[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా కుందన్ షా దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘జానే భీ దో యారో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘జానే భీ దో యారో’ (హిందీ)
[dropcap]వ్య[/dropcap]వస్థ మీద ఆర్ట్ సినిమా వ్యంగ్య భాషణ చేస్తే, అదీ ప్రభుత్వ ఆర్ధిక సహాయంతోనే నిర్మించిన సినిమాతో వేళాకోళ మాడితే, ప్రభుత్వమేం చేస్తోందన్న ప్రశ్న రావచ్చు. పోనీలే ప్రజాస్వామ్యమే కదాని వూరుకుందా ప్రభుత్వం? సినిమా టైటిల్ కూడా ‘జానే భీ దో యారో’ (పోనీలే నేస్తాలూ) అని వుండే సరికి, పోనిద్దురూ అనుకుందా ప్రభుత్వం కూడా? ఈ సందేహాలతో కొంత విషయ సేకరణ చేస్తే -1983 లో అప్పటి స్వతంత్ర సంస్థగా వున్న ఎన్.ఎఫ్.డి.సి.లో శ్యామ్ బెనెగల్, ఆనందన్‌ల వంటి సభ్యులుండడం వల్లే ఇది సాధ్యమైందని తేలింది. ప్రభుత్వాన్ని విమర్శించే ఏ స్క్రిప్టు వచ్చినా ఓకే చేసే వాళ్ళని తెలిసింది. ఇంకోటేమిటంటే, అప్పట్లో ప్రభుత్వం మీద ఈ సెటైర్ ‘జానే భీ దో యారో’ని ఆమోదించిన ఎన్.ఎఫ్.డి.సి.యే, 2012లో తిరిగి దాన్ని డిజిటల్‌గా నవీకరించి విడుదల చేసింది! ఈ రెండు కాలాల్లోనూ అధికారంలో వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
నిజానికి దర్శకత్వ ప్రయత్నాల్లో వున్న ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కుందన్ షా, ఎన్.ఎఫ్.డి.సి.కి మొదట ఈ స్క్రిప్టు పంపలేదు. ఎన్.ఎఫ్.డి.సి. స్క్రిప్టుల పోటీ నిర్వహిస్తూంటే వేరే స్క్రిప్టు పంపాడు. అది ఎంపికైంది. అయితే దానికి 35 ఎం.ఎం.లో అంత బడ్జెట్ కేటాయించలేమని చెప్పడంతో, కుందన్ షా కోపంతో అప్పటికప్పుడు ‘జానే భీ దో యారో’ స్క్రిప్టు రాసి సబ్మిట్ చేశాడు. దీన్ని ఆమోదించి 7 లక్షలు కేటాయించింది ఎన్.ఎఫ్.డి.సి.
ఇక నసీరుద్దీన్ షా, ఓంపురి, పంకజ్ కపూర్, సతీష్ షా, సతీష్ కౌషిక్, రవీ బస్వానీ, భక్తీ బార్వే, నీనా గుప్తా తదితర అతిరథ మహారథ తారాతోరణం ఆ 7 లక్షల బడ్జెట్లోనే క్రిక్కిరిసి సర్దుకుని నటించారు. అనుపమ్ ఖేర్ కూడా ఓ చేయి వేసి డిస్కో కిల్లర్‌గా నటించాడు. తర్వాత అతడి సీన్లన్నీ సినిమాలో కిల్ చేసి తొలగించారు. సుధీర్ మిశ్రా, విధూ వినోద్ చోప్రా తెరవెనుక చెమటోడ్చారు. వీళ్ళిద్దరితో బాటు సతీష్ కౌషిక్ తర్వాత బాలీవుడ్‌లో టాప్ దర్శకులయ్యారు. కుందన్ షా రాసిన కథకి కుందన్ షాతో బాటు సుధీర్ మిశ్రా, సతీష్ కౌషిక్, ఇంకో రంజిత్ కపూర్ స్క్రీన్ ప్లే, మాటలు, ఓ పాటా రాశారు. తర్వాత పాట రద్దు చేశారు. నసీరుద్దీన్ షా, రవీ బస్వానీల దోస్తు పాత్రలకి విధూ వినోద్ చోప్రా, సుధీర్ మిశ్రాల పేర్లే పెట్టేశారు. ఇక బడ్జెట్ చాలక, భోజనాలకీ సరిపోక, షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్ ఘోరాతి ఘోరం. అయినా క్వాలిటీని తగ్గనీయ లేదు.
1983 నాటి థియేటర్ నుంచి నేటి ఆన్‌లైన్ వరకూ దీన్నో కల్ట్ క్లాసిక్‌గా మోస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. మైండ్‌లెస్ కామెడీలుంటాయి, కేవలం జోకులు పేల్చుకుంటూ వెళ్ళే కామెడీలుంటాయి. ఎదుటి పాత్రని హాస్యం పట్టించడమే వీటి లక్ష్యంగా వుంటుంది. ఏ కామెడీలోనూ జరిగేదిదే. వీటిలో ఎదుటి పాత్రలు సీరియస్ పాత్రలై వుంటాయి. ఈ సీరియస్ పాత్రలు పాలకుల పాత్రలై వుంటే, పాలితులు హాస్య పాత్రలై వుంటారు. ఇలా కాక పాలితులూ పాలకులూ అందరూ హాస్య పాత్రలే అయితే వ్యవస్థ ఏం కావాలి? సెటైర్‌కి ఈ కొత్త రూపమే ‘జానే భీ దో యారో’ అనే కల్ట్ క్లాసిక్.
కథ
1983 లో ముంబాయి పేరు బాంబే నే. బాంబే మహానగరంలో వినోద్ చోప్రా (నసీరుద్దీన్ షా), సుధీర్ మిశ్రా (రవీ బిశ్వానీ) అనే నిరుద్యోగులిద్దరు పొట్ట కూటి కోసం ఫోటో స్టూడియో ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి పిలిస్తే ఒక్కరూ రారు. కుక్క పిల్ల కూడా పక్క నుంచి పోతూ మూత్రం పోసి పోతుంది. ఆతిథ్యం కోసం పుష్కలంగా తెచ్చిన సమోసాలు, లడ్డూలు, గులాబ్ జామున్లు, బీరు బాటిళ్ళూ అన్నీ వేస్ట్ అయిపోతాయి. వాటి మీద ఈగలు తోలుకోవడమే మిగులుతుంది. అద్దె సూట్లు, అద్దె బూట్లు తొడుక్కుని, రెండున్నర వేల రూపాయలు కుందన్ షా దగ్గర అడుక్కుని చేసిన ప్రారంభోత్సవం ఇలా అఘోరించింది. ఇక మూడు నెలలు గడిచినా స్టూడియో నడవక, అద్దెలు వెళ్ళక, ఆకలికి తట్టుకోలేక -‘ఐనా మనం విజయం సాధిస్తాం తప్పక ఒక రోజు’ అని నమ్మబలుక్కుంటూ రోజులు గడుపుతూంటారు.
మరో వైపు నిర్మాణ రంగంలో ఏదో గూడుపుఠాణీ జరుగుతూంటుంది. ఇది ‘ఖబర్దార్’ పత్రిక ప్రసిద్ధ ఎడిటర్ శోభా సేన్ (భక్తీ బార్వే) పసిగడుతుంది. ఆ గూడుపుఠాణీ ఏదో బయటికి లాగాలంటే ఫోటోగ్రాఫర్ అనేవాడు లేడు. ఒకానొక రోజు, స్టూడియోలో బేరాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఈ నిరుద్యోగ ద్వయం వినోద్, సుధీర్‌లు తగుల్తారు. వీళ్ళని హైర్ చేసుకుని టాస్క్ ఇస్తుంది. బాంబేలో 4 కొత్త ఫ్లై ఓవర్లు (అప్పటికి ఫ్లై ఓవర్ అనేవాళ్ళు కాదు, ఫ్లై ఓవర్నివంతెన అనే వాళ్ళు) కట్టబోతున్నారు. ఆ కాంట్రాక్టులో మునిసిపల్ కమీషనర్ డీ మెల్లో (సతీష్ షా), తర్నేజా (పంకజ్ కపూర్) అనే బిల్డర్‌తో కుమ్మక్కయ్యాడని సమాచారం.
దీంతో రహస్యంగా వాళ్ళ సమావేశం తాలూకు ఫోటోలు తీసి ఇస్తారు ఎడిటర్ శోభకి. ఇంతలో ఇంకో బిల్డర్, తర్నేజా ప్రత్యర్ధి ఆహూజా (ఓంపురి) అనేవాడు, ఈ మొత్తం కాంట్రాక్టు తను కొట్టేయడానికి రంగప్రవేశం చేస్తాడు. అటు వినోద్, సుధీర్‌లు ఇంకో కార్యక్రమంలో చాలా బిజీగా వుంటారు. ఓ 5 వేల రూపాయల బహుమతితో ఫోటోగ్రఫీ పోటీలు జరుగుతూంటే, ఆ డబ్బు కోసం నగరమంతా తిరిగేస్తూ ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోల్ని డెవలప్ చేస్తూంటే ఒక మర్డర్ ఫోటో బయట పడుతుంది. ఆ పార్కులో ఒక శవం, అక్కడ పిస్తోలు పట్టుకుని తర్నేజా. వెంటనే ఆ పార్కు దగ్గరికి పరుగెత్తుకెళ్ళి చూస్తే, అది మునిసిపల్ కమీషనర్ డీ మెల్లో శవమే. చూస్తూండగానే ఆ శవం కూడా మాయమై పోతుంది. కట్టిన ఫ్లైఓవర్ ఒక్కసారి కుప్ప కూలుతుంది.
ఇప్పుడేం జరిగింది? తర్నేజాని అరెస్టు చేయించాలంటే ఎడిటర్ శోభకి డీ మెల్లో శవం కావాలి. ఈ శవం ఎక్కడుంది? ఎవరు తీసికెళ్ళి సమాధి కట్టారు? శవాన్ని వినోద్, సుధీర్‌లు ఎలా బయటికి తీశారు? తీస్తే మళ్ళీ శవమెలా మాయమైంది? ఎందుకు మాయమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన కథ.
ఎలావుంది కథ
పై కథా సంగ్రహం చదివితే – ఏముంది ఇందులో, రొటీన్ సస్పెస్ కథ తప్ప అన్పించవచ్చు. శవంతో కామెడీయేగా అన్పించ వచ్చు. కమర్షియల్ సినిమాల్లో శవంతో మైండ్‌లెస్ కామెడీలు చాలా వచ్చాయి. అవి కేవలం నవ్వించడానికే. కేవలం నవ్వించడానికే అయితే అది ఆర్ట్ సినిమా అవదు. ఆర్ట్ సినిమాల్ని కమర్షియల్ కామెడీల్లా చుట్టేయరు. ఆ శవాన్ని ప్రతీకగా చేసి ఇంకో అర్థంలో వాడుకుంటారు ఆర్ట్ సినిమాల్లో. ఇక్కడ చూస్తే ఈ శవం ప్రజాస్వామ్యానికి ప్రతీక. శవాన్ని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వాడుకుంటూ, ప్రభుత్వ పనితీరు గురించి, అవినీతి గురించి, అధికార పోరాటం గురించీ సింబాలిక్‌గా చెప్పిన వ్యంగ్య కథ ఇది. ఇలా ఈ అర్థంలో చూసినప్పుడు ఇది కలిగించే వీక్షణాసక్తి, రసస్ఫూర్తి చాలా వుంటుంది.
ఈ వ్యంగ్యంలో 1983లో ఫ్లైఓవర్ లాంటి నూతన అభివృద్ధి నమూనా కూడా అవినీతికి మినహాయింపు కాబోదని ముందే చెప్పేశారు. అప్పట్నుంచీ కట్టిన ఫ్లైఓవర్లు కుప్ప కూలుతూనే వున్నాయి. కలకత్తా, వారణాసి, లక్నో, సూరత్, నవాడా, హైదరాబాద్… ఆఖరికి తాజాగా గత మార్చిలో గురుగ్రామ్ ఎక్స్ ప్రెస్ వే ఫ్లైఓవర్ కుప్పకూలాయి. ఇవి చాలనట్టు హైదారాబాద్‌లో మెట్రో ఫ్లైఓవర్ శకలం వూడి ప్రయాణికురాలి మీద పడింది.
ఈ కథలో బాంబే మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ డీ మెల్లో దృష్టిలో అభివృద్ధి నమూనా అంటే ఫ్లై ఓవర్లు కాదు, మురుగు కాలువలు. వాటిని కన్న బిడ్డల్లా ప్రేమిస్తాడు. అమెరికా స్టడీ టూరు వెళ్ళాడు. అక్కడ మురుగు కాలువలు, మంచి నీటి పైపు లైన్లు వేర్వేరుగా వుండడం చూసి ఆశ్చర్య పడ్డాడు. కొంత తిని కొంత పారేసే అమెరికన్ల కల్చర్ మరీ నచ్చింది. మన ఫంక్షన్ హాళ్ళల్లో ఇదే కదా చేస్తున్నారనుకున్నాడు.
దురదృష్టవశాత్తూ కట్టిన ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చూడకుండా కన్ను మూశాడు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం, అతడి సంతాప సభ ఒకేసారి జరుపుతూ అసిస్టెంట్ కమీషనర్ ఇలా ప్రసంగిస్తాడు – ‘దేశాభ్యున్నతికి ప్రతిబింబాలు మురుగు కాలువలు. డీ మెల్లో గారి ఆకాంక్ష మురుగు కాలువల స్వేచ్ఛ. ఆయన మురుగు కాలువల కోసమే జీవించారు, మురుగు కాలువల్నే స్మరిస్తూ మనల్ని వీడారు. ఈ కట్టిన ఫ్లై ఓవర్‌తో ప్రజలకి కూడా స్వేచ్ఛ. రిక్షా వాలాలు, ఠేలా వాలాలూ, జట్కా వాలాలూ ఇక అందరూ స్వేచ్ఛగా ఫ్లై ఓవర్ని వినియోగించుకుంటారు. ఫ్లై ఓవర్ కింద ఒక నాటికి పేదలు నివాస ముంటారు. పోతే మన దివంగత కమీషనర్ గారి స్మృత్యర్ధం రేపోక రోజు మురుగు కాలువల్ని బంద్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మీరు మంచి నీరు పట్టి వుంచుకోండి…’ అని పడీ పడీ ఏడుస్తాడు.
ఫ్లై ఓవర్ కూలిన రోజు దూరదర్శన్‌లో వార్త వస్తుంది. ముందుగా మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఏఆర్ అంతూలే రాజీనామా చేసిన వార్త చదువుతుంది న్యూస్ రీడర్. తర్వాత ఫ్లై ఓవర్ ప్రమాద వివరాలు చదువుతుంది. అయితే ఇందులో అవినీతి జరగలేదని, సిమెంటులో ఇసుక కలపలేదని, ఇసుకలోనే సిమెంటు కలిపామనీ, అది కూడా ఫారిన్ నుంచి దిగుమతి చేసుకున్న కల్తీ లేని ఒరిజినల్ సిమెంటు అనీ, బిల్డర్ తర్నేజా స్టేట్ మెంట్ ఇవ్వడాన్నీ చూపిస్తారు.
ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏఆర్ అంతూలే రాజీనామా విషయాన్ని ఫిల్లర్ కోసం వాడలేదు. ఉద్దేశపూర్వకంగానే చేశారు. అంతూలే రాజీనామా చేసింది సిమెంటు కుంభకోణం లోనే. తర్వాత సుప్రీం కోర్టు కేసు కొట్టేయడం వేరే విషయం. అంతూలే రాజీనామా వార్త చూపిస్తూ, కల్తీ సిమెంటుతో కుప్పకూలిన ఫ్లై ఓవర్ వార్త చూపించడం కొంటెతనమే.
ఇలాటి ఘట్టాలు మరికొన్ని వున్నాయి. చివర్లో ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకం ఒకెత్తు. ఇంతవరకూ సినిమాల్లో వాడుకున్న సందర్భాలకి ఇది పరాకాష్ఠ. ఇందులో మనోభావాలు దెబ్బతిన్నాయని హర్ట్ అవడానికేమీ లేదు. నాటకం ప్రారంభంలోనే ద్రౌపది పాత్రని తప్పించేస్తారు. డీ మెల్లో శవంతో పారిపోతూ నాటకంలో జొరబడ్డ నసీరుద్దీని షా, రవీ బస్వానీలు ఆ శవానికి ద్రౌపది పాత్ర చీర చుట్టేసి, నాటకంలోకి తోసేస్తారు.
ఇక అది ద్రౌపదియే అనుకుని సభలో వస్త్రాపహరణ రభస. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని చెరబడుతున్న అర్థంలో ప్రయోగించిన తెలివైన సెటైర్‌గా ఇది కన్పిస్తుంది. అధికారం కోసం ‘శవమైన ప్రజాస్వామ్యాన్ని’ ఇంకా పీక్కుతినడానికి ‘దుశ్శాశానుడు’ సహా ఇతర ‘షేర్ హోల్డర్ల’ కీచులాట. ఈ గోల అర్థంగాక మధ్యమధ్యలో ధృతరాష్ట్రుడు ‘యే క్యా హో రహా హై దుర్యోధన్?’ అంటూ ఒకే డైలాగు వల్లె వేయడం. దీనికి కొసమెరుపేమిటంటే అక్బర్ పాదుషా, కొడుకు సలీం రంగప్రవేశం చేసి, ప్రజాస్వామ్యాన్ని తాము క్లెయిన్ చేయడం! మీవల్ల కాదు, ద్రౌపదిని (ప్రజాస్వామ్యాన్ని) మాకు అప్పజెప్పండంటూ! చాలా హిలేరియస్ ఇంటలెక్చువల్ నాటకమిది.
శవంతో ఇలాటి సింబాలిక్ ఘాట్టాలింకా వున్నాయి. హీరోలిద్దరూ శవమనే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే ప్రయత్నాలు చేస్తే, విలన్లు మాయం చేసే ప్రయత్నాలు చేయడం. చివరికి విలన్లు దొరకరు. ఫ్లై ఓవర్‌ని పేల్చేశారని కేసు బనాయించి హీరోల్నే జైల్లో వేయిస్తారు. శిక్ష పూర్తి చేసుకుని జైల్లోంచి జైలు దుస్తులతోనే విడుదలై బయట తిరుగుతూంటారు – న్యాయం కూడా చచ్చిపోయిందన్నట్టు. ఇలా కాలం కంటే ముందు చెప్పిన కథతో ‘జానే భీ దో యారో’ ఒక ప్రత్యేక వర్గ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న కల్ట్ క్లాసిక్ అయింది.
నటనలు- సాంకేతికాలు
అన్ని పాత్రలూ హాస్య పాత్రలే. అధికారుల పాత్రలు మరీ జోకర్లు. మునిసిపల్ కమీషనర్‌గా సతీష్ షా, బిల్డర్‌గా పంకజ్ కపూర్, ఇంకో బిల్డర్‌గా ఓంపురి, అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్‌గా దీపక్ ఖజీర్, పంకజ్ కపూర్ అసిస్టెంట్‌గా నీనా గుప్తా అందరూ జోకర్స్ లా అతి కామెడీ, ఇంకా లేకి కామెడీ కూడా చేసేస్తారు. వ్యవస్థని సాధ్యమైనంత వివస్త్రని చేసి చూపడమే లక్ష్యం.
వీళ్ళని మించిన జోకర్లుగా, వీళ్ళని ఎదుర్కొనే హాస్య పాత్రల్లో నసీరుద్దీన్ షా, రవీ బస్వానీ, భక్తీ బార్వేలు ఓ పక్క. అతి చిన్న ఆర్ట్ సినిమాని అతి పెద్ద హంగామాగా సృష్టించి పెట్టారు అంతరార్థాలతో. అయితే ప్రథమార్ధం దృశ్యాల సాగతీత చాలా వుంది. పార్కులో డీ మెల్లో శవాన్ని కనుగొనే ఇంటర్వెల్ ఘట్టం వరకూ పెద్దగా కథ వుండదు, కథ ప్రారంభం కాదు. ఇంటర్వెల్ తర్వాత నుంచే శవంతో వేగం పుంజుకుంటుంది. హాస్యం స్థాయి పెరుగుతుంది. కేవలం మూడు సీక్వెన్సులతో ద్వితీయార్ధం ముగిసిపోతుంది – శవం మాయమవడం, మళ్ళీ దొరికిన శవంతో పరుగులు, చివర్లో నాటకం.
సుప్రసిద్ధ బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు బినోద్ ప్రధాన్ కెరీర్ ప్రారంభంలో ఇది మూడవ సినిమా. అప్పటి జన సమ్మర్ధం అంతగా లేని బాంబే దృశ్యాలు చాలా రిలీఫ్‌గా వుంటాయి, రాత్రి దృశ్యాలు సహా. కొన్ని దృశ్యాల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కమర్షియల్ సినిమాల పోస్టర్లు కనిపించవు. ఉస్కీ రోటీ, చిరుత వంటి ఆర్ట్ సినిమా పోస్టర్లు అంటించారు. ఇది ఆర్ట్ సినిమా కాబట్టి ఆర్ట్ సినిమా పక్షపాతిగా వుండాలనేమో. వనరాజ్ భాటియా సంగీతం అందించాడు. దీనికి ఉత్తమ చలన చిత్రం జాతీయ అవార్డు రాలేదు గానీ, కుందన్ షాకి 1984 ఇందిరా గాంధీ ఉత్తమ నవదర్శకుడి అవార్డు లభించింది. కుందన్ షా తీసిన మొత్తం పది సినిమాల్లో ఈ ఒక్క సినిమాతోనే గుర్తింపు పొందాడు.