99 సెకన్ల కథ-48

2
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ఇది ఇప్పుడిచ్చే బహుమతి కాదు!

[dropcap]శే[/dropcap]షయ్య మైకు ముందుకొచ్చారు.

ఆ రోజు రిటైరవుతున్న పరాంకుశానికి కాలేజిలో చదివే రోజులనుంచి ఎంతో గౌరవనీయుడు శేషయ్య. అందుకే, సిబ్బంది “ఎవర్ని ముఖ్య అతిథిగా పిలవమంటారు సర్” అన్నప్పుడు, “మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకోండయ్యా, నాకు మాత్రం శేషయ్య గారు ఉండాలి” అన్నాడు తటపటాయించకుండా. సిబ్బంది ఆయన మాటని గౌరవిస్తూనే, మునిసిపల్, మానవ వనరుల శాఖల మంత్రిని కూడా ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు.

హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రధాన కమీషనరుగా బాధ్యత నిర్వహిస్తూనే పదవీ విరమణ వయసుకొచ్చేశాడు పరాంకుశం. రెవెన్యూ సర్వీసులో గ్రూప్-1 అధికారిగా సర్వీసులో చేరి, 15 ఏళ్ళు గడిచాక తన ప్రతిభ ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకి ఎంపికై, వివిధ పోస్టుల్లో పనిచేసి, ఇప్పుడు చీఫ్ మునిసిపల్ కమీషనరుగా (ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో) పదవీ విరమణ చేస్తున్నాడు. మంత్రిగారితో సహా అందరూ మాట్లాడేశాక, చివరగా శేషయ్య ప్రసంగించారు.

“వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ప్రాక్టీస్ ప్రారంభించకముందు నేను కొంతకాలం పాటు లెక్చరరుగా పనిచేశాను. అప్పట్లో పరాంకుశం నా అభిమాన విద్యార్థి. ఇతను ఏకసంధాగ్రాహి. ఏ కొత్త విషయం చెబుతున్నా, అది పూర్తిగా చెప్పకమునుపే ఊహించి దాని సారాంశాన్ని చెప్పేసేవాడు. ఎప్పుడన్నా, నేను మందలించబోతే, అతనికి విపరీతమైన కోపం వచ్చేసేది. మింగలేక కక్కలేక క్లాసులోంచి లేచి వెళ్ళిపోయేవాడు. అయితే, ఇతను సూక్ష్మగ్రాహి కావటం ఇతని పట్ల మిగతా విద్యార్థులకి అసూయకి కారణమైంది… చాలా గొడవలు జరిగేవి… ఇప్పుడు సర్వీసులో ఎలా వున్నాడో మరి!” అంటూ ఆగారు శేషయ్య.

ఆ వీడ్కోలు సభలో అందరూ వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న మునిసిపల్ సిబ్బందే కదా! “కోపిష్టి” అంటూ చెవులు కొరుక్కుంటున్న కలకలం వినిపించింది.

“అలాంటి పరాంకుశానికి మీరు ఈ రోజు ఇలాంటి బహుమతి ఇవ్వటం నాకు నచ్చలేదు” అన్నారు శేషయ్య.

సభలో అంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. అంతా నిశ్శబ్దం.

మంత్రిగారు మరో మైకు అందుకున్నారు.

“శేషయ్య గారు క్షమించాలి. ఇందాక నా ప్రసంగంలో నేను చెప్పని కొన్ని విషయాల్ని ఇప్పుడు చెప్పాల్సి వస్తోంది. మా వాళ్ళు చాలా బాగా ఆలోచించారు. మన నగర చరిత్రలో పరాంకుశంగారు తనకి ఇది చివరి పోస్టింగ్ అని తెలిసికూడా ఎలాంటి రాజీ పడకుండా, గత మూడేళ్ళలో నగరంలో సమస్యల్ని పరిష్కరించడంలో అవిరళ కృషి చేశారు. ముఖ్యంగా తన దగ్గరకొచ్చిన సామాన్యుల సమస్యల్లో న్యాయమైన అన్నింటినీ అతి వేగంగా సిబ్బంది పరిష్కరించేలా రాక్షసుడిలా పనిచేశారు, చేయించారు. కొన్ని విషయాల్లో తన మాటే నెగ్గాలన్న మొండితనం చూపించినా, పరోక్షంగా మా నాయకుల మీద, ప్రత్యక్షంగా సిబ్బంది మీద నిప్పులు కక్కినా, ప్రజల్లో నగరపాలక సంస్థకి మంచిపేరు తీసుకువచ్చారు. ఇంతగొప్ప పాలనాధికారికి ఇచ్చే బహుమతి ఎలా ఉండాలి – అని మా వాళ్ళు అడిగితే నేనే చెప్పాను ‘ఇది’ ఇవ్వండయ్యా అని. ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి శేషయ్య గారు” అంటూ మంత్రిగారు కూర్చున్నారు.

సభలో చప్పట్లు బాగా మోగాయి.

శేషయ్య నవ్వారు.

“మంత్రిగారు చెప్పింది నిజం. ఇంతకన్నా గొప్ప బహుమతి, లేక జ్ఞాపిక, లేక స్మరణిక మరొకటి ఉండదు. కాని ఇది ఇప్పుడిచ్చేది కాదు….”

అందరికీ ఆశ్చర్యం…ఉత్కంఠ !

“సర్వీసులో చేరేటప్పుడే ఈ బహుమతి ఇవ్వాలి. ఈయనకొక్కడికే కాదు. ఉద్యోగంలో అధికారిగా చేరే ప్రతి ఒక్కరికీ ఇవ్వాలి. ‘నేను చెప్పిందే వేదం’ అనుకోవటం తప్పు. నేనిచ్చిన గొప్ప ఆలోచనని ప్రభుత్వం తిరస్కరించింది – అని నిస్పృహకి గురవటం తప్పు. ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన …’ నా విధి నేను శ్రద్ధగా నిర్వర్తించటం వరకే నా బాధ్యత – అని తెలిసి పనిచేయాలన్నా, ‘ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూప జాయతే … సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే …. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ‘ నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నట్లే జరగాలి వంటి గుణాలు మనిషిలో క్రోధాన్ని పెంచేసి, బుద్ధిని నశింపజేస్తాయని తెలుసుకొని నిగ్రహంతో వ్యవహరిస్తే, అందర్నీ కలుపుకు వెళ్తూ కూడా విజయాల్ని సాధించవచ్చు – అన్న అవగాహనతో కెరీర్‌లో ఎదగాలన్నా…. ఇలాంటి అనేక ఉన్నత భావాల్ని ఒంటపట్టించుకొని కార్యదక్షుడు అనిపించుకోవాలన్నా, సర్వీసులో చేరేటప్పుడే ప్రతి అధికారికి ఈ ‘భగవద్గీత’ని ఇవ్వాలి….”

అంతా లేచి నిలబడి హర్షామోదాలతో కరతాళ ధ్వనులు చేశారు.

“ఇకనుంచీ మా మానవ వనరుల శాఖ శేషయ్యగారి సలహాని ఒక శాశ్వత విధానంగా అమలు చేస్తుంది” అని మంత్రి ప్రకటించారు.

పరాంకుశం సజల నేత్రాలతో శేషయ్యకు పాదాభివందనం చేశాడు.

2. పెద్ద కొడుక్కి పెద్ద వాటా?    

రాజా రామచంద్రానికి 82 సంవత్సరాలు నిండాయి.

అతనికీ, భార్య వైదేహికీ మధుమేహం, రక్తపుపోటు వంటి ఆభరణాలు ఉన్నా, ఇంకా దంతాలు గట్టిగా ఉండటం వల్ల, ధాటిగా తినగలుగుతున్నారు. మాట్లాడగలుగుతున్నారు. అయినా వైదేహి పెద్దగా చదువుకోకపోవటం, రామచంద్రం బ్యాంకులో గుమాస్తా స్థాయిలో చేరినా, స్వయం ప్రతిభతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగే క్రమంలో దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి రావటం వంటి కారణాల వల్ల, ధర్మపత్నిగా నలుగురు పిల్లల ఆలనా పాలనా చూసుకోవటంలోనే ఆనందంగా గడిపేసింది.

పల్లెలో స్థిరపడ్డ రామచంద్రానికి రెండు గంటల ప్రయాణ దూరంలో జిల్లా కేంద్రంలో ఉండే నాలుగో కొడుకు వినయ్‌కి ఒక రోజు హైదరాబాదునుంచి వాళ్ళ శ్రేయోభిలాషి శేషయ్య చరవాణిలో సందేశం పంపారు. “మీ నాన్న సహస్రచంద్ర దర్శనం చేసిన భాగ్యశాలి. మీ అన్నదమ్ములంతా ఆ ఉత్సవం చేస్తే బాగుంటుంది.”

అంతే! వినయ్ పంపిన ఈ సమాచారం అందుకున్న మిగతా ముగ్గురు సోదరులూ కూడా ఆ ఉత్సవానికి సొంత కుటుంబాలతో వచ్చేశారు.

ఆయుష్ హోమంతో సహా సహస్ర చంద్ర దర్శనోత్సవం ఘనంగా జరిగింది.

ఆ రోజు సాయంత్రం పై ముగ్గురు కొడుకులూ విమానాల్లో వేర్వేరు నగరాలకి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది.

అప్పటికే కొడుకుల దగ్గర సన్నగా మాటల్లో వదిలింది వైదేహి. “మీ నాన్న తనకి అవకాశమున్న ప్రతి రూపాయి ఆదా చేస్తూ సంపాదించిన పొలాలూ, కంపెనీల్లో షేర్లూ… అన్నీ మీకందరికీ పంచేయాలను కుంటున్నారు …”

ఇది కార్చిచ్చులా కొడుకుల కుటుంబాల్లో ప్రాకిపోయింది – కొన్ని సెకన్లలో.

భోజనాలయ్యాక, కొడుకులు తండ్రితో సమావేశమయ్యారు. వైదేహి చెప్పిందే ఆయన కూడా చెప్పాడు.

“నా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. మీ అమ్మకి మతిమరుపు వచ్చేసింది. మధుమేహం, రక్తపుపోటు ఎలాగా మమ్మల్ని సుఖంగా ఉండనీయటంలేదు. ఇంకా ఎంతకాలం జీవిస్తామో తెలీదు. అందుకే, పంపకాలు చేస్తే ఎలా ఉంటుందా అని…!”

కవి హృదయం అర్థమైంది అందరికీ. మిగతావాళ్ళు ఏ పాయింట్లు లాగుతారో అన్న ఆదుర్దాతో ముందుగా పెద్ద కొడుకు శంకరం తన బాణం వదిలాడు.

“నేను నీ మిగతా కొడుకుల్లాగా కార్పొరేటు స్కూల్లో చదువుకోలేదు. వీధి బడిలో చదివాను. స్కూలుకి బూట్లు, యూనిఫారాలు వేసుకు వెళ్ళలేదు. వేసవిలో కాళ్ళు కాలుతుంటే 50 పైసలు పెట్టి నువ్వు కుట్టించిన టైరు చెప్పులతో తిరిగాను…”

ఇలా తన బాల్యం పిత్రార్జితం లేని తండ్రి చాటున ఎలా గడిచిందో లెఖ్కలు చెప్పి, “ఆ కారణంగా నాకు ఆ దుఃఖభాజన బాల్యానికి పరిహారంగా సగం వాటా రావటం న్యాయం…” అని క్లెయిమ్ పెట్టేశాడు.

వినయ్ మాటిమాటికీ మూడో అన్న చెవిలో ఏదో అడుగుతుంటే, అతను ఏదో రాసి చెబుతున్నాడు..

పెద్ద కొడుకు తరువాత వంతు నారాయణ (2), గోపాలం (3). ఇద్దరూ ఒకే రకమైన కొత్త పాయింటు లాగారు

“నాన్నా, నువ్వు ప్రమోషన్ల మీద బదిలీల్లో రాష్ట్రాలు తిరుగుతుంటే మాకు ఏ ఒక్క భాషా రాక, మా చదువుల సిలబసుల్లో పొంతన లేక మేం పెద్దన్నలాగా సైంటిస్టులం కాలేకపోయాం. అయినా, ఉదారంగా అడుగుతున్నాం. నాలుగు వాటాలు వేయండి. నలుగురికీ సర్దేయండి. మిమ్మల్ని మంచి ఓల్డ్ ఏజ్ హోంలో పెట్టి, మేమంతా కలిసి పోషిస్తాం….”

శంకరం ఒప్పుకోలేదు.

“ఒరేయ్, మీకు అసలు బుద్ధుందా? నేను రిటైర్ అయ్యాను. సంపాదించే అవకాశం మీకున్నట్లు నాకు లేదు. నాకింకా పెళ్ళికావల్సిన కూతురుంది. కాబట్టి నాకే ఎక్కువ రావాలి కదా. మీరు ముగ్గురూ ఇంకా సంపాదించుకుంటున్నారు కదరా!” అంటూ అరిచాడు.

నాలుగోవాడు వినయ్ వంతు వచ్చింది.

“అమ్మా, నాన్నా! మీ దగ్గర బాల్యంలో అన్నయ్యలు పొందినంత ప్రేమ నేను పొందలేదు. నా హైస్కూలు చదువంతా మీకు దూరంగా ‘ప్రత్యేక పిల్లల రెసిడెన్షియల్ స్కూల్లోనే’ గడిచింది…. ఇప్పుడు కలెక్టరాఫీసులో నేను చేసే ఈ గుమాస్తా ఉద్యోగాన్ని బట్టి ఎలాగూ నేను నా ఊళ్ళోనే ఉండక తప్పదు. మీరు నా దగ్గరకి వచ్చేయండి….”

శేషయ్యకి రామచంద్రం ఫోన్ చేశాడు. కొడుకులు ఎవరు ఏమంటున్నారో చెప్పాడు.

“ఏది ధర్మం?” అని అడిగాడు.

“ఫోన్ స్పీకర్ ఆన్ చేయి…. చూడండయ్యా. మీ అమ్మా, నాన్న వందేళ్ళు బ్రతకవచ్చు. ఆయన జీవితకాలంలో స్వార్జితాన్ని ఒక్క పైసా మీకు ఇవ్వకపోయినా మీరు అడగటానికిలేదు….కాని తను ఇప్పుడే పంచేయాలనుకుంటున్నాడు. ఎలాంటి రోగాలొచ్చినా, 100…103…105 ఇలా ఎప్పటిదాకా జీవిస్తే అప్పటిదాకా వాళ్ళని వృద్ధాశ్రమానికి పంపకుండా దగ్గర ఉంచుకుని చూసుకునే శక్తి, ఆసక్తి మీలో ఎవరికి ఉన్నాయో వాళ్ళు మాత్రమే సంపదని తల్లిదండ్రులు జీవించి ఉన్నంతవరకూ వాళ్ళతో కలిసి అనుభవించటం ధర్మం. ఆయన తన తదనంతరం ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో విల్లు రాసిపెడతాడు. ఈసారి వచ్చినప్పుడు చూసుకోండి…”

నిశ్శబ్దం. ఎవరూ నోరు విప్పలేదు.

కాని, వినయ్!

“అమ్మా, నాన్నా. మిమ్మల్ని ప్రేమగా చూసుకొంటాను. నేను బాల్యంలో మిస్ అయిన ‘ప్రేమ నిధిని’ నాకు ఇవ్వండి. మీరు సంపాదించిన నిధి మీ ఇష్టం…” అంటూ, వాళ్ళ పాదాలమీద పడిపోయాడు నలభయ్యేళ్ళ పుట్టు బధిరుడు వినయ్ కన్నీళ్ళతో.

రామచంద్రానికి, వైదేహికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. శేషయ్యకి విషయం అర్థమయింది.

ఫోన్ పెట్టేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here