[dropcap]“ఏ[/dropcap]య్! ఇలారా!”
“ఎందుకు?”
“ఏం లేదు!”
“మరి పిలవటం దేనికి?”
“నా ఇష్టం!”
“నా ఇష్టం! నా ఇష్టం అంటే ఏమిటి?”
“నా ఇష్టం!”
“పిచ్చివాడివా?”
“హ్హ! హ్హ! హ్హ!” పెద్ద నవ్వు.
“ఈ ప్రపంచం మహా చిత్రమైనది. ప్రజలు తమని తాము తెలుసుకునే ముందు, ఇతరులను గుర్తించాలని ప్రయత్నిస్తారు.” ఆ మనిషి అంటూ – అంటూనే ఎదుటి వ్యక్తి వంక వెళ్లసాగాడు.
‘ఎవడో విచిత్రంగా ఉన్నాడు’ – ఆ వ్యక్తి గొణుగుకున్నాడు – ‘ముందు పిలిచాడు, అటుపైన నాకే నేర్పిస్తున్నాడు! పిచ్చివాడు!’
“అయ్యో! అతడు నిజంగానే పిచ్చివాడు” అంటూ దారిన పోతున్న వ్యక్తి ఎవరో అతడికి తెలియజేసాడు.
ఆ ఎదుటి వ్యక్తి కూడా అదే అనుకున్నాడు. పిచ్చివాడే అయి వుంటాడు. లేకపోతే అలా అర్థం పర్థం లేని మాటలు ఎందుకంటాడు? ఉదయాన్నే మూడ్ పాడుచేసినందుకు మనసులోనే ఆ పిచ్చివాడిని తిట్టుకున్నాడు – త్వరత్వరగా పరిగెట్టి ఒక మూల నిల్చున్నాడు. ఎందుకో తెలియదు గాని ఆ పిచ్చివాడు కూడా అతడివంకే దూసుకువస్తున్నాడు. ఈసరికి అతడికీ భయం మొదలయింది. పిచ్చివాడిని నమ్మేదెవరు? ఏమైనా చెయ్యచ్చు. పిచ్చివాడు వెంటబడటం లేదు కదా అనుకుంటూ మధ్య మధ్యలో వెనుకకు తిరిగి చూసుకుంటూ ముందుకు పోతున్నాడు. అదృష్టవశాత్తూ ఆ పిచ్చివాడు కాస్తంత దూరం వెంటబడ్డాక ఆగిపోయాడు. ఆ వ్యక్తి వేగంగా అంగలు వేసుకుంటూ ముందుకు వెళ్లి, ఆ పిచ్చివాడి దృష్టి నుండి మాయమయ్యాడు.
ఇంతలో ఆ వీధిలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండే పిల్లలు కొందరు ఆ పిచ్చివాడి చుట్టూ వచ్చి చేరారు. ముందు కాసేపు ఆ పిల్లలంతా పిచ్చివాడి చేష్టలను వినోదంగా చూస్తూ ఉన్నా, కాసేపటికి వారిలాటి పిల్లలగుంపు ఒకటి పెరగడంతో వారంతా అతడిని వేళాకోళం చేస్తూ విసిగించడం మొదలు పెట్టారు. ఒకరు అతడి చిరిగిన కమీజును పట్టి లాగి పరిగెడితే, మరొకడు అతడిని ఒక్క తోపు తోసిపోతున్నారు. ఒకసారి తప్పించుకునే ప్రయత్నంలో, మరోసారి జోరుగా నెట్టేయ్యటం వలన అతడు ఎన్నోసార్లు పడబోతూ – పడబోతూ సంబాళించుకున్నాడు. కోపంగా పిల్లల్ని కొట్టటానికి వాళ్ళ వెంట పడగానే ఆ పిల్లలు క్షణాల్లో గోల చేస్తూ అతడికి అందకుండా పారిపోతారు. పిచ్చివాడు కాసేపు వెంటపడి, అలసిపోయి కింద కూర్చుంటాడు. అలా కూర్చోగానే పిల్లలంతా అతడిని తిరిగి వేధించటం మొదలెడతారు.
నేను ప్రతిరోజులాగే నియమంగా మా లాన్‌లో కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నాను. ఈ జరుగుతున్న గోల వలన నా దృష్టి మాటిమాటికీ చేతిలోనున్న పేపరుమీద నుండి వాళ్ళవైపుకు మరలుతోంది. ఉదయాన్నే వార్తాపత్రికలోని తాజా వార్తల ఆనందాన్ని ఆస్వాదించలేకపోవటం వలన నాకు ఇబ్బందిగా అనిపించేది. నిజానికి ఆఫీసులో ఈ వార్తల వలనే కదా కబుర్లు మొదలయ్యేది! ఈ సుఖాన్ని అనుభవించకుండా నేనెలా ఉండగలను? అలాంటి సందర్భాలలో, నేను పెద్దమనిషి అభినయాన్ని మీద వేసుకుని పిల్లల్ని అలా చెయ్యొద్దని వారించినా నేను కృతకృత్యుడిని కాలేను. పిల్లలు మహా గడుగ్గాయిలు! నేను చెప్పింది వినటం అటుంచి, ఇటు తిరిగి ముక్కు, కళ్ళు చికిలిస్తూ నన్నే వెక్కిరిస్తూ ఉంటారు. నేను నా లాన్ నుండి ప్రహారీ గోడవరకూ వచ్చి వాళ్ళని కోప్పడినా, పిల్లలు మాత్రం తమ అల్లరి చేష్టలు చేయక మానరు. విధిలేక నేనే నా వార్తాపత్రికలో ఉన్న విశేషాల మీద దృష్టి పెట్టటానికి ప్రయత్నిస్తాను. కాని, ఆ పిల్లల గోల-గాలివానలో దృష్టిని వార్తల పైన ఉంచటం అసంభవమే!
ఈ తమాషా దాదాపు రోజూ చాలా సేపటి వరకూ నడుస్తూనే ఉంటుంది. చాలా కొద్దిసార్లు మాత్రమే ఆ పిచ్చివాడు అక్కడ ఉండకపోవటమో, లేదా పిల్లలు ఉండకపోవటమో, మరీ కాకపోతే ఆ పిచ్చివాడే పూర్తిగా నిస్సహాయుడై ఓ వారకు పారిపోవటమో జరిగేది. అయినా పిల్లలు అతడి వెంటే పడి పోయేవారు. అతడు తనను తాను ఎంత రక్షించుకోవాలని ప్రయత్నిస్తే, పిల్లలు అతడ్ని అంత విసిగించటం చేసేవారు. అతడు తనని తాను రక్షించుకోటానికి రోడ్డుమీద అడ్డదిడ్డంగా పడుతూ – లేస్తూ తిరిగేవాడు. కాని అతడికి సహాయపడటానికి ఎవరూ వచ్చేవారే కాదు. దారినపోయేవారు కొందరు నిలబడి తమాషా చూస్తే, మరికొంతమంది అసలు ఆగకుండానే ముందుకు వెళ్లేవారు. అతడు పరుగులు పెడుతూ పోయి రోడ్డుకవతల ఉన్న ఏదో సందులోకి దూరి, నా దృష్టి నుండి దూరమవుతేనే నా సమస్యలకు పరిష్కారం దొరికి, నేను పేపరు చదివే ఆనందాన్ని ఆస్వాదించగలిగేవాడ్ని.
నా మనసు వ్యాకులమయ్యేది. వార్తలు చదువుతూ ఇది మర్చిపోవాలని ప్రయత్నించినా మనసులో ఏదో తెలియని బాధ ఆవరించుకునేది. ఏదో తెలియని ఆవేదన, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లనిపించేది. కావాలనే నేను విననట్లుండేవాడిని. ఆ భావాన్నే నొక్కేసేవాడిని. అయినా మనసు వినకపోతే, ఇదేం కొత్త విషయమా అంటూ మనసునే ఛాలెంజి చేసేవాడిని. ఇక్కడ తరచూ ఇలాటి తమాషా విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు కావు? మనలా మౌనంగా చూస్తూ ఊరుకునే ప్రేక్షకులు ఉన్నంతకాలం, ఇలాంటి సంఘటనలు, రోజూ జరుగుతూనే ఉంటాయి. కాని నన్ను, నా దినచర్యను ప్రభావితం చేస్తూండే సంఘటన ఇది. అందుకే నేను బాధపడేవాడిని. ఎందుకో తెలియదు, ఆ పిచ్చివాడు కూడా నాలానే ఎదుట రోడ్డుమీదే కూర్చోవాలా! కూర్చోవటం తరువాయి, మళ్లీ మళ్లీ అవే సంఘటనలు మొదలవుతాయి. ఎదురుగా ఏదో బాగా పరిచయమున్న సినిమా ముందుకు సాగిపోతున్నట్లు.
అతడు నిజంగానే పిచ్చివాడా? లేక పిచ్చిపట్టిన వాడిలా నటిస్తున్నాడా? మనసులో ఈ ద్వైదీభావం తల ఎత్తినప్పుడల్లా, అప్పుడప్పుడు అతడు పిచ్చివాడు కాదని నాకనిపించేది. ప్రజలను మభ్య పెట్టడానికి అతడు పిచ్చివాడిలా నాటకమాడుతున్నాడేమో! కాని ప్రజలు మాత్రం నిజంగానే అతనికి మతి భ్రమించిందనే అనేవారు. వాళ్లు నిజం చెప్తున్నారేమో! లేదా వాళ్ళూ నాలాగే భ్రమపడుతున్నారేమో! ఆలోచించే ఓపిక పోయినప్పుడు, వాళ్ళు బహుశా నిజమే చెప్తున్నారేమో అన్న భావన వస్తుంది. ఇలా ఆలోచించి, నానుంచి నన్ను నేనే వేరు చేసుకుంటాను. అయినా, అతడు ఎవరయితే నాకేంటిట? ఎందుకు? నా పనులనుండి విశ్రాంతి దొరికితే కద, ఇంకెవరి గురించో ఆలోచించటానికి! ఇలాటి విషయాలను గురించి ఆలోచించే సమయం ఎక్కడ దొరుకుతుంది? పని ఉన్నా, లేకపోయినా మనం చాలా బిజీగా ఉన్నట్లు నాటకాలు ఆడుతూనే ఉంటాం. మన జీవితం కూడా ఒక నాటకమే కదా! ఆ పిచ్చివాడు కూడా నాటకమే ఆడుతున్నట్లయితే అసలు అందులో తప్పేముంది గనక? ఇక ఆలోచించటం ఆపి, సుఖమైన జీవితాన్ని మరింత సుఖంగా ఉంచుకునేటట్లు ప్రయత్నించాలి. దీనివలనే జీవితం ముందుకు సాగుతుంది. తక్కినవన్నీ శుద్ధ దండుగే! ఈ మహామంత్రం అన్నిటికన్న సుఖమైనదని నేను భావిస్తాను.
నిజమే కదా! మన జీవిత భారాన్ని ఎత్తుకోవటమే కష్టమవుతున్న ఈ రోజుల్లో వేరే ఇంకెవరి గురించో ఆలోచించి మనసుపైన భారాన్ని మోపటం అంత మంచిపని కాదనిపిస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం, నా మనసులో ఏదో ఒకమూల ఏదో ఒక భావం గూడు కట్టుకున్నట్లు, పదే పదే అతని గురించి ఆలోచించటానికి వివశుడిని చేస్తోంది. నాకు పూర్వ జన్మ పైన నమ్మకం లేదు గనక గాని, లేకపోతే ఏదో పూర్వ ఋణానుబంధం అనో, మరేదో అనో చేతులు దులుపుకుని ఉండేవాడిని. అటువంటి దశలో మనస్సును ఏదోలాగ బుజ్జగించవలసి వచ్చేది. పిచ్చివాడే అయుండాలి, అందరూ అదే కదా అంటారు, అనుకుంటారు. నేను ఒక్కడిని ఏదో అనుకోటం వలన తేడా ఏం పడుతుంది? ఇప్పుడు నేనూ నా తీర్పును ఇచ్చేశాను – లేకపోతే నా కారు అద్దాన్ని ఎందుకు పగలగొడతాడు? ఏదో భగవంతుని దయవలన రాయి వచ్చి నా నుదుటికి తగలలేదు, లేకపోతే..? ఆనాడు నేనూ కోపంతో ఊగిపోతూ, నోటికే కాదు, కాళ్ళూ చేతులకీ కూడా పని చెప్పి, బాగా దేహశుద్ధి చేశాను. మరి ఈరోజు ఎందుకో తెలియదు గానీ, అతడి పట్ల జాలి కలుగుతోంది. అతడు జాలి చూపించదగినవాడు కాదా? ప్రతివారూ అతడిని తోసిపడేసేవారే! ఎవ్వరూ సహాయం చెయ్యరు, ఎవరూ అతనిపట్ల సానుభూతిని చూపించరు. అతడి ఈ పాత్ర తను గురించి నేను నా గజిబిజి ఆలోచనలలో ఉండగానే, నా శ్రీమతి పిలుపు వినిపించటం, నేను ఒక్కక్షణం కూడా సమయాన్ని వృథా చేయక సంసార జంఝాటంలో మళ్లీ మునిగిపోవటం జరిగింది.
ఆరోజు ఉదయాన్నే ఒక స్నేహితుని ఇంటికి వెళ్లవలసి వచ్చింది. అతని తండ్రి హఠాత్తుగా, స్వర్గస్తులవటంతో నేను అతనికి కాస్త ధైర్యం చెప్పి వస్తున్నాను. ఇంటికి దగ్గరగా చేరుకున్నానో – లేదో, ఎక్కడినుండో ఆ పిచ్చివాడు నా కారుకు ఎదురుగా వచ్చేశాడు. నా కాలు బ్రేకుమీద పడటంతో కీచుకున్న శబ్దం వచ్చింది. నాకు జరుగుతున్నదేదో అర్ధమయేలోపునే అతడు ఒక పెద్ద రాయిని ఎత్తి, విసిరి, నా కారు అదాన్ని పగలగొట్టాడు. నా మనసు అప్పటికే ఒక రకంగా ఉదాసీనంగా ఉండటం వలన, ఈ సంఘటన నాలో కోపాన్ని మరింత ఉద్రేకపరిచింది. కారులోంచి దిగి అతడిపై లంఘించాను. అంతే! మరి ముందు వెనుక చూడకుండా అతడి చెంపలమీద ఫటఫటమని వాయించాను. నేను రెండు లెంపకాయలు కొట్టేసరికి మరెన్నో చేతులు అతని మీదకు లేచాయి. అందరూ చూడబోతే ఇటువంటి అవకాశానికే వేచి చూస్తున్నారనిపించింది. అతడు అక్కడినుండి పారిపోయే ప్రయత్నం ఎంతమాత్రం చెయ్యలేదు. సగం చచ్చినవాడిలా అక్కడే కూలబడ్డాడు. నా మనసు ఒక్కసారిగా బాధపడింది. అతడి పరిస్థితి మదిలో ఏదో ఒకమూల కరుణ భావాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూండగానే, స్వార్థం దాని నోరు నొక్కేసింది. ‘నువ్వు మాటి – మాటికీ అనవసరంగా అతనిపైన జాలిని చూపించాలని ప్రయత్నిస్తావు. అతడు పిచ్చివాడు! నిజంగానే పిచ్చివాడు. అతడు ఎవర్నీ ఎరగడు – గుర్తించలేడు. నీ జాలి కూడా అతనికి అర్థం కాదు’!.
నేను కోపంతో ఊగిపోతూ ఇంట్లోకి ప్రవేశించటం, వచ్చీరాగానే వృద్ధుడయిన మా నౌకరు విరించి పైన బాగా కేకలు వెయ్యటం జరిగిపోయింది. పాపం ముసలివాడు ఏం అర్థం కాక బిక్కచచ్చిపోయాడు. జీవితంలో మొదటిసారి అతడు ఇలా తిట్లు తిన్నాడు. అతడు మౌనంగా, వెట్టిచాకిరీ చేసే బానిసలా వింటూ తలవాల్చుకు నిలబడ్డాడు. బహుశా ఉప్పు తిన్న విశ్వాసం అడ్డుపడి ఉంటుంది. నా కోపం కాసేపట్లో పాలపొంగులా కిందకు దిగిపోయింది. నేను విరించిని కేకేసి పిలిచాను. అతడు మౌనంగా ఉన్నాడు. ముందులాగే గంభీరమైన అతడి మౌనం నన్ను ఇబ్బంది పెడుతోంది. నన్ను నేనే తిట్టుకోవటం ప్రారంభించాను. నేను యజమానిని అన్న భావాన్ని వదిలెయ్యకుండానే, నేను నా కోపానికి కారణం అతడికి చెప్పాను. అనుభవజ్ఞుడైన విరించి ఇది గ్రహించుకొని అన్నాడు – “బాబుగారూ! ఆ పిచ్చివాడికి నాకు సమానంగా చాలా విషయాలున్నాయి. అతడు నలుగురి ఎదుటా వీధిలో దెబ్బలు తింటాడు. నేను మనసు లోలోపలే!”
నేను బాగా పశ్చాత్తాపపడసాగాను. అయ్యో, అనవసరంగా ఈ ముసలివాడి మనసు బాధ పెట్టానే అని! అతని తప్పేముంది గనక? పాపం ఎప్పుడూ కిమ్మనడు. ఎంతపనయినా సరే, గాడిదలా చాకిరీ చేస్తాడు. పైగా విశ్వాసపరుడు, వారసత్వంలో వచ్చినవాడు కూడా! బహుశా మానాన్నగారు కూడా ఇలా ఎప్పుడూ కోప్పడి ఉండరేమో! ఇదే మనుష్యులమయిన మనతో వచ్చిన తంటా! మన భావాలపైన ఏవిధమయిన నియంత్రణా లేకపోవటం వలన, వాటి ప్రభావాలను వేరెవరో భరించవలసిన అగత్యం ఏర్పడుతుంది. అందుకే మనం అత్తమీద కోపం దుత్త పైన చూపించి మనని మనం ఎంతో ప్రపంచజ్ఞానం కలవాళ్ళుగా, వ్యావహారిక జ్ఞానం కలవాళ్ళమని చూపించుకునే పనికిరాని ప్రయత్నం చేస్తుంటాము.
అవటానికి ఇంటి నౌకరే అయినా, విరించి నాకన్న వయసులోను, అనుభవంలోను కూడా చాలా పెద్దవాడు. అతని తప్పేమీ లేకుండానే అతని పైన కోపగించుకునే హక్కు నాకెక్కడుంటుంది? నేను చేసిన ఈపని తప్పు అని నాకు తెలిసినా, ఒప్పుకోటానికి మాత్రం సిద్ధంగా లేను. అయినా, నా మనసులో భారం తగ్గించుకోటానికి, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అతడిని ప్రశ్నించాను. “విరించీలాల్? ఆ పిచ్చివాడు నిజంగా పిచ్చివాడేనని నీకూ అనిపిస్తుందా?”
“అవును బాబూ!” జవాబు సూటిగా వచ్చింది.
“కానీ, నేననుకోవటం లేదు.”
“నేనూ అనుకోవటం లేదు బాబూ!” గంభీరమైన స్వరం
“మరి అనుకోకపోతే అతడిని పిచ్చివాడని ఎందుకంటున్నావు?” నేను ప్రశ్నించాను.
“జనం అంటారు” తిరిగి అతని గొంతుకలో అదే శాంతం!
“నేనూ అనుకున్నాను!” అతడు చెప్పింది ఎంత అవగాహనతో కూడుకున్నదో కదా! అని ఈ రోజుల్లో అధిక సంఖ్యాకులయిన వారిదే అధికారం! ఒంటరివారిదీ, బలహీనులదీ మాట ఎక్కడ చెల్లుతుంది గనక! అసలు నామనసు కూడా అతడిని పిచ్చివాడని నమ్మేందుకు సిద్ధంగా లేదు. ఎన్నోసార్లు మనసు గొంతుక వినిపించటానికి ముందే నొక్కేసేవాడిని, అదేదో అసలు వినిపించనే లేదు అని భ్రమింపచేసుకోటానికి. ఆపైన ప్రజలందరూ అంటున్నట్లు అతడిని పిచ్చివాడనే భావిస్తూ వచ్చాను.
“బాబుగారూ!” అంటూ ఉదాసీనంగా విరించి పిలిచాడు – “ఆ పిచ్చివాడు మా పక్క ఇంటివాడే!” చాలా మంచి వ్యక్తి, ఎవ్వరినీ నొప్పించే సాహసం ఏనాడూ చెయ్యలేదు. తన సర్వస్వం కోల్పోయినా ఎదుటివారికి సహాయం చెయ్యటం అతని అలవాటు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ ఆకర్షించుకునే తత్త్వం అతనిది. భగవంతుని దయవలన కడుపుకు సరిపడా సంపాదించుకునేవాడు. వేరుశనగకాయలు అమ్ముకునేవాడు. ఎవ్వరితో ఏవిధమయిన లావాదేవీలు ఉండేవి కావు. సాయంత్రం వరకూ అమ్మకం వలన వచ్చిన డబ్బులు తీసుకుని వస్తూ – వస్తూ కొడుకును స్కూలు నుండి తెచ్చుకుని వచ్చేవాడు. కొడుకు దీపూ మాత్రమే ఆ వృద్ధునికున్న ఏకైక ఆసరా!”
ఈమాత్రం వినేసరికి నాకూ ఈ కథలో ఆసక్తి కలగటం మొదలయింది. నేను టీ పెట్టమని అడిగేను. టీ తాగుతూ సావకాశంగా కథను విందామనే ఉద్దేశం. విరించి టీ చేసి తీసుకువచ్చేడు, నేను నెమ్మదిగా టీ గుటకలు వేస్తూ తరవాతి కథ వింటున్నాను. విరించి సంఘటనలను ఒక క్రమంలో జోడిస్తూ చెప్పటం మొదలు పెట్టాడు – “రామ్‌దీన్ భార్య, కొడుకు దీపూను కని చనిపోయింది. అతడి జీవితలక్ష్యం దీపూ మాత్రమే! రామ్‌దీన్ తన కొడుకును తల్లి-తండ్రి, ఇద్దరి ప్రేమను పంచి పెంచేవాడు. తన కొడుకు పెరిగి పెద్దవాడయి పెద్ద ఆఫీసరు కావాలని అతని తీవ్రమైన కోరిక. అందుకే సర్కారు బడిలో చదవటానికి వేశాడు. స్కూలుకు తీసుకువెళ్తూ – వెళ్తూ ఒకటే మాట చెప్పేవాడు – బాగా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పరీక్ష పాసు కమ్మని! దీపూ కూడా బాగానే చదివేవాడు. రామ్‌దీన్ తన పేదరికం దూరమయే రోజు దగ్గరలోనే ఉందని ఎప్పుడూ ఆశపడేవాడు. ఒక చిన్న జాగాలో తనది అంటూ ఒక ఇల్లు ఉంటుందని కలలు కనేవాడు. సంఘంలో నలుగురి ముందు తను తలఎత్తుకుని జీవించే రోజులు వస్తాయనుకునేవాడు. కానీ విధి బలీయమైనది. గోపీ వస్తాదు తన దాదాగిరి చూపించుకోటానికి అతడిని డబ్బు ఇవ్వమని బలవంతపెట్టాడు. కాని పాపం, ఆ బీదవాడు ఎక్కడనుండి తెచ్చివ్వగలడు? ఫలితం తన వేరుశనగ కాయల అమ్మకానికి నీళ్లు వదులుకోవలసి రావటం! లాలాగిరిధారీమల్ ఇదే అదను చూసుకుని, గోపీ వస్తాదు సహాయంతో భయపెట్టి రామ్ దీనికున్న ఆచిన్న భూమి చెక్కనీ బలవంతంగా స్వాహా చేసేసాడు. పాపం, ఏ దారీ లేకపోయింది. అయినా దీపూను చూసుకుంటూ ఎలాగో అలాగ రోజులు వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజుల్లో స్టేషనులో సామాన్లు కూడా ఆనందంగానే మోసేవాడు. ఎందుకంటే దీపూ రూపంలో అతనికి భవిష్యత్తును గురించిన ఆశలు, కలలు కనిపించేవి. బహుశా భగవంతునికి ఇది కూడా ఇష్టం లేకపోయిందేమో! సరిగా ఈ ఇంటికి ఎదురుగానే అతడి గుండెకాయలాంటి కొడుకును కారు తోసిపోయింది. అదొక నాయకుడి కారు. నాయకుడు తప్పించుకున్నాడు, కానీ దీపూ మృత్యువు నుండి తప్పించుకోలేకపోయాడు. దీపూ మరణాన్ని రామ్‌దీన్ జీర్ణించుకోలేకపోయాడు. అదిగో, ఆనాటినుండే ఇలాటి పిచ్చిపనులు చేస్తూ ఉండటంతో, ప్రజలు అతడిని పిచ్చి వాడంటారు.”
విరించి చెప్పటం ఆపి, తన ఊపిరిని నియంత్రించుకుంటూ తిరిగి ఇలా అన్నాడు – “బాబూ! చెట్టంత ఎదిగిన నా కొడుకు సుజన్‌లాల్ మరణించినప్పుడు నేనూ ఇలాగే దిక్కులేని వాడిలా వేదనను అనుభవించాను. కానీ, బహుశా నేను రామ్‌దీన్ తన కొడుకును ప్రేమించినంతగా ప్రేమించలేదేమో! లేకపోతే నేను కూడా పిచ్చివాడిని ఎందుకు కాలేదు?”
నా మనసంతా చిన్నబోయి, ఉదాసీనంగా మారిపోయింది. ఆ పిచ్చివాడికి నా కారును చూస్తే ఎందుకు అంత కోపమో నాకు అర్థమయింది. నేను అత్మగ్లానితో నిండిపోయాను. ఆరోజు ఆఫీసులో కూడా మనసు లగ్నం కాలేదు. పని పూర్తి చేసుకుని తిన్నగా ఇంటికి రాగానే ఆ సంధ్యాసమయంలో కూడా ఆ పిచ్చివాడిని చూడాలనిపించింది. రాత్రంతా మనసు వికలంగా అనిపించింది. మాటి మాటికీ నేనెంత స్వార్థపరుడిని అనిపించటం మొదలయింది. సహాయం చెయ్యలేకపోతే కనీసం ఎవరినీ నొప్పించే హక్కు కూడా లేదు కదా! ఏదోలాగ రాత్రిని గడిపాను. మనసులోనే రామ్‌దీన్‌కు ఏదోవిధంగా సహాయపడాలన్న నిశ్చయానికి వచ్చాను.
మర్నాటి ఉదయం నాకు సరికొత్త ఉషోదయం. ప్రకృతిలోని తత్వాలన్నీ కొత్తగా జాగృతమయినట్లు అనిపించింది. నా మనస్సు శాంతంగా నిశ్చలంగా అనిపించింది. సూర్యకిరణాలేవీ తీక్షణంగా అనిపించలేదు. నాకు నీడకై ఏదో చెట్టు లేదా కొమ్మ ఆసరా అక్కర్లేదు. లాన్ మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాను. ఈ రోజు ఎందుకో తెలియదు గాని మరింత అందంగా అనిపిస్తోంది. చేతుల్లో ఈనాటి సరికొత్త వార్తాపత్రిక ఉంది. వార్తలు కొత్తవి, పుటలు కొత్తవి కాని దృశ్యంలో మార్పేమీ రాలేదు.
పిల్లల మేళం మళ్ళీ వచ్చి చేరింది. ముందు – ముందు నడుస్తున్న పిచ్చివాడు, కాదు రామ్‌దీన్, ఆ వెనకే పిల్లలూ. నేను వెంటనే లేచి నిల్చున్నాను. గేటు వద్దకు వెళ్లి పిల్లల్ని గట్టిగా పిలిచాను. కొందరే ఆగారు, ఎక్కువమంది ముందుకే వెళ్ళారు. నామాట ఎవరూ వినిపించుకోలేదు. అప్పుడే ఒక పెద్ద ఇంపాలా కారు వేగంగా రావటంతో పిల్లలు ఇటు అటు చెదిరిపోయారు. కాని రామ్‌దీన్ ఎటూ కదలలేక, కారుకింద పడ్డాడు. అతడి జీవితం చెదిరిపోయింది. నేను నోటమాట రాక నిల్చుండిపోయాను. అనుకోకుండా ఈ కారు కూడా ఎవరో నాయకుడిదే! అతడి చెంచాలు జనాన్ని వెళ్లగొట్టారు. కారును పక్కకు పెట్టడమూ జరిగింది. ఎవరో మున్సిపాలిటీ కార్పోరేషనుకు ఫోను తిప్పే భారాన్ని ఎత్తుకున్నారు. శవంపైన చిరిగిన దుప్పటి పరవటమయింది. నేను చూస్తూనే ఉన్నాను. ప్రాయశ్చిత్తం చేసుకోటానికి ఒక మిష వెతుక్కుంటూ ఉండగానే శవాన్ని తెల్లటి వాహనంలో పడుకోబెట్టటం, కళ్ళముందునుండి దూరమవటం జరిగిపోయింది. నేను మాత్రం నిశ్చలంగా అవాక్కై నోటమాటరాక చూస్తూనే ఉండిపోయాను.
హిందీ మూలం: విశ్వజిత్ ‘సపన్’
తెలుగు: డా. సుమన్‌లత రుద్రావజ్ఝల