చనిపోయిన యువతి ఆత్మ” అంది శ్రీలత.
“అది నీకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు కూడా రేపు ఉదయమే చెబుతావా”
వెటకారంగా అడిగాడు భవాని.
“దాని చేష్టలను బట్టి నాకు తెలుస్తుంది. ఆ చేష్టలు మాకు తెలుస్తాయి”
“ఆ దెయ్యం నన్నేం చేస్తుంది? చంపేస్తుందా?
“అది కూడా నాకు తెలియదు. మీకేదైనా అయితే నాకు తెలుస్తుంది” అంటూ నవ్వింది.
భవాని సీరియస్ గా ఆమెవైపు చూసాడు.
“ఐతే ఆశ్రయమిచ్చిన వ్యక్తికి హాని కలగాలని నేను కోరుకోను. ఎందుకైనా మంచిది. మీరు జాగ్రత్తగా ఉండండి” అంది శ్రీలత.
“ఏం జాగ్రత్త తీసుకోమంటావు?” విసుగ్గా అడిగాడు.
“మీ అమ్మానాన్నలు తిరిగొచ్చేదాకా మీ స్నేహితుల్ని రాత్రిపూట మీకు తోడుగా పడుకోమనండి”
“దెయ్యాలు ఉదయం పూట హాని చెయ్యవా?”
“అబ్బ..ఎన్ని ప్రశ్నలండీ బాబూ? నా రీసెర్చ్ మొత్తం పూర్తయ్యాక నేను మీ ఇంటికి వచ్చి ఉండాల్సింది” అంది గట్టిగా నవ్వుతూ.
“ఈ ఒక్క ప్రశ్నకు జవాబివ్వు. ఆ దెయ్యం మాఇంట్లోకి ఎందుకు వచ్చిందంటావు?”
“మామూలుగా ఆత్మలు తమకు ఎక్కువ ఇష్టమైన చోట ఉంటాయి లేదా తమకు నష్టం జరిగిన చోట ఉంటాయి”
భవాని కొంతసేపు ఆమె వైపే చూస్తూండిపోయాడు. తర్వాత “ఈ ఇల్లు కట్టినప్పట్నుంచీ అమ్మ,నాన్న, నేను.. ముగ్గురమే ఈ ఇంట్లో ఉంటున్నాం. అమ్మాయిలెవరూ ఈ ఇంట్లో నివసించలేదు” అన్నాడు.
“ఏ ఆడపిల్లకైనా ఈ ఇంట్లో అన్యాయం జరిగిందా?” అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శ్రీలత.
అన్యమనస్కంగా తల అడ్డంగా ఊపాడు భవాని.
“అయితే మీకేం ఇబ్బంది లేదు. అన్యాయం చేసినవాళ్ళకు అవి నరకం చూపిస్తాయి. పగబట్టిన దెయ్యం త్రాచుపాము కంటే ప్రమాదకరమైనది” అంటూ కుర్చీలోంచి లేచి “నేనెక్కడ పడుకోను?” అని అడిగింది అతన్ని.
“నీవు నా గదిలో పడుకో. నేను మా అమ్మానాన్నల గదిలో పడుకుంటాను. పద..గది చూపిస్తాను” అంటూ కదిలాడు భవానీ.
“ఇందాకే ఇల్లు పరిశీలిస్తున్నప్పుడు చూశాను.చాలా బాగుంది మీ గది”
“అయితే చిన్న ప్రాబ్లెం. ఈ గది తలుపుకు గడియ పడటం లేదు”
“ఫర్వాలేదు. నేనేం ఒంటరి ఆడదాన్ని కాదుగా?”
అర్థం కానట్లు చూశాడు ఆమె వైపు.
“ఈ ఇంట్లో నాతో పాటు ఓ ఆడపిల్ల ఆత్మ కూడా ఉందిగా”
ఈసారి అతని ముఖంలో భయం కాస్తా ఎక్కువగానే కనిపించింది ఆమెకి.
***
‘వర్షం మళ్ళీ మొదలైంది’ అనుకున్నాడు భవాని, కిటికీలోంచి బయటికి చూస్తూ. మెరుపులు,ఉరుములతో బీభత్సంగా ఉంది వాతావరణం.
కిటికీ తలుపు దగ్గరగా వేసి మంచంపై పడుకున్నాడు.
అతని కళ్ళముందు శ్రీలత రూపం మెదిలింది. ఎంత ఆకర్షణీయంగా ఉంది శ్రీలత? అవయవాలన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉండి తనలో అలజడి లేపింది. తడిసిన అందాలతో ఆమె ఇంట్లోకి నడుస్తూంటే ఈ రాత్రి తన పంట పండిందని సంబరపడ్డాడు. ఐతే ఆమె అనూహ్యంగా దెయ్యాల ప్రస్తావన తెచ్చి తన మూడ్ చెడగొట్టింది. ఇంతకూ ఆమె చెప్పినదంతా నిజమేనా? ఆమె ముఖం చూస్తే అబద్ధం చెబుతున్నట్లు తనకు అనిపించలేదు. అయినా ఓ అపరిచుతుడితో అబద్ధం చెప్పవలసిన అవసరమేముంది ఆమెకి? అయితే మగవాడయివుండీ తను భయపడుతున్నాడు. మరి ఆమె భయపడటం లేదెందుకు? రీసెర్చ్ వర్క్ కోసం మానసికంగా అన్నిటికీ సిద్దమైనందుకా?
‘దెయ్యాలు తమకు అన్యాయం చేసినవారికి నరకం చూపిస్తాయి’ అన్న శ్రీలత మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే భావన గుర్తొచ్చింది. తను ఓ సారి ముంబై నుండి హైదరాబాదుకు ట్రైన్లో వస్త్గున్నప్పుడు భావన పరిచయమైంది.ఆమె అందం తనను కట్టి పడేసింది. అమాయకంగా కనిపించే అమ్మయిల్ని ట్రాప్ చేయడంలో సిద్ధహస్తుడైన తను ఆమెతో మాటలు కలిపాడు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని,హైదరాబాదుకు వచ్చాక ఆమెకు కాల్ చేసి మాట్లాడసాగాడు. ఆమెని తరచుగా కలుస్తూ పరిచయం కాస్తా ప్రేమగా మారేలా చేసాడు. కొంతకాలం ప్రేమాయణం నడిపాక ఓ రోజు తన పుట్టినరోజని ఇంటికి ఆహ్వానించి, ఆమె వస్తే తన తల్లితండ్రులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను నమ్మి ఇంటికి వచ్చిన భావనపై తను, తన ఇద్దరు స్నేహితులు అత్యాచారం చేసారు. ఆ రాత్రంతా ఆమెని గదిలో బంధించి ఉంచి తమ కోర్కెలు తీర్చుకున్నారు. మరుసటి రోజు ఆమెని బయటికి పంపిస్తూ జరిగిన సంగతి ఎవరికైనా చెబితే ఆమె తల్లితండ్రులకు హాని చేస్తామని బెదిరించారు.
వారం రోజుల తర్వాత ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ తన ఇంటికి వచ్చి ఓ కార్డ్ తన చేతికిచ్చాడు. అందులో భావన ఫొటోతో పాటు ఆమె మరణించిన తేదీ, దశదిన కర్మ జరగబోయే తేదీ, ఇతర వివరాలు ఉన్నాయి. భావన చనిపోయిందన్న విషయం తెలియగానే రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు తను. ఆ ఇన్స్పెక్టర్ ‘భావన ఆత్మహత్య చేసుకుందని, మహిళా సంఘాలు ఆమె చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండు చేస్తున్నాయని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారని’ చెప్పాడు. ‘భావన కాల్ డేటాలో భవానీ నెంబర్ పలుసార్లు కనిపించిందని, ఇంటరాగేషన్ కోసం తనతో పాటు స్టేషన్‌కి రావాలని’ చెప్పాడు. మొదట తను భావనకు కేవలం స్నేహితుడినని, తనకే పాపం తెలియదని అమాయకత్వం నటించాడు. అతను వెంటనే జేబులోంచి ఓ కాగితం తీసి తన చేతికిచ్చాడు. అది భావన రాసిన ఉత్తరం. ఆ దస్తూరీ తనకు పరిచయమైనదే. భవానీ తనను వంచించినందుకు మనసు విరిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావన అందులో రాసింది. “ఆ ఉత్తరం తనకు మాత్రమే దొరికిందని, ఇంకా ఎవరికీ చూపించలేదని, కేసు నుంచి తప్పించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలనీ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేసాడు. యాభై వేలకు బేరం కుదుర్చుకుని, వారం రోజుల తర్వాత అతనికి ఆ డబ్బులు అందజేసి, ఆ సమస్య నుంచి బయటపడ్డాడు.
‘అయితే తనపై పగ సాధించడానికే భావన దెయ్యంగా మారి తన ఇంట్లో ప్రవేశించిందా? వచ్చి ఏం చేస్తుంది? తనను చంపేస్తుందా?’ అనుకున్నాడు భవాని.
ఎక్కడో పిడుగు పడిన శబ్దం వినిపించింది. వెంటనే కరెంటు పోయి చుట్టూ చీకటి వ్యాపించింది. ఇన్వర్టర్ ఎందుకు పనిచేయలేదో అతనికి అర్థం కాలేదు. స్టోర్ రూం కెళ్ళి చూచేందుకు అతనికి ధైర్యం చాల్లేదు. అంతలో కిటికీ తలుపులు భళ్ళున తెరచుకుని చల్లని గాలి అతని ముఖంపై విసురుగా తాకింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనలకు భవాని నిశ్చేష్టుడయ్యాడు. అతనికి తను ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపించింది. ‘శ్రీలత ఉన్న గదిలోకి వెళితే తనకో మనిషి తోడు ఉంటుంది. తర్వాత నయానో, భయానో ఆమెను లోబరచుకుని తన కోరిక కూడా తీర్చుకోవచ్చు ‘ అనుకున్నాడు.
అదురుతున్న గుండెలతో చీకట్లోనే నడచుకుంటూ శ్రీలత ఉన్న గదిలోకి నడిచాడు. మెరుపుల వెలుగులో ఆమె మంచంపై పడుకుని ఉండటం కనిపించింది. నిశ్శబ్దంగా ఆమె ప్రక్కన పడుకుని, అటువైపు తిరిగిఉన్న ఆమె నడుముపై చెయ్యివేసి, ఆమెను తనవైపు త్రిప్పుకున్నాడు. తన ముఖాన్ని ఆమె ముఖానికి ఆనించి తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు.
వెంటనే గదిలోని ట్యూబులైటు వెలిగింది. కళ్ళు తెరచి లైటు వెలుగులో ఆమె ముఖాన్నిచూసి అతను గట్టిగా ఆర్తనాదం చేస్తూ మంచం మీదినుంచి క్రిందపడిపోయాడు.
***
శ్రీలత,, ధీరజ్ శ్రీలత ఇంట్లో సమావేశమయ్యారు.
“మన ప్లాను సూపర్ సక్సెస్” అంది శ్రీలత కుడిచేతి బొటనవేలిని పైకెత్తి చూపుతూ.
“ఎంతైనా సినిమా రచయిత్రివి. పైగా ఘోస్ట్ రచయిత్రివి. నీవు రచించిన ఘోస్ట్ ప్లాన్ సక్సెస్ కాకుండా ఉంటుందా?” అన్నడు ధీరజ్.
“ఈ విజయంలో నీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది ధీరజ్. నువ్వూ చాలా బాగా నటించావు” అంది శ్రీలత.
“పోలీస్ వేషం వేయాలన్న నా కోరిక సినిమాల్లో అయితే తీరలేదు కాని నిజజీవితంలో ఆ పాత్ర నాచే వేయించావు. అంతే కాదు. యాభై వేల పారితోషికం కూడా భవానీచే యిప్పించావు” అన్నాడు ధీరజ్ నవ్వుతూ.
“ఓ అమాయకురాలికి జరిగిన అన్యాయాన్ని చూసి చలించిన మనం స్నేహితులుగా మన వంతు కర్తవ్యం నిర్వహించాము. ఓ పాపాత్ముడి దురాగతాలకు చరమ గీతం పాడాము” అంది శ్రీలత.
“ఇంతకీ నీ ప్లానేంటో చెప్పకుండా నన్ను సస్పెన్స్ లో పెట్టావు” అన్నాడు ధీరజ్.
“భావన చనిపోయిందని నీవు భవానీని నమ్మించావు కదా. తర్వాత అతను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నేను అతనింటికి వెళ్ళాను. వర్షం కారణం చెప్పి ఆ రాత్రి అతని ఇంట్లో ఉండిపోయాను. దెయ్యాలమీద రీసెర్చ్ చేస్తున్నానని చెబుతూ పదే పదే దెయ్యాల ప్రస్తావన తెచ్చాను. అతనింట్లో దెయ్యం తిరుగుతుందో లేదో పరిశీలిస్తానని ఇల్లంతా తిరుగుతూ బయట ఉన్న భావనని ఇంట్లోకి రప్పించి స్టోర్ రూంలో దాచాను. తర్వాత ఇంట్లో దెయ్యం తిరుగుతూందని చెప్పి అతన్ని భయపెట్టాను. మేమిద్దరం పడుకోవడానికి చెరోగదిలోకి వెళ్ళాక భావన ఇన్వర్టర్ కనెక్షన్ పీకేసి పవర్ ఆఫ్ చేసింది. భయంవల్లో, కోరికవల్లో భవాని నేను ఉన్న గదిలోకి వస్తాడని నాకు తెలుసు. అందుకే భావనని పవర్ ఆఫ్ చేయగానే నేనున్న గదికి వచ్చి నా స్థానంలో పడుకోమన్నాను. నేను ఊహించినట్లే భవానీ ఆ గదిలోకి వచ్చి భావన ప్రక్కన పడుకుని నేననుకుని ఆమెని దగ్గరకు తీసుకోబోయాడు. అప్పుడే నేను పవర్ ఆన్ చేసాను. లైటు వెలుగులో భావనని చూసి దెయ్యమనుకుని బిగ్గరగా అరుస్తూ కూలిపోయాడు”
“అబ్బ!ఎంత అద్భుతమైన ప్లాను?” అన్నాడు ధీరజ్ ఆమెవైపు అభినందనపూర్వకంగా చూస్తూ.
“దుష్టశిక్షణకు భగవంతుడు కూడా తన సహకారం అందిస్తాడన్న విషయం ఋజువు చేస్తూ ఆరోజు సాయంత్రం నుంచీ జోరువాన కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు మా ప్లాను విజయవంతం కావడానికి ఎంతో తోడ్పడ్డాయి.” అంది శ్రీలత.
“వాడు పోయాడా” ధీరజ్ అడిగాడు.
అవునన్నట్టు తలూపింది శ్రీలత.
“పోలీస్ కేస్ అవుతుండేమో” భయంగా చూస్తూ అన్నాడు ధీరజ్.
“అతని తల్లితండ్రులు పోలీసులకు కంప్లయింట్ చెయ్యలేదు. వాడి వెధవ్వేషాలు తెలిసి ఉండటం చేత నలుగురికి తెలిస్తే పరువు పోతుందని ఊరకుండిపోయారేమో” అంది శ్రీలత.
అంతలో అక్కడికి వచ్చిన భావనని చూసి “కంగ్రాజులేషన్స్ భావనా” అంది శ్రీలత తన చేయి ఆమెకు అందిస్తూ.
“థాంక్యూ” అంది భావన నిర్లిప్తంగా.
భావన ముఖంలో ఆనందం కనిపించకపోవడం గమనించి “ఏమిటి భావనా? అంత డల్‌గా ఉన్నావు? వాడిపై పగ తీర్చుకున్నానన్న ఆనందం నీలో కనిపించడంలేదు” అని అడిగింది శ్రీలత.
“అతను చనిపోవాలని నేను కోరుకోలేదు. ఓ దెయ్యం తనను వెంటాడుతూందన్న భయంతో అతను చస్తూ బ్రతకాలని నేను ఆశించాను. ఓ ప్రాణం తీసి పాపం మూటగట్టుకున్నామేమో అని బాధగా ఉంది” అంది భావన.
“బాధ ఎందుకు? రేప్ కం మర్డర్ కేసుల్లో నిందితులకు న్యాయమూర్తులు మరణశిక్ష వేసినా, పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి కాల్చేసినా జనం ఆ రాక్షసులకు తగిన శిక్ష పడిందని సంతోషపడుతున్నారే గాని శిక్షించిన వాళ్ళకు పాపం అంటుకుందని అంటున్నారా? అఫ్‌కోర్స్ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం తప్పే. కాని వాడు పోతాడని మనం ఊహించలేదుగా? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ‘చేసేది నీవు-చేయించేది నేను’ అన్నాడుగా. ఇది ఆయన లీలే అని భావించు. ముఖ్యంగా వాడి బారి నుంచి ఎంతోమంది అమ్మాయిల జీవితాలను కాపాడిన పుణ్యం మన ఖాతాలలో జమకాబోతూంది. కమాన్. చీర్ అప్” అంటూ భావన భుజం తట్టింది శ్రీలత. శ్రీలత రీజనింగ్‌కు కన్విన్స్ అయినట్లుగా నవ్వింది భావన.