[dropcap]యు[/dropcap]వత ఇష్టపడే, వాడే మాదకద్రవ్యాలలో ఆల్కహాల్ మొట్టమొదటిది.
అన్ని శరీరభాగాలను ప్రభావితం చేస్తుంది, శరీరము, మనసు సహజంగా పని చేసే తీరును మార్చివేస్తుంది.
చిన్నపిల్లల్లో ఊహ, కుతూహలం రెండూ ఎక్కువే. వాళ్లకి మనం ఏది చెప్పినా అర్థమయ్యేలా, అర్థమయ్యేదాకా చెప్పటం మంచిది. లేదా ఏదైనా వివరం తెలియనప్పుడు ఆ ఖాళీలన్నీ తమకు తోచిన ఊహలతో పూరించుకుంటారు. నిపుణులు పిల్లలను ‘స్పాంజ్ ముక్కలు’ అంటారు. స్పాంజ్ ఎలాగైతే తడిని పీల్చివేస్తుందో, పెద్దలు చెప్పినవన్నీ పిల్లలు వాస్తవాలుగా గ్రహిస్తారు. పెద్దవాళ్ళు చెప్పేవీ, చేసేవీ, ఈ రెంటి ఆధారంతో పిల్లలు తమ అభిప్రాయాలను ఏర్పరచుకుని, అలవాట్లకు పునాదులు వేసుకుంటారు. కాబట్టి పసితనమంతా పెద్దవాళ్ళ ప్రతిబింబాలుగా పిల్లలు పెరుగుతారు. బడికి వెళ్ళటం మొదలు పెట్టగానే ‘సహవాస ప్రభావం’ ప్రారంభమౌతుంది. అందుకే పిల్లల స్నేహితుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించీ పెద్దలు తెలుసుకోవాలి.
తాగుడు, సిగరెట్ వంటి వాటి వాడకం తప్పని ఖండిస్తూ, ‘ఎందుకు తప్పో’ పిల్లలకు అర్థమయ్యే మాటలలో చెప్పుకురావాలి. అవి కలిగించే శారీరక హాని, వాటి వల్ల వాటిల్లే ఇతర ప్రమాదాల గురించి నెమ్మదిగా చెప్పాలి. పిల్లలు అడిగే విషయాలకు జవాబు తెలియనప్పుడు అదే వారితో నిజాయితీగా చెప్పాలి. స్కూల్‌కి వెళ్ళే వయసులో పిల్లలకు ఎన్నో విషయాలకు సంబంధించిన వివరాలు మీద ఆసక్తి మెండుగా ఉంటుంది. ఆహార పదార్థాలు, మందులూ, విషాలు, మాదకద్రవ్యాలు, వీటి గురించిన మంచీ-చెడూ రెండూ వారికి తెలియజెప్పటం క్షేమం. డాక్టర్ ఇచ్చే మందుల వల్ల మంచి ఎలా జరుగుతుంది, దుర్వినియోగం వల్ల ప్రమాదం ఎలా వాటిల్లుతుంది, ఇలాంటి వంటివన్నీ చెప్పాలన్న మాట.
వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు వేసే చొరవ ఎల్లప్పుడూ కలిగి ఉండేటట్లు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పిల్లలు బయట తిరగటం మొదలుపెట్టే వయసులో (పెద్దలు లేకుండా) వాళ్ళతో చాలా ఖచ్చితమైన ఒప్పందం కలిగి ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రుల ప్రవర్తన, వారి మాట ఎంతో ఖచ్చితమని పిల్లలు గ్రహించేలా వ్యవహరించవలసిన బాధ్యత పెద్దలదే! పిల్లలకు చెప్పేదే పెద్దలు ఆచరించి చూపాలి. రెంటిలో తేడా ఉంటే పిల్లలు యిట్టే గ్రహించి తాము కూడా ద్వంద్వ ప్రవృత్తి అలవాటు చేసుకుంటారు. ఏ సమయానికి ఇంటికి తిరిగి రావాలి, రాకపోతే ఏం జరుగుతుంది – ఇలాంటివన్నీ పెద్దలు ముందు నుంచే ఒక ఒప్పందం ప్రకారం వ్యవహరించాలి. పిల్లలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉపేక్షించకూడదు. ఆ పరిణామాలను పిల్లలను అనుభవించనివ్వాలి. ‘పోనీలే’ అని ఊరుకోరాదు. తమ పిల్లలు తమను ‘లోకువ’ కట్టకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత పెద్దలదే!
అలాగని ‘పెద్దరికం’ అనే భూతం ఆవహించినట్లు తల్లిదండ్రులు ప్రవర్తించకూడదు. ఏ అవసరం కలిగినా అమ్మా-నాన్నా ఉన్నారనే ధైర్యం పిల్లలకు అన్నివేళలా ఉండాలి. ఏదైనా ఒత్తిడి కలిగితే చెప్పుకునేందుకు, గైడెన్స్ తీసుకునేందుకు ఇంటికి వెళ్ళచ్చు అనే నమ్మకం పిల్లలలో ఉండాలి. సిగరెట్, తాగుడు, డ్రగ్స్ వంటి వాటి వల్ల లేత శరీరాలకు, మెదడుకు, జరిగే హాని, ఆ అలవాట్లు ఎలా ‘అవసరాలుగా’ మారతాయో, అవి కలిగించే దుష్పరిణామాలు, పదకొండు, పన్నెండేళ్ళ లోపలే పిల్లలకు తెలియజెప్పటం మంచిది. సినిమా, టీవీ, ప్రకటనలలో చూపినట్లుగా విలాసవంతమైన అలవాట్లు కానే కావని, అత్యంత ప్రమాదకరమైనవనే విషయం అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకురావాలి.
పిల్లలు ఎక్కడ, ఎవరితో తిరుగుతున్నారో ఇంట్లో తెలిసి ఉండాలి. ‘మా పెద్దవాళ్ళకు ఇది నచ్చదు, వాళ్లకు ఇష్టముండదు’ అనే భయం, జాగ్రత్త పిల్లల్లో ఎప్పుడూ ఉండాలి. నియమాలు ఏర్పరచినప్పుడు అవి ఆమోదయోగ్యంగా ఉండి, పిల్లల నుండి మీరు ఆశిస్తున్న ప్రవర్తన ‘ఇలా ఉండాలి’ అని వాళ్లకు స్పష్టంగా తెలియాలి. ఏ సందేహం, చికాకు కలిగినా పిల్లలు పెద్దవాళ్ళను ఆశ్రయించే చనువు కలిగి ఉండాలి.
పదహారు దాటుతున్న యువకులలో ఎదిరించే ధోరణి చూస్తూంటాము. వాళ్ళు తమదైన వ్యక్తిత్వాన్ని సంతరించుకునే సమయం కాబట్టి ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగా చేసి చూపిద్దామనే తిరుగుబాటు మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ నాజూకైన సమయంలో ప్రోత్సాహం, ఆరోగ్యకరమైన మెప్పు వారికి పుష్కలంగా అందిస్తూ, ఏ కాస్త మంచి కనబడినా హర్షిస్తూ, మంచి దారికి తెచ్చుకోవాలి. అలా అని పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యటానికి జంకకూడదు.
పిల్లల విషయమై కొన్ని మెళకువలు
- పిల్లలకు వాళ్ళ వయసుకు అర్థమయ్యే మాటలలో మాదకద్రవ్యాల గురించి చెప్పండి.
- మీరు చెప్పేవి సూటిగా, వెంటనే అర్థమయ్యేటంత సరళంగా ఉండేట్టు చూసుకోండి.
- మీరు చెప్పదలచుకొన్నది సావకాశంగా, విశ్రాంతిగా ఉన్నప్పుడు చెప్పటం మంచిది. అరుపులు,తగాదాల మధ్య చెప్పేవి ఎంత మంచి మాటలైనా తలకెక్కవు.
- పిల్లలకు ప్రశ్నలు వెయ్యటం ఇష్టమే కాదు,అవసరం కూడా. విని జవాబివ్వటానికి సంసిద్ధులై ఉండండి.
- ‘లెక్చర్లు/క్లాసు పీకటం’ కంటే పిల్లలు తల్లిదండ్రులతో ‘సంభాషణ’ ఎక్కువగా ఇష్టపడతారని గుర్తుంచుకోండి.
- ముఖ్యమైన జాగ్రత్తలు, విషయాలు, మీకు, పిల్లలకు ‘బోర్’ అనిపించినా పదే పదే చెప్పండి.
- నైతిక విలువలు, ఉద్వేగాలు మీ సంభాషణల్లో సులభమైన మాటలలో చోటు చేసుకునేటట్లు చూసి,పిల్లలు ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేలా దోహదం చెయ్యండి.
- ప్రకటనలలో చూపే ఆధునిక గ్లామర్ (సిగరెట్, మద్యం) కలగలసిన జీవనవిధానాలు (లైఫ్ స్టైల్స్) తప్పుదారి పట్టించేవని వివరించి, అబద్ధాన్ని- నిజాన్ని వేరు చేసే తెలివిని వారిలో ప్రేరేపించండి.
చివరగా, పిల్లలలో ఆత్మ విశ్వాసాన్ని కలిగించి, దాని ఆధారంతో వారు ఒంటరిగానైనా(మీ సాయం లేకుండా) సుస్థిరంగా నిలబడేలా వారి పెరుగుదలను దోహదపరచండి. ఇలా పెంచటంలోనే బాధ్యతతో కూడిన మీ ప్రేమను వారి పట్ల సార్థకం చేసిన వారౌతారు.
Image Courtesy: Internet