[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా పలమనేరు లోని శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వనాధ స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
శ్రీ కాశీ విశాలాక్షీ సమేత విశ్వనాధ స్వామి ఆలయం
పలమనేరులో చాలా ఆలయాలే వున్నాయిగానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 గంటలు. ఈ ఒక్క ఆలయమే చూడగలిగాము.
ఈ ఆలయం చిన్న చెరువుకి ముందర వున్నది. శివలింగం చిన్నదే అయినా అలంకరణ చాలా బాగుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలోనే వున్నారు. ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాన్ని కాశినుండి తెచ్చిన వారు బంగారుపాల్యం జమీందారు నాయని దాసప్ప గారు. ఆయన కాశీనుంచి లింగం తీసుకుని వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఇక్కడి కుంట ముందు విశ్రాంతి తీసుకున్నారు. నిద్రనుంచి లేచిన ఆయన తిరుగు ప్రయాణంలోనే తన కోరికలు తీరిన సంతోషంతో అక్కడ ప్రదేశం బాగుందని భావించి తాను తెచ్చిన లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. కాశీనుంచి స్వయంగా తీసుకు వచ్చిన లింగం కనుక కాశీ విశ్వేశ్వరుడని పేరు స్ధిర పడ్డది. ఈ ఆలయానికి మాన్యములు కూడా ఆ జమీందారుగారే సమకూర్చినట్లు తెలుస్తోంది.
ఆలయానికి ఎదురుగా నాలుగు స్తంభాలపై 5అడుగుల ఎత్తయిన మండపంలో నందీశ్వర ప్రతిమ వుంది. ఆలయంలో స్తంభాలన్నీ చక్కగా మలచబడ్డవి. ప్రధాన ద్వారం పై భాగమున ఈశ్వర జటాజూటంతో వున్న శిరస్సు, రెండువైపులా నందీశ్వర ప్రతిమలున్నాయి. ఆలయ ప్రాంగణం మొత్తం రాతి బండలు పరుపబడి వున్నాయి. ఆలయానికి ప్రదక్షిణం చేస్తూ ఆలయ గోడలలో వున్న ఉపాలయాలలోని అనేక దేవతల్ని దర్శించవచ్చు.
ఆలయానికి ప్రధాన గోపురం కాకుండా ఇరువైపులా రెండు చిన్న గోపురాలున్నాయి. పార్వతీ దేవి, వినాయకులపై నిర్మించిన విమాన గోపురాలు అందంగా వున్నాయి. ఆలయ ఆవరణలో చక్కటి లోహ ధ్వజస్తంభం, లోహపు గంట వున్నాయి. ఆవరణలో కోనేరు ఈశాన్య భాగంలో వుంది. కోనేటికి పడమరగా అయ్యప్పస్వామి ఆలయము, ధ్యాన మందిరము, నాగ ప్రతిష్ఠ వుంది. గర్భాలయమునకు నలువైపులా నంది ప్రతిమలు, దిక్పాలకుల విగ్రహాలు వున్నాయి. గోపుర శిఖరాలను ఏక కలశముతో అలంకరించారు. ఆలయ పై కప్పునకు ముందు భాగములో రెండువైపులా ఒక తలతో, రెండు శరీరాలు వున్న నంది విగ్రహాలు వున్నాయి. ఆలయంలో నిత్య పూజలే కాక పండుగ రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతూ వుంటాయి.
మాఘ శుధ్ధ సప్తమికి 9 రోజులు అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతాయి.
అక్కడనుండి మదనపల్లి రోడ్డులోని కీలపట్లకి బయల్దేరాము.