[dropcap]రా[/dropcap]జగోపాల్ బండి ఊరి గ్రామకంఠం యందున్న గ్రామదేవత గుడి దగ్గర ఆగింది. ఆయన బండి దిగి గ్రామదేవతకు నమస్కరించి, ఆ తరువాత రచ్చబండ దగ్గరవున్న వంద కిలోల రాతిగుండును, తన రొమ్ములకు ఏ మాత్రం తగలకుండా పైకెత్తి కిందపడేశాడు. అలాగే సాయంత్రం పొలం నుండీ వచ్చేటప్పుడు కూడా గ్రామదేవత దర్శనం, రాయిని పెకెత్తటం ఆయనకు ఒక దినచర్యగా అలవాటైపోయింది.
ఆ వూర్లో రాజగోపాల్‌తో సరిసమానంగా ఈ రాయిని పైకెత్తటంలోగానీ, వ్యాయామం చేయటంలోగానీ వ్యవసాయ పనులు చేసేవాళ్ళను కేవలం వేళ్ళమీద లెక్క వేయవచ్చు. క్రమశిక్షణకు మారుపేరు. పగలు సూర్యుణ్ణి చూసి, రాత్రి చుక్కలు చూసి టైము చెప్పగలడు. గ్రామస్తులంతా ఆయనతో పోటీ పడేవాళ్ళే!
పొలంలో కూడా అంతే! అవి వరి నాట్లయినా, కోతలైనా తోటి కూలీలతో పోటాపోటీగా పనిచేస్తాడు. “పనికి మనం భయపడకూడదురా! ఆ పనే మనల్ని చూసి భయపడాలి” అని చెపుతూ తన కారియర్ లోని కూరలను కూలీలకిచ్చి, వాళ్ళ దగ్గరున్న గోంగూరపచ్చడి, గంజి అన్నంలో ఉల్లిపాయ నంజుకు తింటూ, అమృతంలా ఆరగించే నిరంతర శ్రమజీవి రాజగోపాల్.
రాజగోపాల్ పిల్లలు పై చదువులకు పట్నం వెళ్ళిపోయారు. ఊళ్ళో కుస్తీ పోటీలు, ఎడ్ల పందాలలో ఎంతో ఆసక్తి కలవాడు. ప్రతీ సంవత్సరం తనే గెలుపొందేవాడు. “మీరు ఇలా కుస్తీ పోటీల్లోనూ, ఎడ్ల పందాలలోనూ గెలవటం నాకు ఏ మాత్రం నచ్చలేదు” అంది భార్య వైజయంతి.
“అయినా! నేనేమైనా కాని పనిచేశానా ఏమిటి? మన శరీరానికి వ్యాయామం అవసరమే కదా! అసలు నీ ఉద్దేశం ఏమిటి?” అని అడిగాడు భార్యని.
“కుస్తీ పోటీల వల్ల లాభం ఉందనే చెప్పాలి. కానీ మీ యొక్క కండ బలాన్ని పొలంలో పనిచేయటానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇక ఎండ్ల పందాలు అంటారా! పాపం అవి నోరులేని పశువులు! వాటిని బళ్ళుకట్టి మనమే ఫస్టు రావాలని అమానుషంగా చర్నాకోలాతో బాదటం నిజంగా నన్ను మానసిక క్షోభకు గురిచేసింది. మీకు తెలియదుగానీ, మీరు ఎడ్ల పందాలలో గెలిచిన ప్రతిసారీ నేను ఏడుస్తూనే ఉన్నాను. బహుమతిగా మీరిచ్చిన జోడెడ్ల బొమ్మలను రోజూ చూస్తూ ఉంటే నాకు దుఃఖం ముంచుకొచ్చింది.” భార్య వైజయంతి చెప్పిన మాటలు విని చలించిపోయాడు.
ఔను! మన పంట పొలాలను దున్నేవి ఎద్దులు. ఆపై పండిన ధాన్యపు రాసులను మన ఇంటికి బళ్ళమీద చేర్చేది కూడా ఎద్దుల బండీనే కదా! అని భార్య చెప్పిన మాటలు మననం చేసుకుంటూ అర్ధరాత్రి దాటిన తరువాత నిద్రలోకి జారుకున్నాడు. ఇక నుండీ నేను ఎడ్ల పందాలకు వెళ్ళనని దేవుని మ్రొక్కుకున్నాడు.
పొలం పనులు చేస్తూ బాగా అలసిపోతున్నాడు. ఇలాంటప్పుడు కాస్త మనశ్శాంతి కావాలనుకున్నాడు. తాను చిన్నప్పటి నుండీ నాటకాలు బాగా చూసేవాడు. ఎప్పటికైనా నేను కూడా స్టేజి ఎక్కి నాటకం ఆడి అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవాలనుకునేవాడు. నాటకం వేస్తానని భార్యతో చెప్పాడు. మీరు బాగా నటిస్తారులెండి అంటూ ప్రోత్సహించి, ఇక్కడ కూడా బహుమతులు తీసుకురండి అని చలోక్తి విసిరింది ఆవిడ.
సాయంత్రం అయ్యేసరికి కళాకారులందరూ నాటకం రిహార్సల్స్ కోసం కమ్యూనిటీ హాలుకి చేరుకుంటున్నారు. నాటక రచన, దర్శకత్వ బాధ్యతలు దీక్షితులుగారు చూసుకుంటున్నారు. దేశరాజు ఎన్నో రాగాలు తెలిసిన గొప్ప హార్మోనిస్టు కావటం ఇంకొక విశేషం. ఇక అదిరిపోయే తబలా వాయించే తంజావూరు తంబి. అతను తబలా వాయించాడంటే అది ఏ ప్రోగ్రామైనా సరే ఘనవిజయమే అని చెప్పవచ్చు.
సహజంగానే ఆజానుబాహుడైన రాజగోపాల్ ఒక కళాకారుడిగా వేగంగా రూపాంతరం చెందాడు. దుర్యోధనునిగా, కీచకునిగా, రావణాసురునిగా అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ నాటకాలలోనే అతనికి మాలతీప్రియ పరిచయమైయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిచ్చారు. మాలతీప్రియతో తరచుగా నాటకాలు వేయటంతో ఆమె అభిమానానికి కూడా చాలా దగ్గరైపోయాడు. వీరిద్దరి నటనా సహజంగా ఉండటంతో ఇతర గ్రామాలలో, పట్టణాలలో కూడా ప్రోగ్రాములకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఒక ప్రక్క వ్యవసాయపనులు, ఇంకొక ప్రక్క నాటకాల హడావిడి, వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. చేను కోసం ఎరువులు కొనటం, పురుగుమందులు కొట్టడం లాంటి పనులతో సతమతమైపోతున్నాడు. అంతేకాకుండా ఎదిగిన అమ్మాయికి పెళ్ళి చేయటానికి కొంత పొలాన్ని కూడా తప్పనిసరి పరిస్థితిలో అమ్మేశాడు. పోనిలే అబ్బాయి చదువైన తరువాత తనకు ఇన్ని సమస్యలు ఉండవులే! అని సరిపెట్టుకున్నాడు.
ఈ మధ్యలో అకాలవర్షాలు, వడగళ్ళ వానలు ముంచెత్తటంతో కోతదశలో వున్న వరిపంట కాస్తా తడిసిపోయి పాడైపోయింది. ఫలసాయం చేతికి వచ్చేసరికి ప్రకృతి విలయతాండవానికి గురైపోతున్నారు రైతులు. అయినా తన ఆత్మస్టైర్యంతో ముందుకు సాగిపోతున్నాడు రాజగోపాల్.
అంతేకాదు, స్నేహితులకూ, ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటాడు. ముఖ్యంగా జంగమదేవర్లు, యక్షగాన, పగటి వేషకళాకారులు, గంగిరెద్దులు వాళ్ళు సరాసరి పొలంలోగల కళ్ళం దగ్గరకే వచ్చి వారివారి కళలను ప్రదర్శించేవారు. వారందరికీ అంతో ఇంతో సహాయం చేస్తూనే ఉన్నాడు. పుట్టెడు కష్టాల్లో వున్నా, తనది ఇచ్చే చెయ్యేగాని, తీటసుకునే చెయ్యికాదని గర్వంగా చెప్పేవాడు. అలాగే వడ్డీలేకుండా అప్పులిచ్చేవాడు.
అందుకేనేమో వారందరి దీవెనలతోపాటు, ఆ సంవత్సరం వరుణదేవుడు కూడా కరుణించాడు. సకాలవానలతో రాజగోపాల్ పొలం రెండింతల ధాన్యమిచ్చింది. ఇది ధాన్యలక్ష్మి కటాక్షమని శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నారు. మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవటంతో రాజగోపాల్ నాటకకళకు అంకితమై మాలతీప్రియకు చాలా దగ్గరైపోయాడు.
అది గ్రహించిన బావమరిది యుగంధర్ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టాడు. బావమరిది చెప్పిన సలహా చాలా బాగుంది. ఇప్పుడు పొలం పనులన్నీ బావమరిదే స్వయంగా చూసుకుంటున్నాడు. జమాఖర్చులన్నీ ఏమాత్రం తేడా లేకుండా బావకు అప్పగించటంతో, బావమరిది మీద అతనికి బాగా నమ్మకం కుదిరింది.
అలాంటి నమ్మకమే రాజగోపాల్‌ని నిలువునా నట్టేట ముంచేసింది. అసలు పొలానికి వెళ్ళకుండానే కూలీలను పెట్టి పనిచేయించినట్లు వాళ్ళకు డబ్బులిచ్చినట్లు పద్దు కింద పద్దు రాసి దొంగ లెక్కలు చూపించసాగాడు బావమరిది యుగంధర్.
రాను రాను పెట్టుబడి ఎక్కువైపోయ్యింది. రాబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతటితో ఆగాడా బావమరిది! పొలంలో వున్న చెట్లను సైతం అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. కొన్ని వంటచెరకై పోయాయి, మరికొన్ని చక్కసామాన్లలకు బలైపోయాయి. పాపం కష్టపడి పెంచుకున్న చెట్లూ, వృక్షాలూ. ఇంకా నయం జోడెడ్లనూ, బండీని కూడా అమ్మలేదు, అని భార్యతో చెప్పుకొని కుమిలి కుమిలి ఏడ్వసాగాడు రాజగోపాల్. భార్య ఓదార్చింది.
కొడుకు డిగ్రీ పూర్తి చేశాడు. “నాన్నా, నేను పై చదువులకొరకు ఆస్ట్రేలియా వెళ్ళాలి, వెంటనే నాకు నాలుగులక్షలు కావాలి” అని మొరాయించాడు కొడుకు. దేవుడా! ఇప్పుడు నేనేం చేసేది. వీడిని డిగ్రీవరకూ చదివిస్తే నాకు చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్నాను. మన దేశంలోనే చదువుకోని ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చుగా! ఇతర దేశాలు వెళ్ళాటం అవసరమా! రాజగోపాల్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది.
ఆ సమయంలో భార్య వైజయంతి ఇచ్చిన చేయూత వర్ణనాతీతం. ఆవిడకు నగలు, పట్టుచీరల కోసం ఇచ్చిన డబ్బు, ఇంకా ఆవిడ దాచుకున్న డబ్బు అంతా కలిపి ఇచ్చింది. కొడుకును పై చదువులకై ఆస్ట్రేలియా పంపించారు.
“హమ్మయ్యా! ఇక నా వ్యవసాయం నేనే హాయిగా చేసుకుంటాను” అని రోజూ మామూలుగా పొలం పనులు చేసుకుటున్నాడు రాజగోపాల్. వరుసగా రెండు సంవత్సరాలు ప్రకృతి కన్నెర్ర చేసింది. వర్షాలు అంతంత మాత్రంగానే పడ్డాయి. దిగుబడి చాలా తగ్గిపోయింది.
చివరికి మార్వాడీ మదన్‌లాల్ దగ్గర అప్పు చేయక తప్పలేదు. అయినా ఎంత డబ్బు అప్పు తీసుకొచ్చినా అది కేవలం గంటల్లోనే హారతి కర్పూరంలా కరిగిపోతోంది. అదే సమయంలో ‘నాటకాలపోటీ’ ప్రకటన రాజగోపాల్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
నాటక పోటీల్లో ‘ఉత్తమ నటుడి’గా ఐదువేల రూపాయలు బహుమతి గెల్చుకున్నాడు. ఏదో సరదాకని వేసుకునే నాటకాలు ఇంత డబ్బునిస్తాయని కలలో కూడా ఊహించలేదు.
వచ్చిన బహుమతి డబ్బు ఎద్దుల గ్రాసానికే సరిపోయింది. మరి ఇల్లు ఎలా గడవాలి? ఇంకొక కూతురి చదువు పూర్తి అవ్వాలి, పెళ్ళి చేయాలి. దేవుడా! రైతులకిన్ని కష్టాలు ఎందుకిచ్చావయ్యా? అని గ్రామదేవతను ప్రార్థించాడు. అలా ప్రార్థించగానే ఇలా ప్రత్యక్షమయ్యాడు మార్వాడీ మదన్‌లాల్.
“చూడండి రాజగోపాల్ గారూ! మీరు చాలా మంచివారు, ఉత్తములు. బాగా కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు. అలాగే దానధర్మాలు కూడా విరివిగా చేసినవాళ్ళు. వీటన్నిటికీ మించి తీరు నిజాయితీపరులు కూడా. ఇన్ని సద్గుణాలున్నా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడలేకపోయింది. మీరు చేసిన దానధర్మాలు మిమ్మల్ని సమయానికి ఆదుకోలేకపోయాయి. అంటే మీకు గుస్సా వస్తుంది కానీ, మనం బాగా డబ్బు సంపాదించుకున్నప్పుడే భవిష్యత్ కోసం పొదుపు చేసుకోవాలి. ఆ పని మీరు చేయలేకపోయారు.
ఏది ఏమైనా ఇప్పుడు మీ దగ్గర జోడెడ్లు, బండీ, నాగలి మాత్రమే మిగిలాయి. వాటిని అమ్మేయండి కనీసం ఇల్లు గడుస్తుంది. లేదంటారా ఏదైనా బంగారు ఆభరణం ఇస్తే దానిని నా దగ్గర తాకట్టు పెట్టుకొని, కొంత పైకం అప్పుగా ఇస్తాను, మీకు సమ్మతమేనా?” అని మార్వాడీ మదన్ లాల్ చెప్పగానే అగ్గిమీద గుగ్గిలంలా మండిపోయాడు రాజగోపాల్.
కళ్ళు ఎర్రబడ్డాయి. కోపాన్ని నిగ్రహించుకోవాలన్నా అది సాధ్యం కావటం లేదు. “మదన్‌లాల్! నువ్వు ఇంకొక్క క్షణం ఇక్కడున్నావంటే నిన్ను డోలు వాయించేస్తాను. ఇక్కడనుండి వెళ్ళిపో! నువ్విచ్చే అక్రమ సంపాదన నాక్కరలేదు. నీ దిక్కుమాలిన సలహాలు అంతకన్నా అక్కర్లేదు” అని రుద్రుడయ్యేసరికి, తోకముడిచి మెల్లంగా జారుకున్నాడు మార్వాడీ మదన్‌లాల్.
మనసు బాగోక మాలతీప్రియ ఇంటికి చేరుకున్నాడు. మాలతీప్రియ పరమభక్తురాలు. రామాయణ, మహాభారత పఠనం చేస్తూ ఉంటుంది. మనశ్శాంతి కోసం మౌనదీక్ష చేసేది. ఇప్పుడు ఆత్మీయుడైన రాజగోపాల్ రాకతో ఆమెకు నూతన ఉత్సాహాన్నిచ్చింది. ఆమని కుసుమ పరాగాలు పరిమళాలతో వెదజల్లుతున్నాయి. వెన్నెల అమృతమై వర్షిస్తోంది.
“రాజగోపాల్ రాసలీలలు” అంటూ ఊరంతా అమ్మలక్కల ప్రచారం జోరుగా సాగుతోంది. కాని దానికి ఏమాత్రం చలించలేదు రాజగోపాల్. ఇది కాకుల లోకం ఇలాగే ఉంటుంది దీని నైజం, అని ముందుకు సాగిపోతున్నాడు.
ఇప్పుడు ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు నెలకు పదివేలు ఇస్తారంట. అదే కిసాన్ సహారా, రైతుబంధు పథకాలట. కానీ వాటికోసం అధికారులకు లంచం ఇవ్వాలని మళ్ళీ రంగంలోకి దిగాడు మదన్‌లాల్. నా ప్రాణం పోయినా నేను ఒక్క పైసా కూడా లంచం ఇవ్వనంటే ఇవ్వను. నాకు డబ్బు వస్తేరాని, లేకపోతే లేదని ఖరాఖండీగా చెప్పేశాడు రాజగోపాల్.
అధికారికి లంచం ఇచ్చి రాజగోపాల్ పొలానికి ఆర్థిక సహాయం చేయమని వేడుకుంది మాలతీప్రియ. “నువ్వు నా సొంతమైతే ఇక లంచమెందుకు?” అని ఆమెను పశువులా అనుభవించాడు అధికారి. రాజ్‌గోపాల్‌కి ఉపయోగపడగలుగుతున్నందుకు ఆమెకు చాలా తృప్తిగా ఉంది. ఆ తరువాత ఆమె ఎవరికీ కనిపించకుండా ఊరు వదిలి వెళ్ళిపోయింది.
కాలం తాత్కాలికంగా గతి తప్పినా మళ్ళీ తమాయించుకుంటుంది ప్రకృతి. ఈనాడు రైతులకి గిట్టుబాటు ధర లభిస్తోంది. కల్తీ విత్తనాలు నశించాయి. మార్కెట్లో ఎరువులు విరివిగా దొరుకుతున్నాయి. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలూ కరెంట్ లభిస్తోంది. ప్రభుత్వాల సమర్థవంతమైన పాలనవల్ల రైతుల కష్టాలు అంతరించిపోయాయి.
ధాన్యరాసులతో మళ్లీ రాజగోపాల్ కళ్ళం కళకళలాడుతోంది.