అలనాటి అపురూపాలు-60

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

అందాల బాలతార షిర్లే టెంపుల్:

హాలీవుడ్ చరిత్రలో బాక్సాఫీస్ స్టార్ ఎవరని ఎప్పుడయినా ఆలోచించారా? నన్ను చెప్పనీయండి… క్లార్క్ గాబెల్ కాదు, మార్లిన్ మన్రో కాదు, ఎలిజబెత్ టేలర్ అంతకంటే కాదు. వీళ్ళందరిని అధిగమించినది ప్రకాశవంతమైన కళ్ళు, ఉంగరాల జుట్టు, సొట్టబుగ్గలు ఉన్న ఆరేళ్ల బాలనటి అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆర్థికంగా క్రుంగిపోయిన హాలీవుడ్ స్టూడియోలను పునరుజ్జీవింపజేసిందీ పాప. ఈ ప్రక్రియలో ప్రపంచంలోకెల్లా గుర్తింపు పొందిన బాలిక అయింది. ఆర్థిక మాంద్యం కాలంలో తను ఓ ఆశాకిరణం. ప్రేక్షకులు తమ రోజూ వారీ సమస్యలను తాత్కాలికంగానైనా మర్చిపోయి, ఆమె హాస్యానికి నవ్వుకుని మైమరిచేలా చేసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోను తను ఎందరో బ్రిటీషువారికి, అమెరికన్‍లకు ఓ ఊరట. రోజువారి కష్టాల నుంచి తప్పించుకోడానికి తను ఆధారం!

శాంటా మోనికా రిసార్టులలో 23 ఏప్రిల్ 1928 నాడు బేబీ షిర్లే జేన్ టెంపుల్ జన్మించడంతో తన శకం మొదలయింది. కాలిఫోర్నియాలో బ్యాంక్ మేనేజరు అయిన జార్జ్ టెంపుల్, మాజీ నాట్యగత్తె అయిన జెర్‌ట్రూడ్ దంపతులకు ఈ పాప మూడవ సంతానం.

మూడేళ్ళ వయసులో హాలీవుడ్ లోని ఏథెల్ మెగ్లిన్ డాన్స్ స్టూడియోస్‍లో చేరిందీ పాప. అక్కడ తనని ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ సంస్థకి చెందిన ఇద్దరు టాలెంట్ స్కౌట్స్ గమనించి, ఒక రీల్ – ‘పావర్టీ రో’ షార్ట్స్‌లో అవకాశం ఇప్పించారు. పాప మనోహరమైన ప్రవర్తనతో ఆకర్షితులై ఎడ్యుకేషనల్ ఫిల్మ్స్ సంస్థ వారానికి 50 డాలర్ల పారితోషికంతో వరుసగా 26 లఘు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకుంది. నేటి లెక్కల్లో ఆ మొత్తం వారానికి 468 పౌండ్లకి సమానం.

ఇందులో మొదటి ఎనిమిది ‘Baby Burlesks’ అనే అసభ్య సిరీస్‍లోవి. వీటి గురించి పెద్దయ్యాకా, షిర్లే టెంపుల్ మాట్లాడుతూ – తన బాల్యపు అమాయకత్వాన్ని – రేసిస్ట్ గానూ, సెక్సిస్ట్‌గాను వాడుకోవడం దారుణం – అని అన్నారు.

ఎడ్యుకేషనల్ సంస్థలో పని చేయడం అంటే బానిసలా ఉండడమే. రిహార్సల్స్ సాకుతో రెండు వారాలు డబ్బులివ్వకుండా గడిపేసేవారు. ప్రతీ చిత్రాన్ని అతి వేగంగా రెండు రోజులలో నిర్మించేవారు. ప్రధాన పాత్ర పోషించినందుకు గాను షిర్లేకి రోజుకి పది డాలర్లు దక్కేవి.

దురుసుగా ప్రవర్తించే పిల్లలను ‘పనిష్‍మెంట్ బాక్స్’ అనే ఐస్ బాక్స్‌లో ఉంచి శిక్షించేవారు. షిర్లేని పలుమార్లు ఈ ఐస్ బాక్స్ లో ఉంచారు.

ఎడ్యుకేషనల్ సంస్థ దివాళా తీసినప్పుడు, జార్జ్ టెంపుల్ తన కూతురు కాంట్రాక్ట్‌ని కేవలం 25 డాలర్లకి కొనుక్కున్నారు.

ఐదేళ్ళ షిర్లేకి తొలి విజయవంతమైన అవకాశం గేయ రచయిత, ‘Brother, Can You Spare A Dime?’ చిత్రానికి సహ రచయిత అయిన జే జోర్నీ ద్వారా వచ్చింది. ఫాక్స్ స్టూడియోస్ వారు పాపని 7 డిసెంబర్ 1933న తమ కొత్త చిత్రం ‘Stand Up And Cheer’కి ఆడిషన్‌కి రమ్మన్నారు.

తల్లి ప్రోత్సహించడంతో చిన్నారి షిర్లే బాగా చేసింది. ‘Baby Take A Bow’ అనే పాటని కూడా పాడింది. ముగ్ధులైన నిర్మాతలు ఒక సంవత్సరం పాటు వారానికి 150 డాలర్లు చెల్లించేలా – ఒప్పందాన్ని మరో ఏడేళ్ళు పొడిగించుకునేలా, ఇంకా పాప తల్లికి వారానికి 25 డాలర్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కుటుంబపు దశ తిరిగింది.

‘Now I’ll Tell’ చిత్రంలో స్పెన్సర్ ట్రేసీ కూతురుగా నటించాకా, ఫాక్స్ స్టూడియోస్ వారు బేబీ షిర్లేని పారమౌంట్ స్టూడియోస్‌కి బదలాయించారు. అక్కడ తను ‘Little Miss Marker’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. పారితోషికం కూడా ఫాక్స్ వారు చెల్లించిన దాన్ని కన్నా ఆరు రెట్లు ఎక్కువగా వారానికి 1000 డాలర్లు లభించింది.

ఈ సినిమాలో తన సహనటి Adolphe Menjou మాట్లాడుతూ – “ఈ పాప నన్ను భయపెట్టేసింది. తనకి అన్ని చిట్కాలు తెలుసు” అన్నారు.

ఈ సినిమా డైరక్టర్ పాప తల్లి దుర్మార్గుల చేత కిడ్నాప్ గురయ్యే సన్నివేశాన్ని వివరిస్తూ ఎలా ఏడవ్వాలో చెబితే, అద్భుతంగా చేసి చూపించిదట ఆ చిన్నారి.

ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఓ స్టార్ ఆవిర్భవించబోతున్నట్టు పారమౌంట్ వారికి అర్థమైపోయింది. భారీ మొత్తం – 50,000 డాలర్లు ఇస్తామని, పాపని తమకిచ్చేయమని ఫాక్స్ స్టూడియోస్ వారిని అడిగారట. అయితే, ఫాక్స్ వారు అందుకు అంగీకరించలేదట. ‘Little Miss Marker’ అమెరికా అంతటా విడుదలై, ఘన విజయం సాధించింది.

కుటుంబపు ఆదాయం నాలుగు రెట్లు పెరగడంతో, షిర్లే కుటుంబం పెద్ద ఇంట్లోకి మారింది. అభిమానులనుంచి వారానికి నాలుగువేల ఉత్తరాలకంటే అధికంగా వస్తుండడంతో వారు ఒక ఫుల్ టైమ్ సెక్రటరీని నియమించుకున్నారు.

షిర్లే తండ్రి పని చేసే బ్యాంకులో వ్యాపారం పుంజుకుంది. హాలీవుడ్ తాజా సంచలనం నాన్నని చూడాలని ఎందరో మహిళలు బ్యాంకుకి వచ్చేవారు. ఒకావిడ జార్జ్ టెంపుల్‍తో మరో ‘షిర్లే టెంపుల్’ని కనడానికి కూడా సిద్ధమని చెప్పింది.

బేబీ షిర్లే తదుపరి చిత్రం ‘Baby Take A Bow’ విడుదలై ఘన విజయం సాధించింది.  అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ “మన దేశంలో షిర్లే టెంపుల్ ఉన్నం వరకూ మనకేం కాదు” అన్నారు. బ్రిటన్‍లో ఇద్దరు యువరాణులు ఎలిజబెత్, మార్గరెట్ రోజ్ – షిర్లేకి అభిమానులయ్యారు.

1934లో షిర్లేవి ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘Bright Eyes’ ఒకటి. ఈ సినిమాతో షిర్లే స్టార్ నుంచి సూపర్ స్టార్ అయిపోయారు. ఆ ఏడు ముగిసే సరికి ప్రపంచంలో కెల్లా అత్యధికంగా ఆర్జించే నటీనటుల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరారు షిర్లే.

మరుసటి సంవత్సరం ఈ జాబితాలో షిర్లే తొలి స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా నాలుగు సంవత్సరాలు ఆకర్షించే నంబర్ వన్ హాలీవుడ్ స్టార్స్ జాబితాలో ప్రథమ స్థానంలోనే ఉన్నారు. 42 మిలియన్లు అప్పులున్న ఫాక్స్ స్టూడియో ఈ ఆరేళ్ళ బాలనటి దయవల్ల అప్పుల ఊబి నుంచి బయటపడింది.

ఫాక్స్ స్టూడియోస్ వారు పాప జీతాన్ని ఆరు రెట్లు పెంచారు. ఆమె తల్లికి వారానికి 250 డాలర్లు ఇవ్వసాగారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న బాలనటి షిర్లే. తనికి నెలకి 13 డాలర్ల పాకెట్ మనీ కూడా ఇచ్చేవారు. దాంతో షిర్లే తల్లిదండ్రులు విలాసవంతమైన జీవితం గడపసాగారు.

(షిర్లే టెంపుల్ పెద్దయ్యాకా, ఆమె ఆస్తి విలువ 3,200,000 అని తెలుసుకున్నారు… అంటే ఇప్పటి కరెన్సీ విలువలో 60 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ, కానీ, ఆ డబ్బులో నిజంగా మిగిలినది కేవలం 44,000 డాలర్లు అని తెలిసినప్పుడు ఆమె విస్తుపోయారు. మిగతా డబ్బంతా ఖర్చయిపోయింది).

1939 నుండి ఆమె ప్రభ క్షీణించసాగింది. ఫాక్స్ వారు కొన్నాళ్ళ కోసం షిర్లేని ఎం.జి.ఎం. వారికి బదలాయించడానికి అంగీకరించకపోవడంతో ‘The Wizard Of Oz’ చిత్రంలో ప్రధాన పాత్ర షిర్లే టెంపుల్‌ని కాకుండా జూడీ గార్లాండ్‌ని వరించింది. దీనికి పోటీగా ఫాక్స్ వారు షిర్లేతో టెక్నికలర్ ఫాంటసీ ‘The Blue Bird’ తీశారు. అది దారుణ పరాజయం ఎదుర్కుంది. రిలీజయిన కొద్ది రోజులకే థియేటర్ల నుండి తీసేసారు.

షిర్లే ఆకర్షణ అదృశ్యమైపోయిందని గ్రహించిన ఫాక్స్, ఆమెతో కాంట్రాక్ట్‌ని వదిలేసుకున్నారు. షిర్లే ఎం.జి.ఎం.కి మారినా అక్కడా ఫ్లాప్స్ ఎదురయ్యాయి. David O.Selznick తో ఏడేళ్ళ కాలానికి కుదిరిన ఒప్పంద కాలంలో షిర్లేని హాలీవుడ్ టీనేజర్‍లా చూపించే సినిమాలు తీశారు. టీనేజ్ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టిన షిర్లే టెంపుల్ సినీ కెరీర్‍ని పొడిగించే ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి.

1945లో 17 ఏళ్ళ వయసులో సినీ నటుడు, అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో సార్జంట్ అయిన జాన్ అగర్‍ని పెళ్ళి చేసుకున్నారు షిర్లే. అతనితో లిండా అనే ఒక కూతురిని కన్నారు. అయితే అగర్ విపరీతంగా తాగుతున్నాడనే కారణంతో 1948లో విడాకులు తీసుకున్నారు. దీనికి తోడు 1949లో ఆమె నటించిన చివరి సినిమా విడుదలయి పరాజయం పాలయింది. అప్పుడామె వయసు 21 సంవత్సరాలు.

1950లో ఆమె కాలిఫోర్నియాకి చెందిన వ్యాపారవేత్త ఛార్లెస్ ఆల్డెన్ బ్లాక్‍ని పెళ్ళి చేసుకున్నారు. ఆమె కంటే 9 ఏళ్ళు పెద్దయైన ఆయన ఆమె సినిమాలు ఒక్కటి కూడా చూడలేదట. 1952లో కొడుకు ఛార్లెస్ జూనియర్, 1954లో కూతురు లోరి పుట్టారు.

1958లో షెర్లీ టీవీ సిరీస్ ‘Shirley Temple’s Storybook’ లోనూ, దానికి కొనసాగింపుగా 1961లో ‘Shirley Temple Theatre’ లోనూ నటించారు.

రాజకీయాలంటే ఆసక్తి పెంచుకున్న షిర్లే, వియాత్నాం యుద్ధాన్ని సమర్థించి, 1967 కాంగ్రెస్ టికెట్ పొందారు. 1969లో అధ్యక్షుడు నిక్సన్ ఆమెని ఐక్యరాజ్యసమితి 24వ సాధారణ సభకు అమెరికా ప్రతినిధిగా నియమించారు.

1972లో తన ఎడమ వక్షంలో గడ్డ ఉన్నట్టు తెలుసుకున్నారు. పరీక్ష జరిపించుకుంటే, అది క్యాన్సర్ అని తేలింది. తన జబ్బుని బహిరంగంగా వెల్లడించి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్న నిజాన్ని ప్రపంచానికి స్వయంగా తెలిపిన అతి కొద్ది మంది మహిళలలో ఆమె ఒకరు. ఆమెకి మద్దతుగా 50,000 ఉత్తరాలు వచ్చాయి.

1974లో ఆమెను ఘనాకి అమెరికా రాయబారిగా నియమించారు, తర్వాత చెకోస్లోవేకియాకు రాయబారి అయ్యారు. 1976లో ఆమె వైట్ హౌస్‌లో అమెరికా యొక్క తొలి మహిళా ప్రొటోకాల్ చీఫ్‍‌గా నియమితులయ్యారు.

ఓ దశాబ్దం తరువాత – యాభై ఏళ్ళక్రితం ఇచ్చిన మినీయేచర్ ప్రతిమ స్థానంలో పెద్ద ప్రతిమను ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్’ వారు షిర్లేకి అందజేశారు. ఆమె దానిని తన తల్లికి అంకితం చేశారు. కొందరు ఆమె తల్లే షిర్లేని మోసం చేసిందని భావిస్తారు.

4 ఆగస్టు 2005 నాడు మజ్జకి సంబంధిత రోగంతో 86 ఏళ్ల వయసులో భర్త చనిపోవడంలో ఆమె క్రుంగిపోయారు. సుమారు 55 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని గడిపారా దంపతులు. తమ ఆన్సరింగ్ మెషీన్‍లో ఛార్లెస్ స్వరాన్ని అలాగే ఉంచేశారు. ‘దాన్ని చెరిపివేయడం నాకిష్టం లేదు’ అన్నారు.

2006లో దేశ విదేశాలలో 30 ఏళ్ళపాటు విశిష్ట సేవలందించినందుకు గాను ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వారి లైఫ్ టైమ్ ఎచీవ్‍మెంట్ అవార్డు లభించింది.

తన జీవితాన్ని తాను మధ్యస్తంగా గడిపినట్టు బావించుకుంటారు. “నేను రిన్ టిన్ టిన్ ఒకేలాంటి వాళ్ళం” అన్నారు వెండితెర పై ఓ వెలుగు వెలిగిన మగ జర్మన్ షెపర్డ్ కుక్కతో తనని పోల్చుకుంటూ.

“ఆర్థిక మాంద్యం ముగిసేసరికి, తమని ఉత్సాహపరిచే వాటి కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. వాళ్ళకి ఓ చిన్నారి పాప, చిన్న కుక్క నచ్చాయి… అవింక మళ్ళీ రావు” అన్నారు షిర్లే.

నిజమే రావు… ఆ అమాయకపు రోజులు మళ్ళీ రావు. ప్రపంచానికి తెలిసిన బాలనటి షిర్లే టెంపుల్ చేసే అద్భుతాలు మళ్ళీ రానే రావు.


విస్మృతికి గురయిన నటి షీలా రమణి:

షీలా కేవల్ రమణి అంటే నేటి తరం వారికి తెలియకపోవచ్చు… కానీ మాకు… పాత తరం వారికి – నవకేతన్ ఫిల్స్మ్ వారి ‘టాక్సీ డ్రైవర్’ (1954) చిత్రంలో ఆంగ్లో-ఇండియన్ క్లబ్ డాన్సర్ – సిల్వీగా ఆమె చేసిన ప్రదర్శన ఇంకా గుర్తుంది. 1948లో ‘మిస్ ముస్సోరీ’ గానూ, 1950లో ‘మిస్ సిమ్లా’ గాను ఎంపికయ్యారు షీలా. ‘బద్నామ్’ చిత్రంలో ‘చంప’ పాత్రలో వగలాడిగా కనిపించారు. ‘ఆనంద్ మఠ్’ చిత్రంలో అద్భుతమైన నాట్య ప్రదర్శన కనబరిచారు.

ప్రస్తుతం పాకిస్తాన్‍లో ఉన్న కరాచీ నగరంలో 2 ఏప్రిల్ 1932 నాడు జన్మించిన షీలా… సాధన తర్వాత బాలీవుడ్‌లో పేరు ప్రతిష్ఠలు సంపాదించిన రెండవ సింధీ నటి! 50లలో ఆమెను సాధరణంగా ఎగువ తరగతి ఆధునిక యువతిగా పరిగణించేవారు. అటువంటి పాత్రలను ఆమె సునాయాసంగా పోషించేవారు… ఉదాహరణకి వి.శాంతారాం గారి ‘తీన్ బత్తి చార్ రాస్తే’ (1953), షేక్ ముఖ్తార్ గారి ‘మంగు’ (1954), ‘మీనార్’ (1954), ‘రైల్వే ప్లాట్‌ఫార్మ్’ (1955),  ‘ఫంటూష్’ (1956) చిత్రాలను చెప్పుకోవచ్చు. ఒక దశాబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్‍లో ‘బద్నామ్ ‘ (1952) తొలి చిత్రం కాగా, ‘మా బేటా’ (1962) చివరి సినిమా.

ఆమె దగ్గరి బంధువు షేక్ లతిఫ్ అలియాస్ లచ్చు పాకిస్తాన్‌లో గొప్ప పేరున్న నిర్మాత. ‘Pattan’ (1955),  ‘Khizan Kai Baad’ (1955),  ‘Darbar-e-Habib’ (1956) తదితర చిత్రాలు నిర్మించారు. ఆయన కోరిక మేరకు షీలా- ‘అనౌఖీ’ (1956) అనే పాకిస్తానీ చిత్రంలో కథానాయికగా నటించేందుకు కరాచీ వెళ్లారు. ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రం ‘ఫాబ్యులస్ సెనొరీటా’ ఆధారం. ‘గాడీ కో చలానా బాబు, జరా హల్కే హల్కే’ అనే జనాదరణ పొందిన పాటను జుబేదా ఖానుమ్ పాడారు. ఈ చిత్రానికి హసన్ లతీఫ్‍తో బాటు భారత్ నుంచి ప్రత్యేకంగా పిలిపించిన బెంగాలీ శ్రీ తిమిర్ బరన్ సంయుక్తంగా సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారా షీలా భారతదేశం తిరిగి వచ్చి – మధ్య స్థాయి నటిగా కొనసాగారు. కెరీర్ చివరి దశలో ఆమెకి చెప్పుకోదగ్గ చిత్రాలు రాలేదు – ‘జంగిల్ కింగ్’ (1959), ‘ది రిటర్న్ ఆఫ్ సూపర్‌మాన్’ (1960) వంటివి దక్కాయి – (ఈ రెండు చిత్రాలలో ఒకదానికి అనిల్ బిస్వాస్ సంగీతం అందించారు).

షీలాకి క్రీడలంటే… ముఖ్యంగా ఫుట్‌బాల్, ఈత అంటే బాగా ఆసక్తి. బాల్‌రూమ్ డాన్సింగ్ ఆమెకో వ్యసనం లాంటింది. వీలైనంత తరచుగా నృత్యాలకి వెళ్తుండేవారు. ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండేవారు షీలా. ఒకసారి ధరించిన దుస్తులని తిరిగి ఆరు నెలలకి గాని వేసుకునేవారు కాదు.

ఆమె కొడుకు రాహుల్ కోవాస్జీ వెల్లడించిన వివరాల ప్రకారం 1962లో నటన విరమించుకున్నాకా, ఆమె 31 మార్చ్ 1963 నాడు జాల్ ఏదీ కోవాస్జీని (బాంబే డైయింగ్ అధ్యక్షుడు) వివాహం చేసుకున్నారు. పాకిస్తాన్‌లో ఉండిపోయిన ఆమె కుటుంబ సభ్యులలో కొందరు ఇస్లాం మతానికి మారిపోయారు. ఆమె తన భర్తతో కల్సి 1981 వరకు బొంబయిలో జీవించారు. మధ్యలో ఈ దంపతులు మూడేళ్ళు ఖార్టోం లోనూ, ఆ తర్వాత మరో మూడేళ్ళు శ్రీలంకలోనూ నివసించారు. 1984లో భర్త చనిపోయాకా, ఆమె ఒక్కరే 80వ దశకం చివర్లో ఆస్ట్రేలియాకి వలస వెళ్ళారు. అక్కడ సిడ్నీలోనూ, సర్ఫర్స్ పారడైజ్ లోనూ నివసించారు. అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నూతన సహస్రాబ్దిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. మహూ పట్టణంలో తన భర్త అనువంశిక భవనంలో నివాసముండేవారు. 2015లో చనిపోయే ముందు కొన్నాళ్ళు, చిక్కి శల్యమై మంచానికే పరిమితమయ్యారు.

తన కెరీర్‌లో ఆమెకి బాగా ఇష్టమైన హిందీ చిత్రం ‘టాక్సీ డ్రైవర్’ (1954). దేశ విభజన తర్వాత తీసిన తొలి సింధీ సినిమా ‘అబానా’ (1958)లో ఆమే కథానాయిక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here