నా బాల్యం కతలు-5

0
3

[box type=’note’ fontsize=’16’] ‘నా బాల్యం కతలు’ అంటూ తన చిన్ననాటి ముచ్చట్లను అందిస్తున్నారు జిల్లేళ్ళ బాలాజీ. [/box]

5. చేంతాడుతో ఈత – ఎదురుదబ్బతో వాత

[dropcap]పి[/dropcap]లకాయలకి ఒఠి సదువే కాదు, పెద్దలంటే బయ్యిం బక్తీ, మట్టూ మర్యేదా… ఈటితోపాటు ఈత కూడా తెలిసుండాలని మా ప్రవేటు అయ్యోరి అభిప్రాయం. అందుకే ఆయిన… ప్రవేటు పిలకాయలకు ఈత నేర్పించాలనుకున్నాడు.

గిరింపేటకు దగ్గరగా గొడుగుమూరు అనే ఒక ఊరుండాది. దానికి సుట్టుపక్కల చానా పంట పొలాలుండాయి. ఆడ సిన్నప్పరెడ్డి బాయి అని, ఒక పెద్ద బాయి ఉండాది. ఆ బాయి దెగ్గిరికి అయ్యర్ క్లాసులు (8,9,10 తరగతులు) సదివే పిలకాయిలను ఆదోరం ఆదోరం ఈత నేర్పించేందుకు తీసకపోతున్నాడు మా సైదా అయ్యోరు.

సిన్నపిలకాయిల్ని మాత్రం తీసకపోడు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవురు బాద్ధులు. అదీ ఆయిన బయ్యిం.

సిన్నప్పరెడ్డి బాయి చానా పెద్దది. పొలాల మద్దెలో ఉండాది ఆ బాయి. ఎప్పుడూ ఆ బాయి నిండుగా నీళ్లుంటాయి. ఈత నేర్చుకునేవోళ్లకి అదే అనువైన బాయి. పదో తరగతి సదివే మొగపిలకాయల్లో నలుగురైదుగురికి బాగానే ఈతొచ్చు. మిగతా వోళ్లకి రాదు. వాళ్లను ఆ ఆదోరం బాయి కాడికి తీసకపోయినాడు అయ్యోరు.

మొగపిలకాయలతో పాటు ఆడపిలకాయల్ని కూడా తీసకపోయినాడు.

ఈత నేర్పించేటందుకు అనువుగా కతాయి తుండ్లు, లారీ టూబులు, చేంతాళ్లు ఎంట తీసకపోయినారు.

బాగా ఈతొచ్చినోళ్లు బాయి పైనుండి నీళ్లల్లోకి జంపింగ్ జేసి ఈదులాడతా ఉండారు. కొందరు బయ్యస్తుల నడుముకు కతాయి తుండ్లు కట్టి నీళ్లల్లోకి దింపినారు. వాళ్లకు ఈతొచ్చిన పిలకాయలు ఈత నేర్పిస్తాండారు. కొంచీం ధైర్నం ఉండే పిలకాయల నడుముకు చేంతాడును కట్టి దాని కొనాను గట్టుమీద ఉండే అయ్యోరు పట్టుకోనుంటే, వాళ్లు బాయిలో ఈత నేర్సుకుంటారు. వాళ్లు మునిగిపోతారనిపిస్తే పైన గట్టుమీదుండే అయ్యోరు చేంతాడును సరసరమని పైకిలాగేస్తాడు. వాళ్లు పైకి తేలి ఊపిరి పీల్చుకుని, కొంచిం సుదారించుకుని ఒడ్డుకు వొచ్చేస్తారు.

ఇట్టా చానా కాలంగా ఈతరాని పిలకాయిలకు ఈత నేర్పిస్తా ఉండాడు మా సైదా అయ్యోరు.

నేను ఎనిమిదో క్లాసుకు వొచ్చినా బాయి కాడకు మాత్రం పొయ్యింది లేదు. ఎందుకంటే, నాకు నీళ్లంటే చానా బయ్యిం! అందుకనీ నేను మా క్లాసు పిలకాయలతో కలిసి ఈతకు పోకుండా, అయ్యోరు కంటబడకుండా తప్పించుకోని తిరగతా ఉండా. ఒక ఆదోరం తెల్లార్తో… పిలకాయిలు ఈతకు బయలుదేరినారు. ఎప్పుడూ తప్పించుకునే నేను, ఈసారీ తప్పించుకునే ఆలోసన్లోనే ఉండా. అప్పటిదాకా నేను బాయి దగ్గరికే రాలేదని ఎవురో అయ్యోరుకు చెప్పేసినారు. దాంతో అయ్యోరికి కోపమొచ్చి నన్ను పిలిపించి బాయికాడికి బయలుదేరమని ఆడ్డరేసినాడు. దాంతో తప్పించుకునే సాన్స్ లేకపాయె.

అయినా తలొంచుకుని… “నేను రాను సార్.” అన్నాను మెల్లింగా..

“ఎందుకు రావురా?” అని అడిగినాడు అయ్యోరు. “నాకు నీళ్లంటే బయ్యిం సార్….” అన్నాను అదరతా.

“అది పోవాలనే కదరా ఈత నేర్పిస్తాండేది.” “వొద్దు సార్, నాకు బయ్యిం…” అన్నాను మళ్లీ మొండిగా.

“పద వాయ్, బయ్యమంటే ఎట్టా? మొదట్లో బయ్యంగానే ఉంటాది. ఈత వొచ్చిందంటే బయ్యం గియ్యం అంతా మటాష్ అయిపోతింది. నువ్వు బాయికాడికి రావాల్సిందే, నోర్మూసుకోని పద!” అన్నాక, ఏం జెప్పాల్నో తెలీక నీళ్లు నమిల్తిని.

వేనుగోపాల్, రాజేంద్ర, తొలసి, జి.డి. గోపీ… ఇట్టా నా క్లాసు పిలకాయలంతా పెద్దబాయి కాడికి పోతావుంటే నేనూ బయ్యిం బయ్యింగానే ఎలబార్తిని.

పెద్దబాయి కాడికి పోంగానే కొందరు ఈతొచ్చిన మొగపిలకాయిలు సరసరమంటా గుడ్డలిప్పేసి… పైన్నుండి బాయిలోకి దభీదభీమని ఎగిరి దూకినారు. నేను బయ్యిం బయ్యింగా బాయిలోకి తొంగిచూస్తిని. దూకినోళ్లు నీళ్ల లోపలికి నిలవనా మునిగిపోయి, కొంచేపయినాక బుడుంగున నీళ్లపైకి తేలి నోట్లో నుండి నీళ్లను తుపుక్కుమని ఊస్తా, రెండు సేతలో నీళ్లను పక్కకు తోస్తా ఈదులాడ్డం మొదలు పెట్టినారు.

కొందరు ఆడపిలకాయిలు నడుముకు కతాయి తుండ్లు కట్టుకోని మెట్ల మీద నుండి బాయిలోకి దిగి మెల్లింగా ఈతకొడతా ఉండారు. ఒకరిద్దరు మొగపిలకాయిలు నడుముకు చేంతాడు కట్టుకుని ఈతకొడతా ఉండారు. మరికొందురు లారీ టూబులు నడుముకు తగిలించుకోని నీళ్లలోకి దిగేసుండారు.

నా క్లాస్‌మేట్లు మీరా, కాంచన, సుమతి, సరోజ ఇంకా ఏరే క్లాసులోని కొందురు ఆడపిలకాయిలు ఎప్పుడు ఈత నేర్చుకున్నారో ఏమో, బాయిలో ఆయిగా ఈతకొడతా ఉండారు. వాళ్లను జూసి నాకు ఆచ్చర్యమేసింది. సిగ్గుగా కూడా అనిపించింది. ఆడపిలకాయిలు ఈతకొడతా ఉండారు. నాకు రాదు. థూ, ఏం పుటక నాది? వాళ్లను చూసేకొందికి నాకు అగుమానంగా కూడా అనిపించింది. కానీ బాయిలోని నీళ్లను చూసేకొందికి గుండెల్లో బయ్యిం కూడా రొండింతలైతాంది.

కొంచేపు ఈదులాడి గట్టుమీదికొచ్చిన పిలకాయిల నుండి కొందరు పైనుండేవోళ్లు కతాయి తుండ్లు తీసుకుని, తమ నడుముకి కట్టుకుని నీళ్లలోకి దిగతా ఉండారు. నేను మాత్రం దూరం దూరంగానే సైగ్గా ఉండిపోతిని.

“వొరే బాలా… నువ్వేమిటికిరా ఇంకా గుడ్డలిప్పకుండా అట్నే నిలబడుకో నుండావు?” అన్నేడు వేనుగోపాల్, అయ్యోరుకు ఇనబడే విధంగా. వీడొకడు నా ప్రానానికి యముడులాగా దాపరించినాడని వాణ్ణి మణుసులోనే తిట్టుకుంటా… “నాకు బాయిలోకి దిగేందుకు బయ్యింగా ఉండాది సార్.” అన్నాను వొణకతా అయ్యోరుతో..

“పోరా, అదురు నాయాలా! బయ్యిం లేదు గియ్యం లేదు… ముందు ఇప్పరా గుడ్డల్ని.” అన్నాడు వాడు మళ్లా. ఇంక తప్పదనుకుని నిక్కరును అట్నే ఉంచుకుని, సొక్కాయిని మాత్రం ఇప్పి ఒక పక్కన ఉడ్డగా పెడ్తిని. “ఇట్రారా…” అంటా నన్ను దగ్గరగా పిలిచి, నా నడుముకు చేంతాడు కట్టబోయినాడు వాడు. “రేయ్, నాకు చేంతాడొద్దురా. కతాయి తుండుయ్యి కట్టుకుంటాను.” అన్నాను నాలోని అదురును కనబడనీయకుండా.

“కతాయి తుండును కట్టుకునేది ఆడపిలకాయిలు రా. నువ్వు చేంతాడునే కట్టుకుని బాయిలోకి దూకాల్రా…” అన్నాడు వాడు. “వొద్దు సార్. నేను దూకను సార్… మెట్లకాడ నుండి మెల్లింగా నీళ్లలోకి దిగతాను సార్…” అన్నాను.

“వొరేయ్, అంత దూరం ఈ చేంతాడు సాలదు రా… ఈణ్ణించే దూకరా, ఏమీకాదు. నేనుండాను కదా” అన్నాడు అయ్యోరు. ‘మీరుంటారు సార్, నేనుండొద్దా…’ అని మణుసులో అనుకుని “వొద్దు సార్” అన్నాను మళ్లా బయ్యిం బయ్యింగా.

“బాయిలోకి దూకరా అంటే కతలు చెప్తా ఉండాడు. ఎందుకు రా అట్టా అదురుకోని సస్తాండావు. అటుపక్క సూడ్రా మన గేల్స్ ఎంత బాగా ఈదలాడతా ఉండారో.” అంటా నన్ను ఉన్నపళంగా బాయిలోకి తోసేసినాడు వేణుగోపాల్.

ఆ పడటం పడటం నీళ్లల్లో మునిగిపోయి నీళ్లు బాగా మింగేసినాను. సెవల్లో, కండ్లల్లో, ముక్కల్లో నీళ్లు దూరిపోయి నాకు ఊపిరాడకుండా అయిపోయింది. అంతే! బిత్తరకపోయి గెట్టిగా “సార్ నన్ను పైకి లాగేయండి సార్…” అని అరస్తా చేతులు పైకిలేపి ఊపసాగినాను. ఇంతలో నా జుట్టు పట్టుకుని నన్ను ఒడ్డుకు ఈడుకొచ్చింది ఎవురివో రెండు చేతులు.

బిత్తరకపోయి బాయి మెట్టు పట్టుకుని గసపోస్తా నిలబడ్డాను నేను.

మెల్లింగా పైమెట్టుమీదికెక్కి చూస్తును కదా… కాంచన నన్ను చూసి కిసుక్కున నవ్వి నీళ్లల్లో ఈదుకుంటాపోయింది. అంటే, నన్ను జుట్టు పట్టుకొని ఈడ్సి ఒడ్డున పడేసింది కాంచన అన్నమాట. కతాయి తుండు కట్టుకోని కిలకిల నవ్వతా ఈదులాడతా ఉండాది కాంచన.

అప్పుడు పుట్టింది నాకు సిగ్గు. ఒక ఆడపిల్ల ధైర్నంగా బాయిలో ఈదులాడతా ఉంది. నేను అదురుపుట్టి ఒడ్డెక్కేస్తిని. ఏమి చెప్పుదును నా ఈ అదురును. ఈ అదురుతోనే కదా నేను ఈ రోజుటివరకూ బాయిలోకి దిగంది.

కానీ, కాంచనను చూసేకొందికి ఎట్టయినా నాక్కూడా ఈత నేర్సుకోవాలని పంతం పెరిగింది. బాగా ఆలోచిస్తిని.

ఇంకో ఆదోరం నేనూ… ఇంకో ఇద్దరు జతగాళ్లు కలుసుకుని, ఒక చేంతాడును సంపాయించి రామిరెడ్డి మామిడితోపులో ఉండే ఇంకో దిగుడుబాయి కాడికి పోతిమి.

మేము ముగ్గురుమూ మార్చి మార్చి నడుముకు చేంతాడును కట్టుకోని బాయిలోకి దిగి చేతులు కాళ్లు ఆడిస్తా… ఈత నేర్సుకునేటందుకు ప్రియత్నిస్తిమి. అట్టా రొండు గంటలు పైన్నే బాయికాడ్నే గడిపేస్తిమి.

ఇంటికాడికొచ్చేకొందికే ఈ ఇసయం మా నాయినకు ఎట్నో తెల్సిపోయుండాది. ఎదురు బెత్తం పట్టుకోని నా కోసరం పోతురాజు మాదిరిగా ఎదురుచూస్తా ఉండాడు. నన్ను ఎగాదిగా చూసి….”ఇంతసేపూ ఎక్కడికి పోయినావు రా?” అని అడిగె. అబద్దం జెప్పకూడదనుకుని “బాయి కాడికి. ఈత నేర్సు…” నా మాటలు పూర్తికాక మునుపే నా ఈపు ఇమానం మోగించేసినాడు. “ఎదవ నాయాలా, మీలో ఒక్కడికైనా ఈతొచ్చునారా? ఏదైనా జరగరానిది జరిగుంటే ముగ్గురూ సచ్చుండే వాళ్లు కదరా.” అని మళ్లీ నా ఒంటిమీద వాతలు పడేలా ఇంకో రెండు పీకినాడు.

మర్నాడు… “వొరేయ్, మా నాయిన కొట్టినందుకు కూడా నాకు బాద లేదురా. కానీ, నేను అపద్దమాడకుండా నిజిమే గదా చెప్పినాను! అయినా వాతలు రేగొట్టినాడు మా నాయిన. ఒక్కోసారి నిజిం చెప్పినా సిచ్చ తప్పదేమో రా. ఇంతే రా ఈ పెద్దాళ్ల నాయం. ఇదే రా ఈ పెపంచకం తీరు…” అంటా నానోట మొదటిసారిగా మెట్ట ఏదాంతం పుట్టుకొచ్చె.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here