అలనాటి అపురూపాలు-61

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

పర్వీన్ బాబీ జీవితంలో ప్రేమలూ విషాదాలూ:

పర్వీన్ బాబీ 70, 80 వ దశకంలో అందమైన, గ్లామరస్ హీరోయిన్‍గా పేరుపొందారు. ఆమెది వెస్ట్రన్ ఇమేజ్ కావడం, ఆమె రూపం యూరేసియన్‍ల వలె ఉండడంతో దర్శకులు ఆమెకి ఎక్కువగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే ఇచ్చేవారు. ఆ కాలంలో అత్యధికంగా పారితోషికం తీరుకున్న నటీమణులలో ఆమె ఒకరు. అమితాబ్ బచ్చన్‍తో కలిసి ఎనిమిది సినిమాల్లో నటించారు, అవన్నీ సూపర్ హిట్లే. పర్వీన్ ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌కి ప్రసిద్ధి చెందారు. నమక్ హలాల్ లోని ‘జవానీ జానేమన్’, ‘రాత్ బాకీ బాత్ బాకీ’;  షాన్ లోని ‘ప్యార్ కర్నే వాలే’ నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆమె అన్ని ప్రసిద్ధ సినీ పత్రికల కవర్ పేజీలపై వచ్చారు. ఆకట్టుకునే రూపంతో పాటు, స్వేచ్ఛావిహార జీవితం ఆమెది. ఎప్పుడూ ఉన్నదున్నట్టు మాట్లాడేవారు. తన సంబంధాలను దాచేవారు కాదు. జీవితాన్ని తను అనుకున్నట్టుగానే జీవించారు. పలువురు బాలీవుడ్‍ ప్రముఖులతో ప్రేమలో పడి, ఆ ప్రేమలు విఫలమై జీవితం విషాదాంతమైన పర్వీన్ బాబీ గురించి ఈ వారం తెలుసుకుందాం.

కబీర్ బేడీతో:

సాందోకన్ సెట్‍లో ఆమె కబీర్ బేడీని కలిసినప్పుడు సంచలనం చెలరేగింది. ఈ ఇద్దరూ చక్కని రూపసులు కావడం, ప్రేమలో పడడంతో యూరోపియన్ ప్రెస్ వీరి గురించి చిలువలు పలువలుగా రాసింది. వారి ప్రేమ గాఢమైనదైనా, తాత్కాలికమే అయింది. కబీర్ బేడీకి యూరప్‍లో విపరీతమైన జనాదరణ లభించి, పని అధికమైంది. ఆ కాలంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్‍లలో పర్వీన్ ఒకరు… ఆమె బాలీవుడ్ సినిమాలను వదులుకోలేకపోయారు. ఆమె యూరప్‍కి బయల్దేరేముందు ఆమె చేతిలో నలభై సినిమాలున్నాయనీ, ఆమె తిరిగి బొంబాయి చేరగానే ఆ నిర్మాతలందరూ ఊపిరి పీల్చుకున్నారని అంటారు. రెండో దఫా కూడా ఆమె కెరీర్ బాగా సాగింది. కబీర్ బేడీతో సంబంధాలు తెంచుకున్నందుకు ఆమె బాధ పడలేదు. ఆయన కెరీర్ ఎక్కువగా యూరప్‍లో కొనసాగడం, ముఖ్యంగా ఆయన ప్రొమితాకు దూరంగా ఉండాలనుకోవడం వల్ల దేశం బయటే ఉండడానికి ప్రాధాన్యత నిచ్చారు. తనకంటూ ఓ జీవితం ఉందనీ, ఆయన ఛాయలో ప్రపంచమంతా తిరగడం ఇష్టం లేదని పర్వీన్ చెప్పారు.

తర్వాతి కాలంలో ఆమె దర్శకుడు మహేష్ భట్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ కల్సి ఆధ్యాత్మిక అన్వేషణలో యు.జి. కృష్ణమూర్తి దగ్గరకు, ఓషో వద్దకు వెళ్ళేవారు. మహేష్ భట్‌తో ప్రేమలో ఉండగానే ఆమెలో స్కీజోఫ్రీనియా తొలి దశ తలెత్తడం విచారకరం.

మహేష్ భట్‌తో:

పర్వీన్ బాబీ గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే: “పర్వీన్‍తో నా సంబంధం 1977లో మొదలైంది (తను కబీర్ బేడీతో తెగతెంపులు చేసుకున్నాకా). అప్పట్లో ఆమె టాప్ స్టార్. అమర్ అక్బర్ ఆంథోనీ (1977), కాలా పత్థర్ (1979) లోనూ నటిస్తోంది. నేనేమో ఫ్లాప్ డైరక్టర్‍ని. నేను భార్యనీ, పాప పూజని విడిచి పర్వీన్‍తో జీవించసాగాను. ఇంటివద్ద పర్వీన్ సాధారణంగానే ఉండేది. జడ వేసుకునేది, వంట చేసేది… తొలి రోజుల్లో ఆమెపై పాశ్చాత్య ఛాయలు ఉన్నప్పటికీ, సాధారణ గుజరాతీలానే ప్రవర్తించేది. గొప్ప సినీ నటిలా ప్రవర్తించేది కాదు. నిర్మాతలలో ఫోన్‍లలోనే మాట్లాడేది. కానీ పరిస్థితి తారుమారయింది. తను వింతగా ప్రవర్తించసాగింది. అది 1979లొ ఓ సాయంత్రం. నేను జూహూలో వాళ్ళింటికి వెళ్ళాను.. పెద్దావిడయిన వాళ్ళమ్మ (జమాల్ బాబీ) బయటకొచ్చి, నెమ్మదిగా మాట్లాడుతూ “పర్వీన్‍కి ఏమైందో చూడండి” అన్నారు. నేను ఆమె గదిలోకి వెళ్ళాను. ఆ గదిలో డ్రెస్సింగ్ టేబుల్‍పై లెక్కలేనన్ని పెర్‍ప్యూమ్స్ ఉన్నాయి (వాటి పరిమళం ఇప్పటికీ నాకు తెలుస్తుంది). నా ఒళ్ళు జలదరించింది. సినీ కాస్ట్యూమ్ ధరించిన పర్వీన్ – గోడకీ, మంచానికి మధ్యగా ఓ మూలన దాక్కుని ఉంది. నన్నూ చూస్తూనే ఒక్క గెంతులో నా దగ్గరకి వచ్చింది. ఆ గెంతు ఓ జంతువు గెంతినట్టుగా ఉంది. ఆమె చేతిలో వంటగదిలో వాడే చిన్న కత్తి ఉంది. “ఏం చేస్తున్నావు?” అని అడిగా. “ష్! మాట్లాడద్దు… ఈ గదిలో బగ్స్ (గూఢచర్య పరికరాలు) పెట్టారు… వాళ్ళు నన్ను చంపేద్దామనుకుంటున్నారు… షాండిలియర్‍ని మీద పడేస్తారు..” అంటూ నా చేయి పట్టుకుని నన్ను బయటకు నడిపించింది. నేను వాళ్ళమ్మగారి కేసి చూశాను. ఆవిడ నాకేసి నిస్సహాయంగా చూస్తోంది. ఆ చూపుతో తెలిసింది – ఇటువంటి ఘటన ఇంతకు ముందు జరిగిందనీ, ఇది కొత్త కాదనీ. ఆ రోజు నుంచి భయం, వేదన వెంటాడాయి. అసలు పర్వీన్‍కి ఏమవుతోందో అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. ఎన్నో సిద్ధాంతాలు బయటికొచ్చాయి. ఒకటి – తగిన సమాచారం లేకపోవడం, రెండు బాగా విజయవంతం కావడం వల్ల ఆమెకెవరో చేతబడి చేసారు; ఆమెను దెయ్యం ఆవహించింది అని! నేను ప్రసిద్ధులైన మానసిక వైద్యులను సంప్రదించాను… ఆమెది పారనాయిడ్ స్కీజోఫ్రీనియా (ఈ స్థితిలో వ్యక్తి భ్రమలకు, భ్రాంతులకు గురవుతాడు) అనీ, అది జెనెటిక్ బయోకెమికల్ డిజార్డర్ అని చెప్పారు. మందులు రాసిచ్చారు. ఒకవేళ మందులు పనిచేయకపోతే, ఎలెక్ట్రోకన్వల్సివ్ ట్రీట్‌మెంట్ (సాధారణ పరిభాషలో కరెంట్ షాక్) ఇవ్వవలసి ఉంటుందని చెప్పారు.

ఇప్పుడు మన హీరోయిన్‍కి వచ్చిన మానసిక సమస్య గురించి దాచాల్సిన పరిస్థితి! తొలుత – జనాలు ఆమె దగ్గరకి రాకుండా ఉండేందుకు ఆమెకి కామెర్లు అని చెప్పాం! నేను కబీర్ బేడీకి ఫోన్ చేసి ఆమె పరిస్థితి వివరించాను. ఆయనకి ఈ సంగతి తెలుసని ఆయన స్వరం ద్వారా అనిపించింది. ఆమెకి సాయపడగల కొన్ని యూ.కె. హాస్పిటల్స్‌ని ఆయన సూచించారు. డానీ (డానీ డెంజోంగ్ప, పర్వీన్ మాజీ ప్రియుడు, పొరుగున ఉండేవారు) కూడా బాగా సాయపడ్డారు. సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నేను ఆమెని శాంతిపజేయడానికి ఆయన ఇంటికి తీసుకెళ్ళేవాడిని. కాని ఆమెను భయాలు వెంటాడాయి. గదిలో తుఫానులా ఉండేదామె. ఒక్కోసారి ఎయిర్ కండీషనర్‍లో బగ్ ఉంది అనేది…. దాన్ని విప్పదీసి చూపిస్తే గాని నమ్మేది కాదు. మరోసారి ఫ్యాన్‌లో ఇంకోసారి తన పెర్‍ప్యూమ్‍లో బగ్ ఉంది అనేది. ఒకసారి నేనూ తనూ, మా మిత్రుడు, తత్త్వవేత్త, మార్గదర్శి అయిన యు.జి.కృష్ణమూర్తిని కలిసి వస్తున్నాం… ఉన్నట్టుండి.. “కారులో బాంబ్ ఉంది… టిక్ టిక్ చప్పుడు వినిపిస్తోంది… కారు పేలిపోతుంది” అంటూ కదులుతున్న కారు తలుపు తీసుకుని కిందకి దూకేసింది. నేను ఆమెని ఆపడానికి ప్రయత్నించాను. జనాలేమో పర్వీన్ బాబీ తన ప్రియుడితో గొడవ పడుతోంది అని అనుకున్నారు. ఎలాగోలా ఆమెని ఒక టాక్సీలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్లాను.

తనని అమితాబ్ బచ్చన్ చంపాలని చూస్తున్నారని భయపడేది. ఒకసారి అమితాబ్‍కి క్షమాఫణ చెప్పాలంటూ నాతో పాటూ మొహబూబ్ స్టూడియోకి వచ్చింది. ఆయన పట్ల ఏదో తప్పు చేసి ఉంటుందని, అందుకని ఆయన కోపగించి ఉంటారని భావించాను. ఆమె భ్రాంతులన్నీ ఆమెకి వాస్తవాలే! మరోసారి 1969లో అహ్మదాబాద్‍లో జరిగిన అల్లర్ల సందర్భంగా తనని స్కూల్ నన్స్ బడి వ్యాన్‍లో చాపల కింద దాచి తప్పించడం గురించి చెప్పింది. ఆ ఘటన ఇప్పుడు జరిగినట్లుగా ఒణికిపోయింది. ఈ మానసిక స్థితిలోనే ఓసారి వాళ్ళమ్మతో “మేమిద్దం పెళ్ళి చేసుకుంటాం” అని చెప్పింది. పెళ్ళయితే సమస్యలు సర్దుకుంటాయని భావించింది. కానీ అప్పటికే నాకు పెళ్ళయింది. నేను నా భార్యని విడిచిపెట్టలేను. పైగా నాలాంటి పనికిమాలిన వాడి కోసం భార్య తన కెరీర్‍ని కూడా వదులుకోడానికి సిద్ధంగా ఉంది. పర్వీన్‍కి మాత్రలు ఇవ్వడం కూడా సమస్యే. అన్నంలోనో, పానీయాల్లోనే కలిపి ఇచ్చేవాళ్ళం. “నువ్వు ముందు తిను” అనేది. ఒక్కోసారి నేను తినేవాడిని. చాలాకాలం పాటు సినిమాలకి దూరంగా ఉంది. కాబట్టి షూటింగులకి హాజరు కావల్సిందిగా ఒత్తిళ్ళు పెరగసాగాయి. షాన్ (1980) కోసం ఓ భారీ సెట్ వేసి ఉంచారు, విదేశీ టెక్నీషియన్స్ ఎదురు చూస్తున్నారు. కొంతమంది నిర్మాతలు నేరుగా వైద్యులతో మాట్లాడడానికి ప్రయత్నించారు. వాళ్ళ తప్పేం లేదు, అధిక వడ్డీలకి సొమ్ము తెస్తున్నారు. అమె కార్యదర్శి వేద్ శర్మ, మంచివాడు, ఈ తాకిడిని తట్టుకోవడానికి, నిర్మాతలని ఆపడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సమయంలోనే డాక్టర్లు కరెంట్ షాక్ ఇద్దామని, ఆమె రోగం కుదురుతుందని ప్రతిపాదించారు. నేను దానికి వ్యతిరేకించాను. షాకులు రోగికి నయం చేయవు, అవి సమాజం కోసం మాత్రమే.

ఆమెని సినిమాల్లో నటింపజేయడమంటే, ఆమెని ఇబ్బంది పెట్టడమే అని నిర్మాతలతో నేనంటే వాళ్ళూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆమెను వాడుకుంటున్నానని భావించారు. మీడియా కూడా, ముఖ్యంగా టాబ్లాయిడ్ జర్నలిజం, ఇందుకు కారణం సెక్స్, డ్రగ్స్ అని రాశారు. ఎంతటి వాళ్ళకయినా పాపం పండక తప్పదు అన్నట్టు రాశారు. ఆమె జీవితంలో నాకు ఎటువంటి చట్టబద్ధమైన హోదా లేదు, చికిత్సలో నేను జోక్యం చేసుకోలేను. కరెంట్ షాక్‍లు ఇప్పించి ఆమెకి కోలుకోలేని హాని చేయడం నాకు నచ్చదు. అందుకని పర్వీన్‍ని తీసుకుని సెప్టెంబరు 1979లో యు.జి.కృష్ణమూర్తి దగ్గరకు బెంగుళూరు వెళ్ళాను. డ్రగ్ థెరపీ కొనసాగినా, అక్కడి ప్రశాంతత ఆమెకి సాంత్వన కలిగిస్తుందని నమ్మాను. ఆమెకి రోగం నయమవాలంటే, ఆమెని పూర్తిగా ఓ అజ్ఞాతవ్యక్తిగానే ఉండనీయాలని భావించాను. నయమయే అవకాశాలు అతి తక్కువని యు.జి. భావించారు. ఆయన మరో మార్గం సూచించారు… స్టార్‍డం కల్పించే అన్ని ఒత్తిళ్ళనుంచి పూర్తిగా దూరంగా ఉంటూ, సాధారణ మనిషిలా ఉండాలని! ఆమె సమస్యలో నేనూ ఓ భాగమేనని, నా సమక్షం ఆమెకి మేలు చేయదనీ; నేను తనకి దూరంగా ఉండాలని యు.జి. అనడంతో నేను అక్టోబరు 1979లో ఆమెని యుజి దగ్గర బెంగుళూరులో వదిలి వచ్చేశాను. “ఆమె నిన్నూ ముంచేస్తుంది… నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో” అన్నారు యుజి. తర్వాత పర్వీన్ యుజితో పాటు స్విట్జర్లాండ్ వెళ్ళింది. అక్కడ ఆమె పరిస్థితి మెరుగుపడకపోగా, ఇంకా ముదిరిపోయింది. ఆ మేరకు యుజి నాకు 6 జూన్ 1980 నాడు ఉత్తరం రాశారు. ఈలోపు నేను నా భార్యతో ఉండి, జీవితాన్ని కుదుటపరుచుకున్నాను. ‘లహు కే దో రంగ్’ (1979) పరాజయం పాలయింది. ‘అర్థ్’ సినిమా రచన చేస్తున్నాను. ఆ ఏడాది పర్వీన్ ఇండియాకి, నా జీవితంలోకి తిరిగొచ్చింది.  నేనూ నా భార్య కలిసిపోయినా, నేను పర్వీన్‍తో ఉన్నాను. నేను యుజితో సంప్రదింపులతో ఉన్నానని పర్వీన్‍కి తెలుసు. పర్వీన్ తిరిగి సినిమాల్లోకి రావడానికి ఆయన అంగీకరించలేదు. ఆయన స్వరంలోని పవిత్రతను, పర్వీన్ పట్టించుకోలేదు. ఆఖరి అస్త్రం ప్రయోగించింది… అదే బెడ్ రూమ్! బయటికి వచ్చేస్తుండగా, ఒకటవుదామని కోరింది… మీరు నా గురించి ఏమైనా అనుకోండి… ఆమె నన్ను శారీరకంగా కలవాలనుకుంది. ఒకరి కొకరం దగ్గరయ్యాం. “మహేష్, నేను కావాలో, యుజి కావాలో తేల్చుకో” అంది. విస్తుపోయి చూసాను. ఆమే నాకేసి చూసింది. నేనేం జవాబు చెప్పలేదు. ఆమె నా జవాబుని అర్థం చేసుకుంది. ఆమె ముఖంలో కన్నీళ్ళు! నేను లేచి దుస్తులు ధరించాను. “ఎసి ఆపేయ్, బాగా చల్గగా ఉంది” అంది. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. బయట వర్షం పడుతోంది. నేను చీకటి వసారాలోంచి బయటకు నడిచాను. “మహేష్, మహేష్” అని తను పిలవడం వినిపించింది. కానీ నేను వెనక్కి తిరగలేదు. లిఫ్ట్ కోసం ఆగలేదు. మెట్లు దిగసాగాను. లిఫ్ట్ కోసం ఆగితే తను వచ్చి నన్ను వెనక్కి తీసుకువెళ్ళిపోతుందని భయం! అందుకే మెట్లు దిగసాగాను… నా వెనుకే తను పరుగెత్తుతూ వస్తున్న శబ్దం వినిపించింది… నగ్నంగా బట్టలు లేకుండా మెట్లు దిగేస్తోంది… వెనక్కి పరుగెత్తి… “ఇలా చేయకూడదు” అని చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేక, బయటకి వానలో నడిచాను. మా బంధం తెగిపోయినట్టేనని గ్రహించాను. చక్కగా, హుందాగా విడిపోవాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు. కరెంట్ షాకులనుంచి ఆమెని కాపాడిన ఏకైక వ్యక్తిని, ఆమెకి సేవలు చేసినవాడిని, మరో మార్గం చూపడానికి కృషి చేసిన వాడిని నేనే. కానీ ఈ నిజాన్ని వినడానికి ఆమె సిద్ధంగా లేదు. యుజి నాకు తండ్రి లాంటి వారయితే, ఆమెకి తల్లి లాంటి వారు. ఇక మేం తిరిగి  కలిసేదే లేదు. మేం 1980లో విడిపోయాం (1983లో పర్వీన్ అన్ని ప్రాజెక్టులను రద్దు చేసుకుని అమెరికా వెళ్ళిపోయారు. 1989లో విపరీతంగా బరువు పెరిగిపోయి, గుర్తించలేని విధంగా ఇండియాకు తిరిగి వచ్చారు). ఆమెను మళ్ళీ 1991లో చూశాను. అవి గల్ఫ్ యుద్ధం రోజులు (ఆగస్ట్ 1990 – ఫిబ్రవరి 1991). సద్దాం హుస్సేన్ కువైట్‍పై దాడి చేశారు. సిఎన్‌ఎన్ ఛానెల్‍లో యుద్ధం వార్తలు నిరంతరం ప్రసారమవుతూ ఉండేవి. హాలిడే ఇన్‍లో ఒక టీవీ ఉండేది… దానిలో నిరంతరం యుద్ధం వార్తలు వస్తూండేవి. వాటిని చూడ్డానికి ఆ కాఫీ షాప్‍కి వెళ్తుండేవాడిని. అక్కడ ఓ పుస్తకాల కొట్టు కూడా ఉండేది. ఓరోజు నేనక్కడ నిలబడి పుస్తకాలు తిరగేస్తున్నాను. వెనుక నుంచి ఎవరో “ఎక్స్‌క్యూజ్ మీ” అన్నారు. వెనక్కి తిరిగి చూస్తే పర్వీన్. అయితే ఆమె కళ్ళలో సాన్నిహిత్యం ఏమీ లేదు, బదులుగా చిన్న పిల్లల కోపం కనబడింది. నేను పక్కకి జరగగానే ముందుకు వెళ్ళి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ తాజా సంచిక వచ్చిందా అని అడిగింది. ఇంకా రాలేదని వాళ్ళు అన్నారు. నన్ను దాటుకుంటూ, బయటకు వెళ్ళిపోయింది. గత 11 ఏళ్ళుగా తను నాలో లేదు… కానీ అనుకోకుండా జరిగిన ఈ సంఘటన ఎన్నో భావాలని రేపింది. మేము ‘సన్నిహిత అపరిచితులం’.

(పద్నాలుగేళ్ళ తర్వాత)

అది 22 జనవరి 2005. హైదరాబాద్ నుంచి వస్తూ, ఎయిర్‍పోర్ట్‌లో ఉన్నాను. నా ఫోన్ ఎస్.ఎం.ఎస్.లతో నిండిపోయింది. ‘పర్వీన్ బాబీ చనిపోయింది. తన అపార్ట్‌మెంట్‍లో నిర్జీవంగా కనిపించింది (డయాబెటీస్ కాంప్లికేషన్స్ వల్ల)’. అది వాస్తవం కాదు అనిపించింది. ఆమె శవాన్ని ఎవరూ తీసుకోవడానికి రాకపోతే, కూపర్ హాస్పటల్‍లోనే ఉందని తెలిసింది. ఆమె బంధువులు ఎవరూ ముందుకు రాకపోతే, అంత్యక్రియలు నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. నా విజయానికి కారణం ఆమే. సినీ రంగంలో నా పునరుత్థానానికి (ఆమెతో నా సంబంధం ఆధారంగా తీసిన) ‘అర్థ్’ సినిమానే కారణం. ఆ చిత్రం లేకపోతే నేను లేను. ఆమెకి ఋణపడి ఉంటాను. ఆమెకి అంత్యక్రియలు నిర్వహించాలని అనుకోవడం ద్వారా నాలో ముగింపు భావన కలిగింది. 23 జనవరి 2005 నాడు అంత్యక్రియలు జరుగుతుండగా, ఆమె లేకపోతే నేను ఏమయ్యేవాడినా అనుకున్నాను. నా ఉనికికి కొంత ‘అర్థా’న్నిచ్చింది ఆమె!

డానీ డెంజోంగ్పతో:

70వ దశకంలో పర్వీన్ బాబీ, నటుడు డానీ డెంజోంగ్ప కొన్నేళ్ళ పాటు కలిసున్నారు. మంచి మనిషైన డానీకి ఆమె గురించి తీపి జ్ఞాపకాలే ఉన్నాయి. ఆమె గురించి చెప్తూ, ‘మంచి మనిషి’ అనీ, ‘అందగత్తె’ అనీ అన్నారు. “మేం అప్పట్లో చిన్నపిల్లలం! నాలుగేళ్ళు కలిసి ఉన్నాం.. అప్పట్లో అదో పెద్ద వార్త! మేం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం! తర్వాత మా మద్య అభిప్రాయ భేదాలొచ్చాయి. ఇద్దరం సంతోషంగా విడిపోయాం. తర్వాత స్నేహితుల్లా ఉన్నాం” గుర్తు చేసుకున్నారు డానీ. ఆ తర్వాత పర్వీన్, కబీర్ బేడీ తోనూ, మహేష్ భట్ తోను సంబంధాలు నెరపారు. జుహులో డానీ ఉండే కాలనీలోనే నివాసముండేవారు.

“పర్వీన్ ఎప్పుడూ నన్ను భోజనానికి పిలుస్తూ ఉండేది. నాకేమో అప్పట్లో కొత్త గర్ల్ ఫ్రెండ్ కిమ్ ఉండేది. ఆమెకి పర్వీన్ అంటే ఇష్టం ఉండేది కాదు. పైగా మాజీ ప్రేయసి ఒక సమయమూ అదీ లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంటికి వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది? ఆమోదించడానికి ఏ అమ్మాయికైనా కష్టమే. ప్యాకప్ అయిపోయాక, సెట్స్ నుండి నేను కిమ్‍ని తీసుకుని ఇంటికి వచ్చేవాడిని…. ఆ సమయంలో మా ఇంట్లో విసిఆర్ లో సినిమాలు చూస్తూ ఉండేది పర్వీన్. అలా చేయద్దని పర్వీన్‍కి చెప్పాను… ‘ఇందులో తప్పేముంది, ఇప్పుడు మన మధ్య ఏమీ లేదు, కేవలం స్నేహితులం’ అనేది. తాను నవ్వేసి, పర్వీన్‍కి నచ్చజెప్పమని తన స్నేహితుడైన మహేష్‌కి ఈ సంగతి చెప్పాను అని చెప్పారు.

పర్వీన్‍లో అసాధరణంగా అనిపించిన విషయాన్ని తాను మొదటిసారి గుర్తించిన రోజుని జ్ఞాపకం చేసుకున్నారు డానీ. “వాళ్ళింటికి భోజనానికి వెళ్లాను. అక్కడ బల్ల మీద వెండి శంఖాలు ఉన్నాయి. ఒకదాన్ని చేతిలోకి తీసుకుని ఊదుతుంటే – పర్వీన్ తెగ భయపడిపోయింది. అప్పుడే మహేష్ చెప్పారు – ఈమధ్య తను ప్రతీ దానికి భయపడుతోందని, ఏకాంతాన్ని కోరుకుంటోందని!”

“కొన్ని రోజుల తర్వాత మహేష్ చెప్పారు, పర్వీన్‍కి ఒంట్లో బాగోలేదు, మీరొచ్చి చూడాలి” అని – అంటూ గుర్తు చేసుకున్నారు డానీ. వైద్యులు మొదట డానీ ఇంటికి వచ్చేవారు. అక్కడ్నించి పర్వీన్ దగ్గరికి వెళ్ళేవారు. ఒకరోజు మహేష్ డానీని పిలిచి, పర్వీన్‌కి అపస్మారం సోకిందని చెప్పారు. వెంటనే గురు యుజి కృష్ణమూర్తిని పిలిపించారు. ఆయన ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, “పర్వీన్… నీకేం కాలేదు… నువ్వు చక్కగా ఉన్నావు” అన్నారు. అంతే ఆమె మామూలయిపోయింది. ఆయనను బాగా విశ్వసించేది. “పర్వీన్‍కి అవసరమైనప్పుడల్లా నేను అందుబాటులో ఉన్నాను” చెప్పారు డానీ.

ఆమె తనతో స్నేహాన్ని కూడా ఎందుకు తెంచుకుందో డానీ వివరించారు. “ఒకరోజు ఆమె ఒక ఇంటర్వ్యూ చదువుతోంది. దాంట్లో అమితాబ్ బచ్చన్ నేను ఆయన మిత్రుడిని అని చెప్పారు. అంతే! తర్వాత ఆమెని కలవడానికి వెళ్తే, కీ హోల్ నుంచి చూసి “నువ్వు ఆయన ఏజంట్‌వి” అంటూ నన్ను లోపలికి రానీయలేదు (అప్పట్లో పర్వీన్ పరానాయిడ్ స్కీజోఫ్రీనియాతో బాధపడుతూ, అర్థరహితమైన భయాలతో ఉండేది. అమితాబ్ బచ్చన్‌తో సహా ఎందరో ప్రముఖులు తనని చంపేందుకు చూస్తున్నారని భ్రమ పడేది). నన్ను చూసి కూడా భయపడింది.”

చాలా ఏళ్ల తరువాత ఆమె అంత్యక్రియలని డానీ హాజరయ్యారు. “ఆమెతో సినిమాలు తీయడానికి ఎందరెందరో నిర్మాతలు క్యూ కట్టేరు. కానీ ఆ రోజు మాత్రం ఎవరూ లేరు. కొంతమంది మాత్రమే ఉన్నాం… నేనూ, కబీర్, మహేష్, జానీ బక్షీ, రంజిత్, ఇంకా నిర్మాత హరీష్ షా… అంతే!”

విచారకరం, కానీ వాస్తవం!!


నటి పుష్పవల్లి:

పుష్పవల్లిగా ప్రసిద్ధమైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారమ్మ (3 జనవరి 1926 – 28 ఆగస్టు 1991) కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్‍లోని (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ) పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు గ్రామంలో జన్మించారు. పుష్పవల్లి తాయారమ్మ పేరుతో బాలనటిగా సినీరంగంలో ప్రవేశించారు. సంపూర్ణ రామాయణం (8 ఆగస్టు 1936) చిత్రంలో బాల సీత పాత్ర పోషించారు. ఈ చిత్రం ఆంధ్ర ప్రాంతంలో తొలి స్టూడియో అయిన రాజమండ్రిలోని దుర్గా సినీటోన్‍లో షూటింగ్ జరుపుకుంది. అప్పట్లో ఆమె వయసు 9 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమాకి ఆమెకి 300 రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. దీని తరువాత బాలనటిగా మరికొన్ని సినిమాలలో నటించారు. వాళ్ల కుటుంబానికి తన సంపాదనే ఆధారం. అందువల్ల చదువుకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ప్రాథమిక విద్యతో ముగించారు. 1940లో ఐ.వి. రంగాచారి అనే న్యాయవాదిని పెళ్ళి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు, 1946లో వారు విడిపోయారు.

ఎక్కువ విరామం తీసుకోకుండానే బాల నటి నుంచి సాధారణ పాత్రలలోకి మారిపోయారు పుష్పవల్లి. ఎందుకంటే కుటుంబానికి ఆదాయ వనరు నటన మాత్రమే. విరామం తీసుకునే వెసులుబాటు లేదు. బహుశా ఈ కొనసాగింపే తన కెరీర్‍ని ప్రభావితం చేసి ఉండచ్చు; ఆమెకి ప్రధాన కధానాయికా అవకాశాలు కల్పించలేదు. చాలా సినిమాల్లో రెండో హీరోయిన్‍గా నటించారు. మొత్తం మీద 20-25 తెలుగు, తమిళ చిత్రాలలో (బాలనటిగా వేసిన పాత్రలతో సహా) నటించారు. ఆమె టాప్ స్టార్ అవలేదు, మధ్యస్థంగా మాత్రమే విజయం సాధించారు. గొప్ప పేరు ప్రతిష్ఠలూ పొందలేదు. బహుశా ఆమె కెరీర్‍లోనే అతి పెద్ద హిట్ 1942 నాటి ‘బాల నాగమ్మ’ కావచ్చు. అందులో ఆమె ముఖ్యమైన సహాయక పాత్రలో నటించారు. 1947లో తాను ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ మాలిని’కి విమర్శకుల ప్రశంసలు దక్కినా, సినిమా ఆర్థికంగా పరాజయం పాలయ్యింది. ఈ చిత్రంతోనే ఆమె భవిష్యత్తు భర్త జెమినీ గణేశన్ సినీ రంగ ప్రవేశం జరిగింది.

పుష్పవల్లి తరువాత 1948లో జెమినీ గణేశన్‌తో కలిసి చక్రధారి అనే తమిళ చిత్రంలో నటించారు. ఆమె ఈ చిత్రంలో హీరోయిన్ కాగా, ఆయనది చిన్న పాత్ర. ఈ సినిమా తర్వాత వారి స్థితి తారుమారు అయింది. జెమినీ గణేశన్ పెద్ద హీరో అయిపోగా, పుష్పవల్లికి చిన్న పాత్రలే రాసాగాయి. పైగా హీరోయిన్‍గా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. జెమినీ గణేశన్‍తో మరికొన్ని సినిమాలు చేశాక, వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇద్దరూ అప్పటికి వివాహితులు (జెమినీ గణేశన్‍కి అలివేలు అనే భార్య ఉంది, ఆయన చనిపోయేవరకు కలిసే ఉన్నారు). పుష్పవల్లికి, జెమినీకి వెంటవెంటనే ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. పెద్దమ్మాయి సినీ హీరోయిన్ రేఖ (1954 జననం), రెండో అమ్మాయి రాధ కూడా కొన్నాళ్ళు సినిమాల్లో నటించి, పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఈ పిల్లలిద్దరికీ తానే తండ్రినని చెప్పుకోడానికి జెమినీ చాలా రోజుల వరకు అంగీకరించలేదు. పుష్పవల్లి ఇంటికి అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుండేవారు. వాళ్ళ సంబంధం త్వరలోనే బలహీనపడి విడిపోయారు. 1955 తొలి నాళ్ళలో, రాధ పుట్టక ముందు, జెమినీ ప్రముఖ నటి సావిత్రిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ సంబంధం చట్టబద్ధమే అయింది, ఎందుకంటే, చట్టప్రకారం, 1956 వరకూ హిందూ భర్త, ఒక్క భార్య కన్నా ఎక్కువ భార్యలని కలిగి ఉండే వీలు ఉంది. పైగా, అప్పటికి సావిత్రికి వివాహం కాలేదు కాబట్టి, ఆమె జెమినీ గణేశన్ రెండవ భార్య అయ్యారు. కానీ పుష్పవల్లి అప్పటికే రంగాచారిని వివాహమాడి ఉండడం వల్ల (1956 వరకూ హిందువులకు విడాకులు తీసుకునే అవకాశం లేకపోయింది), మరొకరిని వివాహం చేసుకునే వీలు లేక, తనది రెండో పెళ్ళిగా ఆమె చెప్పుకోలేకపోయారు. పుష్పవల్లి, జెమినీ తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారని కొందరంటారు కానీ నిజానిజాలు తెలియవు.

జెమినీతో విడిపోయాక, ఆమె మరికొన్ని సినిమాలు చేశారు, అయితే అవన్నీ చిన్న చిన్న పాత్రలే. తనకి తెలిసిన దక్షిణాది వారు తీసిన  కొన్ని హిందీ సినిమాల్లోను నటించారు. తనకి డబ్బు అవసరం కాబట్టి చిన్నా చితకా పాత్రల్లోనూ నటించారు. తన పిల్లలను ఒంటిచేత్తో పెంచుకోచ్చారు. రేఖ సినీరంగంలో స్థిరపడపడడం, రాధ గౌరవంగా సయ్యద్ ఉస్మాన్‍ని వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడడటం ఆమెకు తృప్తినిచ్చిన అంశం. 65 ఏళ్ళ వయసులో పుష్పవల్లి 1991లో మరణించారు. ఆమెకు మొత్తం అయిదుగురు పిల్లలున్నారు – జెమినీ గణేషన్‍కి పుట్టిన రేఖ, రాధ కాకుండా – బాబ్జీ అనే కొడుకు, రమ, ధనలక్ష్మి అనే కూతుర్లు ఉన్నారు.

ఆమె కథని ఆమె మాటల్లోనే చదవండి:

“నా మొదటి సినిమా ఆంధ్రా టాకీస్ వారి సంపూర్ణ రామాయణం. అందుకో నేను కళ్యాణ సీతగా నటించాను. నా పాత్ర చిత్రీకరణ మూడు రోజులలో ముగిసింది. నాకు 300 రూపాయలిచ్చారు. చిత్ర నిర్మాతలు మా నాన్నగారి స్నేహితులు. ఆ విధంగా నాకీ సినిమాలో అవకాశం వచ్చింది. కళ్యాణ సీతగా నేను ఒక పాట కూడా పాడాను. అశోకవనంలో కూర్చుని సీత విచారంగా పాడే పాట అది. సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉందేది. సినిమాల్లో నటించేది కూడా మామూలు మనుషులే అని తెలిసినప్పటి నుండీ, నాక్కూడా సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. నా మొదటి రోజు షూటింగ్‍లో నాకే ఇబ్బంది ఎదురవలేదు. నాకెలా చెప్పారో అలాగే చేశాను. షూటింగ్ విరామాలలో నేనో పాట హమ్ చేస్తుంటే విన్న నిర్మాతలు నాతో ఆ పాట పాడించారు. మా వాళ్ళకి సినీ పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. సినిమాల్లో నటిస్తే జనాలు చచ్చిపోతారన్న భయంతో ఉండేవారు. ఈ సినిమాలో నేను నటించిన తర్వాతే, వారికి ఆ భయం పోయింది.

ఇప్పుడు కాస్త మా కుటుంబం గురించి చెబుతాను. నేను కందాళ కుటుంబంలో కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు పెంటపాడు గ్రామంలో పుట్టాను. అమ్మకి నాకన్నా ముందు పిల్లలు పుట్టినా, వాళ్ళు బ్రతకలేదు. వేంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే నేను పుట్టి, బ్రతికాను. అందుకని నా పూర్తి పేరు కందాళ వెంకట పుష్పవల్లి తాయారమ్మ అయింది (నా తర్వాత పుట్టిన చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమాల్లో నటించింది. తను ప్రసిద్ధ దర్శకులు వేదాంతం రాఘవయ్య గారిని పెళ్ళి చేసుకుంది. వాళ్ళ అమ్మాయి నటి శుభ). మా ఊరికి దగ్గరగా అంటే సుమారు రెండు మైళ్ల దూరంలో టూరింగ్ టాకీస్ ఉంది. అక్కడ ఆడే సినిమాల పోస్టర్లు మా బడి బయటి గోడలకి అతికించేవారు. స్కూలు ఇంటి నుంచి రెండు వీధుల అవతల ఉంది. స్కూలుకి వెళ్ళేడప్పుడు, వచ్చేటప్పుడు ఆ పోస్టర్ల కేసి చూస్తూ నిలబడిపోయేదానిని. అప్పుడు నాకు 8 ఏళ్ళు. కన్నమ్మ కోపాన్నీ, సీనియర్ శ్రీరంజని దుఃఖాన్ని, రామతిలకం కృష్ణుడిని దండించడాన్ని ఆ పోస్టర్లపై చూసేదాన్ని.  ఇది రోజూ జరిగే తంతు. బడి బయటే ఉండి కాలం గడిపేదాన్ని తప్ప, లోపలికి వెళ్ళేదాన్ని కాదు… మాస్టర్లు అమ్మానాన్నలకి ఈ విషయం చెప్పేశారు. అమ్మానాన్న కోప్పడలేదు కాని, నాతో మాట్లాడం మానేసారు… ఏమైనా అంటే, ఆఁ, ఊఁ అని మాత్రం అనేవారు. ఒకరోజు గ్రామస్థులంతా వచ్చి “మీ చిట్టిని (నా ముద్దు పేరు) అలా సినిమా పోస్టర్లు చూడడం ఆపకపోతే, తనకి పిచ్చెక్కుతుంది” అని భయపెట్టారు. దాంతో అమ్మకి భయం వేసి నన్ను బాగా కొట్టింది. కాసేపయ్యాకా, నన్ను అంతలా కొట్టినందుకు తన తలని గోడకేసి కొట్టుకుంది. ఆ రాత్రి నిద్రలో మేమిద్దరం ఏడ్చాం.  మర్నాడు ఉదయం “చిట్టీ, నువ్వు పోస్టర్లు చూడడం మానేస్తే, సాయంత్రం నీకు సినిమా చూపిస్తాను” అంది మా అమ్మ. నాకు సంతోషం వేసింది. అప్పటి నుంచి పోస్టర్లు చూడడం మానేశాను. చెప్పినట్టుగానే అమ్మ ఆ సాయంత్రం సినిమా చూపించింది. మర్నాడు బళ్ళో నా స్నేహితులందరికీ ఆ సినిమా కథ చెప్పాను… వాళ్ళకీ సినిమాలంటే ఇష్టం పెరిగింది. డబ్బులున్నా లేకపోయినా, మేం తరచూ టూరింగ్ టాకీస్‌కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. ఒక రోజు డబ్బుల్లేకుండా వెళ్ళాం, గేట్ కీపర్ మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. నేను ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ చుట్టాన్ని అని అతన్ని అరెస్టు చేయిస్తానని బెదిరించి లోపలికి దూరాము. భయంతో అతను మమ్మల్ని వదిలేశాడు. ఆ రోజులు అలా ఉండేవి. మా ఊర్లో అందరూ నన్ను ఆప్యాయంగా చిట్టీ అనేవారు.

దర్శకులు సి. పుల్లయ్య గారూ, పూర్ణమంగయ్య గారూ నా పేరుకి ముందూ వెనకలు కత్తిరించి, ‘పుష్పవల్లి’ అని మార్చారు. నేను ఆ పేరుతోనే ప్రసిద్ధమయ్యాను. సినిమా షూటింగులంటే మా వాళ్ళకున్న భయాలను పోగొట్టడానికి మా నాన్నగారి స్నేహితులు అచ్యుతరామయ్య, నన్నూ అమ్మానాన్నలని ఓ సినిమా షూటింగ్‌కి తీసుకువెళ్ళారు. మా మొదటి షూటింగ్ అనుభవం దుర్గా సినీటోన్ స్టూడియోలో! అక్కడ ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా ఎంతో శ్రద్ధగా చూశాను. మర్నాడు నన్ను నిర్మాత – నువ్వు పాట పాడుతావా అని అడిగారు, ఆ రోజుల్లో ప్లే బ్యాక్ సింగింగ్ లేదు. అంతకుముందు రోజు విన్న ఆ పాటని ఎంతో చక్కగా పాడేసరికి, నిర్మాత ఎంతో సంతోషించారు. ఆ సినిమాకి నన్ను తీసుకుని, నేనో పెద్ద స్టార్‍ని అవుతానని మా వాళ్ళకి చెప్పారు. సి. పుల్లయ్య గారు, పూర్ణమంగయ్య గారు ‘దశావతారములు’ సినిమాకి నన్ను తీసుకున్నారు. అది నా రెండవ సినిమా. తరువాత నేను ‘చల్ మోహనరంగ’లో కథానాయికగా ఎంపికయ్యాను. హీరోగా – ఇప్పుడు సుప్రసిద్ధ ఆర్ట్ డైరక్టర్ – వాలి సుబ్బారావు చేశారు. ఆ తర్వాత ‘మోహినీ భస్మాసుర’కి ఎంపికయ్యాను. అప్పుడు పుల్లయ్యగారు నాతో మూడేళ్ళ పాటు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత వరవిక్రయం, మాలతీ మాధవం చిత్రాలకు ఎంపికయ్యాను. ఈ సినిమాలో నాతో కలిసి భానుమతి నటించింది. ఈ సినిమాలను కలకత్తాలో చిత్రీకరించారు. వరవిక్రయం భానుమతి మొదటి సినిమా (‘నాలో నేను’ అనే తన ఆత్మకథలో – తనలాంటి కొత్తమ్మాయితో పుష్పవల్లి నిష్ఠురంగా నడుచుకుందని భానుమతి వ్రాసుకున్నారు. తాను సబ్బుతో కాకుండా సున్నిపిండితో స్నానం చేస్తానని – పుష్పవల్లి ఏడిపించినట్టు భానుమతి రాశారు).

వేంకటేశ్వరుని అనుగ్రహంతో, నా సినిమాలు  ఒకదాని తర్వాత మరొకటి హిట్ అయ్యాయి. జెమినీ స్టూడియోస్‌లో పర్మెనెంట్ ఆర్టిస్ట్‌ని అయ్యాను. వాళ్ళతో 18 సంవత్సరాలు పని చేశాను. అప్పట్లో నేను నా కెరీర్‍ని సరిగా చూసుకోలేదని చాలామంది అభిమానులు కోపంగా ఉత్తరాలు రాశారు (పుష్పవల్లి జెమినీ స్టూడియోకి చెందిన ఎస్.ఎస్. వాసన్‍కి దగ్గరయ్యారు. కొన్ని తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించారు. కానీ ఆయన, పుష్పవల్లిపై అనాసక్తి ప్రదర్శించి నటి వనజకు దగ్గరయ్యారు. పెళ్ళి చేసుకున్న భర్త వదిలేసారనీ, ఇష్టపడిన వాసన్ దూరం పెడుతున్నారని బాధతో ఓ రోజు మద్రాసు బీచ్‍లో కూర్చుని ఏడుస్తుంటే జెమినీ సంస్థ ఉద్యోగి ఒకరు ఆమెను ఓదార్చారు. ఆయనే గణేశన్. తరువాతి కాలంలో జెమినీ గణేశన్‍గా ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడి రేఖ, రాధ పుట్టారు. రేఖ కన్నా ముందు పుష్పవల్లికి బాబ్జీ అనే కొడుకు ఉన్నాడు. ఈయన మాస్టర్ బాబ్జీ పేరుతో చెంచులక్ష్మి చిత్రం ప్రహ్లాదుడిగాను, భక్త మార్కండేయ చిత్రంలో మార్కండేయునిగాను నటించారు. తరువాత ఈయన ‘లేతమనసులు’ చిత్రంలో ప్రసిద్ధి చెందిన కుట్టి పద్మినిని వివాహం చేసుకున్నారు. ఈయన ఇప్పుడు లేరు, గతించారు. ఇంటిగుట్టు చిత్రం షూటింగ్ సందర్భంగా పుష్పవల్లి స్వరకర్త ప్రకాశ్ గారితో ప్రేమలో పడ్డారు. తరువాత ఆయనతో ఇద్దరు పిలల్ని కన్నారు).

నాకు పెద్ద కళ్ళుండేవి… కానీ కాంచనమాల నా సమకాలీనురాలవడం నా దురదృష్టం. ఆమెవి నా కళ్ళ కన్నా పెద్ద కళ్ళు… అందుకని ఎక్కువమంది నా కళ్ళను గమనించలేకపోయారు. నేను జెమినీ అనే యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ నయ్యాను, కానీ 18 ఏళ్ళు వాళ్ళతో ఉండడం నా సినీ జీవితాన్ని దెబ్బ తీసింది. తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాను, కానీ చక్కని నెల జీతం వస్తుండడంతో దాన్ని పట్టించుకోలేదు. క్రమంగా నాకు తెలుగులోనూ, తమిళంలోనూ ప్రధాన పాత్రలు తగ్గాయి. సహాయక పాత్రలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించాను. నా వ్యక్తిగత జీవితం కూడా చెల్లాచెదురయింది. పిల్లలు నా మీదే ఆధారపడడంతో, నేను సంతానలక్ష్మిని అయ్యాను. వాళ్ళ తిండి కోసం ఏ పాత్ర వచ్చినా చేశాను. మా ఇల్లు గడవడం కోసమే రేఖని నటిని చేశాను… ఇక తరువాయి అంతా చరిత్రే”

ప్రకాశవంతంగా వెలిగి, వేగంగా ఆరిపోయిన సినీజీవితం పుష్పవల్లిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here